మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 17న పోలింగ్ పూర్తయింది. డిసెంబర్ 3న వెలువడే ఫలితాల కోసం అటు ప్రజానీకం, ఇటు రాజకీయ పార్టీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఫలితాలకు ముందే వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందనే అంచనాలు వెలువడ్డాయి.
ఎగ్జిట్ పోల్స్‌పై సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైవిధ్యంగా ఉన్నాయని అన్నారు. దీని గురించి మేం ఇప్పుడే ఏమీ చెప్పలేమని, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 130కి పైగా సీట్లు వస్తాయని భావిస్తున్నామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనపై విసిగిపోయారని ఆరోపించారు.
ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లో తమకు పోటీ లేదని, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అన్నారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశం, అమిత్ షా వ్యూహాలు, జేపీ నడ్డా నాయకత్వం, కార్యకర్తల కృషి, బీజేపీ ప్రభుత్వ పథకాలు.. మొదలైనవన్నీ రాష్ట్రంలో బీజేపీకి మెజారిటీ వస్తుందని స్పష్టం చేస్తున్నాయన్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇండియా టీవి-సీఎన్ఎక్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. ఈసారి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 140 నుంచి 159 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్ ధర!
Comments
Please login to add a commentAdd a comment