న్యూయార్క్: రష్యా, ఉత్తర కొరియా మధ్య ఆయుధాల ఒప్పందం గురించి అమెరికా ఇప్పటికే పలు నివేదికలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాల రవాణాను సరఫరా చేసినట్లు వైట్ హౌస్ శనివారం ఆరోపించింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా విడుదల చేసింది.
అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా ఇటీవలి వారాల్లో రష్యాకు 1,000 కంటే ఎక్కువ సైనిక పరికరాలు, ఆయుధాల కంటైనర్‌లను పంపిణీ చేసినట్లు అమెరికాకు సమాచారం ఉందని చెప్పారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య సైనిక సంబంధాలు ఆందోళన కలిగించే అంశమని అమెరికా ఉన్నతాధికారులు అన్నారు.
సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 1 మధ్య ఆయుధాల రవాణా జరిగిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఆయుధ సహకారాన్ని అందిస్తున్న ఉత్తర కొరియా చర్యలను తాము ఖండిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఆయుధ సామగ్రిని సమకూర్చిన దేశాలపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం కూడా తెలిసిందే. దక్షిణ కోరియాకు అమెరికా యుద్ధ నౌక రావడంపై వైట్‌హౌజ్‌ను ఉత్తరకొరియా హెచ్చరించిన మరుసటి రోజే ఈ ప్రకటనలు రావడం గమనార్హం.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి
Comments
Please login to add a commentAdd a comment