చండీగఢ్ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్కు గురువారం ఉదయం పంచకుల ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం రాంపాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనను ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఉద్రిక్త, నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు రాంపాల్ నిన్న రాత్రి పోలీసులు బల్వారాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
రాంపాల్‌తో పాటు ఆయన కుమారుడు పురుషోత్తం దాస్, ఆశ్రమ ప్రతినిధి రాజ్ కపూర్ సహా 70 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాంపాల్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నంత సేపు ఆస్పత్రి బయట పెద్ద ఎత్తున ఆయన భక్తులు గుమ్మిగూడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు ప్రాంగణం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు 2006లో జరిగిన హత్య కేసులో రాంపాల్ బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది.