Barwala
-
రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం
బర్వాలా: గుజరాత్లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, జీపు ఢీ కొట్టడంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బర్వాల హైవేలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర నుంచి గుజరాత్‌లోని పలిటనాకు ఓ ట్రక్కులో 11 మంది వెళ్తున్నారు. ధుందక్ బర్వాలా రోడ్డు వద్దకు చేరుకోగానే ఓ జీపును ట్రక్కు బలంగా ఢీకొట్టింది. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే నాలుగు 108 వాహనాలు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుస్పత్రికి తరలించాయి. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
రామ్‌పాల్ ఆశ్రమంలో ఆయుధాలు!
బర్వాలా: హర్యానాలోని బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్‌పాల్‌కు చెందిన ఆధ్యాత్మిక సామ్రాజ్యం సత్లోక్ ఆశ్రమంలో ఆధునిక ఆయుధాలు దొరికాయి. ఆశ్రమంలో ఆయుధాలు చూసి పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. హర్యానా పోలీసులు ఆదివారం ఆశ్రమాన్ని తనిఖీ చేశారు. ఆశ్రమంలో ఆయుధాలు, నగదు, తూటాల రక్షణ కవచం, కమాండో డ్రెస్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 19న రామ్‌పాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ కస్టడీలో ఉన్న రామ్‌పాల్‌ను ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్) అధికారులు ఆదివారం హిసార్‌లోని ఆయన ఆశ్రమానికి తీసుకెళ్లారు. రామ్‌పాల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆశ్రమంలో లాకర్లు, అల్మరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటిని మేజిస్ట్రేట్ సమక్షంలో తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు. సోదాల సందర్భంగా నాలుగు .315 బోర్ రైఫిళ్లు, .12 బోర్ తుపాకులు, తూటాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, కమాండో డ్రెస్‌లను గుర్తించినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వాటితోపాటు 32 బోరు రివాల్వర్లు, 19 ఎయిర్ గన్స్, రెండు డబుల్ బేరర్ గన్స్, 4200 కర్రలు, 171 హెల్మెట్లు, రామ్‌పాల్ ప్రైవేట్ కమాండోలు ధరించే 235 జతల యూనిఫామ్, 12 పెట్రోల్ బాంబులు కూడా లభించాయి. వాటినన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామ్‌పాల్ నివాసం ఉండే భవనంలో అత్యాధునిక వసతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలో తనిఖీలు ఇంకా కొనసాగుతాయని ఆ అధికారి చెప్పారు. ఇదిలా ఉండగా, హర్యానా డీజీపి వశిష్ట, ఐజీపి అనిల్ కుమార్ రావు ఆదివారం ఆశ్రమాన్ని సందర్శించారు. ** -
'బయటకు వెళితే కాల్చేస్తారని భయపెట్టారు'
బర్వాలా: వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్ కు చెందిన ఆశ్రమం నుంచి ఇంకా భక్తులు బయటకు వస్తూనే ఉన్నారు. బర్వాలాలోని ఆయన ఆశ్రమంలో చాలా మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. లోపల ఉన్నవారంతా బయటకు రావాలని, ఎటువంటి భయం అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చిన వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది సహకరిస్తున్నారు. స్వామి రాంపాల్ ప్రైవేటు సైన్యం, అనుచరులు ఆశ్రమంలో ఉన్నారని, వీరిని బయటకు రప్పించేందుకు పారా మిలటరీ బలగాలు ఆపరేషన్ కు సిద్ధమవుతున్నాయి. దీనికంటే ముందు ఆశ్రమంలో ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపల ఉన్నవారిని రాంపాల్ ప్రైవేటు సైన్యం మభ్యపెడుతూ బయటకు రాకుండా చేస్తోంది. బయటకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారని తమతో చెప్పినట్టు ఆశ్రమం నుంచి వెలుపలికి వచ్చిన మధ్యప్రదేశ్ కు చెందిన మహిళ వెల్లడించింది. ఆశ్రమం నుంచి వెలుపలికి వెళితే పోలీసులు కాల్చేస్తారని రాంపాల్ ప్రైవేటు సైన్యం తమను భయపెట్టిందని ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకులు తెలిపారు. -
స్వామీజీ ఆశ్రమంలో మృతదేహాలు లభ్యం!
-
స్వామీజీ ఆశ్రమంలో మృతదేహాలు లభ్యం!
బల్వారా: హర్యానా బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్‌పాల్ ... సత్యలోక్ ఆశ్రమంలో మృతి చెందిన నాలుగురు మహిళ మృతదేహాలను ఆశ్రమవాసులు తమకు అప్పగించారని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్.ఎన్. వశిష్ట బుధవారం వెల్లడించారు. ఆశ్రమంలో అనారోగ్యంతో ఉన్న మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా...వారు చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారితోపాటు 70 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉందన్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం అఘోరాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతులు ఢిల్లీకి చెందిన సవిత (31), రోహితక్కి చెందిన సంతోష్ (45) బిజినోర్‌కు చెందిన రాజ్ బాల (70) పంజాబ్‌లోని సంగురూర్కి చెందిన మలికిత్ కౌర్ (50) గా గుర్తించినట్లు చెప్పారు. రామ్ పాల్ ఆచూకీ మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదని తెలిపారు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్లోక్ ఆశ్రమ స్వామీజీ రామ్పాల్పై హర్యానా పంజాబ్ ఉమ్మడి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో స్వామీజీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆశ్రమానికి చేరుకున్నారు. స్వామీజీని అరెస్ట్ చేసేందుకు వీలు లేదంటూ ఆయన భక్తులు, అనుచరులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో స్థానికంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేసి భాష్పవాయువు ప్రయోగించారు. దాంతో పలువురు భక్తులు, అనుచరులు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రులకు తరలించారు.