ఆయుధ ప్రదర్శనకు పోటెత్తిన విద్యార్థులు
కర్నూలు: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయం ఏపీఎస్పీ రెండవ పటాలంలో బుధవారం కూడా ఆయుధాల ప్రదర్శన కొనసాగింది. నగరంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటెత్తారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్, ఫొటో ఎగ్జిబిషన్, డాగ్ స్క్వాడ్ బృందాల విన్యాసాలను ఎస్పీ ఆకే రవికృష్ణ విద్యార్థులతో కలసి తిలకించారు. ప్రదర్శనల్లో ఉంచిన వివిధ రకాల ఆయుధాలను, వాటి పనితీరును విద్యార్థులకు ఎస్పీ స్వయంగా తెలియజేశారు. విద్యార్థులు అడిగిన వివిధ రకాల సందేహాలను నివృత్తి చేశారు. వాసన పసిగట్టి నిందితులను గుర్తించే విధానం, పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే విధానంపై పోలీసు జాగిలాలు నిర్వహించిన విన్యాసాలను విద్యార్థులతో కలసి ఎస్పీ తిలకించారు. పోలీసు అమరవీరుల త్యాగాల గురించి ఎస్పీ విద్యార్థులకు వెల్లడించారు. పోలీసుల సాదకబాధకాలను తెలుసుకోవడానికి ఆయుధ ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్, డాగ్ స్క్వాడ్ బృందాలను తిలకించడానికి గురువారం చివరి రోజు అయినందున జిల్లా ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఐ.వెంకటేష్, ఆర్‌ఐలు రంగముని, జార్జి, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.