తిరువణ్ణామలై: తిరువణ్ణామలైలోని నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించిన తన కుమారుడు, మనవరాలిని విడిపించాలని కోరుతూ దంపతులు ఆశ్రమం ముందు ధర్నా నిర్వహించారు. వివరాలు.. తేని జిల్లా పెరియకులం వడకరై సుబ్రమణ్య వీధికి చెందిన కార్తి రైతు, ఇతని భార్య ఈశ్వరి. దంపతుల కుమారుడు మనోజ్‌కుమార్, కుమార్తె వనిత ఉన్నారు. మనోజ్‌కుమార్ మేలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం మదురైలోని నిత్యానంద ధ్యాన మండపానికి వెళ్లిన మనోజ్ తిరిగి రాలేదు. ఈ స్థితిలో మనోజ్‌కుమార్ తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులోని నిత్యానంద ఆశ్రమంలో ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తల్లిదండ్రులు ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. అయితే వారిని ఆశ్రమ సిబ్బంది లోనికి అనుమతించలేదు. మనోజ్‌కుమార్ బెంగళూరులోని ఆశ్రమంలో ఉన్నాడని, ధ్యానంలో ఉన్నందున చూసేందుకు వీలుకాదని అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు.
మనోజ్‌కుమార్‌తో పాటు తమ మనవరాలు నివేద(17) (వనిత కుమార్తె)ను ఆశ్రమంలో నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నట్టు ఆరోపించడంతో వారిని సిబ్బంది అక్కడినుంచి వెల్ల్లగొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్రమం వద్దకు చేరుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో ఆశ్రమ సిబ్బంది తాము ఎవ్వరినీ బలవంతంగా నిర్బంధించలేదని, భక్తులు స్వయంగా వచ్చి ధ్యానంలో పాల్గొంటున్నారని ఆధారాలతో తెలిపారు. ఇలాఉండగా మనోజ్ తల్లిదండ్రులు విలేకరులతో మాట్లాడుతూ తన కుమారుడు, మనవరాలిని ఆశ్రమంలో నిర్బంధించారని వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారనే విషయం కూడా తమకు తెలియరాలేదన్నారు. వనిత మాట్లాడుతూ మదురైలో జరిగిన నిత్యానంద ధ్యాన శిక్షణలో తాను కుమార్తె సహా పాల్గొన్నట్టు తెలిపారు. ఒక నెల ప్రత్యేక ధ్యానం అని చెప్పి తమను తిరువణ్ణామలై ఆశ్రమానికి తీసుకొచ్చారన్నారు. ఆ సమయంలో తన తండ్రికి అనారోగ్యం అని తెలియడంతో ఆశ్రమంలో రూ.3లక్షలు చెల్లించి కుమార్తెను ఇక్కడే వదిలి ఇంటికి వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం తన కుమార్తెను చూసేందుకు కూడా ఆశ్రమ నిర్వాహకులు అనుమతించడం లేదన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment