'బయటకు వెళితే కాల్చేస్తారని భయపెట్టారు'
బర్వాలా: వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్ కు చెందిన ఆశ్రమం నుంచి ఇంకా భక్తులు బయటకు వస్తూనే ఉన్నారు. బర్వాలాలోని ఆయన ఆశ్రమంలో చాలా మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. లోపల ఉన్నవారంతా బయటకు రావాలని, ఎటువంటి భయం అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చిన వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది సహకరిస్తున్నారు.
స్వామి రాంపాల్ ప్రైవేటు సైన్యం, అనుచరులు ఆశ్రమంలో ఉన్నారని, వీరిని బయటకు రప్పించేందుకు పారా మిలటరీ బలగాలు ఆపరేషన్ కు సిద్ధమవుతున్నాయి. దీనికంటే ముందు ఆశ్రమంలో ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
లోపల ఉన్నవారిని రాంపాల్ ప్రైవేటు సైన్యం మభ్యపెడుతూ బయటకు రాకుండా చేస్తోంది. బయటకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారని తమతో చెప్పినట్టు ఆశ్రమం నుంచి వెలుపలికి వచ్చిన మధ్యప్రదేశ్ కు చెందిన మహిళ వెల్లడించింది. ఆశ్రమం నుంచి వెలుపలికి వెళితే పోలీసులు కాల్చేస్తారని రాంపాల్ ప్రైవేటు సైన్యం తమను భయపెట్టిందని ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకులు తెలిపారు.