Rajgarh district
-
‘400 మందితో నామినేషన్ వేయిస్తా’
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించే మార్గాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ చెప్పారు. రాజ్‌గఢ్‌లోని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ఇక్కడి నుంచి 400 మంది నామినేషన్లు వేసేలా కృషి చేస్తున్నానని, తద్వారా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. రాజ్‌గఢ్‌లోని కచ్నారియా గ్రామంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. ‘ఇక్కడ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మీరు కోరుకుంటే ఒక మార్గం ఉంది . ఒక స్థానం నుండి 400 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు . దానికి నేను సిద్ధమవుతున్నాను’ అన్నారు. పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ వివరాలను కూడా దిగ్విజయ్ సింగ్ తెలిపారు. "రిజర్వ్డ్ కేటగిరీకి చెందని వారు రూ. 25,000, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు రూ. 12,500 డిపాజిట్ చేయాలి. ఇది దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగే ఒక సీటుకు దారి తీస్తుంది" అని చెప్పారు. ప్రజలు ఈ ప్రభుత్వంతో విసిగిపోయారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో విజయం సాధించగలమన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంపై దిగ్విజయ్ సింగ్ గతంలోనే అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలపై ప్రజల అనుమానాలపై 2018లోనే ఏఐసీసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు గత ఫిబ్రవరిలో దిగ్విజయ్ సింగ్ ఏఎన్ఐతో అన్నారు. -
33 ఏళ్ల తర్వాత రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ!
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను రాబోయే లోక్ సభ ఎన్నికల్లో రాజ్‌గఢ్ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచి పోటీచేయాలని అధిష్ఠానం తనను ఆదేశించిందని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొదటి నుండి నిరాకరిస్తూనే వస్తున్నారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉందని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని గతంలో స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని 29 లోక్‌సభ స్థానాలకు బీజేపీ జాబితా విడుదల చేసినా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీలోని దిగ్గజ నేతలను రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపధ్యంలో రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ప్రకటనతో కాంగ్రెస్ మద్దతుదారులు బాణాసంచా కాల్చి, తమ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు దాదాపు 33 ఏళ్ల తర్వాత తిరిగి రాజ్‌గఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గమనార్హం. కాగా ఇవే ఆయనకు ఆఖరి ఎన్నికలు కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
హ్యాట్సాఫ్: 450 కి.మీ. నడిచిన పోలీస్
భోపాల్: కరోనా వ్యాప్తి నిరోధించడానికి పోలీసులు పడుతున్న శ్రమ అనిర్వచనీయం. ఓవైపు జనాలు గుమిగూడకుండా నిరంతరం వెయ్యికళ్లతో పర్యవేక్షిస్తూ.. పగలూ రాత్రీ తేడా లేకుండా గస్తీ కాస్తూ నిర్విరామంగా పని చేస్తున్నారు. పైగా కరోనా వైరస్ కోరలు చాస్తున్న ఈ సమయంలో వారి అవసరం కూడా ఎంతో ఉంది. దీన్ని గుర్తించిన ఓ కానిస్టేబుల్ తన విధులు నిర్వర్తించేందుకు 450 కిలోమీటర్లు నడిచి శభాష్ అనిపించుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల దిగ్విజయ్ శర్మ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. డిగ్రీ పరీక్షల నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు వెళ్లిన అతడు సెలవులో ఉన్నాడు. తీరా పరీక్షలు వాయిదా పడటంతో తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతానని బాస్‌ను సంప్రదించాడు. (కానిస్టేబుల్ ర్యాప్ సాంగ్.. నెటిజన్లు ఫిదా!) లాక్డౌన్ నేపథ్యంలో అక్కడి నుంచి స్వస్థలానికి రావడానికి ఎలాంటి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోమని పై అధికారులు సూచించారు. దానికి అతను ససేమీరా అన్నాడు. ఎలాగైనా డ్యూటీకి వెళ్లి తీరాల్సిందేనని ధృడంగా నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా మార్చి 25న ఉదయం కాలినడకన బయలు దేరాడు. మధ్యలో కొన్నిసార్లు లిఫ్ట్ తీసుకుంటూ, నడుచుకుంటూ.. సుమారు 20 గంటల తర్వాత మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌కు చేరుకున్నాడు. దారి మధ్యలో ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోలేదు. ఈ విషయం తెలిసిన అధికారులు అతని నిర్ణయాన్ని మెచ్చుకోవడమే కాక కాలినడకన వచ్చినందున కాస్త విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. అయితే అతను మాత్రం వెంటనే విధుల్లోకి చేరేందుకు పట్టుబడుతుండటం విశేషం. (మహిళా కానిస్టేబుల్‌కు కరోనా లక్షణాలు?) -
400 ఏళ్లుగా ఆ ఊరిలో..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని రాజ్ఘడ్ జిల్లాలోని గ్రామంలో వింత ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శంకా శ్యామ్‌జీ అనే గ్రామంలో 400 ఏళ్లుగా స్ర్తీలు ఎవరూ పిల్లల్ని ప్రసవించలేదు. గ్రామ సరిహద్దుల్లో నవజాత శిశువులను ప్రసవించరాదనే వింత ఆచారం ఏళ్ల తరబడి అమల్లో ఉంది. పిల్లల్ని కంటే దేవతలు ఆగ్రహిస్తారనే నమ్మకంతో గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామంలో బిడ్డలకు జన్మనిస్తే బిడ్డతో పాటు తల్లికూడా మరణిస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. 16వ శతాబ్దంలో దేవతలు గ్రామానికి ఈ రకంగా నిర్ధేశించారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. అప్పటినుంచి గ్రామంలో నిండు గర్భిణులను గ్రామ సరిహద్దు వెలుపలికి తీసుకువెళ్లి ప్రసవించేలా చేస్తున్నారు. దీనికోసం గ్రామ సరిహద్దుల అవతల ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించారు. గ్రామంలో దేవాలయాన్ని నిర్మించేందుకు దేవతలు ప్రయత్నించగా ఓ మహిళ అడ్డుకుందని అప్పటినుంచి గ్రామానికి ఇది శాపంగా పరిణమించిందని గ్రామ సర్పంచ్ నరేంద్ర గుర్జార్ చెప్పుకొచ్చారు. గ్రామంలో 90 శాతం డెలివరీలు ఆస్పత్రుల్లోనే జరుగుతాయని, అత్యవసర పరిస్థితుల్లో గ్రామ సరిహద్దుల వెలుపల ప్రసవించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆయన చెబుతున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం; 12 మంది మృతి
రాజ్ గఢ్: మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులతో పాటు 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆటోలోని వారందరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన బస్సు సాయికృప ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 25 వేల చొప్పున సహాయం ప్రకటించారు.