బంగ్లాదేశ్ః ఢాకా కేఫ్ లో దాడికి ఉగ్రవాదులు వినియోగించిన ఆయుధాలను పోలీసులు గుర్తించారు. విదేశీయులే లక్ష్యంగా ఓ భారత యువతి సహా 22 మంది ని కిరాతకంగా హతమార్చిన టెర్రరిస్టులు.. దాడులకు వాడిన ఆయుధాలను కనుగొనడంలో తాము సఫలమైనట్లు బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. ఆయుధాలద్వారా వాటిని సరఫరా చేసినవారిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీస్ ఇనస్పెక్టర్ జనరల్ ఏకేఎమ్ షహీదుల్ తెలిపారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కేఫ్ దాడిలో ఉగ్రవాదులు దాడికి వినియోగించిన ఆయుధాలు అంత ఆధునికమైనవేమీ కాదని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయుధాలను కనుగొన్నామని, వాటిని సరఫరా చేసినవారిని త్వరలో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకు ప్రజల సహాయాన్ని కూడా కోరినట్లు పోలీస్ ఇనస్పెక్టర్ జనరల్ ఏకేఎమ్ షహీదుల్ తెలిపారు. ఇప్పటికే దాడుల సూత్రధారులను గుర్తించి నిఘాలో ఉంచినట్లు షహీదుల్ తెలిపారు. 12 గంటలపాటు జరిగిన మారణహోమంపై సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించి, వారి సహాయంతో తీవ్ర వాదాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దాడుల అనంతరం ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు తప్పించుకున్నవారి జాబితాను తయారు చేస్తున్నామని, నిర్థారణ అనంతరం వెల్లడిస్తామని చెప్పారు. ఇటీవలి దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు దేశంలోని విద్యాసంస్థలకు చెందిన వారుగా గుర్తించడంతో.. విద్యా సంస్థలపైనా పూర్తి నిఘా పెట్టినట్లు హక్ తెలిపారు. అంతేకాక దాడి వెనుక అంతర్జాతీయ హస్తం ఏదైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దాడి సందర్భంలో అప్రమత్తమైన భద్రతా దళాలు రెస్టారెంట్ ను చుట్టుముట్టి ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చి, ఒకరిని సజీవంగా పట్టుకున్న విషయం తెలిసిందే. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు వాయవ్య బోగ్రాలోని ఓ గ్రామానికి చెందిన మదర్సా విద్యార్థి అని, అతడే దాడికి సారథ్యం వహించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఓ భారతీయ యువతి సహా 22 మంది మరణించడంతోపాటు, 30 మంది వరకూ గాయపడ్డ దాడికి తామే బాధ్యులమంటూ ఇస్లామిక్ స్టేట్ బృదం ఎమాక్ వార్తా సంస్థద్వారా అప్పట్లో వెల్లడించింది. అయితే ఉగ్రవాదులు ధరించిన దుస్తులను బట్టి దాడి వెనుక తీవ్రవాద సంస్థ జమాత్ ఉల్ హెజాహిదీన్ ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది.
ఢాకా దాడి ఆయుధాలు దొరికాయ్!
Published Mon, Jul 25 2016 7:58 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
Advertisement
Advertisement