మరణానంతరమూ  బోధించిన ఆచార్యులు | Professors who preached after death | Sakshi
Sakshi News home page

మరణానంతరమూ  బోధించిన ఆచార్యులు

Published Sun, Jan 7 2018 12:44 AM | Last Updated on Sun, Jan 7 2018 12:44 AM

Professors who preached after death - Sakshi

ఆశ్రమం దరిదాపుల్లో అనేక మంది జనం గుమికూడి  ఉండడంతో మహాపూర్ణులు కీడు శంకిస్తున్నారు. దగ్గరికి రాగానే ఆచార్యులవారి ఆరోగ్యం ఎలా ఉంది అని ఆతృతగా అడిగారు. విన్నవారు మౌనం వహించారు. ఆళవందార్‌ ఇక లేరని అర్థమైంది. కూలబడిపోయారు. తేరుకుని రామానుజుని తీసుకుని లోనికి వెళ్లారు. రామానుజుని దుఃఖం అలవికాకుండా ఉంది. ఇంతటి మహానుభావుడిని చూసే భాగ్యం లేకపోయిందే అని, వారి మాట వినకముందే పరమపదించారే అనీ, అంతటి ఆచార్యునికి శిష్యుడిగా శుశ్రూష చేయకుండా మిగిలిపోయానే అని పరితపించారు. రోదిస్తున్న రామానుజుని దగ్గరికి తీసుకుని ఊరడించి, ‘‘శాంతించు నాయనా, విధి బలీయమైంది, కాలాన్ని అతిక్రమించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన మనసులో నీవున్నావు. అదే మహాభాగ్యమనుకో నాయనా. వారిని ఈ విధంగానైనా చూడగలిగావు కదా అని ఊరడిల్లు రామానుజా’’ అని వెన్నుతట్టారు మహాపూర్ణులు. ‘‘అవును స్వామీ’’ అని, యామునాచార్యులకు చివరిసారిగా పాదాభివందనం చేశారు. 

కళేబరాన్ని తరలించడానికి ముందే వారికి మూడుసార్లు ప్రదక్షిణ చేయాలనిపించింది. కుడివైపునుంచి చుట్టూ తిరుగుతూ రామానుజుడు జాగ్రత్తగా ఆయన శరీరాన్ని గమనించారు. ఒక చోట ఆగిపోయారు. ‘‘ఇదేమిటి ఆచార్యుల వారి కుడిచేతి మూడు వేళ్లు ముడుచుకుని ఉన్నాయి. ఎప్పుడూ ఇలాగే ఉండేవారా?’’ అనడిగారు.శిష్యులు కూడా అప్పుడే ఆ విషయం గమనించారు. ‘‘లేదు లేదు ఎప్పుడూ ఈ విధంగా వేళ్లు ముడుచుకుని లేరు.’’ అని జవాబిచ్చారు. మహాపూర్ణులు కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటన్నట్టు? వారేమయినా చెప్పాలనుకుని చెప్పలేక ఈ విధంగా వేళ్లు ముడిచారా? అనుకుంటూ ‘‘ఏం జరిగిందో చెప్పండి’’ అక్కడివారిని అడిగారు.‘‘అయ్యా మీరు గురువుగారి ఆజ్ఞమేరకు కాంచీపురం వెళ్లిన తరువాత వారి ఆరోగ్యం మరింత క్షీణించింది. మమ్మల్ని పిలిచి ‘‘శ్రీరంగని సేవకు లోటు రానివ్వకండి అన్ని ఉపచారాలూ చేస్తూ ఉండండి. రంగడి ప్రసాదాన్ని అందరికీ ఇవ్వండి. గురువులకు తీసుకువెళ్లి అందించండి’’ అని ఉపదేశించారు. మేమంతా తప్పకుండా చేస్తామని గురువుగారికి విన్నవించాం. ఆ తరువాత యామునాచార్యుల వారు పద్మాసనంలో కూర్చున్నారు. 

సమాధిలోకి వెళ్లే ముందు ఒక్కసారి ద్వారం వైపు చూసారు, మీరు రామానుజులను తోడ్కొని వస్తున్నారేమోనన్నట్టుగా..  ఆ తరువాత తమ ఆచార్యులైన మణక్కాల్‌ నంబిని తలచుకున్నారు, మనసును గురువుగారి పాదాలపైన నిలిపారు, మమ్మల్ని తైత్తరీయోపనిషద్‌ లోని బ్రహ్మవల్లి భృగువల్లి పురుష సూక్తాలను గొంతెత్తి గట్టిగా పఠించమన్నారు.మేం పఠిస్తూనే ఉన్నాం. వైయాసి నెల, శ్రావణ షష్ఠి, అభిజిత్‌ లగ్నంలో, ఆ విధంగానే ధ్యానముద్రలోనే ఉంటూ పరమపద నిత్యవిభూతిని చేరుకున్నారు’ అని వాక్యం పూర్తిచేయలేక కూలబడ్డాడు ఆ శిష్యుడు. ‘‘అంతకుముందు మాకోసం ఏదైనా సందేశం చెప్పారా నాయనా.’’ ‘‘లేదు స్వామీ.. మీ తిరుగు ప్రయాణం మొదలైందా, రామానుజుల వారు మీతో వస్తున్నారా’’ అని మాత్రం ఒకటికి రెండు సార్లు అడిగారు. వారి మనసునిండా మీరిద్దరే స్వామీ...మొత్తం శిష్యబృందానికి మహాపూర్ణులకు అర్థం కావడం లేదు, గురువు యామునాచార్యులు ఎందుకు వేళ్లు ముడిచారు. ఈ పని వెనుక అంతరార్థం ఏమిటి? ఆయన ఎప్పుడూ ఇంత నిగూఢంగా లేరే. ఇంతమంది శిష్యులలో ఎవరైనా ఒకరికి తన ఆశలు ఆశయాలేమో వివరిస్తే ఈ రోజు ఇంత అన్వేషణ ఉండేది కాదు. పోనీ చివరి నిమిషంలో ఏదైనా ఆలోచించుకున్నారా అంటే అదీ తెలియదు. అని కలవరపడుతున్నారు. 

రామానుజులు ఆలోచిస్తున్నారు. ఇది ఏమై ఉంటుంది. ఏది ఏమైనా ఇది తేలేదాకా యామునాచార్యుల అంత్యక్రియలు జరపకూడదు. అదే విషయాన్ని మహాపూర్ణులవారికి విన్నవించారు. అవునవును. మనం ఆలోచించాల్సిందే. అందాకా ఆగాల్సిందే అన్నారు. రామానుజునికి ఇది ఒక జటిలమైన సమస్య. యామునాచార్యుల మనసులో ఏముందో తెలుసుకోవడం. వారి ఆశయాలు ఏమిటో సరిగ్గా ఊహించడం. ఒకవేళ సరిగ్గా ఊహించినా అవి సరైనవో కాదో ఎవరు సమర్థించాలి? ఏమో. ముందుగా ఆలోచిద్దాం. ఆయన మూడు వేళ్ల ముడి రహస్యాలేమిటో.యామునాచార్యుల జనన కాలంనుంచి జరిగిన వారి అపురూప జీవన సంఘటనలను, వారి ఎదుగుదలను నెమరు వేసుకున్నారు రామానుజులు. ఆచార్యత్వం, ఆయన బోధించిన దివ్యతత్వం, ఆ ఆచార్యుని ఆలోచనలో వెల్లివిరిసిన వైష్ణవ సిద్ధాంతం, దాన్ని ఆయన వివరించిన తీరు, ద్రవిడ వేదం పైన యామునుల భావాలు, విష్ణుభక్తి పరివ్యాప్తం చేయడంపైన ఆయనకున్న ప్రణాళికల గురించి వారి శిష్యులైన కాంచీపూర్ణులు చెప్పిన అనేకానేక అంశాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నారు. తనను తీసుకుని వెళ్లడానికి యామునుల ఆజ్ఞపై కాంచీపురం వచ్చిన మహాపూర్ణులను దారిపొడుగునా తాను ప్రశ్నల ద్వారా వేధించి చెప్పించుకున్న విశేషాంశాలను గుర్తు చేసుకున్నారు. వారు తనను ఎందుకు తన చెంతకు రమ్మన్నారో నేరుగా అడగకుండా, కాంచీపురంనుంచి శ్రీరంగం వచ్చేవరకు దారిలో మహాపూర్ణులతో సాగించిన వివరమైన సంభాషణద్వారా లోతుగా గ్రహించే ప్రయత్నం చేశారు. సుదీర్ఘ ప్రయాణ సమయంలో ఈ అంశాలనన్నింటినీ వివరంగా చర్చించుకునే అవకాశం కలిగింది. తనకు భవిష్యత్‌ కార్యక్రమంపైన తన విధ్యుక్త ధర్మనిర్వహణ గురించి ఒక స్పష్టమైన అవగాహనా ఏర్పడింది, యామునాచార్యుల ఆశయాలేమిటో కొంత అర్థమైంది. నిజానికి వారు తన ద్వారా ఏం సాధిద్దామని అనుకున్నారో కూడా తెలుసుకోవడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తూనే ఉన్నారు. రామానుజుని కుశాగ్రబుద్ధికి అది తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టకూడదు.  కాని భౌతికంగా లేని ఆచార్యుల మనసులో దూరడం ఏ విధంగా? ఆయన మూడు వేళ్ల ముడుల వెనుక ఉన్న వేదన ఏమిటి? కనీసం ఒక్క గంటైనా మాట్లాడలేదే? కొంచెం ముందు వచ్చినా బాగుండేది. తెలుసుకోగలడా? ‘‘వరదా శక్తినివ్వు. రంగనాథా, ఆలోచననివ్వు, అమ్మా శారదాంబా... కరుణించు. దారి చూపించు......భర్గోదేవస్య ధీమహీ... నారాయణా... నా బుద్ధి వికసింపజేయి’’ అని రామానుజుని అంతరంగం అర్థిస్తున్నది. 

కాస్సేపటికి ఒక నిర్ణయానికి వచ్చారు. నాలో రూపు కట్టిన ఆలోచనను అంచనాను వారికే విన్నవిస్తాను. ఇక గురువుగారి దయ. అని రామానుజుడు ముందడుగు వేసాడు.  నిర్జీవంగా ఉన్నా విజ్ఞాన తేజం ఉట్టిపడుతున్న యామునాచార్యుల శిరస్సు చెంతకు కదిలాడు రామానుజుడు. మహాపూర్ణులు ఆతృతతో చూస్తున్నారు. ఈ యువకుడు ఏం చేయబోతున్నాడు? ఎవరికీ చెప్పని రహస్యాలు చిక్కబట్టుకున్న చిక్కుముడులను వ్రేళ్లతో చూపుతున్న యామునాచార్యులదగ్గరికి వెళ్లి రామానుజుడు ఏంచేస్తాడు?యామునాచార్యులకు నమస్కరించి, దగ్గరగా వెళ్లి, చెవుల చెంత చేరి, రామానుజుడు ఇలా అంటున్నాడు. ‘‘ఆచార్యవర్యా, యామునాచార్య తిరువడిఘళే శ్శరణం, అడియేన్‌ దాసోహం...అత్యంతగహనమైన మీ అంతరంగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రతిపాదన సరైనదైతే ఏదో ఒక సంకేతం ద్వారా మీ ఆమోదం తెలపండి. ఏ సూచనా రాకపోతే, నా ప్రతిపాదన మార్చి ఆలోచనకు మరింత పదును పెడతాను. నన్ను రమ్మని ఆదేశించిన మీరు నాతో ఏదో చెప్పడానికి ఆలోచించే ఉంటారు. ఇది నా మొదటి ప్రతిపాదన. మీకు ఆదినుంచీ మన మహారుషులు వ్యాసుడు, పరాశరుడు చెప్పిన అద్భుత అంశాలను లోకానికి వివరించాలనే ఆలోచన ఉన్నట్టు నేను విన్నాను. మీ అనుగ్రహం చేత నేను మన వ్యాస పరాశరులు విష్ణు పురాణంలో చెప్పిన విశ్వతత్వాన్ని, జీవతత్వాన్ని పరమాత్మ తత్వాన్ని, ఈ తత్వత్రయ వైభవాన్ని ఈ లోకానికి వెల్లడిస్తాను, వ్యాస, పరాశరుల ప్రబోధాలను పునర్వ్యవస్థీకరించి వారి కీర్తిని శాశ్వతం చేస్తాను’’ అని ప్రకటించారు. 

ఆశ్చర్యం .. యామునాచార్యుల వారు ఒక వేలు ముడి విడిచారు.  శిష్యగణం అంతా అచ్చెరువొంది చూస్తున్నారు.  మహాపూర్ణుల వారూ ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు.  యామునాచార్యుల అంతరంగాన్ని తనతో సంభాషణ ద్వారా పూర్తిగా గ్రహించిన రామానుజుని ప్రతిభ అనితర సాధ్యం అని దిగ్భ్రాంతితో ఆ మహానుభావుడినే నిశితంగా పరిశీలిస్తున్నాను. విస్తరించిన యామునాచార్యుల వేలు రేపటి వెలుగును చూపుతున్నట్టు అనిపించింది. మిగిలిన రెండు వ్రేళ్ల ముడులను విప్పగలడీ విప్రయువకుడు రామానుజుడు ...సందేహం లేదు అనుకున్నాడు.  రామానుజుని మేధోశక్తితో విప్పని రహస్యాలు విచ్చుకుంటున్నాయి. ఏమి మహత్యం? రామానుజుడు కూడా సంతోషించాడు. తన మొదటి ఆలోచన లక్ష్యాన్ని చేరింది. తనకు యామునాచార్యుల తొలి గురోపదేశం ఏమిటో అర్థమైంది. ప్రాణం ప్రయాణిస్తున్నా ఆశయాలను వీడని దివ్యాత్మ యామునాచార్యులవారిది. ఎంత గొప్ప జీవనం ఆయనది? యామునుల ఆత్మ, అంతరంగం ఇక్కడే ఎక్కడో ఈ పంచభూతాలను ఆవహించి ఉన్నాయి. తన మాటలను వింటున్నాడా ఆచార్యుడు. తనకు సమాధానం చెబుతున్నాడు. భౌతికంగా చెవిలో ఊదవలసిన మహామంత్రాల వంటి అద్భుత ఆశయాలను అంతరాత్మలో దాచుకుని ఆత్మసంభాషణ ద్వారా నానోటితోనే పలికించి, సమాధానాలు సాంకేతికంగా ప్రకటిస్తున్నారు. అంతేకాదు, అందరిముందూ ఈ ఆశయాలేమిటో తెలిపేందుకు ఈ ప్రక్రియను యామునాచార్యులు ఎంచుకున్నారేమో. ఎంత అద్భుతం ఆయన ఆలోచన? అనుకున్నారు. ఇంకా రెండు విషయాలను కూడా నేను ఆలోచించి ఊహించి వారి మనసుకు తగినట్టు చెప్పగలనా; వాగ్దేవి కృప ఉంటే సాధ్యమే. హయగ్రీవుని దయ అని ప్రార్థించి రెండో మాట చెప్పడానికి ఉద్యుక్తులైనారు రామానుజులు. మళ్లీ వంగి యామునాచార్యుల చెవి దగ్గరకు చేరి, ‘‘ఇది నా రెండో ప్రతిపాదన... ఆచార్యవర్యా, మీరు నమ్మాళ్వార్‌ ద్రవిడ వేదాన్ని లోకానికి అవగతం చేయడానికి ప్రయత్నాలను ప్రారంభించారు. సంస్కృతంలో ఉన్న వేదం దక్షిణ భారతంలోని సామాన్యులకు అర్థం కావడం లేదని, అందుకే అనుసరించలేకపోతున్నారని మీ ఆలోచన కదా. ఆ ద్రవిడవేదాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు తమిళ భాషలో ఆధ్యాత్మిక వైభవాన్ని జనపథంలోకి తెచ్చేందుకు మీ అనుగ్రహంతో ప్రయత్నిస్తాను. అడుగడుగునా మీరు నన్ను ప్రేరేపించి, ముందుకు నడిపిస్తారనే ఆశతో,  ప్రజానీకం నాలాయిర ప్రబంధాలను అవగాహన చేసుకునే మార్గాలను అన్వేషిస్తాను... సాధిస్తాను....’’ అంటూ దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించగానే రెండో వేలు ముడి కూడా వీడింది. 

శిష్యగణంలో ఆశ్చర్యానందాలు వెల్లువెత్తాయి. అంత దుఃఖంలో కూడా హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. తన రెండో సూచన కూడా ఫలించినందుకు రామానుజుడు ధన్యతాభావాన్ని పొందాడు. ఇక మూడో అంశం. ఏమై ఉంటుంది. ఆ... గుర్తుకు వచ్చింది. మిగిలిపోయిన కర్తవ్యాలగురించి యామునాచార్యుల వారేమనేవారని నేను పదేపదే అడిగినప్పుడు మహాపూర్ణుల వారు అన్నారు. దాదాపు అవే ఆలోచనల గురించి కాంచీ పూర్ణుల వారు కూడా తనకు వివరించారు. యామునాచార్యులంతటి గురువు చేయాలనుకున్న అంతటి మహత్కార్యాన్ని ఈ లఘువు, శిష్యుడు చేయగలడా... చూద్దాం ఆ విషయం ఆయనే విన్నవిస్తారు. అనుకున్నారు.
- ఆచార్య మాడభూషి శ్రీధర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement