దొండపర్తి(విశాఖ దక్షిణ): ఆశ్రమం ముసుగులో పూర్ణానంద సరస్వతి స్వామీజీ సాగించిన లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధ్యాత్మికత పేరుతో సాగించిన అకృత్యాలు విస్తుగొలుపుతున్నాయి. అనాథ బాలికలకు ఆశ్రయం కల్పించే నేపంతో చేసిన దారుణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. ఆశ్రమంలో మరో మైనర్ బాలికపై కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వెంకోజీపాలెం ప్రాంతంలో దశాబ్దాల క్రితం ఏర్పాటైన జ్ఞానానంద ఆశ్రమాన్ని పూర్ణానంద సరస్వతి స్వామీజీ నిర్వహిస్తున్నారు.
ఒకవైపు అధ్యాత్మికత బోధనలతో పాటు తల్లిదండ్రుల నుంచి దూరమైన, అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే ఈ ఆశ్రమంపై గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక(15) స్వామీజీ గత రెండేళ్లుగా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులకు చేసిన ఫిర్యాదు ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆమె ఫిర్యాదుతో పేర్కొన్న వివరాల ప్రకారం
గొలుసులతో కట్టేసి రెండేళ్లుగా అఘాయిత్యం
రాజమండ్రికి చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పెద్దమ్మ విశాఖకు తీసుకువచ్చి జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించింది. అక్కడ స్వామీజీ ఈ బాలికతో పాటు మరికొంత మంది బాలికలతో పశువుల నిర్వహణ చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా రోజూ రాత్రి 12 గంటలకు ఆ మైనర్ బాలికను బలవంతంగా గదిలోకి తీసుకువెళ్లి గొలుసులతో కట్టేసి అఘాయిత్యం చేసేవాడు. కొన్నిసార్లు స్వామీజీని నిలువరించే ప్రయత్నం చేస్తే కొట్టి హింసించేవాడు. ఇలా రెండేళ్ల పాటు బాలిక నరకయాతన అనుభవించింది.
పనిమనిషి సాయంతో బయటపడి..
ఈ నెల 13వ తేదీన పనిమనిషి గొలుసులు విప్పిడంతో బాలిక ఆశ్రమం నుంచి తప్పించుకుంది. ఆమె ఇచ్చిన డబ్బులతో రైల్వేస్టేషన్‌కు వెళ్లి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలులో ఒక ప్రయాణికురాలు బాలికను గమనించి మాట్లాడగా ఆశ్రమంలో జరిగిన విషయాన్ని ఆమెకు వివరించింది. దీంతో ఆమె కృష్ణా జిల్లాలో కంకిపాడులోని తన సోదరి ఇంటికి తీసుకువచ్చింది.
స్థానికుల సలహా మేరకు బాలికను హాస్టల్‌లో చేర్చేందుకు ప్రయత్నించింది. పోలీస్‌స్టేషన్ నుంచి లేఖ తీసుకువస్తే హాస్టల్ చేర్చుకుంటామని చెప్పారు. దీంతో వారు బాలికతో కంకిపాడు స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు బాలిక నుంచి వివరాలు తెలుసుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. కమిటీ సభ్యులు బాలిక నుంచి వివరాలు సేకరించారు. అనంతరం పోలీసులు అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కేసును ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
మరో బాలికపై కూడా అఘాయిత్యం
విశాఖ పోలీస్ ఉన్నతాధికారులు కేసును దిశ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా మరో బాలికపై స్వామీజీ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. దీంతో పోలీసులు ఆ ఆశ్రమంలో తనిఖీలు చేయగా పిల్లల ఆశ్రయానికి అనువైన పరిస్థితులు లేనట్లు గుర్తించారు. అలాగే ఇప్పటి వరకు ఎంత మంది పిల్లలు ఆశ్రమంలో ఆశ్రయం పొందారు? ఏయే పరిస్థితుల్లో బయటకు వెళ్లారు? వారితో స్వామీజీ వ్యవహరించిన తీరు? ఇలా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్వామీజీపై కొన్నేళ్లుగా ఆరోపణలు
ఆశ్రమ నిర్వహణ, పూర్ణానంద సరస్వతి స్వామీజీ వ్యవహార శైలిపై గత కొన్నేళ్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి 1955లో జ్ఞానానంద భారతి అనే స్వామిజీ ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అనాథ పిల్లలు, తల్లిదండ్రులచే నిర్లక్ష్యం చేయబడిన, అనార్యోగంతో ఉన్న పిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పించారు. వారికి విద్యాబోధనతో పాటు ఆధ్యాత్మిక చింతన కలిగేలా శ్లోకాలు నేర్పించేవారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రకు చెందిన పూర్ణానంద సరస్వతి(అసలు పేరు వేరు) విశాఖలో ఉంటూ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినట్లు తెలుస్తోంది.
తొలినాళ్లలో వెంకోజీపాలెంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. ఆశ్రమానికి వెళుతూ అప్పటి స్వామీజీకి సపర్యలు చేస్తూ, చిన్న చిన్న పనులు చేస్తుండడంతో ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. దీంతో అతడు ఆశ్రమంలో ఉంటూ అక్కడి కార్యకలాపాలు చూసుకునేవాడు. 1984లో పూర్ణానంద సరస్వతి ఆశ్రమ బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి కొన్నాళ్ల పాటు పిల్లలను చేరదీసి వారికి పాఠశాల విద్యను అందించేవారు. అయితే టూషన్లు చెప్పే సమయంలోనే బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పలువురు ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కొన్నేళ్ల క్రితం కూడా ఇదే తరహా ఆరోపణలు పెద్ద దుమారాన్ని రేపాయి.
పోలీసుల అదుపులో స్వామీజీ
తాజాగా మైనర్ బాలిక ఫిర్యాదుతో మరోసారి పూర్ణానంత సరస్వతి వ్యవహారం సంచలనం రేపింది. ఆమెతో పాటు మరో బాలికపై కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లు సదరు బాలిక స్టేట్‌మెంట్ ఇవ్వడంతో పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే గతంలో జరిగిన విషయాలపై ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment