రామ్పాల్
బర్వాలా: హర్యానాలోని బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్పాల్కు చెందిన ఆధ్యాత్మిక సామ్రాజ్యం సత్‌లోక్ ఆశ్రమంలో ఆధునిక ఆయుధాలు దొరికాయి. ఆశ్రమంలో ఆయుధాలు చూసి పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. హర్యానా పోలీసులు ఆదివారం ఆశ్రమాన్ని తనిఖీ చేశారు. ఆశ్రమంలో ఆయుధాలు, నగదు, తూటాల రక్షణ కవచం, కమాండో డ్రెస్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 19న రామ్పాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ కస్టడీలో ఉన్న రామ్పాల్ను ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్) అధికారులు ఆదివారం హిసార్‌లోని ఆయన ఆశ్రమానికి తీసుకెళ్లారు. రామ్పాల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆశ్రమంలో లాకర్లు, అల్మరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటిని మేజిస్ట్రేట్ సమక్షంలో తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు.
సోదాల సందర్భంగా నాలుగు .315 బోర్ రైఫిళ్లు, .12 బోర్ తుపాకులు, తూటాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, కమాండో డ్రెస్‌లను గుర్తించినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వాటితోపాటు 32 బోరు రివాల్వర్లు, 19 ఎయిర్ గన్స్, రెండు డబుల్ బేరర్ గన్స్, 4200 కర్రలు, 171 హెల్మెట్లు, రామ్పాల్ ప్రైవేట్ కమాండోలు ధరించే 235 జతల యూనిఫామ్, 12 పెట్రోల్ బాంబులు కూడా లభించాయి. వాటినన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామ్పాల్ నివాసం ఉండే భవనంలో అత్యాధునిక వసతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలో తనిఖీలు ఇంకా కొనసాగుతాయని ఆ అధికారి చెప్పారు.
ఇదిలా ఉండగా, హర్యానా డీజీపి వశిష్ట, ఐజీపి అనిల్ కుమార్ రావు ఆదివారం ఆశ్రమాన్ని సందర్శించారు.
**