జైపూర్: శిష్యురాలిపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక వేత్త దాతీ మహారాజ్ ఆశ్రమం నుంచి 600 మంది అమ్మాయిలు అదృశ్యం అయినట్టు ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే దాతీ మహారాజ్ రాజస్థాన్‌లోని అల్వాస్‌లో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి బాగోగులు తానే చూసుకుంటున్నానని గతంలో అనేక సార్లు చెప్పుకున్నారు.
కాగా దాతీ మహరాజ్ తనపై అత్యాచారం చేశాడని 25 ఏళ్ల యువతి ఫిర్యాదు ఇవ్వడంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆశ్రమానికి వెళ్లారు. ఆ సమయంలో ఆశ్రమంలో కేవలం 100 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మిగతా 600 అమ్మాయిలు ఎక్కడికి వెళ్లారన్న కోణంలో విచారణ జరుపుతున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. అలాగే ఆశ్రమం నుంచి తప్పించుకున్న దాతీ మహారాజ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
దాతీ మహారాజ్ తనను పదేళ్ల పాటు ఆశ్రమంలో నిర్భందిచాడని, ఆయనతో పాటు మరో ఇద్దరు అనుచరులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ 25 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన వద్ద ఉండే ఓ మహిళా శిష్యురాలు అమ్మాయిలను బలవంతంగా ఆయన గదిలోకి పంపుతుందని వెల్లడించింది. ఈ విషయంపై ఇటీవల స్పందించిన దాతీ మహారాజ్.. ఆరోపణలు చేస్తున్న యువతి తనకు కుమార్తె వంటిదని పేర్కొన్నారు. విచారణకు కూడా సహకరిస్తాని చెప్పిన ఆయన ఆశ్రమం నుంచి పరారు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment