స్వామి రాంపాల్ అరెస్ట్
- ఉద్రిక్తత నడుమ ఆశ్రమంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు
- బుధవారం ఉదయం నుంచీ ఆశ్రమం వద్ద భద్రత బలగాలు
- ఆశ్రమంలో దాదాపు 15 వేలమంది అనుచరులు
బర్వాలా/చండీగఢ్: ఉద్రిక్త, నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్(63)ను బుధవారం రాత్రి పోలీసులు బల్వారాలోని ఆయన ఆశ్రమంలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో దాదాపు రెండు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతకు తెరపడినట్లైంది.
గురువారం ఉదయం హిస్సార్ కోర్టులో, శుక్రవారం పంజాబ్, హర్యానా హైకోర్టులో ఆయనను హాజరు పరుస్తామని పానిపట్ జిల్లా ఎస్పీ సతీశ్ బాలన్ వెల్లడించారు. చాలా కఠినమైన ఆపరేషన్ అనంతరం రాంపాల్‌ను అదుపులోకి తీసుకున్నామని హర్యానా డీజీపీ ఎస్‌ఎన్ వశిష్ట్ తెలిపారు. వేలాది మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఆశ్రమంలో ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు ఎస్పీలు పాల్గొనడం విశేషం.
200 మందికి పైగా గాయాలపాలైన మంగళవారం నాటి ఘర్షణల అనంతరం.. బుధవారం ఉదయం నుంచీ ఆశ్రమం వద్ద పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆశ్రమం చుట్టూ పోలీసులు, పారా మిలటరీ బలగాలు భారీగా మోహరించాయి. రాంపాల్ లొంగిపోవాలంటూ లౌడ్ స్పీకర్లలో పదేపదే ప్రకటించారు. ఆశ్రమంలో ఉన్నవారిలో దాదాపు 15 వేల మంది వెలుపలికి వచ్చారు. వారిని పోలీసులు క్షణ్ణంగా పరీక్షించారు. స్వామి రాంపాల్ ప్రైవేటు సైన్యం, అనుచరులు బలవంతంగా తమను లోపలే ఉంచారని బయటకు వచ్చినవారు తెలిపారు.
ఆశ్రమం వద్ద మరింత హింస జరిగేందుకు అవకాశముందన్న ఐబీ హెచ్చరికల నేపథ్యంలో.. మరో 500 మంది పారా మిలటరీ బలగాలను కేంద్రం హర్యానాకు పంపించింది. ఆశ్రమంలోకి విద్యుత్, నీటి సరఫరాలను అధికారులు నిలిపేశారు. మరోవైపు, ఆశ్రమంలో చనిపోయిన నలుగురు మహిళల మృతదేహాలను ఆశ్రమ వర్గాలు పోలీసులకు అప్పగించాయి. అస్వస్థతతో ఉన్న ఒక చిన్నారి, మరో మహిళను కూడా అప్పగించాయి కానీ వారు అనంతరం ఆసుపత్రిలో మరణించారు. వీరి మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని, ఈ మరణాలపై దర్యాప్తు జరుపుతున్నామని హర్యానా డీజీపీ ఎస్‌ఎన్ వశిష్ట్ తెలిపారు.
ఆశ్రమం లోపల ఉన్నవారిలో హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చిన వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉన్నారన్నారు. రాంపాల్ కుమారుడు, ప్రధాన అనుచరుడు పురుషోత్తం దాస్, ఆశ్రమ ప్రతినిధి రాజ్ కపూర్ సహా 70 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా స్వామి రాంపాల్, రాజ్ కపూర్, పురుషోత్తం దాస్ సహా పలువురిపై దేశద్రోహం సహా వివిధ కేసులు నమోదు చేశారు. రాంపాల్‌పై ఇప్పటికే హత్య, హత్యాయత్నం, ఫోర్జరీ కేసులున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం సీఎం ఖట్టర్‌కు ఫోన్ చేసి రాంపాల్ అరెస్ట్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారని, త్వరగా దీనికి తెర దించాలని ఆదేశించారని తెలిసింది.
మెర్సిడెజ్‌లు.. బీఎండబ్ల్యూలు..!
హిస్సార్: 1951లో హర్యానాలోని సోనేపట్‌లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రాంపాల్ సింగ్ జతిన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి హర్యానా నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనను 2000 సంవత్సరంలో విధుల్లోం చి తొలగించారు. తర్వాత ఆయనే సద్గురు రాంపాల్‌జీ మహారాజ్‌గా అవతారం ఎత్తారు. రాంపాల్ ప్రస్తుతం దాదాపు 100 కోట్ల ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న బల్వారాలో 12 ఎకరాల విశాల స్థలంలో ప్రధాన ఆశ్రమమనే ఆధునిక భవనంలో ఆయన నివాసం ఉంది. ఆయనకు ప్రైవేటు సైన్యంతోపాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ కార్లు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయనకు 25 లక్షల మందికిపైగా అనుచరులు, భక్తులున్నారు.