
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అధునాతన ఆయుధాల తయారీ, సరఫరాలో ప్రపంచస్థాయి దిగ్గజం కారకల్ ఇంటర్నేషనల్‌తో హైదరాబాద్‌కు చెందిన ఐకామ్ టెలీ సాంకేతిక బదిలీ ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈలోని అబుదాబిలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రై-సర్వీస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్లలో ఒకటైన ఐడీఈఎక్స్ 2023 కార్యక్రమంలో మంగళవారం ఇరు సంస్థల మధ్య డీల్ కుదిరింది.
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఐకామ్.. భారత రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల తయారీలో భాగస్వామిగా ఉంది. తాజా డీల్ ప్రకారం హైదరాబాద్ ప్లాంటులో కారకల్ టెక్నాలజీతో చిన్న పాటి ఆయుధాలను తయారు చేస్తామని ఐకామ్ టెలి ఎండీ పి.సుమంత్ తెలిపారు. క్షిపణులు, కమ్యూనికేషన్స్, ఈడబ్ల్యూ సిస్టమ్స్, రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టిక్స్, మందుగుండు, షెల్టర్లు, డ్రోన్, కౌంటర్–డ్రోన్ సిస్టమ్స్‌ను ఐకామ్ ఇప్పటికే తయారు చేస్తోంది. 1989లో ప్రారంభమైన ఐకామ్‌కు హైదరాబాద్ శివారులో 110 ఎకరాల్లో ప్లాంటు ఉంది.