రాంపాల్
హిస్సార్: అరెస్ట్ అనంతరం రాంపాల్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భక్త కబీరు ఆధ్యాత్మిక వారసుడిగా ప్రకటించుకున్న రాంపాల్.. భక్తులకు రోజూ అందించే ప్రసాదం ఏంటో తెలుసా?. పాలతో స్నానం చేసి.. ఆ పాలతో ఖీర్ తయారు చేయించి, భక్తులకు క్షీరామృతంగా అందిస్తారు. కాగా త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించవద్దని, భక్త కబీర్‌ను మాత్రమే ఆరాధించాలని రాంపాల్ బోధించేవారు. విగ్రహారాధన లాంటి హిందూ సాంప్రదాయాలను పాటించవద్దనేవారు. అన్ని మత గ్రంధాల్లోనూ భక్త కబీర్‌ను దేవుళ్లకే దేవుడిగా పేర్కొన్నారని వివరించేవారు.
ఇక బల్వారాలో 12 ఎకరాల సువిశాల స్థలంలో రాంపాల్ షత్లాక్ ఆశ్రమాన్ని ఆధునిక హంగులతో నిర్మించారు. భారీ స్విమింగ్ పూల్, ముఖ్య అనుచరుల కోసం ఎసీ గదులు ఉన్నాయి. అనుయాయులకు ల్యాప్‌టాప్‌లు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో లెక్చర్ హాళ్లు ఉన్న ఆధునిక ఆశ్రమం అది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా భారీగానే సమకూర్చుకున్నారని సమాచారం. ఆశ్రమంలో అర్థనగ్నంగా ఉండాలని అక్కడి నిర్వాహకులు తమని వేధించేవారని ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన మహిళలు తెలిపారు. స్వామీజీ వల్ల కొన్ని కుటుంబాలు కూడా నాశనమయ్యాయని వారు చెప్పారు.