చెన్నై: శ్రీలంక నుంచి భారత్‌లోకి భారీగా ఆయుధాలు, మత్తు పదార్థాలు సరఫరా జరుగుతోందన్న సమాచారం మేరకు తమిళనాడులో సోదాలు నిర్వహించింది జాతీయ దర్యాప్తు (ఎన్‌ఐఏ). ఈనెల 19వ తేదీన 22 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. పాకిస్థాన్‌కు చెందిన హాజీ సలీమ్ సహకారంతో.. సీ గునశేఖరన్, పుష్పరాజన్‌లు నిర్వహిస్తున్న శ్రీలంక డ్రగ్స్ మాఫియా అక్రమాల కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్, ఆయుధాల మాఫియా భారత్, శ్రీలంకల్లో సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. లిబర టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టీటీఈ)ని పునరుద్ధరించటం, హింసాత్మక కార్యక్రమాలను పెంచటమే వారి లక్ష్యమని తెలిపారు.
చెన్నై, తిరుపుర్, చెంగళ్‌పట్టు, తిరుచిరపల్లి జిల్లాల్లోని పలువురు నిందితుల ఇళ్లు, పరిసరాల్లో సోదాలు చేపట్టారు అధికారులు. ఆయుధాలు, మత్తు పదార్థాల సరఫరాపై సుమోటోగా తీసుకున్న ఎన్‌ఐఏ జులై 8న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ సోదాల్లో డిజిటల్ సర్వీసెస్, నేరాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌టీటీఈని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆందోళన నెలకొంది.
శ్రీలంక సైన్యం, ఎల్‌టీటీఈ మధ్య మూడు దశాబ్దాల పోరాటం 2009, మేలో ముగిసింది. ఆ సమయంలో శ్రీలంక ప్రభుత్వానికి భారత్ మద్దతు తెలిపింది. సామాన్య ప్రజలపై ఎల్‌టీటీఈ సాగించిన మారణకాండపై విచారం వ్యక్తం చేసింది. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిన ఈ సమయంలో ఆయుధాల సరఫరాపై ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment