ఏది ఎలా జరగాలో అలాగే జరగాలి. చెట్టున ఉన్న కాయ ఎప్పుడు పక్వానికి రావాలో అప్పుడే వస్తుంది.
ఒకరోజు ఒక యువకుడు ఒక ఆశ్రమంలో యుద్ధక్రీడలు నేర్పే ఒక గురువు దగ్గరికి వెళ్లాడు. గురువు చెట్టుకింద ధ్యానంగా కూర్చునివున్నాడు. ‘గురువర్యా’ అని పిలిచాడు యువకుడు. గురువు కళ్లు తెరిచాడు. ‘మీ శిక్షణలో నాకు రాటుదేలాలని వుంది, నన్ను మీ శిష్యునిగా చేర్చుకోండి’ అని కోరాడు యువకుడు. గురువు సమ్మతిగా తలూపాడు. ‘అయితే నేను మొత్తం ఈ కళలో ప్రావీణ్యత సంపాదించడానికి ఎన్నేళ్లు పడుతుంది?’ అడిగాడు యువకుడు. ‘పదేళ్లు’ అని జవాబిచ్చాడు గురువు.
‘నేను అంతకాలం వేచివుండలేను. అంతకంటే త్వరగా ముగించగలిగే మార్గం చెప్పండి. నేను ఎక్కువ శ్రమిస్తాను, ఎక్కువ పనిగంటలు వెచ్చిస్తాను, ఎక్కువ శక్తిని ధారపోస్తాను. ఇలాగైతే ఎన్నేళ్లలో నేర్చుకోవచ్చు’ అడిగాడు యువకుడు. ఒక క్షణం ఆలోచించి చెప్పాడు గురువు: ‘ఇరవై ఏళ్లు’. ఈ కథ చెప్పే కీలకమైన అంశం ఏమిటి? ఏది ఎలా జరగాలో అలాగే జరగాలి. చెట్టున ఉన్న కాయ ఎప్పుడు పక్వానికి రావాలో అప్పుడే వస్తుంది. దానికోసం మనం చేయగలిగేది వేచివుండటమే. వేచివుండటానికి కూడా సాధన కావాలి. వేచివుండగలగడం కూడా ఒక శక్తి!
Comments
Please login to add a commentAdd a comment