అలా దాఖలుచేసే రిట్ పిటిషన్‌కు విచారణార్హతే లేదు
సాటి ఉద్యోగి మాత్రమే సవాలు చేయగలరు
సంబంధంలేని మూడో వ్యక్తి రిట్ ద్వారా ప్రశ్నించజాలరు
అభ్యంతరాలుంటే వాటిని తగిన వేదిక ముందు సవాలు చేసుకోవచ్చు
తీర్పునిచ్చిన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కె. మన్మథరావు
శ్రీకృష్ణ గీత ఆశ్రమం ఈఓపై దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
సాక్షి, అమరావతి : ప్రభుత్వ సంస్థలో పనిచేయని, ఆ సంస్థ పరిపాలన వ్యవహారాలతో సంబంధంలేని ఏ వ్యక్తి అయినా కూడా ఆ సంస్థ కార్యకలాపాలను, అధికారుల చర్యలను ప్రశ్నిస్తూ అధికరణ–226 కింద రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. అలా దాఖలు చేసే రిట్ పిటిషన్‌కు ఎంతమాత్రం విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. ఆ సంస్థ, ఆ అధికారి చర్యలపై అభ్యంతరాలుంటే వాటిని తగిన వేదికల ముందు సవాలు చేసుకోవచ్చునని సూచించింది.
సర్వీసు వివాదాలను సాటి ఉద్యోగి మాత్రమే సవాలు చేయగలరని, సంబంధంలేని మూడో వ్యక్తి ప్రశ్నించజాలరని స్పష్టంచేసింది. వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీత ఆశ్రమం కార్యనిర్వహణాధికారి (ఈఓ) అయిన సి. శంకర బాలాజీని జిల్లా దేవాదాయ శాఖ ఇన్‌చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించడాన్ని సవాలు చేస్తూ ఎం. సురేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ఇటీవల తీర్పు వెలువరించారు.
ఇన్‌చార్జ్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించడం తగదు..
ప్రొద్దుటూరుకు చెందిన సురేష్ శ్రీకృష్ణ గీత ఆశ్రమానికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకుని అందులో శారదా జూనియర్ కాలేజీ పేరుతో విద్యా సంస్థను నడుపుతున్నారు. ఆ ఆశ్రమానికి శంకర బాలాజీ ఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన్ను జిల్లా దేవాదాయశాఖ ఇన్‌చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు.
దీనిని సవాలుచేస్తూ సురేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ మన్మథరావు విచారణ జరిపారు. శంకర బాలాజీ రెండు పోస్టుల్లో కొనసాగడానికి వీల్లేదని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. అసిస్టెంట్ కమిషనర్‌గా శంకర బాలాజీ నియామకం చట్ట విరుద్ధమన్నారు.
ఆ నియామకం పిటిషనర్‌కు సంబంధంలేనిది..
అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. శ్రీకృష్ణ గీత ఆశ్రమం, దేవదాయ శాఖ పరిపాలన వ్యవహారాల్లో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధంలేదన్నారు. శంకర్ బాలాజీని పూర్తిస్థాయి ఇన్‌చార్జ్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించడమన్నది పిటిషనర్‌కు సంబంధంలేని వ్యవహారమని తేల్చిచెప్పారు. అందువల్ల ఇన్‌చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా శంకర్ బాలాజీ నియామకాన్ని ప్రశ్నించజాలరన్నారు. సురేష్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం కోర్టును విసిగించేదన్నారు. కాబట్టి.. సురేష్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
సర్వీసు ఉద్యోగాల్లో సహ ఉద్యోగే బాధితుడు
దేవదాయ శాఖ కమిషనర్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇన్‌చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా బాలాజీ నియామకంవల్ల పిటిషనర్ ఏ విధంగా బాధితుడు కాదని, ఆయన నియామకాన్ని ప్రశ్నించేందుకు సహ ఉద్యోగి కూడా కాదన్నారు. సర్వీసు వివాదాల్లో సహ ఉద్యోగి మాత్రమే బాధిత వ్యక్తి అవుతారని కమిషనర్ తన కౌంటర్‌లో పేర్కొన్నారు. ఆశ్రమం ఈఓ కౌంటర్ దాఖలు చేస్తూ కళాశాల నిర్వహిస్తున్న స్థలాన్ని ఎలాంటి వేలం నిర్వహించకుండా తనకే 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని పిటిషనర్ సురేష్ దేవదాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారన్నారు.
చెల్లించాల్సిన లీజు బకాయిలను కూడా చెల్లించలేదని, బకాయిల కోసం పిటిషనర్‌కు నోటీసులు ఇచ్చామన్నారు. అద్దె కూడా సక్రమంగా చెల్లించకుండా కాలేజీ నిర్వహిస్తున్నారని, వీటన్నింటినీ ప్రశి్నస్తున్నందుకే శంకర బాలాజీ నియామకాన్ని సవాలుచేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. శంకర బాలాజీ సైతం ఇదే విషయాలతో వ్యక్తిగత హోదాలో కౌంటర్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment