ఆకాశమంత ఆర్తి | Special on Hundreds of girls are future | Sakshi
Sakshi News home page

ఆకాశమంత ఆర్తి

Published Thu, Nov 29 2018 12:22 AM | Last Updated on Thu, Nov 29 2018 12:22 AM

Special on Hundreds of girls are future - Sakshi

అభంశుభం తెలియని, ఆదుకునే వారే లేని ఆ చిన్నారులను ‘ఆర్తి’ ఆశ్రమం తన ఒడిలోకి తీసుకుంటోంది.  అన్నీ తానే అయి వారిని ఆదరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు పదిహేను వందల మంది బాలికల భవిష్యత్తును వెలిగించింది.  ఆ దీపాలన్నీ నేడు ప్రపంచ వ్యాప్తంగా వెలుగులను పంచుతున్నాయి. ఆ వెలుగుల్లో ‘ఆర్తి’ ఆకాశమంత ఎత్తులో కనిపిస్తోంది.

నగరం సద్దుమణుగుతోంది. రాత్రి 11 గంటలు. ఆ భవనం వద్ద జీరో బల్బు వెలుతురు. ఎవరో కంగారుగా వచ్చి అక్కడ ఏదో పడేసి అంతే కంగారుగా వెళ్లిపోయారు. అటుగా వచ్చిన వాచ్‌మెన్‌ అక్కడేదో కదులుతున్నట్లు గమనించాడు. దగ్గరికి వచ్చి చూశాడు. పాత చీరెలో చుట్టి  ఉన్న నెలల వసిగుడ్డు! చలికి వణుకుతోంది. జాగ్రత్తగా రెండు చేతుల్లోకి లోపలికి  తీసుకెళ్లాడు. అతడు ‘ఆర్తి’ వాచ్‌మెన్‌.ఇంకో ఘటన. ఇంకా చీకట్లు విచ్చుకోలేదు. కొద్దిగా తెరిచి ఉన్న గేటులో నుంచి ఏడు నెలల పాప బరాబరా దోగాడుతూ వచ్చేసింది. లోపలి నుంచి వచ్చిన వారు ఆ చిన్నారిని ఎత్తుకున్నారు. గేటు బయటికి చూసి ఎవరూ లేకపోవడం గమనించారు. విషయం అర్థమైంది. ఆ పాపను అందరూ కాసేపు ఎత్తుకున్నారు. ‘ఆర్తి’ హృదయానికి హత్తుకున్నది.కడప నగరంలో మున్సిపల్‌ స్టేడియం వద్ద ఉం టుంది ‘ఆర్తి’. ఈ చిన్నారుల ఆశ్రమాన్ని పీవీ సంధ్య నిర్వహిస్తున్నారు. పాతికేళ్ల క్రితం ఆవిర్భవించింది మొదలు నేటి వరకు ఆర్తి ఆదర్శప్రాయమైన ప్రయాణంలోని విశేషాలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. 

బంధువులమ్మాయి ‘ఆర్తి’
‘‘నేను ఇంగ్లీషు లెక్చరర్‌. నా భర్త శ్రీనివాసులురెడ్డి నేత్ర వైద్యులు. మాకు ఇద్దరు అమ్మాయిలు. 1992లో వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు.. మా ఇంటికి సమీపంలో ఓ పసిపాపకు ఎవరూ లేకపోవడం గమనించాను. ఆ చంటిబిడ్డను తెచ్చుకున్నాను. నా పిల్లలతో పాటు పెంచుకున్నాను. దీన్ని గమనించిన మరికొందరు తమ పిల్లలను రాత్రులు మా ఇంటి వద్ద వదిలేసేవారు. ఇలాంటి చిన్నారుల సంఖ్య పెరగడంతో స్నేహితులతో చర్చించి వారి సహకారంతో ప్రత్యేకంగా చిన్న ఇల్లు తీసుకుని బాలల ఆశ్రమం ప్రారంభించాను.  మా బంధువుల అమ్మాయి ఆర్తి విదేశాల్లో తన స్నేహితుల నుంచి కొద్ది సొమ్మును సేకరించి మాకు పంపేది. దురదృష్టవశాత్తు ఆమె భౌతికంగా దూరం కావడంతో మా ఆశ్రమానికి ఆర్తి హోమ్‌ అని ఆమె పేరు పెట్టుకున్నాం. సంస్థ నిర్వహణకు విజయ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసుకున్నాం. వాళ్లకు ఎంతవరకు ఆశ్రయం, రక్షణ ఇవ్వగలనో, వారిని ఎంతవరకు చదివించగలనో, ఆ తర్వాత వారి జీవితం ఏమిటో.. ఏదీ ఆలోచించలేదు. హోమ్‌ నిర్వహిస్తున్నాం అంతే! 

ఇంటి బయట ఊయలతొట్టి
ఓరోజు ఇంటి బయట ఎవరో నెలల పాపను ఉంచి వెళ్లారు. కొద్దిసేపటి ద్వారా కనుగొని చిన్నారి పరిస్థితి బాగా లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఎంత ప్రయత్నించినా చిన్నారిని నిలుపుకోలేక పోయాం. చాలా బాధ అనిపించింది. దాంతో ఇంటి బయట ఊయల తొట్టి ఏర్పాటు చేశాను. వాచ్‌మెన్‌ను నియమించాను. ఇక్కడ వదిలి వెళ్లే పిల్లల గురించి ఎవరూ ఏమి అడిగేది ఉండదని అక్కడ రాసి ఉంచాము. అలా హోమ్‌ పెరిగింది. 1993లో కలెక్టర్‌ సుబ్రమణ్యం హోమ్‌కు మున్సిపల్‌ స్టేడియం వద్ద కొద్దిగా స్థలాన్ని ఇచ్చారు. మెల్లిగా ఆ స్థలంలో ఇంటిని నిర్మించాం. 36 మంది చిన్నారులతో సొంత భవనంలో ఆశ్రమం పూర్తి స్థాయిలో మొదలైంది.  ఇప్పటికి పదిహేను వందల మందికి పైగా ఆశ్రమం విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. పలు దేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వీరిలో చాలామందికి మేమే వివాహాలు జరిపించాము. సీమంతాలు, పురుళ్లు చేస్తున్నాం. ఏ ఉద్యోగంలో, ఎంత దూరంలో ఉన్నా పుట్టినరోజులు, పండుగల సందర్భంగా వాళ్లు హోమ్‌ కు వస్తుంటారు. ప్రస్తుతం  హోమ్‌లో 120 మంది ఉన్నారు. 

కుటుంబ జీవన గ్రామం
పిల్లలందరినీ ఒకేచోట పెంచుతున్న విషయంగా నాలో ఆలోచన మొదలైంది. వారందరికీ బాధ్యతలు తెలిసేలా పెంచడంతో పాటు కుటుంబ జీవనంలోని మాధుర్యాన్ని చవి చూపాలని భావించాను. అందుకోసం ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసి అందులో వీరినే కుటుంబాలుగా ఏర్పాటు చేయాలని భావించాను. నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని సహకరించాలని కోరాను. రిమ్స్‌ వద్ద స్థలం ఇచ్చారు. అక్కడ తొమ్మిది కుటీరాలు ఏర్పాటు  చేశాం. ఒక్కొ దానిలో పదీపదిహేను మంది ఓ కుటుంబంగా ఉంటున్నారు. ఒకరి కుటుంబాలకు ఒకరు సహకరించుకుంటున్నారు. దీంతో అది ఒక గ్రామంగా, వీరంతా గ్రామస్థులుగా ఆత్మీయత అనుబంధాలతో జీవిస్తున్నారు. 

భ్రూణహత్యలపై ప్రాజెక్టు వర్క్‌
దక్షిణ ఏషియా స్థాయిలో కేవలం ఆర్తి హోమ్‌కు మాత్రమే భ్రూణహత్యల నిర్మూలనపై ప్రాజెక్టు వర్క్‌ లభించింది. 2015లో కేంద్ర పథకం బేటీ బచావో.. బేటీ పఢావోలో భాగంగా ‘మన బిడ్డ’ కార్యక్రమాన్ని జిల్లాలోని 51 మండలాల్లో ప్రతిభావంతంగా నిర్వహించాం. ఆర్తి విద్యార్థులే అన్ని విభాగాలకు వలంటీర్లుగా జిల్లాలో విస్తృతంగా పర్యటించి పథకాన్ని వంద శాతం అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టారు. ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం భ్రూణ హత్యల సంఖ్య గణనీయంగా తగ్గడం నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది’’ అని ముగించారు సంధ్య.
– పంతుల పవన్‌కుమార్, సాక్షి, కడప  

ఆడబిడ్డ విలువను గుర్తించాలి
భ్రూణహత్యలు అమానుషం. ఈ సమస్యను అధిగమించడానికి ప్రధాన గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు అవగాహన కల్పించాల్సి ఉంది. అంకురం దశలోనే ఆడబిడ్డను అంతం చేస్తుండటం సృష్టికి విరుద్ధం. స్త్రీలేని లోకాన్ని ఊహించనే లేము. ఆడబిడ్డను ఇంటికి వెలుగు అని అనుకోవాలి తప్ప గుండెపై కుంపటి అనే భావం రానీయకూడదు. మెరుగైన సమాజం కావాలనుకున్నప్పుడు ఆడపిల్లకు మెరుగైన అవకాశాలు కల్పించాలి. స్త్రీ విలువను గమనించేందుకు సమాజంలో నైతిక విలువలు పెరగాల్సి ఉంది. ఈ సమస్యకు మూలాలు వెతికి సరిదిద్దాల్సి ఉంది.
 – పీవీ సంధ్య, నిర్వాహకులు, ఆర్తి హోం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement