గుంతకల్లు టౌన్:
భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయనున్న కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్ కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని అమృత వర్షిణి బాల కళ్యాణ ఆశ్రమం (అనాథ శరణాలయం) కార్యదర్శి కె.లింగప్ప, క్యాంప్ ఆర్గనైజర్లు ఇల్లూరు లక్ష్మినారాయణ, డాక్టర్ రామ్మూర్తి కోరారు. శరణాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. జైపూర్ కంపెనీ కంటే నాణ్యమైన కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్‌ను ఉచితంగా అందజేస్తామన్నారు. అవసరమైన వారు ఈ నెల 25 మధ్యాహ్నం 3 గంటలకు శరణాలయంలో హాజరైతే కొలతలు తీసుకుంటారని చెప్పారు. జనవరి 12న కృత్రిమ అవయవాలను అందజేస్తామన్నారు. ఇతర వివరాల కోసం తిలక్‌నగర్‌లోని అనాథ శరణాలయం లేదా ఇల్లూరు లక్ష్మినారాయణ భవన్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. శరణాలయం కమిటీ సహాయ కార్యదర్శి గిరిధర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.