రాత్రి రెండు దాటింది. ‘కోహినూర్ జువెలరీ’ షాపుకి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజు షాపు ముందు ఉన్న వరండాలో నిద్రపోతున్నాడు. మధ్యలో తీవ్రమైన తలనొప్పి అతడిని నిద్రపోనివ్వలేదు. దాంతో పెయిన్ కిల్లర్ వేసుకుని నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మగతనిద్రలోకి జారుకునే సమయంలో షాపులోపల నుంచి ఏదో కింద పడిన శబ్దం వచ్చింది. ఉలిక్కిపడి లేచిన రాజు.. అయోమయంగా చుట్టూ ప్రదేశాలను గమనించాడు.‘‘షాపులోకి ఏ ఎలకైనా వచ్చిందేమో అనుకుంటూనే... ఒకవేల దొంగలొస్తేనో..?’’ అనే ఆలోచన అతడ్ని కలవరపరిచింది. వెంటనే మంచం దిగి షాపు చూట్టూ తిరిగి చూశాడు. షాపు వెనక్కి వెళ్లిన రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. షాపు వెనక వైపు ఉన్న బాత్‌రూమ్ కిటికిని ఎవరో ఊడబీకారు. అందులోంచి లోపలికి మనుషులు సునాయాసంగా వెళ్లొచ్చు. చప్పుడు చేయకుండా ఓ దిమ్మపైకి ఎక్కి అదే కిటికీలోంచి లోపలికి చూశాడు. ఎవరూ కనిపించలేదు. కాస్త ధైర్యం చేసి లోపలికి దిగాడు. అలికిడి లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ బాత్‌రూమ్‌లోంచి షోరూమ్‌లోకి తొంగి చూశాడు. అక్కడా ఎవరూ కనిపించలేదు. అయితే షోకేసుల్లో ఉండాల్సిన నగలన్నీ మాయమయ్యాయి. ఓ ఫ్లవర్‌వాజ్ మాత్రం కిందపడి ఉంది. ఆ ఫ్లవర్‌వాజ్ శబ్దానికే మెలికువ వచ్చిందని అర్థం చేసుకున్నాడు. అంటే అన్నీ తీసుకుని పారిపోతున్న హడావుడిలో ఈ ఫ్లవర్‌వాజ్ కింద పాడేసి ఉంటారు దొంగలు. ఎంతో సమయం అయ్యి ఉండదు. వెంటనే పోలీసులకు సమాచారం అందిద్దాం. అనుకుంటూ ఫోన్ అందుకుంటూ ఓ అడుగు ముందుకేశాడు రాజు. అంతే! కాళ్లకు ఏదో తాకింది. వంగి దాన్ని అందుకున్నాడు. అది ఓ వజ్రాల నగ. కళ్లు తలుక్కుమన్నాయి. బహుశా దొంగలు దోచుకునే సమయంలో ఇది కింద పడి ఉంటుంది అనుకుంటూ ఫోన్ కట్ చేసి.. ఆ నగను జేబులో వేసుకుంటూనే ఇంకా నగలు దొరికే అవకాశం ఉందేమో అన్నట్లు ఆ షోకేసులను వెతికాడు. వెంటనే వచ్చిన దారినే వెనుదిరిగి సైకిల్ తీసుకుని ఆ నగను ఇంట్లో పెట్టి, తిరిగి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీస్ విచారణల్లో వేలుముద్రల ఆధారంగా... దొంగల ముఠాకు రాజే సహకరించాడని, దొంగతనానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజే సహకరించాడని తేల్చారు. అదే సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి డైమండ్ నగ రాజు వద్దే ఉందని చెప్పడం, ఆ వెంటనే పోలీసులు రాజు ఇంటిలో తనిఖీలు జరపడం వెంటవెంటనే జరిగిపోయాయి. పలు సాక్ష్యాల ఆధారంగా రాజు జైలు పాలయ్యాడు. మిగిలిన దొంగలను వెతికే పనిలో పడ్డారు పోలీసులు.జైల్లో ఉండగా రాజుకు ఓ రోజు తీవ్రమైన తలనొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. డాక్టర్లు అతడికి బ్రెయిన్‌ట్యూమర్ ఉందని తేల్చారు. వెంటనే ఆపరేషన్ చెయ్యకపోతే రాజు చనిపోతాడని చెప్పారు. రాజు ఖైదీ కావడంతో ఆపరేషన్ ఖర్చు అంతా ప్రభుత్వమే భరించింది. రాజు మెల్లగా కోలుకున్నాడు.కొద్దిరోజులకు కోహినూర్ షాపులో దొంగతనానికి పాల్పడిన దొంగలు దొరికారు.సెక్యూరిటీ గార్డ్ రాజుకి తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీసు లకు చెప్పారు. దాంతో కోర్టు రాజును నిర్దోషిగా విడుదల చేసింది.దొంగలు దొరకడంతో కేసు క్లోజ్ అయ్యింది. అయితే ఈ కేసుని మొదటి నుంచి స్టడీ చేస్తూ వచ్చిన ఎస్సై రాఘురాం తల పట్టుకున్నాడు. అతడికి అర్థం కానీ విషయమేంటంటే... ‘వజ్రపు నగ సెక్యూరిటీ గార్డ్ రాజు దగ్గరే ఉంది’ అనే విషయాన్ని పోలీసులకు తెలియజేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరా అని ఆలోచనలో పడ్డాడు. ఎంతైనా పోలీసు కదా! ఎప్పటికీ అంతుచిక్కకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ ఇంటికి వెళ్లాడు రఘురాం.ఎస్సై రఘురామ్‌ని చూసిన రాజు కాస్త కంగారు పడ్డాడు. ‘‘కంగారు పడకులే! చిన్న డౌట్ అడుగుదామని వచ్చాను’’‘‘చెప్పండి సారు!’’‘‘ఏం లేదు..! నీకు శత్రువులెవరైనా ఉన్నారా?’’‘‘పేదోడిని నాకెవరు శత్రువులుంటారు సారు? ఎందుకలా అడుగుతున్నారు?’’‘‘ఏం లేదు రాజు..! ఈ దొంగతనం కేసులో నువ్వు నిర్దోషివని తేలింది. ఆ దొంగలే మొత్తమంతా చేశారని అర్థమవుతుంది కానీ.. దొంగలు వదిలిపెట్టిన ఆ వజ్రపు నగ నీ దగ్గరే ఉందని నాకు ఫోన్ చేసింది ఎవరైయుంటారు?’’‘‘ఫోన్ చేశారా? ఓ.. అందుకే మీరు మా ఇంటిని తనిఖీ చేశారా?’’ ఆశ్చర్యంగా అడిగాడు రాజు.
‘‘అవును రాజు! కేసు క్లోజ్ అయినా ఇదే ఆలోచన నన్ను కుదురుగా ఉండనీయట్లేదయ్యా! నీకైతే శత్రువులెవరూ లేరా?’’ మరో సారి ప్రశ్నించాడు ఎస్సై రఘురాం.‘‘నాకు తెలిసైతే శత్రువులెవరూ లేరు సారు!ఆ దొంగనాయాళ్లే ఫోన్ చేసి చెప్పుంటారు సారు. కేసును తప్పుదారి పట్టించేందుకు!’’‘‘లేదయ్యా! వాళ్లెవ్వరూ కాదు! ఆ విషయం వాళ్లని కూడా అడిగాను’’‘‘మీరు అంతగా అడుగుతుంటే నాకో విషయం యాదికొస్తోంది సారూ!’’‘‘ఏంటయ్యా అది?’’‘‘ఆ కోహినూర్ గోల్డ్ షాపులో నాతో పాటు రాములు అని మరో సెక్యూరిటీ గార్డ్ ఉండేవాడు సారు! వాడు రాత్రేల సరిగా డ్యూటీ చేయకుంటే.. రెండు మూడు సార్లు వానరు సారు చేత తిట్టించినా. గా తర్వాత మా వానరు సారుకు విసుగొచ్చి వాడ్ని జాబు నుంచి తీసేసినారు. వాడు గిట్లా ఏమైనా నాపై పగబట్టిండేమో సారూ!’’ అన్నాడు రాజు కాస్త గట్టిగా.‘‘హా.. అయ్యుండొచ్చు. అతడే ఎవరిచేతైనా ఫోన్ చెయ్యించుండొచ్చు. సరేలే నువ్వు జాగ్రత్తగా ఉండు!’’అంటూ విషయాన్ని పెద్దది చేయకుండా ఎస్సై అక్కడ నుంచి కదిలాడు.ఎస్సై అక్కడి నుంచి కదలగానే ఓ విజేతలా నవ్వాడు రాజు. ‘నాకు శత్రువులెవరుంటారు!? గా ఫోన్ చేసింది నేనే. నాకు బ్రెయిన్ ట్యూమర్ అని ముందే తెలుసు. నాకు షోరూమ్‌లో వజ్రపు నగ కాలికి దొరకగానే ఓ పాత హిందీ సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో హీరోకి ఏదో పెద్ద జబ్బు వస్తుంది. దాన్ని తగ్గించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. అందుకే ఎవరో చేసిన నేరాన్ని తనపైన వేసుకుని జైలుకెళ్లి ప్రభుత్వ డబ్బుతో ఆపరేషన్ చేయించుకుంటాడు. పూర్తిగా బాగైన తర్వాత జైలు నుంచి పారిపోయి నేరం చేసిన వాడిని తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తాడు. ఆ సినిమానే నేనూ ఫాలో అయ్యాను! లేకుంటే పేదవాడినైన నాకు ఎవడు సాయం చేస్తాడు?’ అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూనే ఉన్నాడు.
- మహబూబ్ బాషా
ఆ శత్రువు ఎవరు?
Published Sun, Sep 30 2018 1:50 AM | Last Updated on Sun, Sep 30 2018 1:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment