మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను రాబోయే లోక్ సభ ఎన్నికల్లో రాజ్‌గఢ్ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచి పోటీచేయాలని అధిష్ఠానం తనను ఆదేశించిందని తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొదటి నుండి నిరాకరిస్తూనే వస్తున్నారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉందని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని గతంలో స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని 29 లోక్‌సభ స్థానాలకు బీజేపీ జాబితా విడుదల చేసినా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీలోని దిగ్గజ నేతలను రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపధ్యంలో రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ప్రకటనతో కాంగ్రెస్ మద్దతుదారులు బాణాసంచా కాల్చి, తమ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు దాదాపు 33 ఏళ్ల తర్వాత తిరిగి రాజ్‌గఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గమనార్హం. కాగా ఇవే ఆయనకు ఆఖరి ఎన్నికలు కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment