పాట్నా : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగర ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన మరోసారి జైలు శిక్షను అనుభవించనున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్వాలియర్‌లోని కోర్టులో కొనసాగుతున్న అక్రమ ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన కేసు నిందితుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. ఆయుధ చట్టం కింద 30 ఏళ్ల నాటి కేసుకు సంబంధించి గ్వాలియర్ ప్రత్యేక కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కోనున్నారు.
30 ఏళ్ల నాటి కేసు
1997లో మధ్యప్రదేశ్ పోలీసులు అక్రమ ఆయుధాల కేసును నమోదు చేశారు. ఇందులో నిందితులుగా 22 మందిని చేర్చారు. అయితే, ఆ నిందితులు గ్వాలియర్‌లోని మూడు వేర్వేరు సంస్థల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసి 1995 నుంచి 1997 మధ్య కాలంలో బీహార్‌లో విక్రయించినట్లు అభియోగాలు మోపారు పోలీసులు. అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టు ముందుంచారు. అప్పటి నుంచి గ్వాలియర్ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది.
నిందితుల్లో లాలూ ఒకరు
మొత్తం 22 మంది నిందితుల్లో 14 మంది పరారీలో ఉండగా, ఆరుగురు విచారణలో ఉండగా, ఇద్దరు చనిపోయారు. ఈ కేసులో అభియోగాలు మోపబడి పరారీలో ఉన్న 14 మందిలో ఒకరే లాలూ ప్రసాద్ యాదవ్. తాజాగా, గ్వాలియర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అక్రమ ఆయుధాల కేసుపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment