ప్రతీకాత్మక చిత్రం
చెన్నై: స్వయం ప్రకటిక దైవం (దొంగ బాబా) అకృత్యాలకు మరో బాలిక బలైంది. మూలికలు, పూజల నెపంతో ఓ బాబా యువతికి వైద్యం అందిస్తున్న క్రమంలో ఆమె ఆ వైద్యానికి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత‍్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన హేమమాలిని(20) బీఎస్సీ చదువుతోంది. అయితే, ఆమె కొద్ది రోజులుగా కడుపు నొప్పి, మెడ నొప్పి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా.. వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు యువతిని ఆమె తల్లిదండ్రులు తిరువళ్లూరులోని మునుస్వామి ఆశ్రమానికి తీసుకువచ్చారు.
ఈ క్రమంలో మునుస్వామి.. హేమమాలినికి దోషం ఉందని అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పూజలు చేయాలని, మూలికల వైద్యం అందించాలని సూచించాడు. బాధితురాలిని ఆశ్రమంలోనే ఉంచాలని తెలిపాడు. దీంతో ఆమె అక్కడే ఉండి అనేక పూజలు చేస్తూ, మునుస్వామి అందిస్తున్న వైద్యాన్ని తీసుకుంటోంది. ఈ క్రమంలో మంగళవారం హేమమాలిని ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. విపరీతంగా వాంతులు చేసుకోవడంతో ఆమెతో పాటే అక్కడే హేమమాలిని అత్త ఇంద్రాణి.. వెంటనే మునుస్వామిని కలిసి ఆసుపత్రికి తీసుకెళ్తానని కోరింది. అయితే, హేమమాలినికి చిక్సిత జరుగుతోందని ఈ సమయంలో బయటకు పంపించలేమని మునుస్వామి చెప్పాడు. దీంతో మునుస్వామితో బాధితురాలి కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో చివరకు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనుమతించాడు. దీంతో బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ఆమెకు చికిత్స అందించిన వైద్యులు హేమమాలిని మృతి చెందినట్టు తెలిపారు. పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు.
ఈ సందర్బంగా బాధితురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మునుస్వామి వైద్యంతో తమ బిడ్డను చంపేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం పేరుతో హేమమాలినిని కాలేజీకి వెళ్లేందుకు కూడా మునుస్వామి అనుమతించలేదని అన్నారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు మునుస్వామిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి విచారణలో పూజలు, మూలికల చికిత్సతో రోగాలు నయం చేస్తున్నట్టు మునుస్వామి చెబుతున్నాడని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment