ashram
-
సర్వీసు వివాదాలనుఇతరులు సవాలు చేయలేరు
సాక్షి, అమరావతి : ప్రభుత్వ సంస్థలో పనిచేయని, ఆ సంస్థ పరిపాలన వ్యవహారాలతో సంబంధంలేని ఏ వ్యక్తి అయినా కూడా ఆ సంస్థ కార్యకలాపాలను, అధికారుల చర్యలను ప్రశ్నిస్తూ అధికరణ–226 కింద రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. అలా దాఖలు చేసే రిట్ పిటిషన్‌కు ఎంతమాత్రం విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. ఆ సంస్థ, ఆ అధికారి చర్యలపై అభ్యంతరాలుంటే వాటిని తగిన వేదికల ముందు సవాలు చేసుకోవచ్చునని సూచించింది. సర్వీసు వివాదాలను సాటి ఉద్యోగి మాత్రమే సవాలు చేయగలరని, సంబంధంలేని మూడో వ్యక్తి ప్రశ్నించజాలరని స్పష్టంచేసింది. వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీత ఆశ్రమం కార్యనిర్వహణాధికారి (ఈఓ) అయిన సి. శంకర బాలాజీని జిల్లా దేవాదాయ శాఖ ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించడాన్ని సవాలు చేస్తూ ఎం. సురేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ఇటీవల తీర్పు వెలువరించారు. ఇన్చార్జ్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించడం తగదు.. ప్రొద్దుటూరుకు చెందిన సురేష్ శ్రీకృష్ణ గీత ఆశ్రమానికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకుని అందులో శారదా జూనియర్ కాలేజీ పేరుతో విద్యా సంస్థను నడుపుతున్నారు. ఆ ఆశ్రమానికి శంకర బాలాజీ ఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన్ను జిల్లా దేవాదాయశాఖ ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు. దీనిని సవాలుచేస్తూ సురేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ మన్మథరావు విచారణ జరిపారు. శంకర బాలాజీ రెండు పోస్టుల్లో కొనసాగడానికి వీల్లేదని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. అసిస్టెంట్ కమిషనర్‌గా శంకర బాలాజీ నియామకం చట్ట విరుద్ధమన్నారు. ఆ నియామకం పిటిషనర్‌కు సంబంధంలేనిది.. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. శ్రీకృష్ణ గీత ఆశ్రమం, దేవదాయ శాఖ పరిపాలన వ్యవహారాల్లో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధంలేదన్నారు. శంకర్ బాలాజీని పూర్తిస్థాయి ఇన్చార్జ్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించడమన్నది పిటిషనర్‌కు సంబంధంలేని వ్యవహారమని తేల్చిచెప్పారు. అందువల్ల ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా శంకర్ బాలాజీ నియామకాన్ని ప్రశ్నించజాలరన్నారు. సురేష్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం కోర్టును విసిగించేదన్నారు. కాబట్టి.. సురేష్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సర్వీసు ఉద్యోగాల్లో సహ ఉద్యోగే బాధితుడుదేవదాయ శాఖ కమిషనర్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా బాలాజీ నియామకంవల్ల పిటిషనర్ ఏ విధంగా బాధితుడు కాదని, ఆయన నియామకాన్ని ప్రశ్నించేందుకు సహ ఉద్యోగి కూడా కాదన్నారు. సర్వీసు వివాదాల్లో సహ ఉద్యోగి మాత్రమే బాధిత వ్యక్తి అవుతారని కమిషనర్ తన కౌంటర్లో పేర్కొన్నారు. ఆశ్రమం ఈఓ కౌంటర్ దాఖలు చేస్తూ కళాశాల నిర్వహిస్తున్న స్థలాన్ని ఎలాంటి వేలం నిర్వహించకుండా తనకే 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని పిటిషనర్ సురేష్ దేవదాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారన్నారు. చెల్లించాల్సిన లీజు బకాయిలను కూడా చెల్లించలేదని, బకాయిల కోసం పిటిషనర్‌కు నోటీసులు ఇచ్చామన్నారు. అద్దె కూడా సక్రమంగా చెల్లించకుండా కాలేజీ నిర్వహిస్తున్నారని, వీటన్నింటినీ ప్రశి్నస్తున్నందుకే శంకర బాలాజీ నియామకాన్ని సవాలుచేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. శంకర బాలాజీ సైతం ఇదే విషయాలతో వ్యక్తిగత హోదాలో కౌంటర్ దాఖలు చేశారు. -
సాకార్ హరి ఆశ్రమంపై నిరంతర నిఘా
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఇటీవల జరిగిన తొక్కిసలాట పెనువిషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 121 మంది మృతి చెందారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మెయిన్‌పురిలోని బిచ్వాన్ పట్టణంలో ఉన్న సాకర్ హరి ఆశ్రమంపై నిరంతర పోలీసు నిఘా కొనసాగుతోంది. హత్రాస్ ఘటన అనంతరం సకార్ హరి ఆశ్రమానికి వచ్చే బాబా అనుచరుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. హత్రాస్ ఘటన జరిగి ఏడు రోజులు గడిచాయి. కేసు దర్యాప్తునకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు, నిందితులను హత్రాస్ పోలీసులు జైలుకు తరలిస్తున్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఆశ్రమంపై కన్నేసి ఉంచాయి. ఇంటెలిజెన్స్ శాఖ సిబ్బంది స్థానికుల కదలికలపై నిఘా పెట్టింది. -
Samantha: ఆశ్రమంలో సమంత.. ఎందుకంటే? (ఫోటోలు)
-
కన్హా ఆశ్రమంలో దాజిని కలిసిన ఆటా ప్రతినిధులు!
రంగారెడ్డి జిల్లా కన్హా గ్రామంలో గల కన్హా శాంతి వనంను ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు కమలేష్ డి పటేల్(దాజీ) ని కలిశారు. ఇదే సందర్భంలో ఆశ్రమంలో యోగ చేసి, యోగ వల్ల కలిగే లాభాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సూదిని, కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాశం, అడ్వైసర్ కరుణాకర్ అసిరెడ్డి, ఆటా మాజీ ప్రెసిడెంట్లు భీమ్ రెడ్డి పరమేష్, కరుణాకర్ మాధవరం, ట్రస్టీస్ కాశీ కొత్త, నరసింహ రెడ్డి ద్యాసాని, కిషోర్ గూడూరు, శివ గీరెడ్డి వారి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: లండన్‌లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు!) -
బ్రహ్మ కుమారి ఆశ్రమంలో కలకలం.. ఇద్దరు మహిళల మృతి
ఆగ్రాలోని బ్రహ్మ కుమారి ఆశ్రమంలో కలకలం రేగింది. శుక్రవారం (నవంబర్ 10) రాత్రి ఇద్దరు మహిళలు (సిస్టర్స్) మృతి చెందారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల దగ్గర సూసైడ్ నోట్స్ లభ్యమయ్యాయి. ఆశ్రమానికి చెందిన నలుగురు సిబ్బంది పేర్లు అందులో ఉన్నాయి. వారే తమ చావుకు కారణమని మృతులు పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చనిపోయిన ఇద్దరు మహిళలకు, వారి బంధువులకు మధ్య విభేదాలు ఉన్నాయి. వారు బ్రహ్మ కుమారి సంస్థ నుంచి రూ. 25 లక్షలతో పారిపోయి పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న మరొక ఆశ్రమానికి వెళ్లారు. బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఇద్దరు మహిళలు చనిపోయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఖేరాఘర్ ఏసీపీ మహేష్ కుమార్ తెలిపారు. ఆ మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని, మృతుల దగ్గర సూసైడ్ నోట్లు లభ్యమయ్యాయని చెప్పారు. మృతుల దగ్గర నుంచి సూసైడ్ నోట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. -
స్వామీజీ లీలలు.. గొలుసులతో కట్టేసి రెండేళ్లుగా అఘాయిత్యం
దొండపర్తి(విశాఖ దక్షిణ): ఆశ్రమం ముసుగులో పూర్ణానంద సరస్వతి స్వామీజీ సాగించిన లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధ్యాత్మికత పేరుతో సాగించిన అకృత్యాలు విస్తుగొలుపుతున్నాయి. అనాథ బాలికలకు ఆశ్రయం కల్పించే నేపంతో చేసిన దారుణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. ఆశ్రమంలో మరో మైనర్ బాలికపై కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వెంకోజీపాలెం ప్రాంతంలో దశాబ్దాల క్రితం ఏర్పాటైన జ్ఞానానంద ఆశ్రమాన్ని పూర్ణానంద సరస్వతి స్వామీజీ నిర్వహిస్తున్నారు. ఒకవైపు అధ్యాత్మికత బోధనలతో పాటు తల్లిదండ్రుల నుంచి దూరమైన, అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే ఈ ఆశ్రమంపై గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక(15) స్వామీజీ గత రెండేళ్లుగా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులకు చేసిన ఫిర్యాదు ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆమె ఫిర్యాదుతో పేర్కొన్న వివరాల ప్రకారం గొలుసులతో కట్టేసి రెండేళ్లుగా అఘాయిత్యం రాజమండ్రికి చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పెద్దమ్మ విశాఖకు తీసుకువచ్చి జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించింది. అక్కడ స్వామీజీ ఈ బాలికతో పాటు మరికొంత మంది బాలికలతో పశువుల నిర్వహణ చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా రోజూ రాత్రి 12 గంటలకు ఆ మైనర్ బాలికను బలవంతంగా గదిలోకి తీసుకువెళ్లి గొలుసులతో కట్టేసి అఘాయిత్యం చేసేవాడు. కొన్నిసార్లు స్వామీజీని నిలువరించే ప్రయత్నం చేస్తే కొట్టి హింసించేవాడు. ఇలా రెండేళ్ల పాటు బాలిక నరకయాతన అనుభవించింది. పనిమనిషి సాయంతో బయటపడి.. ఈ నెల 13వ తేదీన పనిమనిషి గొలుసులు విప్పిడంతో బాలిక ఆశ్రమం నుంచి తప్పించుకుంది. ఆమె ఇచ్చిన డబ్బులతో రైల్వేస్టేషన్‌కు వెళ్లి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలులో ఒక ప్రయాణికురాలు బాలికను గమనించి మాట్లాడగా ఆశ్రమంలో జరిగిన విషయాన్ని ఆమెకు వివరించింది. దీంతో ఆమె కృష్ణా జిల్లాలో కంకిపాడులోని తన సోదరి ఇంటికి తీసుకువచ్చింది. స్థానికుల సలహా మేరకు బాలికను హాస్టల్లో చేర్చేందుకు ప్రయత్నించింది. పోలీస్‌స్టేషన్ నుంచి లేఖ తీసుకువస్తే హాస్టల్ చేర్చుకుంటామని చెప్పారు. దీంతో వారు బాలికతో కంకిపాడు స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు బాలిక నుంచి వివరాలు తెలుసుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. కమిటీ సభ్యులు బాలిక నుంచి వివరాలు సేకరించారు. అనంతరం పోలీసులు అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కేసును ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. మరో బాలికపై కూడా అఘాయిత్యం విశాఖ పోలీస్ ఉన్నతాధికారులు కేసును దిశ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా మరో బాలికపై స్వామీజీ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. దీంతో పోలీసులు ఆ ఆశ్రమంలో తనిఖీలు చేయగా పిల్లల ఆశ్రయానికి అనువైన పరిస్థితులు లేనట్లు గుర్తించారు. అలాగే ఇప్పటి వరకు ఎంత మంది పిల్లలు ఆశ్రమంలో ఆశ్రయం పొందారు? ఏయే పరిస్థితుల్లో బయటకు వెళ్లారు? వారితో స్వామీజీ వ్యవహరించిన తీరు? ఇలా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వామీజీపై కొన్నేళ్లుగా ఆరోపణలు ఆశ్రమ నిర్వహణ, పూర్ణానంద సరస్వతి స్వామీజీ వ్యవహార శైలిపై గత కొన్నేళ్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి 1955లో జ్ఞానానంద భారతి అనే స్వామిజీ ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అనాథ పిల్లలు, తల్లిదండ్రులచే నిర్లక్ష్యం చేయబడిన, అనార్యోగంతో ఉన్న పిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పించారు. వారికి విద్యాబోధనతో పాటు ఆధ్యాత్మిక చింతన కలిగేలా శ్లోకాలు నేర్పించేవారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రకు చెందిన పూర్ణానంద సరస్వతి(అసలు పేరు వేరు) విశాఖలో ఉంటూ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినట్లు తెలుస్తోంది. తొలినాళ్లలో వెంకోజీపాలెంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. ఆశ్రమానికి వెళుతూ అప్పటి స్వామీజీకి సపర్యలు చేస్తూ, చిన్న చిన్న పనులు చేస్తుండడంతో ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. దీంతో అతడు ఆశ్రమంలో ఉంటూ అక్కడి కార్యకలాపాలు చూసుకునేవాడు. 1984లో పూర్ణానంద సరస్వతి ఆశ్రమ బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి కొన్నాళ్ల పాటు పిల్లలను చేరదీసి వారికి పాఠశాల విద్యను అందించేవారు. అయితే టూషన్లు చెప్పే సమయంలోనే బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పలువురు ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కొన్నేళ్ల క్రితం కూడా ఇదే తరహా ఆరోపణలు పెద్ద దుమారాన్ని రేపాయి. పోలీసుల అదుపులో స్వామీజీ తాజాగా మైనర్ బాలిక ఫిర్యాదుతో మరోసారి పూర్ణానంత సరస్వతి వ్యవహారం సంచలనం రేపింది. ఆమెతో పాటు మరో బాలికపై కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లు సదరు బాలిక స్టేట్మెంట్ ఇవ్వడంతో పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే గతంలో జరిగిన విషయాలపై ఆరా తీస్తున్నారు. -
ధ్యానం మరియు యోగా కోసం ప్రపంచవ్యాప్తంగా 10 ఆశ్రమాలు
-
సాయం పేరిట ఘోరం.. ఆశ్రమం ముసుగులో అవయవాల దోపిడీ?
పేరుకు అనాథ ఆశ్రమ నిర్వాహకులు.. కానీ వారి మనసంతా కాలకూట విషమే. అవును.. మానసిక వికలాంగులు, దిక్కులేని వారిని ఆదరిస్తామంటూ తమ ఆశ్రమంలో చేర్చుకుని.. వారిపై లైంగిక దాడులు చేయిస్తూ సొమ్ము దండుకుంటున్నారు. అంతేకాక కొందరి అవయవాలను సైతం ప్రైవేటు ఆస్పత్రులకు అడ్డోగోలుగా అమ్మేస్తూ.. నరరూప రాక్షసులను తలపిస్తున్నారు. విల్లుపురం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాక్షి, చెన్నై: అభాగ్యులను చేరదీస్తామనే ముసుగులో దారుణాలకు పాల్పడుతున్న అన్బు జ్యోతి అనాథ ఆశ్రమ బండారం గురువారం అధికారుల విచారణలో బయటపడింది. ఇప్పటి వరకు ఈ ఆశ్రమం నుంచి 14 మంది అదృశ్యమైనట్లు వెలుగు చూసింది. ఇక తమ దారుణాలు బయటి ప్రపంచానికి తెలియడంతో అనారోగ్యం పేరిట నాటకాలాడిన నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అన్బుజ్యోతి ఆశ్రమం (ఇన్సెట్) పోలీసులు రక్షించిన అభాగ్యులు వివరాలు.. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని గుండల పులియూర్‌లో అన్బుజ్యోతి పేరుతో ఓ అనాథ ఆశ్రమం ఉంది. దీనిని కేరళకు చెందిన జుబీన్(45), ఆయన భార్య మరియ జుబీన్ నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఉన్న వారు తరచూ కనిపించకుండా పోతున్నట్లుగా చాలా కాలంగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం తిరుప్పూర్‌కు చెందినన హనీదుద్దీన్ తన బంధువు జబరుల్లా(45)ను ఈ ఆశ్రమంలో చేర్పించారు. మానసిక రుగ్మతతో బాధ పడుతున్న వారికి ఇక్కడ ప్రత్యేక చికిత్స ఇస్తుండడంతో అనేక మంది యువతులు, మహిళలను వారి కుటుంబాలు తీసుకొచ్చి ఇక్కడ వదిలి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారం క్రితం జబరుల్లా బెంగళూరులో ప్రత్యక్షం కావడంతో హనీదుద్దీన్కు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడుతున్న అధికారులు కోర్టు ఆదేశాలతో పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో ఆశ్రమంలో ఉంటున్న కోల్క తాకు చెందిన ఓ యువతి విచారణలో తనకు మత్తు మందు ఇచ్చి రాత్రిళ్లు లైంగిక దాడికి పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల అదుపులో ఆశ్రమ సిబ్బంది ఆశ్రమం సీజ్..? ఆశ్రమంలో ఉన్న రికార్డుల ఆధారంగా బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. కొందరు వచ్చి తమ వారిని వెంట బెట్టుకెళ్లారు. మరి కొందరి బంధువులు రాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సెంజి డీఎస్పీ ప్రియదర్శిని నేతృత్వంలోని బృందం దృష్టి సారించింది. కలెక్టర్ పళణి ఆదేశాల మేరకు ఆశ్రమాన్ని సీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఆశ్రమంలోని మానసిక రోగులు, అనాథలను పొలీసు సంరక్షణలో ఉంచారు. ఈ ఆశ్రమానికి అనుబంధం ఉన్న మరో భవనంలో 27 మంది మానసిక రోగులను నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లతో ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. వీరంతా తమకు వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పడంతో అవయవాల విక్రయం కోసమే ఇదంతా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆశ్రమం నుంచి 14 మంది అదృశ్యం అయినట్లు తేలింది. వీరి సమాచారంపై ఆందోళన నెలకొంది. విచారణ జరుపుతున్న పోలీసులు అలాగే ఇక్కడి అనాథలు, మానసిక రోగుల అవయవాలను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుంటున్నారనే అంశానికి సంబంధించిన రికార్డులు బయటపడినట్లు కూడా ప్రచారం సాగుతోంది. బాధితుడు జబరుల్లాను ఆశ్రమ నిర్వాహకులు బెంగళూరుకు పంపించడంతో అక్కడి ఆసుపత్రులతో ఈ ఆశ్రమానికి ఉండే సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సోదాలు...రక్షింపు.. బుధవారం రాత్రి పోలీసులు, రెవెన్యూ, వైద్యాధికారులు ఆశ్రమంలో పెద్దఎత్తున సోదాలు చేశారు. ఇక్కడ మొత్తం 150 మంది మానసిక రోగులు, 27 మంది అనాథలు ఉన్నట్లు తేలింది. అయితే అనేక మంది మహిళలు తమకు రాత్రుల్లో మత్తు మందు ఇస్తున్నారని, తమపై కొందరు లైంగిక దాడి చేస్తున్నారని పోలీసుల ఎదుట వాపోయారు. దీంతో ఆశ్రమ నిర్వాహకులను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సమాచారంతో జుబీన్, ఆయన భార్య మరియా అనారోగ్యం బారిన పడ్డామంటూ విల్లుపురం ముండియం బాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. దీంతో పోలీసులు ఆశ్రమ మేనేజర్ కేరళకు చెందిన విజయ మోహన్(46), సిబ్బంది అయ్యప్పన్, గోపీనాథ్, ముత్తమారితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిపై 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిర్వాహకులు జుబీన్, ఆయన భార్య మరియా ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తేల్చడంతో గురువారం అరెస్టు చేశారు. -
Virat Kohli: మ్యాచ్‌లు లేకుంటే ఆధ్యాత్మిక ధోరణిలోకి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మ్యాచ్‌లు లేకుంటే ఆధ్యాత్మిక వాతావరణంలో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి రుషికేష్ టూర్‌కు వెళ్లాడు. విరుష్క దంపతులు రుషికేష్‌లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని స్వామిజీ దగ్గర దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవలే విరాట్-అనుష్కలు తరచు ఆశ్రమాలను సందర్శించడం ఆసక్తి సంతరించుకుంది. అంతకముందు కోహ్లి, అనుష్కలు తమ కూతురు వామికాతో కలిసి బాబా నీమ్ కరోలి బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించి బాబా ఆశీర్వాదాలు పొందారు. అనంతరం అక్కడున్నవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఇక కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ నేపథ్యంలో ఆసీస్‌తో టెస్టు సిరీస్ భారత్‌కు చాలా కీలకం కానుంది. వన్డేల్లో మంచి ఫామ్ కనబరుస్తున్న కోహ్లి స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్‌లోనూ అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక ఆసీస్‌తో టెస్టు సిరీస్ ముగిశాక వన్డే వరల్డ్‌కప్‌పై దృష్టి సారించనున్నాడు. 2023 వన్డే వరల్డ్‌కప్ కోహ్లి కెరీర్లో చివరి వన్డే వరల్డ్‌కప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. Virat Kohli with his family visit in Rishikesh.#ViratKohli𓃵 pic.twitter.com/cnPZ7UhlHE — Flick of Wrist (@flickk_of_Wrist) January 30, 2023 చదవండి: పృథ్వీ షా లవ్‌స్టోరీకి ఎండ్‌కార్డ్ పడిందా! -
@ హెయిర్ బై సీమ
కట్టుబాట్లు, హద్దులు ఎన్ని ఉన్నా.. అన్నింటిని చెరిపేసి అనేక రంగాల్లో తమదైన ముద్రవేస్తున్న మహిళలెందరినో చూస్తున్నాం. చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తమలోని ప్రతిభతో వెలుగులోకి వచ్చి ప్రపంచానికి తామేంటో నిరూపిస్తూ ఎంత మందికి ఉదాహరణగా నిలుస్తున్నారు మరికొందరు. ఈ కోవకు చెందిన వారే సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ సీమా మనే. షోలాపూర్‌లోని బర్షీలో పుట్టింది సీమా మనే. చిన్నతనంలో అనేక కష్టాలను చూస్తూ ఆశ్రమంలో పెరిగిన సీమ.. తొమ్మిదో తరగతి అయిన తరువాత చదువు మానేసింది. ఆశ్రమంలోనే హెల్త్ సెంటర్లో పనికి చేరింది. తర్వాత కొన్నేళ్లకు పెళ్లి కుదిరింది సీమకు. వివాహం తరువాత భర్త అండతో తన కష్టాలు కాస్త కుదుటపడ్డాయి. దీంతో ఐదేళ్ల తరువాత భర్త ప్రోత్సాహంతో తనకెంతో ఇష్టమైన హెయిర్ కటింగ్ కోర్సు చేయాలనుకుంది. భర్త సహకారం అందించడంతో పదోతరగతి చదువుతూనే హెయిర్ కటింగ్‌లో డిప్లొమా చేసింది. కోర్సు పూర్తయ్యాక ఇంట్లోనే ఒక సెలూన్ ఏర్పాటు చేసుకుంది. అలా రెండేళ్లపాటు సెలూన్ నిర్వహించిన తరువాత సీమకు ఓ ఫ్యాషన్ షోలో హెయిర్ స్టైలిస్ట్‌గా అవకాశం వచ్చింది. తక్కువ సమయంలో వెరైటీ, మోడ్రన్ హెయిర్ స్టైల్స్‌తో మోడల్స్‌ను తీర్చిదిద్దడంతో ఈ ఫ్యాషన్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. దీంతో సీమకు మంచి హెయిర్ స్టైలిస్ట్‌గా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుతో ‘ఎట్ ది రేట్ హెయిర్బై సీమ’ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ను ప్రారంభించింది. ఈ అకౌంట్లో సరికొత్త హెయిర్ స్టైల్స్‌ను పోస్టు చేస్తుండేది. ఈ హెయిర్ స్టైల్స్ నచ్చడంలో గ్లామర్ ప్రపంచంలో సీమ బాగా పాపులర్ అయ్యింది. దీంతో సినిమాలు, ఫ్యాషన్ షోలు, ఫోటోషూట్స్‌లో పనిచేయడానికి అవకాశాలు వచ్చేవి. వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ప్రతిభతో సరికొత్త హెయిర్‌స్టైల్స్‌ను రూపొందించి తానేంటో నిరూపించింది. దీంతో సెలబ్రిటీల దృష్టిలో పడింది సీమ. ఒక్కోమెట్టు ఎక్కుతూ... అంతర్జాతీయంగానూ సీమ హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేసిన సెలబ్రెటీలలో మాధురీ దీక్షిత్, అలియా భట్, తాప్సీ పన్ను, కియరా అడ్వాణి, బిపాషా బసు, కత్రినా కైఫ్, అంబాని కుటుంబానికి చెందిన విభూతి ఉన్నారు. అంతర్జాతీయ వెబ్ సిరీస్ ‘ఏ సూటబుల్‌బాయ్’ లో టబుకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేసింది. ‘ఘాజీ’ సినిమాలో తాప్సీకి, నామ్ షబాన, లక్ష్మీబాంబ్, సూర్మ, మన్ మర్జియా, జుడ్వా–2 సినిమాలకు పనిచేసింది. కళంక్, గుడ్‌న్యూస్, ఎంఎస్ ధోణి, కబీర్ సింగ్ సినిమాల్లో కియరా అడ్వాణికి హెయిర్ స్టైల్స్ చేసింది. తెలుగు సినిమా బాద్షాలో కాజల్ అగర్వాల్‌కు మోడ్రన్ హెయిర్ స్టైల్స్‌ను అందించింది. ఒక్క ఇండియాలోనేగాక అంతర్జాతీయ స్థాయిలోనూ సీమకు మంచి గుర్తింపు లభించింది. 2016లో ఓ పెళ్లిలో హెయిర్‌స్టైల్స్ చేయడానికి ఇటలీ వెళ్లగా, ఆ ఏడాది విడుదలైన ‘ద వోగ్ వెడ్డింగ్ బుక్’లో సీమ పేరు ప్రస్తావించారు. చేసే పనిలో నిజాయితీ ఉండాలి ‘‘నిజాయితీగా పనిచేస్తే ఫలితం మనకు వందశాతం అనుకూలంగా వస్తుందని అమ్మ చెప్పేవారు. ఎన్ని సమస్యలు ఉన్నా నిబద్ధతతో పని చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. తాప్సీ, కియరా లాంటి సెలబ్రెటీల సాయంతో బాలీవుడ్లో నాకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోగలిగాను. ప్రస్తుతం ప్రారంభించబోయే హెయిర్ అకాడమీ, స్టూడియోల ద్వారా నాలా మరికొంతమందిని ఇండస్ట్రీకి అందించడమే నా లక్ష్యం’’ అని చెబుతోంది సీమ. మనలో కష్టపడే తత్వం, ప్రతిభ ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చనడానికి సీమ జీవితమే నిదర్శనం. -
యువతితో దొంగ బాబా.. ఆ ఆశ్రమంలో ఏం జరిగింది..?
చెన్నై: స్వయం ప్రకటిక దైవం (దొంగ బాబా) అకృత్యాలకు మరో బాలిక బలైంది. మూలికలు, పూజల నెపంతో ఓ బాబా యువతికి వైద్యం అందిస్తున్న క్రమంలో ఆమె ఆ వైద్యానికి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన హేమమాలిని(20) బీఎస్సీ చదువుతోంది. అయితే, ఆమె కొద్ది రోజులుగా కడుపు నొప్పి, మెడ నొప్పి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా.. వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు యువతిని ఆమె తల్లిదండ్రులు తిరువళ్లూరులోని మునుస్వామి ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో మునుస్వామి.. హేమమాలినికి దోషం ఉందని అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పూజలు చేయాలని, మూలికల వైద్యం అందించాలని సూచించాడు. బాధితురాలిని ఆశ్రమంలోనే ఉంచాలని తెలిపాడు. దీంతో ఆమె అక్కడే ఉండి అనేక పూజలు చేస్తూ, మునుస్వామి అందిస్తున్న వైద్యాన్ని తీసుకుంటోంది. ఈ క్రమంలో మంగళవారం హేమమాలిని ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. విపరీతంగా వాంతులు చేసుకోవడంతో ఆమెతో పాటే అక్కడే హేమమాలిని అత్త ఇంద్రాణి.. వెంటనే మునుస్వామిని కలిసి ఆసుపత్రికి తీసుకెళ్తానని కోరింది. అయితే, హేమమాలినికి చిక్సిత జరుగుతోందని ఈ సమయంలో బయటకు పంపించలేమని మునుస్వామి చెప్పాడు. దీంతో మునుస్వామితో బాధితురాలి కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో చివరకు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనుమతించాడు. దీంతో బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ఆమెకు చికిత్స అందించిన వైద్యులు హేమమాలిని మృతి చెందినట్టు తెలిపారు. పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ సందర్బంగా బాధితురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మునుస్వామి వైద్యంతో తమ బిడ్డను చంపేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం పేరుతో హేమమాలినిని కాలేజీకి వెళ్లేందుకు కూడా మునుస్వామి అనుమతించలేదని అన్నారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు మునుస్వామిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి విచారణలో పూజలు, మూలికల చికిత్సతో రోగాలు నయం చేస్తున్నట్టు మునుస్వామి చెబుతున్నాడని పోలీసులు వెల్లడించారు. -
ఆశ్రమంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: దుండిగల్‌లో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆశ్రమం పరిసరాల్లో ఏర్పాటు చేసిన భారీ షెడ్డు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపుచేస్తున్నారు. ఆశ్రమంలో ఉన్న రెండు ఆలయాలకు మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. -
పోలీసుల వేట.. పరారీలో నిత్యానంద!
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని బిడది ధ్యాన పీఠాధిపతి వివదాస్పద అధ్యాత్మిక గురువు నిత్యానంద పరారీలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లైంగిక వేధింపులు తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఏడాదిన్నరగా బిడది ధ్యాన పీఠానికి రావడం లేదు. నిత్యానంద కోసం ధ్యానపీఠంలో వాకబు చేయగా ఆయన ఉత్తర భారత పర్యటనలో ఉన్నట్లు చెబుతున్నారు. గుజరాత్‌లోనూ నిత్యానందకు మఠం ఉండడంతో అక్కడకి వెళ్లి ఉండవచ్చునని భావిస్తున్నారు. నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి నిత్యానంద ఆస్ట్రేలియా దగ్గర్లోని ద్వీపానికి వెళ్లినట్లు వార్తలొచ్చాయి. కాగా అహ్మదాబాద్‌లోని నిత్యానంద ఆశ్రమంలో నిర్భంధించిన తన ఇరువురు కుమార్తెలను విడిపించాలని ఓ తల్లిదండ్రులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఇరువురిని విముక్తి కల్పించిన పోలీసులు నిత్యానందతో పాటు అహ్మదాబాద్‌కు చెందిన ఇరువురు ఆశ్రమ ముఖ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివాదాలు తారాస్థాయికి చేరడంతో నిత్యానంద ఆచూకీ తెలుసుకునేందుకు గురువారం బిడిదిలోని ధ్యానపీఠంకు పోలీసులు వెళ్ళగా సమగ్ర సమాచారం ఇవ్వలేదు. నిత్యానంద బిడిది ధ్యానపీఠంకు వచ్చి కొన్ని నెలలు అయ్యిందని అహ్మదాబాద్ ఆశ్రమంలో ఉండవచ్చునని తెలిపినట్లు సమాచారం. అయితే అతను విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగానే ఆయన పాస్‌పోర్ట్‌ను రద్ద చేశారు. -
ఆకాశమంత ఆర్తి
అభంశుభం తెలియని, ఆదుకునే వారే లేని ఆ చిన్నారులను ‘ఆర్తి’ ఆశ్రమం తన ఒడిలోకి తీసుకుంటోంది. అన్నీ తానే అయి వారిని ఆదరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు పదిహేను వందల మంది బాలికల భవిష్యత్తును వెలిగించింది. ఆ దీపాలన్నీ నేడు ప్రపంచ వ్యాప్తంగా వెలుగులను పంచుతున్నాయి. ఆ వెలుగుల్లో ‘ఆర్తి’ ఆకాశమంత ఎత్తులో కనిపిస్తోంది. నగరం సద్దుమణుగుతోంది. రాత్రి 11 గంటలు. ఆ భవనం వద్ద జీరో బల్బు వెలుతురు. ఎవరో కంగారుగా వచ్చి అక్కడ ఏదో పడేసి అంతే కంగారుగా వెళ్లిపోయారు. అటుగా వచ్చిన వాచ్మెన్ అక్కడేదో కదులుతున్నట్లు గమనించాడు. దగ్గరికి వచ్చి చూశాడు. పాత చీరెలో చుట్టి ఉన్న నెలల వసిగుడ్డు! చలికి వణుకుతోంది. జాగ్రత్తగా రెండు చేతుల్లోకి లోపలికి తీసుకెళ్లాడు. అతడు ‘ఆర్తి’ వాచ్మెన్.ఇంకో ఘటన. ఇంకా చీకట్లు విచ్చుకోలేదు. కొద్దిగా తెరిచి ఉన్న గేటులో నుంచి ఏడు నెలల పాప బరాబరా దోగాడుతూ వచ్చేసింది. లోపలి నుంచి వచ్చిన వారు ఆ చిన్నారిని ఎత్తుకున్నారు. గేటు బయటికి చూసి ఎవరూ లేకపోవడం గమనించారు. విషయం అర్థమైంది. ఆ పాపను అందరూ కాసేపు ఎత్తుకున్నారు. ‘ఆర్తి’ హృదయానికి హత్తుకున్నది.కడప నగరంలో మున్సిపల్ స్టేడియం వద్ద ఉం టుంది ‘ఆర్తి’. ఈ చిన్నారుల ఆశ్రమాన్ని పీవీ సంధ్య నిర్వహిస్తున్నారు. పాతికేళ్ల క్రితం ఆవిర్భవించింది మొదలు నేటి వరకు ఆర్తి ఆదర్శప్రాయమైన ప్రయాణంలోని విశేషాలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. బంధువులమ్మాయి ‘ఆర్తి’ ‘‘నేను ఇంగ్లీషు లెక్చరర్. నా భర్త శ్రీనివాసులురెడ్డి నేత్ర వైద్యులు. మాకు ఇద్దరు అమ్మాయిలు. 1992లో వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు.. మా ఇంటికి సమీపంలో ఓ పసిపాపకు ఎవరూ లేకపోవడం గమనించాను. ఆ చంటిబిడ్డను తెచ్చుకున్నాను. నా పిల్లలతో పాటు పెంచుకున్నాను. దీన్ని గమనించిన మరికొందరు తమ పిల్లలను రాత్రులు మా ఇంటి వద్ద వదిలేసేవారు. ఇలాంటి చిన్నారుల సంఖ్య పెరగడంతో స్నేహితులతో చర్చించి వారి సహకారంతో ప్రత్యేకంగా చిన్న ఇల్లు తీసుకుని బాలల ఆశ్రమం ప్రారంభించాను. మా బంధువుల అమ్మాయి ఆర్తి విదేశాల్లో తన స్నేహితుల నుంచి కొద్ది సొమ్మును సేకరించి మాకు పంపేది. దురదృష్టవశాత్తు ఆమె భౌతికంగా దూరం కావడంతో మా ఆశ్రమానికి ఆర్తి హోమ్ అని ఆమె పేరు పెట్టుకున్నాం. సంస్థ నిర్వహణకు విజయ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసుకున్నాం. వాళ్లకు ఎంతవరకు ఆశ్రయం, రక్షణ ఇవ్వగలనో, వారిని ఎంతవరకు చదివించగలనో, ఆ తర్వాత వారి జీవితం ఏమిటో.. ఏదీ ఆలోచించలేదు. హోమ్ నిర్వహిస్తున్నాం అంతే! ఇంటి బయట ఊయలతొట్టి ఓరోజు ఇంటి బయట ఎవరో నెలల పాపను ఉంచి వెళ్లారు. కొద్దిసేపటి ద్వారా కనుగొని చిన్నారి పరిస్థితి బాగా లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఎంత ప్రయత్నించినా చిన్నారిని నిలుపుకోలేక పోయాం. చాలా బాధ అనిపించింది. దాంతో ఇంటి బయట ఊయల తొట్టి ఏర్పాటు చేశాను. వాచ్‌మెన్‌ను నియమించాను. ఇక్కడ వదిలి వెళ్లే పిల్లల గురించి ఎవరూ ఏమి అడిగేది ఉండదని అక్కడ రాసి ఉంచాము. అలా హోమ్ పెరిగింది. 1993లో కలెక్టర్ సుబ్రమణ్యం హోమ్‌కు మున్సిపల్ స్టేడియం వద్ద కొద్దిగా స్థలాన్ని ఇచ్చారు. మెల్లిగా ఆ స్థలంలో ఇంటిని నిర్మించాం. 36 మంది చిన్నారులతో సొంత భవనంలో ఆశ్రమం పూర్తి స్థాయిలో మొదలైంది. ఇప్పటికి పదిహేను వందల మందికి పైగా ఆశ్రమం విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. పలు దేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వీరిలో చాలామందికి మేమే వివాహాలు జరిపించాము. సీమంతాలు, పురుళ్లు చేస్తున్నాం. ఏ ఉద్యోగంలో, ఎంత దూరంలో ఉన్నా పుట్టినరోజులు, పండుగల సందర్భంగా వాళ్లు హోమ్ కు వస్తుంటారు. ప్రస్తుతం హోమ్‌లో 120 మంది ఉన్నారు. కుటుంబ జీవన గ్రామం పిల్లలందరినీ ఒకేచోట పెంచుతున్న విషయంగా నాలో ఆలోచన మొదలైంది. వారందరికీ బాధ్యతలు తెలిసేలా పెంచడంతో పాటు కుటుంబ జీవనంలోని మాధుర్యాన్ని చవి చూపాలని భావించాను. అందుకోసం ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసి అందులో వీరినే కుటుంబాలుగా ఏర్పాటు చేయాలని భావించాను. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని సహకరించాలని కోరాను. రిమ్స్ వద్ద స్థలం ఇచ్చారు. అక్కడ తొమ్మిది కుటీరాలు ఏర్పాటు చేశాం. ఒక్కొ దానిలో పదీపదిహేను మంది ఓ కుటుంబంగా ఉంటున్నారు. ఒకరి కుటుంబాలకు ఒకరు సహకరించుకుంటున్నారు. దీంతో అది ఒక గ్రామంగా, వీరంతా గ్రామస్థులుగా ఆత్మీయత అనుబంధాలతో జీవిస్తున్నారు. భ్రూణహత్యలపై ప్రాజెక్టు వర్క్ దక్షిణ ఏషియా స్థాయిలో కేవలం ఆర్తి హోమ్‌కు మాత్రమే భ్రూణహత్యల నిర్మూలనపై ప్రాజెక్టు వర్క్ లభించింది. 2015లో కేంద్ర పథకం బేటీ బచావో.. బేటీ పఢావోలో భాగంగా ‘మన బిడ్డ’ కార్యక్రమాన్ని జిల్లాలోని 51 మండలాల్లో ప్రతిభావంతంగా నిర్వహించాం. ఆర్తి విద్యార్థులే అన్ని విభాగాలకు వలంటీర్లుగా జిల్లాలో విస్తృతంగా పర్యటించి పథకాన్ని వంద శాతం అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టారు. ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం భ్రూణ హత్యల సంఖ్య గణనీయంగా తగ్గడం నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది’’ అని ముగించారు సంధ్య. – పంతుల పవన్‌కుమార్, సాక్షి, కడప ఆడబిడ్డ విలువను గుర్తించాలి భ్రూణహత్యలు అమానుషం. ఈ సమస్యను అధిగమించడానికి ప్రధాన గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు అవగాహన కల్పించాల్సి ఉంది. అంకురం దశలోనే ఆడబిడ్డను అంతం చేస్తుండటం సృష్టికి విరుద్ధం. స్త్రీలేని లోకాన్ని ఊహించనే లేము. ఆడబిడ్డను ఇంటికి వెలుగు అని అనుకోవాలి తప్ప గుండెపై కుంపటి అనే భావం రానీయకూడదు. మెరుగైన సమాజం కావాలనుకున్నప్పుడు ఆడపిల్లకు మెరుగైన అవకాశాలు కల్పించాలి. స్త్రీ విలువను గమనించేందుకు సమాజంలో నైతిక విలువలు పెరగాల్సి ఉంది. ఈ సమస్యకు మూలాలు వెతికి సరిదిద్దాల్సి ఉంది. – పీవీ సంధ్య, నిర్వాహకులు, ఆర్తి హోం -
అల్ప సంతోషి
ఒకప్పుడు నీలగిరి కొండల్లో శతానందుడనే మహర్షి గురుకులం నడిపేవాడు. దూరప్రాంతాల నుంచి అక్కడ విద్యను అభ్యసించేందుకు చాలామంది విద్యార్థులు వచ్చేవారు. కొన్నాళ్లు ఆశ్రమంలోనే ఉండి విద్యాభ్యాసం పూర్తయ్యాక తమ తమ ఊర్లకు వెళ్లిపోయేవారు. అవంతిపురం రాజ్యానికి చెందిన అనంత శర్మ అనే యువకుడు కూడా ఆ ఆశ్రమంలో ఉండి చదువుకునేవాడు. అనంతశర్మ ఆశ్రమంలో ఉన్న విద్యార్థుల్లో కెల్లా తెలివైనవాడు. అయితే మహా గర్వి. తను తెలివైనవాడు గనుక అందరూ తనను గౌరవించాలనుకునేవాడు. ముఖ్యంగా గురువు తనను ప్రత్యేకంగా చూడాలనుకునేవాడు. కానీ శతానందుడు అతన్ని మిగతా విద్యార్థులతో సమానంగా చూసేవాడు. ఆయన ధోరణి అనంతశర్మకి నచ్చేది కాదు. ఓ రోజు శతానందుడు ఆశ్రమంలో తన విద్యార్థులకు సాత్విక జీవన విధానం గురించి బోధిస్తున్నాడు. ‘‘మనుషుల మధ్య ఎన్ని అంతరాలున్నా దేవుడి ముందు అందరూ సమానులే! ఉన్నత కులస్తులు, ధనవంతులు, మేధావులు తమని తాము గొప్పవారిగా భావించకూడదు. ఇతరుల కన్నా తమకు ఎక్కువ మర్యాదలు, సౌఖ్యాలు లభించాలని ఆశించకూడదు. దొరికినదానితో తృప్తి పడి జీవించడం అలవాటు చేసుకోవాలి. అలా అల్ప సంతోషిగా జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు’ అంటూ బోధించాడు. గురువుగారి మాటలు అనంత శర్మకు రుచించలేదు. ‘గురుదేవా..! మన సామర్థ్యానికి, తెలివితేటలకు తగ్గ ప్రతిఫలం పొందటం మన హక్కు కదా!? దాని కోసం ఆశించడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను’ అన్నాడు. ‘‘ఆశించడంలో తప్పులేదు కానీ ఆ ఆశ అత్యాశగా మారకూడదు. తెలివైన వారు పని చెయ్యటం కోసం తమ తెలివిని ఉపయోగించాలి గానీ ప్రతిఫలం పొందటం కోసం ఉపయోగించకూడదు. అలా చేస్తే కొన్నిసార్లు దొరికిన ప్రతిఫలం కూడా చేజారిపోవచ్చు’’ అంటూ అనంత శర్మకు బోధించాడు శతానందుడు. ఆశ్రమ నియమాల ప్రకారం అక్కడ చదువుకొనే విద్యార్థులు వ్యవసాయపనులు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో చుట్టుపక్కల గల పొలాలకు వెళ్లి అక్కడ రైతులకు సేద్యపు పనుల్లో సాయపడాలి. దీనివల్ల రైతుల కష్టాల గురించి విద్యార్థులకు తెలుస్తుంది. ఓ రోజు గురువు ఆదేశానుసారం విద్యార్థులంతా ఓ రైతు పొలంలో పని చేశారు. ఆ రైతు పొలంలో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ రైతు బాగా పండిన పళ్లను బుట్టనిండా కోసుకొచ్చి గురువుగారికి అందించాడు. శతానందుడు తానొక పండు తీసుకుని మిగతా పండ్లను ఒక్కొక్కరికీ ఒక్కటి చొప్పున పంచమని అనంతశర్మను ఆదేశించాడు. ఆ బుట్టలో ఒక పెద్ద పండు ఉండటం అనంత శర్మ గమనించాడు. మిగతా పండ్లు చిన్నగా ఉన్నాయి. అనంతశర్మ అందరికీ చిన్న పండ్లు పంచి తాను పెద్ద పండు తీసుకొన్నాడు. మిగతా పండ్లను రైతుకిచ్చేశాడు. తర్వాత అందరూ పండ్లు తిన్నారు. అందరి పండ్లు తియ్యగా ఉన్నాయి. కానీ అనంతశర్మ తీసుకున్న పెద్ద పండు మాత్రం పుల్లగా ఉంది. దాన్ని తినలేక అతను పండును పారవేశాడు. అది గమనించిన శతానందుడు ‘‘చూశావా శర్మా? మిగతా వారి కన్నా ఎక్కువ ప్రతిఫలం పొందాలని నువ్వు పెద్ద పండు తీసుకున్నావ్. కానీ అది తినటానికి పనికి రాకుండా పోయింది. కొన్ని సార్లు అత్యాశకు పోతే అసలుకే మోసం వస్తుందనటానికి ఇదే ఉదాహరణ. అందుకే దొరికిన దానితో తృప్తి పడాలని పెద్దలంటారు. అల్ప సంతోషిగా జీవించే వ్యక్తికి జీవితంలో అసంతృప్తి అనేదే ఉండదు’’ అంటూ హితబోధ చేసి ఆనక రైతుకి చెప్పి అనంతశర్మకు మరో పండు ఇప్పించాడు. అలా జ్ఞానోదయమైన అనంతశర్మ ఆ నాటి నుంచి గర్వాన్ని, అత్యాశను విడిచి అల్ప సంతోషిగా ఉంటూ తృప్తిగా జీవించసాగాడు. -
ప్రకృతి వ్యవసాయంపై 29 నుంచి వారం రోజుల శిక్షణ
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రకృతి వ్యవసాయ ట్రస్టు ఆధ్వర్యంలో బెంగళూరులోని మానస గంగ ఆశ్రమంలో ఈనెల 29 నుంచి వచ్చే నెల 4 వరకు గోఆధారిత ప్రకృతి వ్యవసాయం, 5 లేయర్ మోడల్, టెర్రస్ గార్డెనింగ్పై వారం రోజుల రెసిడెన్సియల్ శిక్షణా శిబిరం జరగనుంది. పత్తిలో గులాబీ పురుగు, మొక్కజొన్న ఆర్మీ లద్దెపురుగులను అరికట్టే పద్ధతులపై కూడా శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. ఉమామహేశ్వరి – 90004 08907, నాయుడు – 79937 95246, లయ – 88973 32296. -
ప్రభోదానంద ఆశ్రమం అసలు కథ!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభోదానంద ఆశ్రమం... ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఈ ఆశ్రమంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా జేసీ వర్గీయులు, ఆశ్రమ నిర్వాహకులకు మధ్య తలెత్తిన ఘర్షణ మూడు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎట్టకేలకు సోమవారం భక్తులను ఎవరి ఊళ్లకు వాళ్లను పంపడంతో వివాదానికి తెరపడింది. ఈ క్రమంలో అసలు ప్రభోదానంద ఎవరు? బోధనలేంటి? ట్రస్టు కార్యకలాపాలు, జేసీ బ్రదర్స్‌తో వైరం ఎలా మొదలైంది? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇదీ. వైద్యుడిగా సేవలు, ఆథ్యాత్మిక పుస్తకాల రచన తాడిపత్రి మండలం అమ్మలదిన్నెకొత్తపల్లికి చెందిన గుత్తా పెద్దన్న చౌదరి ఆర్మీలో వైర్లెస్ ఆపరేటర్‌గా పని చేశారు. తర్వాత ఆర్ఎంపీ వైద్యుడిగా కొన్నాళ్లు సేవలందించారు. ప్రాచీన ఆయుర్వేదంపై పుస్తకాలు రాశారు. మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో జ్ఞానబోధపై పుస్తకాలు రచించారు. 1978లో తాడిపత్రి సమీపంలోని నందలపాడులో ఆశ్రమం స్థాపించారు. గుత్తా పెద్దన్న చౌదరి పేరును ప్రభోదానంద యోగీశ్వరులుగా మార్చుకున్నారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ సందేశాలను మిళితం చేసి ప్రభోదానంద ‘త్రైతసిద్ధాంతం’ రూపొందించి పుస్తకాలు రాశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మల్లిక అనే మహిళను వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. జేసీ బ్రదర్స్‌తో వైరానికి బీజం మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య సమయంలో తాడిపత్రిలో పలువురు బీజేపీ సానుభూతిపరుల దుకాణాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ‘టైగర్’ ఆలె నరేంద్ర అప్పుడు తాడిపత్రిలో పర్యటించి బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు. ప్రభోదానంద బీజేపీ సానుభూతిపరుడు. వేణుగోపాల్‌రెడ్డి అనే బీజేపీ నేత నాడు కాంగ్రెస్‌లో ఉన్న జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా నిలబడ్డారు. అయన్ను తరిమికొట్టాలని జేసీ బ్రదర్స్ ప్రయత్నించగా ప్రభోదానంద అడ్డుకుని ఆశ్రయం కల్పించారు. దీంతో ఆశ్రమంపై దాడికి దిగి ఖాళీ చేయించారు. ప్రభోదానంద అనంతపురంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఓ వ్యక్తి ద్వారా ఆశ్రమాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం జరిగినా ప్రభోదానంద గట్టిగా ఎదుర్కొన్నారు. ఓ రోజు చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళతోపాటు ప్రభోదానంద మూడేళ్ల కుమారుడు యుగంధర్‌ను కొందరు చంపేశారు. ఆశ్రమం బత్తలపల్లికి మార్చినా అక్కడ కూడా అదే పరిస్థితులు ఎదురుకావడంతో రాష్ట్రం వదిలి కర్ణాటకలోని కంప్లి చేరుకున్నారు. పుస్తక వ్యాపారమే ప్రధానం తాడిపత్రి ఆశ్రమంలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన భారీ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఇక్కడ పుస్తకాలు ముద్రిస్తుంటారు. పలు భాషల్లోకి ప్రభోదానంద బోధనలను తర్జుమా చేసి పుస్తకాలు విక్రయిస్తారు. ఇదే వీరి ప్రధాన వ్యాపారం. ఆయన భక్తుల్లో హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. తాను భగవంతుడిని కృష్ణుడి రూపంలో పూజిస్తానని ఇతర మతాలవారు వారి ఇష్ట ప్రకారం పూజించుకోవచ్చని చెబుతారు. భక్తులు ఆశ్రమానికి భారీగా విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిధులు అవసరమైతే భారీగా విరాళాలు ఇచ్చే భక్తులూ ఆయనకున్నారు. బీజేపీలో చేర్చుకోవద్దని ఒత్తిడి ప్రభోదానంద కుమారుడు యోగానంద చౌదరిని బీజేపీలో చేర్చుకోవద్దని ఉన్నత స్థాయిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రభోదానంద హిందూ వ్యతిరేకి అని, యోగానందను పార్టీ నుంచి బహిష్కరించాలని ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు కూడా చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆశ్రమాన్ని సందర్శించిన బీజేపీ నేతలు దీన్ని పట్టించుకోలేదని తెలిసింది. 12 ఏళ్ల తర్వాత తిరిగి తాడిపత్రికి ప్రభోదానంద 12 ఏళ్ల క్రితం తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడలో తిరిగి ఆశ్రమం స్థాపించారు. ప్రభోదానంద ఆశ్రమంలో మూడు వైపులా భవనాలున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి సమీపంలోనే ఇళ్లు కొనుగోలు చేశారు. ఆశ్రమ నిర్మాణానికి కూలీలు రాకుండా అడ్డుకోవడంతో ఇతర ప్రాంతాల నుంచి రప్పించారు. నీటిని నిలిపివేయడంతో సొంతంగా బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రభోదానంద స్థిరపడ్డారు. ఆశ్రమంలో పౌర్ణమి, అమావాస్య నాడు జరిగే ప్రత్యేక బోధనల కోసం వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. అనంతపురం జిల్లాలో ఆయనకు 25 వేల మంది భక్తులు ఉంటారని అంచనా. ఇందులో 15 వేల మంది తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన వారే. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభోదానందకు భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, థాయ్‌లాండ్, జపాన్, ఆస్ట్రేలియాలో బోధనలు సాగుతున్నాయి. రెండేళ్లుగా ప్రభోదానంద ఎక్కడున్నారో తెలియదు. ఆయన ప్రసంగాలను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తారు. వాటిని ఆశ్రమంలోని తెరలపై ప్రసారం చేస్తున్నారు. జేసీ బ్రదర్స్‌తో వైరం తారస్థాయికి జేసీ బ్రదర్స్‌ను గట్టిగా ఎదుర్కోవాలంటే రాజకీయ అండదండలు అవసరమని భావించిన ప్రభోదానంద కుమారులు జలంధర్ చౌదరి, యోగానంద చౌదరిలు గతేడాది ఏప్రిల్‌లో అప్పుడు మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రభోదానందకు మణిందర్ చౌదరి అనే తనయుడు కూడా ఉన్నాడు. తాడిపత్రి వద్ద ఆశ్రమం నిర్మాణ సమయంలో ఇసుక సరఫరా కాకుండా అడ్డుకోవడంతో నిర్వాహకులు హెచ్ఆర్సీని ఆశ్రయించడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత తాడిపత్రి సమీపంలోని రావి వెంకటాపురంలో కమ్మ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి స్థానిక టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఆహ్వానించారు. జలంధర్ చౌదరి కూడా దీనికి హాజరై కళ్యాణ మండపానికి విరాళం ఇచ్చారు. అంతకుముందు పరిటాల శ్రీరాంను కాకర్ల రంగనాథ్ తన నివాసంలో భోజనానికి ఆహ్వానించారు. ఈ ఘటనతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరంతా ఏకమై జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ పరిణామంతో జేసీ బ్రదర్స్ ఆత్మరక్షణలో పడ్డారు. ఆశ్రమానికి సంబంధించి భక్తులు భారీ సంఖ్యలో ఉండటం, వచ్చే ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేస్తారనే ఉద్దేశంతో గణేశ్ నిమజ్జనం ఘటనను అస్త్రంగా వాడుకున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా విగ్రహాన్ని ఓ ఆటోలో తీసుకెళ్లారు. వెనుక రెండు ట్రాక్టర్లలో రాళ్లు తరలించారు. ఆశ్రమం వద్ద జరిగిన గొడవ అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఎవరు ముందు దాడికి దిగారు? ఏం జరిగిందనేది కెమెరాలు పరిశీలిస్తే స్పష్టమవుతుంది. -
ప్రబోదానందస్వామి ఆశ్రమంను ధ్వంసం చేసిన పోలీసులు
-
సర్ధుమణిగిన తాడిపత్రి.. కలెక్టర్ పూర్తి భరోసా
-
ఊపిరి పీల్చుకున్న తాడిపత్రి
సాక్షి, అనంతపురం : తాడిపత్రిలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న వివాదం చల్లారింది. వినాయక నిమజ్జనం సందర్భంగా తాడిపత్రిలో ప్రబోదానందస్వామి భక్తులు, జేసీ సోదరుల మధ్య చెలరేగిన ఘర్షణలకు తెరపడింది. ఆశ్రమ నిర్వాహకులతో కలెక్టర్ వీరపాండ్యన్ సోమవారం జరిపిన చర్చలు ఫలించాయి. ఆశ్రమం వదిలి స్వగ్రామాలకు వెళ్లేందుకు భక్తులు అంగీకరించారు. తాము ఏ ఒక్కరికీ అనుకూలం కాదని... ఆశ్రమానికి రక్షణ కల్పిస్తామని కలెక్టర్ భరోసా ఇవ్వడంతో భక్తులు శాంతించారు. ఆశ్రమం నుంచి ఆర్టీసీ బస్సుల్లో అధికారులు వారిని తరలించారు. పోలీసుల తీరు వివాదాస్పదం మరోవైపు ప్రబోదానందస్వామి ఆశ్రమంపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదస్పదమవుతోంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాల్సిన పోలీసుల్లో కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ప్రబోదానందస్వామి ఆశ్రమంలోని సీసీ కెమెరా ను సాక్షాత్తు పోలీసులే ధ్వంసం చేయటం దుమారం రేపుతోంది. ఆదివారం రోజున ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కొందరు పోలీసులు తమ వద్ద ఉన్న లాఠీలతో సీసీ కెమెరాలను పగులగొట్టారు. జేసీ వర్గీయులకు మేలు చేసేందుకు ఇలా వ్యవహరించారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రబోదానందస్వామి ఆశ్రమంలో ఉన్న కొందరు భక్తులను లాఠీలతో కొడుతున్న దృశ్యాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. దీంతోపాటు జేసీ వర్గీయుల రాళ్ళ దాడి, వాహనాల ధ్వంసం చేసిన తీరు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తక్షణమే చంద్రబాబు సర్కారు జోక్యం చేసుకుని తాడిపత్రిలో శాంతిభద్రత పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత -
600 మంది అమ్మాయిలు అదృశ్యం.. కలకలం
జైపూర్: శిష్యురాలిపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక వేత్త దాతీ మహారాజ్ ఆశ్రమం నుంచి 600 మంది అమ్మాయిలు అదృశ్యం అయినట్టు ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే దాతీ మహారాజ్ రాజస్థాన్‌లోని అల్వాస్‌లో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి బాగోగులు తానే చూసుకుంటున్నానని గతంలో అనేక సార్లు చెప్పుకున్నారు. కాగా దాతీ మహరాజ్ తనపై అత్యాచారం చేశాడని 25 ఏళ్ల యువతి ఫిర్యాదు ఇవ్వడంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆశ్రమానికి వెళ్లారు. ఆ సమయంలో ఆశ్రమంలో కేవలం 100 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మిగతా 600 అమ్మాయిలు ఎక్కడికి వెళ్లారన్న కోణంలో విచారణ జరుపుతున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. అలాగే ఆశ్రమం నుంచి తప్పించుకున్న దాతీ మహారాజ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. దాతీ మహారాజ్ తనను పదేళ్ల పాటు ఆశ్రమంలో నిర్భందిచాడని, ఆయనతో పాటు మరో ఇద్దరు అనుచరులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ 25 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన వద్ద ఉండే ఓ మహిళా శిష్యురాలు అమ్మాయిలను బలవంతంగా ఆయన గదిలోకి పంపుతుందని వెల్లడించింది. ఈ విషయంపై ఇటీవల స్పందించిన దాతీ మహారాజ్.. ఆరోపణలు చేస్తున్న యువతి తనకు కుమార్తె వంటిదని పేర్కొన్నారు. విచారణకు కూడా సహకరిస్తాని చెప్పిన ఆయన ఆశ్రమం నుంచి పరారు కావడం గమనార్హం. -
నువ్వు పుణ్యాత్ముడివి గనుక!
ఒకనాడు తన పొలంలోపడి మేస్తున్న ఓ గోవుని గడ్డిపరకతోఅదిలించాడు గౌతముడు. ఆ మాత్రానికే అది కిందపడి ప్రాణంకోల్పోయింది. గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకోవడంతో వరుణుడికి స్వేచ్ఛ కలిగింది. పుష్కరిణి ఎండిపోయింది. గౌతమ మహర్షి దండకారణ్యంలో తన ఆశ్రమాన్ని నిర్మించుకొన్నాడు. దగ్గరలోనే ఒక పుష్కరిణి తవ్వించుకొన్నాడు. అందులో ఎప్పుడూ సమృద్ధిగా నీళ్లు ఉండేవి. పాడి పంటలతో మునివాటిక సస్యశ్యామలంగా ఉండేది. ఇలా ఉండగా ఆ ప్రాంతంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. వాగులూ వంకలూ ఎండిపోయాయి. గుక్కెడు నీళ్లు కూడా కరువై జనం అలమటించసాగారు. వర్షాలకోసం వరుణ యాగం చేసినా లాభం లేకపోవడంతో గౌతముడు సూక్ష్మ శరీరంతో వరుణలోకానికి వెళ్లి, వానలు కురిపించమని ప్రార్థించాడు. వరుణుడు ఆలకించకపోవడంతో గౌతముడు వరుణుడిని తన తపోశక్తితో నీరుగా మార్చి తన ఆశ్రమంలోని పుష్కరిణిలోకి ప్రవహింపజేశాడు. ‘నువ్వు పుణ్యాత్ముడివి గనుక, నీకు కట్టుబడి ఉన్నాను. నిన్ను పాపం అంటిన మరుక్షణం నేనిక్కడ ఉండను’ అని చెప్పి వరుణుడు అక్కడే ఉండిపోయాడు. దాంతో లోకమంతా కరువు తాండవిస్తున్నా గౌతముని ఆశ్రమ ప్రాంతం మాత్రం సుభిక్షంగా ఉంటోంది. ఒకనాడు తన పొలంలో పడి మేస్తున్న ఓ గోవుని గడ్డిపరకతో అదిలించాడు గౌతముడు. ఆ మాత్రానికే అది కిందపడి ప్రాణం కోల్పోయింది. గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకోవడంతో వరుణుడికి స్వేచ్ఛ కలిగింది. పుష్కరిణి ఎండిపోయింది. గౌతముడు శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గంగను విడువమన్నాడు గౌతముడు. నేలమీదికి దూకిన గంగాజలాల స్పర్శతో గోవు ప్రాణంతో లేచి నిలబడింది. గౌతముడి పాపం తొలగిపోయింది. గంగా ప్రవాహం దక్షిణాపథాన్ని సస్యశ్యామలంగా మార్చింది. గౌతముడి వల్ల ఏర్పడింది కనుక గౌతమి అని, గోవును బతికించింది కనుక గోదావరి అని ఆ నదికి పేర్లు వచ్చాయి. గౌతముడి పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా భరించినప్పుడేగా లోకకల్యాణం! -
కోట్లు వసూలు చేసిన కిలేడి..
నెల్లూరు సిటీ: భక్తి ముసుగులో మోసానికి పాల్పడిన కిలాడి లేడీ మెతుకు వెంకట నాగవాసవిపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నగరంలోని ప్రశాంతినగర్‌లో గురుదత్తాత్రేయ ఆశ్రమాన్ని అడ్డాగా చేసుకొని భక్తుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మహిళ పరారైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చిన విషయం తెలి సిందే. ఒంగోలు నగరంలోని మిర్యాలపాళేనికి చెందిన మెతుకు వెంకటనాగవాసవికి తొమ్మిదేళ్ల క్రితం సునీల్ అనే వ్యక్తితో వివాహమైంది. విభేదాలతో దంపతులిద్దరూ విడిపోయారు. అనంతరం ఆంజనేయులును రెండో వివాహం చేసుకున్నారు. అనంతరం ఆయనకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒంగోలులో ని ట్రంక్‌రోడ్డులో ఓ ఫర్నిచర్ దు కాణాన్ని నిర్వహిస్తున్న బాషా అలియాస్ మస్తాన్‌తో స్నేహం చేస్తోంది. మహామంత్రయా గం పేరు తో నెల్లూరులోని ప్రశాంతినగర్‌లో కొన్ని వారాలుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భక్తులను ముగ్గులోకి దించుతూ వాసవి రూ. కోట్ల మేర వసూలు చేసింది. ఇలా దాదాపు రూ.నాలుగు కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా నగదు బదిలీ వాసవి పక్కా స్కెచ్‌తో గుట్టుచప్పుడు కాకుండా రూ.కోట్లను కుటుంబసభ్యులకు చేరవేసిందనే ఆరోపణలు ఉన్నా యి. దాదాపు రూ.రెండు కోట్ల నగదుతో కూడిన సంచులను కుటుం బసభ్యులకు అందజేసినట్లు తెలు స్తోంది. ఒంగోలులోని తన స్నేహితుడు బాషా అలియాస్ మస్తాన్, సోదరుడు మెతు కు రాజా, విజయవాడలో మామయ్య అయిన రైల్వే ఉద్యోగి వెంకటసురేష్‌బాబుకు సంచుల నిండా నగదును భారీగా అందజేసినట్లు సమాచారం. పరారీలో కిలాడి లేడీ వాసవి ముందస్తు ప్రణాళికలో భాగంగా తన ఆరేళ్ల చిన్నారితో కలిసి పరారైంది. ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. వాసవికి సుధాకర్‌బాబాతో ఏ విధమైన సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రణాళికలో భాగంగా జరిగిందా.. లేక వాసవి నమ్మించి మోసానికి పాల్పడిందా అనే విషయం తెలియాల్సి ఉంది. -
వేచిచూసే కళ
ఏది ఎలా జరగాలో అలాగే జరగాలి. చెట్టున ఉన్న కాయ ఎప్పుడు పక్వానికి రావాలో అప్పుడే వస్తుంది. ఒకరోజు ఒక యువకుడు ఒక ఆశ్రమంలో యుద్ధక్రీడలు నేర్పే ఒక గురువు దగ్గరికి వెళ్లాడు. గురువు చెట్టుకింద ధ్యానంగా కూర్చునివున్నాడు. ‘గురువర్యా’ అని పిలిచాడు యువకుడు. గురువు కళ్లు తెరిచాడు. ‘మీ శిక్షణలో నాకు రాటుదేలాలని వుంది, నన్ను మీ శిష్యునిగా చేర్చుకోండి’ అని కోరాడు యువకుడు. గురువు సమ్మతిగా తలూపాడు. ‘అయితే నేను మొత్తం ఈ కళలో ప్రావీణ్యత సంపాదించడానికి ఎన్నేళ్లు పడుతుంది?’ అడిగాడు యువకుడు. ‘పదేళ్లు’ అని జవాబిచ్చాడు గురువు. ‘నేను అంతకాలం వేచివుండలేను. అంతకంటే త్వరగా ముగించగలిగే మార్గం చెప్పండి. నేను ఎక్కువ శ్రమిస్తాను, ఎక్కువ పనిగంటలు వెచ్చిస్తాను, ఎక్కువ శక్తిని ధారపోస్తాను. ఇలాగైతే ఎన్నేళ్లలో నేర్చుకోవచ్చు’ అడిగాడు యువకుడు. ఒక క్షణం ఆలోచించి చెప్పాడు గురువు: ‘ఇరవై ఏళ్లు’. ఈ కథ చెప్పే కీలకమైన అంశం ఏమిటి? ఏది ఎలా జరగాలో అలాగే జరగాలి. చెట్టున ఉన్న కాయ ఎప్పుడు పక్వానికి రావాలో అప్పుడే వస్తుంది. దానికోసం మనం చేయగలిగేది వేచివుండటమే. వేచివుండటానికి కూడా సాధన కావాలి. వేచివుండగలగడం కూడా ఒక శక్తి! -
నిత్యానంద ఆశ్రమంలో ఆ ఇద్దరిని విడిపించండి!
తిరువణ్ణామలై: తిరువణ్ణామలైలోని నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించిన తన కుమారుడు, మనవరాలిని విడిపించాలని కోరుతూ దంపతులు ఆశ్రమం ముందు ధర్నా నిర్వహించారు. వివరాలు.. తేని జిల్లా పెరియకులం వడకరై సుబ్రమణ్య వీధికి చెందిన కార్తి రైతు, ఇతని భార్య ఈశ్వరి. దంపతుల కుమారుడు మనోజ్‌కుమార్, కుమార్తె వనిత ఉన్నారు. మనోజ్‌కుమార్ మేలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం మదురైలోని నిత్యానంద ధ్యాన మండపానికి వెళ్లిన మనోజ్ తిరిగి రాలేదు. ఈ స్థితిలో మనోజ్‌కుమార్ తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులోని నిత్యానంద ఆశ్రమంలో ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తల్లిదండ్రులు ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. అయితే వారిని ఆశ్రమ సిబ్బంది లోనికి అనుమతించలేదు. మనోజ్‌కుమార్ బెంగళూరులోని ఆశ్రమంలో ఉన్నాడని, ధ్యానంలో ఉన్నందున చూసేందుకు వీలుకాదని అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. మనోజ్‌కుమార్‌తో పాటు తమ మనవరాలు నివేద(17) (వనిత కుమార్తె)ను ఆశ్రమంలో నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నట్టు ఆరోపించడంతో వారిని సిబ్బంది అక్కడినుంచి వెల్ల్లగొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్రమం వద్దకు చేరుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో ఆశ్రమ సిబ్బంది తాము ఎవ్వరినీ బలవంతంగా నిర్బంధించలేదని, భక్తులు స్వయంగా వచ్చి ధ్యానంలో పాల్గొంటున్నారని ఆధారాలతో తెలిపారు. ఇలాఉండగా మనోజ్ తల్లిదండ్రులు విలేకరులతో మాట్లాడుతూ తన కుమారుడు, మనవరాలిని ఆశ్రమంలో నిర్బంధించారని వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారనే విషయం కూడా తమకు తెలియరాలేదన్నారు. వనిత మాట్లాడుతూ మదురైలో జరిగిన నిత్యానంద ధ్యాన శిక్షణలో తాను కుమార్తె సహా పాల్గొన్నట్టు తెలిపారు. ఒక నెల ప్రత్యేక ధ్యానం అని చెప్పి తమను తిరువణ్ణామలై ఆశ్రమానికి తీసుకొచ్చారన్నారు. ఆ సమయంలో తన తండ్రికి అనారోగ్యం అని తెలియడంతో ఆశ్రమంలో రూ.3లక్షలు చెల్లించి కుమార్తెను ఇక్కడే వదిలి ఇంటికి వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం తన కుమార్తెను చూసేందుకు కూడా ఆశ్రమ నిర్వాహకులు అనుమతించడం లేదన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.