‘400 మందితో నామినేషన్‌ వేయిస్తా’ | Sakshi
Sakshi News home page

‘400 మందితో నామినేషన్‌ వేయిస్తా’

Published Mon, Apr 1 2024 11:10 AM

Digvijaya Singh shares how elections can be held through ballot paper - Sakshi

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించే మార్గాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ చెప్పారు. రాజ్‌గఢ్‌లోని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ఇక్కడి నుంచి 400 మంది  నామినేషన్లు వేసేలా కృషి చేస్తున్నానని, తద్వారా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. 

రాజ్‌గఢ్‌లోని కచ్నారియా గ్రామంలో దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడారు. ‘ఇక్కడ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మీరు కోరుకుంటే ఒక మార్గం ఉంది . ఒక స్థానం నుండి 400 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు . దానికి నేను సిద్ధమవుతున్నాను’ అన్నారు. పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ వివరాలను కూడా దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు.

"రిజర్వ్డ్ కేటగిరీకి చెందని వారు రూ. 25,000, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు రూ. 12,500 డిపాజిట్ చేయాలి. ఇది దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగే ఒక సీటుకు దారి తీస్తుంది" అని చెప్పారు.  ప్రజలు ఈ ప్రభుత్వంతో విసిగిపోయారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో విజయం సాధించగలమన్నారు.

ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంపై దిగ్విజయ్ సింగ్ గతంలోనే అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలపై ప్రజల అనుమానాలపై 2018లోనే ఏఐసీసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు గత ఫిబ్రవరిలో దిగ్విజయ్‌ సింగ్‌ ఏఎన్‌ఐతో అన్నారు.

Advertisement
Advertisement