artificial legs
-
కాళ్లు లేని వారిని నడిపిస్తున్న సదా‘సేవా’మూర్తి!
పాలకొల్లు (సెంట్రల్): పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఆయన పేరు వేదాంతం సదాశివమూర్తి. పాతికేళ్ల వయసు (1981)లో రైలు దిగుతుండగా కాలుజారి ప్లాట్‌ఫామ్, బోగీ మధ్యలో పడిపోవడంతో ఆయన రెండు కాళ్లూ కోల్పోయారు. పూనేలోని డిఫెన్స్ రిహేబిలిటేషన్ సెంటర్లో మూడు నెలలపాటు చికిత్స చేయించుకున్న సదాశివమూర్తి కృత్రిమ కాళ్లు అమర్చుకున్నారు. 6 నెలల తరువాత కృత్రిమ కాళ్లతోనే బుల్లెట్ వాహనాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తర్వాత తాను ధరించే కృత్రిమ కాళ్లకు ఎలాంటి మరమ్మతు వచ్చినా పూనే వెళ్లాల్సి వచ్చేది. అలా 1998 వరకు దాదాపు 17 సంవత్సరాలపాటు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సదాశివమూర్తి పూనే వెళ్లి వస్తుండేవారు. తాను పడుతున్న ఇబ్బందుల్ని తనలాంటి వారు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో స్థానిక రంగమన్నార్‌పేటలో చైతన్య కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలా మొదలుపెట్టిన ఈ కేంద్రంలో ఇప్పటివరకు సుమారు 10 వేల మందికి కృత్రిమ కాళ్లను అమర్చారు. ఇటీవల ఓ ఆవుకు సైతం కృత్రిమ కాలు అమర్చి ఔరా అనిపించారు సదాశివమూర్తి. అతి తక్కువ ధరకే.. ఒక్కో కృత్రిమ కాలు ధర రూ.15 వేల నుంచి సుమారు రూ.25 వేల వరకు ఉంటుంది. కాళ్లతో పాటు చేతి వేళ్లు, చెవులు ఇలా ఏ రంగు వారికి ఆ రంగులోనే కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు సదాశివమూర్తి. రూ.14 వేలు ఉండే కృత్రిమ కాలిని రూ.900, రూ.3,500 ఉండే కాలి ధరను రూ.120కు తీసుకువచ్చారు. వివిధ కంపెనీలు వేసే రాడ్ల స్థానంలో సైకిల్‌కు వాడే కడ్డీలను కట్ చేసి కృత్రిమ కాళ్ల పరికరాలు తయారు చేయడం ద్వారా కృత్రిమ కాళ్ల ధరలను నిరుపేదలకు సైతం అత్యంత అందుబాటు ధరల్లోకి తెచ్చారు. సదాశివమూర్తి సేవలను గుర్తించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆర్థోపెడిక్ సర్జన్స్ 15 ఏళ్ల క్రితం స్వర్ణ పతకాలను అందజేశాయి. కృత్రిమ అవయవాలను కొత్తగా తయారు చేసినందుకు 2010లో ఆలిండియా అవార్డుతో పాటు రూ.2 లక్షల నగదు కూడా అందుకున్నారు. 2007లో పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమ నిర్వాహకులు సదాశివమూర్తిని స్వర్ణ ఉంగరంతో సత్కరించారు. ఆస్ట్రేలియా వర్సిటీ డాక్టరేట్ ప్రదానం నూతన టెక్నాలజీతో తక్కువ ధరకు.. పేదవారికైతే ఉచితంగానే కృత్రిమ అవయవాలను అందిస్తున్న సమాచారాన్ని సదాశివమూర్తి ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుండేవారు. అతని ఫేస్బుక్ ఖాతాను ముంబైలో నివాసం ఉంటున్న డాక్టర్ వీవీఎల్ఎన్ శాస్త్రి చాలాకాలంగా ఫాలో అవుతూ.. ఆ పోస్టులను భద్రపరిచి ఆస్ట్రేలియా యూనివర్సిటీకి పంపించారు. ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన ఆస్ట్రేలియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. గత నెల 5వ తేదీన ఢిల్లీలో డాక్టరేట్‌ను అందించడంతోపాటు ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డును సైతం సదాశివమూరి్తకి అందజేసింది. పేదలను ఆదుకోవాలనే తపనతోనే.. ఎంఏ చదువుతున్నప్పుడు కాళ్లు కోల్పోయాను. అనంతరం డిపొ్లమా ఇంజనీరింగ్ చేశాను. మోకాలి కింద వరకు కృత్రిమ కాళ్లను ఉచితంగానే అమరుస్తున్నాం. మోకాలి పైవరకు అమర్చాలంటే రూ.45 వేలకు పైగా ఖర్చవుతుంది. పేదలకు ఉచితంగా సేవలందించాలనేదే సంకల్పం. – వేదాంతం సదాశివమూర్తి, చైతన్య కృత్రిమ అవయవ కేంద్రం నిర్వాహకుడు, పాలకొల్లు చదవండి: వేరుశనగలో ‘విశిష్ట’మైనది -
దొడ్డ మనస్సులు వారిని నడిపిస్తున్నాయ్
విధి వారి జీవితాల్లో విషాదం నింపింది. దొడ్డ మనస్సులు వారిని నడిపిస్తున్నాయి. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో కాళ్లు కోల్పోయి వీల్ చైర్లకు.. పాకడానికి పరిమితమైన వారిని కృత్రిమ కాళ్లు నడిపిస్తున్నాయి. జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఎంతో మంది నిర్భాగ్యులకు జైపూర్ కృత్రిమ కాళ్లు, చేతులు అందిస్తోంది. మూడు రోజులుగా దివ్యాంగులు కృత్రిమ అవయవాల కోసం కొలతలు ఇచ్చేందుకు తరలివచ్చారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని ఆనంద పరవశులు అవుతున్నారు. నెల్లూరు (అర్బన్): సేవకు ప్రతి రూపం పేరును సార్థకం చేస్తూ జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దివ్యాంగులకు నాలుగైదేళ్లకోసారి జైపూర్ కృత్రిమ కాలు, చేతులు అందిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్లకు పైగా కృత్రిమ అవయవాలు పొందేందుకు దివ్యాంగులకు బ్రేక్ పడింది. దెబ్బతిన్న కృత్రిమ అవయవాలను మార్చుకోవాలనుకునే అభాగ్యులు, కొత్తగా ప్రమాదాలు, జబ్బుల కారణంగా కాలు, చేయి పోగొట్టుకున్న వారు కృత్రిమ అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సారథ్యంలో కలెక్టర్ చక్రధర్‌బాబు సహకారంతో ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు సుమారు 600 మందికి పైగా దివ్యాంగులకు జైపూర్ కృత్రిమ కాలు, చేయి ఏర్పాటు చేసేందుకు పూనుకోవడం రెడ్‌క్రాస్ తొలిసారిగా ఈ బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించింది. దివ్యాంగుల జీవితాల్లో కొంత మేరకైనా వెలుగులు ప్రసాదించేందుకు పూనుకుంది. ఈ శిబిరాన్ని కలెక్టర్ చక్రధర్‌బాబు ప్రారంభించి అభినందించారు. సుమారు 600 మందికి ఉపకరణాలు అనేక మంది దివ్యాంగులు కృత్రిమ అవయవాలను కావాలని అడుగుతుండడంతో రెడ్‌క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ విషయాన్ని కలెక్టర్ చక్రధర్‌బాబు వద్దకు తీసుకెళ్లి 200 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ 200 మంది కాదు కనీసం 500 మందికైనా కృత్రిమ అవయవాలు ఇవ్వండి.. అంటూ ప్రోత్సహించారు. ఈ క్రమంలో 500 మందికి కృత్రిమ కాలు, చేతులను ఏర్పాటు చేసేందుకు ఈ నెల 23 నుంచి స్థానిక మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న రెడ్‌క్రాస్ కార్యాలయంలో మూడు రోజుల పాటు కొలతలు తీసుకునేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే తొలి రోజే 540 మంది తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సుమారు 600 మించివచ్చని రెడ్‌క్రాస్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. సంస్థల సహకారం భేష్ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి రాయచూరుకు చెందిన రాజ్మల్ కేమ్ భండారి ఫౌండేషన్, జైపూరుకు చెందిన భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయతా సమితి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. తాము 1000 మందికైనా కృత్రిమ కాలు, చేయి అమర్చేందుకు సాయం చేస్తామంటూ ముందుకువచ్చాయి. వీరి సేవా నిరతికి దివ్యాంగులు తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రూ 1.50 కోట్ల ఖర్చు రెడ్‌క్రాస్ సంస్థ భోజనం, ఇతర వసతుల కోసం చేసే ఖర్చుతో పాటు ఫౌండేషన్ సంస్థలు అందించే కృత్రిమ కాలు, చేతుల ఏర్పాటుకయ్యే ఖర్చును పరిశీలిస్తే సుమారు రూ 1.50 కోట్లు ఖర్చు కానుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఊహించిన వారి కన్నా ఎక్కువ మంది వస్తుండటంతో ఖర్చు కూడా పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. రెడ్‌క్రాస్ సంస్థకు రుణపడి ఉంటా నేను నెల్‌కాస్ట్ కంపెనీలో కార్మికుడిని. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో 5 నెలల క్రితం నా కాలును డాక్టర్లు తొలగించారు. దీంతో ఇంటికే పరిమితమయ్యాను. జైపూర్ కాలు గురించి వినడమే తప్ప ఎవరి వద్దకు వెళ్లి ఏర్పాటు చేయించుకోవాలో తెలియలేదు. రెడ్‌క్రాస్ నా విషయం తెలుసుకుని కృత్రిమ కాలు ఏర్పాటు శిబిరానికి రావాలని నా ఫోన్‌కు మెసేజ్ పంపించారు. ఇప్పుడు వచ్చి కొలతలు ఇచ్చాను. నన్ను పిలిపించి కృత్రిమ కాలు ఏర్పాటు చేయిస్తున్న రెడ్‌క్రాస్ వారికి రుణపడి ఉంటా. – కాకాణి రామకృష్ణ, బత్తలాపురం, ఓజిలి మండలం ఏడు నెలల క్రితమే ప్రణాళిక కొంత మంది తమకు కృత్రిమ చేయి, కాలు ఏర్పాటు చేయమని కోరారు. అవయవాలు కోల్పోయిన దివ్యాంగులకు జైపూర్ కాలు చేయి ఏర్పాటు చేయించాలని 7 నెలల క్రితమే అనుకున్నాం. తమ పాలకవర్గ సభ్యులతో చర్చించాను. అందరి సహకారంతో కలెక్టర్‌కు తెలిపాం. కలెక్టర్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. రాజ్మల్ కేమ్ భండారి ఫౌండేషన్, భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయతా సమితి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయించాం. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ నాలాంటి పేదకు వరం కృత్రిమ కాలు నేను లారీ క్లీనర్‌ను. నాకు జరిగిన ప్రమాదంలో 2014లో ఆపరేషన్ చేసి డాక్టర్లు కాలు తీసేశారు. తర్వాత కొంత మంది దాతలు లోకల్‌గా తయారైన కాలును అమర్చారు. అయితే అది సెట్ కాలేదు. స్టీలు రాడ్ కూడా ఇచ్చారు. సెట్ కాలేదు. విధిలేని పరిస్థితుల్లో ఇంటికే పరిమితమయ్యాను. అయితే ఇప్పుడు రెడ్‌క్రాస్ ఖరీదైన, క్వాలిటీ ఉన్న జైపూర్ కాలును ఏర్పాటు చేసేందుకు కొలతలు తీసుకున్నారు. నాలాంటి పేదకు కృత్రిమ కాలు వరం. – ఎస్కే సందాని, వెంకటేశ్వరపురం, నెల్లూరు కందుకూరు రామమ్మ.. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఈమె కూలి పని చేసుకునే నిరుపేదరాలు. దురదృష్టవశాత్తు ఆమెకు డయాబెటీస్ మిల్లిటస్ (షుగర్) వ్యాధికి గురైంది. షుగర్ కంట్రోల్ తప్పింది. కాలుకు గాయమై రక్త సరఫరా తగ్గిపోయింది. దీంతో రక్తసరఫరా తగ్గిన వరకు కాలును తీసేయాలని లేదంటే మిగతా కాలు కూడా పనికి రాదని డాక్టర్లు తెలిపారు. బాధాకరమైనప్పటికీ ఆమెకు డాక్టర్లు ఆపరేషన్ చేసి ఒక కాలును తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు మించి పోయింది. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైంది. నడిచేందుకు వీలులేకుండా పోయింది. రెడ్‌క్రాస్ ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల శిబిరం గురించి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతం వెందోడుకు చెందిన రామమ్మ చెల్లెలు కుమార్తె పావనికి తెలిసింది. దీంతో పావని తమ పిన్నిని నెల్లూరు రెడ్‌క్రాస్ కార్యాలయానికి తీసుకువచ్చింది. కృత్రిమ కాలు ఏర్పాటుకు కొలతలు ఇచ్చింది. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ తనకు కృత్రిమ కాలు కాలు ఏర్పాటు చేస్తే నడుస్తానని ఆనందంగా చెప్పింది. -
అర్పిత.. స్ఫూర్తి ప్రదాత
మొన్నటి ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులు ఒక బంగారు పతకంతోపాటు, ఇతర పతకాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతోన్న పారా ఒలింపిక్స్‌లోనూ మేమేం తక్కువ కాదన్నట్లు ... పారా ఒలింపిక్ క్రీడాకారులు మరింత కసితో ఆడుతూ ప్రతి ఆటలో పతకాన్ని ఖాయం చేస్తున్నారు. వైకల్యాలకు ఎదురొడ్డి పోరాడుతూ పతకాల సంఖ్యను పెంచుతున్నారు. అయితే వీళ్లలా ఆ స్థాయికి వెళ్లనప్పటికీ, రెండు కాళ్లు కోల్పోయిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన అర్పితా రాయ్ మొక్కవోని ధైర్యంతో కృత్రిమ కాళ్లతో నడవడం నేర్చుకుని యోగా ట్రైనర్‌గా మారి ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అది 2006 ఏప్రిల్ 22 కోల్‌కతాలో కొన్ని వస్తువులు కొనేందుకు తన ఫ్రెండ్ బైక్ మీద కూర్చుని వెళ్తోంది అర్పితా రాయ్. బ్యారక్‌పూర్‌లోని తన ఇంటి నుంచి 30 కిలోమీటర్లు వెళ్లాక.. ఒక సెకను లో అర్పిత జీవితం అనూహ్యంగా తలకిందులైపోయింది. ఒక పెద్ద లారీ వచ్చి వారి బైక్‌ను గుద్దింది. ఆ స్పీడుకు అర్పిత కిందపడిపోవడం... ఆమె కాళ్ల మీద నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో... ఆమె కాళ్లు నలిగిపోయాయి. ఆ దరిదాపుల్లో ఉన్న వారు వచ్చి రోడ్డుకు అవతలివైపు ఉన్న ఆసుపత్రిలో అర్పితను చేర్చారు. అక్కడ పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇచ్చి, శస్త్రచికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించమన్నారు. వేరే ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తే కాళ్లు వస్తాయని డాక్టర్లు చెప్పినప్పటికీ ... అర్పిత తల్లిదండ్రుల వద్ద ఆ సమయంలో ఆపరేషన్‌కు సరిపడా డబ్బులు లేక, వాటిని సమకూర్చుకోవడానికి 12 రోజుల సమయం పట్టింది. దీంతో కాళ్లకు ఇన్ఫెక్షన్ సోకి రెండు కాళ్లను తీసేశారు. అంతేగాక ఎనభైశాతం శరీరానికి గ్యాంగ్రిన్ సోకడంతో నాలుగు నెలలపాటు ఆసుపత్రిలోనే ఉంది. తన కాళ్లమీద తాను నిలబడి ధైర్యంగా బతకాల్సిన 20 ఏళ్ల అమ్మాయి రెండు కాళ్లనీ కోల్పోయింది. అయినప్పటికీ కృత్రిమ కాళ్లను అమర్చుకుని తను ఎవరి మీదా ఆధారపడ కూడదని నిర్ణయించుకుంది. ఈ దుర్ఘటన జరిగి ఇప్పటికీ పదిహేనేళ్లు. ఇప్పుడు అర్పిత కృత్రిమ కాళ్లతో నడవడమేగాక, యోగా కూడా చేస్తుంది. రోజూ గంట నిల్చొని... ఆపరేషన్ తరువాత రోజూ గంటపాటు నిలుచోమని డాక్టర్లు చెప్పారు. ఇలా చేయడం వల్ల శరీర ఆకృతి కరెక్టు వస్తుందని చెప్పడంతో అలా చేసేందుకు ప్రయత్నించేది. దాని వల్ల అర్పితకు చాలా నొప్పిగా అనిపించేది. అయినప్పటికీ అంతటి నొప్పిని ఓర్చుకుని, అనేక ప్రయత్నాల తరువాత తన కాళ్ల మీద తను నిలబడింది. నడవడం నేర్చుకున్న తరువాత 2007లో కాల్ సెంటర్లో ఉద్యోగంలో చేరింది. రెండున్నరేళ్లు పనిచేసి, పెళ్లి అవడంతో ఉద్యోగం మానేసింది. యోగా ట్రైనర్‌గా... కాల్ సెంటర్లో పనిచేసేటప్పుడు సహోద్యోగులు చూసే చూపులు తనని తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి. మెట్టు ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా కష్టంగా అనిపించేది. ఈ క్రమంలోనే యోగా చేయడం ద్వారా శరీరాన్ని బ్యాలెన్స్‌గా ఉంచడమేగాక, ఫిట్‌గా ఉండవచ్చని భావించి 2015లో యోగా చేయడం ప్రారంభించింది. తొలిదినాలలో యోగా చేయడం బాగా కష్టంగా అనిపించినప్పటికీ కఠోర శ్రమపడి నేర్చుకుంది. ఆసనాలు పర్ఫెక్ట్గా వేయడం వచ్చాక... 2019 లో తనే ఒక ఇన్‌స్ట్రక్టర్‌గా మారింది. కరోనా రాకముందు 25 మందికి ఆసనాలు వేయడం నేర్పించేది. వీరిలో వికలాంగులు కూడా ఉన్నారు. యోగా ట్రైనర్‌గా అర్పితకు మంచి గుర్తింపు రావడంతో తన యోగా క్లాసుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ప్రారంభించింది.‘రాయ్ అర్పితా యోగా’ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తన యోగా ట్రైనింగ్ సెషన్స్‌తో కూడిన వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఈ వీడియోలకు ప్రోత్సాహంతో కూడిన కామెంట్లు వస్తుండడంతో అర్పిత మరింత ఉత్సాహంతో దాదాపు ఆరేళ్లుగా యోగా తరగతులు చెబుతూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. -
నడిపించే దాతృత్వం
వారు ఈ ప్రాంతీయులు కారు.. ఎక్కడో సుదూరాన ఉన్న రాజస్థాన్ నుంచి దశాబ్దాల క్రితం తరలివచ్చి పలు వ్యాపకాలతో ఉపాధి పొందుతూ ఇక్కడే స్థిరపడ్డారు. తమకు ఆదరువు కల్పించిన ఈ ప్రాంతానికి, ఇక్కడి వారికి ఏదో చేయాలన్న తపనతో రాజస్థానీ అగర్వాల్ సమ్మేళన్, రాజస్థానీ సాంస్కృతిక మండళ్ల పేరిటి ఏకతాటిపైకి వచ్చి సమాజ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి దాతృత్వం అక్కడితో ఆగిపోలేదు.. విశాఖ, విజయనగరం, శ్రీకాకాళం జిల్లాలకు నడిచెళ్లింది. ప్రమాదాలు ఇతర కారణాలతో కాళ్లు కోల్పోయి..నడక మర్చిపోయిన వారికి మళ్లీ నడక నేర్పాలని సంకల్పించారు. అటువంటి దీనులకు కృత్రిమ కాళ్లు సమకూర్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అర్హులను ఎంపిక చేశారు. కొలతలు తీసుకున్నారు. తొలి విడతలో శనివారం 472 మందికి కృత్రిమ కాళ్లు అమర్చేందుకు సర్వం సిద్ధం చేశారు. పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ప్రమాదవశాత్తు అవయవాలు కోల్పోయి సంవత్సరాల తరబడి అవస్థల జీవనం సాగించిన వారికి కృత్రిమ అవయవాలను అందించేందుకు ముందుకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ అఖిల భారత అగర్వాల్ సమ్మేళన్, రాజస్థాన్ సాంస్కృతిక మండలి. తమ పనులు తాము స్వయంగా చేసుకోలేక ఇతరులపై ఆధారపడిన వారు ఇక స్వతంత్ర జీవనం సాగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. దివ్యాంగులు కొత్తపథంలో అడుగిడేందుకు ఉత్తరాంధ్ర జర్నలిస్టు ఫ్రంట్, మహా విశాఖ నగరపాలక సంస్థ, ప్రేమ ఆస్పత్రి, రాష్ట్ర దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ సహకారం అందిస్తున్నాయి. తయారీలో నిపుణులు నిమగ్నం కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్ వంటి పరికరాల తయారీలో 35 ఏళ్ల ఆనుభవం ఉన్న కోల్‌కతాకు చెందిన మహావీర్ సేవాసదన్కు చెందిన 16 మంది నిపుణులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. మహారాణిపేటలోని రాజస్థాన్ సాంస్కృతిక భవన్లో ఈ నెల 10 నుంచి కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 528 మంది లబ్ధిదారులు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకుని, తమకు అవసరమైన అవయవాల కొలతలను ఇచ్చారు. వాటి ప్రకారం అవయవాలను తయారు చేసి, ఈ నెల 17న విశాఖపట్నం రాజస్థాన్ సాంస్కృతిక భవనంలోను, 22న శ్రీకాకుళంలోను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఒక్కో కృత్రిమ కాలుకు రూ.2 నుంచి రూ.4వేల వరకు, కృత్రిమ చేతికి రూ.6వేల వరకూ వెచ్చిస్తున్నారు. అలా ఒకటా.. రెండా దాదాపు 28లక్షల రూపాయలను అగర్వాల్ సమ్మేళన్, రాజస్థాన్ సాంస్కృతిక మండలి సమకూర్చాయి. 2015 ఏప్రిల్ 19వ తేదీన నిర్వహించిన శిబిరంలో 200 మందికి కృత్రిమ, కాళ్లు చేతులను అమర్చే కార్యక్రమం విజయవంతం అయ్యింది. కృత్రిమ అవయవాల కొరకు వచ్చే లబ్ధిదారులకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయంతో పాటు వసతి సౌకర్యం కూడా నిర్వాహకులు కల్పించారు. కాలేజీకి అందరిలానడిచి వెళ్లగలను చిన్నతనంలో వచ్చిన పోలియో వల్ల కాలు కురచగా మారిపోయింది. 2015లో ఇప్పటి నిర్వాహకులే కృత్రిమ కాలు అమర్చారు. వయసు పెరగడంతో కాలు సైజు కూడా మారింది. దీంతో మళ్లీ వీళ్లే మరో కృత్రిమ కాలును అమర్చుతున్నారు. కళాశాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండేది. కొత్తకాలు అమరికతో ఇబ్బంది తొలగిపోనుంది. – దినేష్‌కుమార్, గాజువాక -
కృత్రిమ కాళ్లు, చేతుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
గుంతకల్లు టౌన్: భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయనున్న కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్ కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని అమృత వర్షిణి బాల కళ్యాణ ఆశ్రమం (అనాథ శరణాలయం) కార్యదర్శి కె.లింగప్ప, క్యాంప్ ఆర్గనైజర్లు ఇల్లూరు లక్ష్మినారాయణ, డాక్టర్ రామ్మూర్తి కోరారు. శరణాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. జైపూర్ కంపెనీ కంటే నాణ్యమైన కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్‌ను ఉచితంగా అందజేస్తామన్నారు. అవసరమైన వారు ఈ నెల 25 మధ్యాహ్నం 3 గంటలకు శరణాలయంలో హాజరైతే కొలతలు తీసుకుంటారని చెప్పారు. జనవరి 12న కృత్రిమ అవయవాలను అందజేస్తామన్నారు. ఇతర వివరాల కోసం తిలక్‌నగర్‌లోని అనాథ శరణాలయం లేదా ఇల్లూరు లక్ష్మినారాయణ భవన్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. శరణాలయం కమిటీ సహాయ కార్యదర్శి గిరిధర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
నడిపించే మనసు
కొన్ని మనసులు కదలవు. మెదలవు.కొన్ని మాత్రం ఎదుటివారి చిన్న కష్టానికి కదిలిపోతాయి. కదిలే మనసుకు సమాజాన్ని కదిలించే శక్తి ఉంటుంది. డాక్టర్ రమణ యశస్వి మనసులో కదలిక ఉంది. అందుకే అది కదల్లేని వారి కోసం తపన పడుతుంది. అవిటితనం శరీరం కంటే ముందు మనసును అవిటిని చేస్తుంది. రమణ యశస్విలాంటి వాళ్లు ఉంటే మొదట మనసులు కదులుతాయి. తర్వాత కాళ్లు కదులుతాయి. ఆగిపోయిన జీవితాలను నడిపించ గలిగే డాక్టర్‌ను కలవండి. నా పేరు రమణ. మాది గుంటూరు జిల్లా గణపవరం. నేను వ్యవసాయ కుటుంబంలో జన్మించాను. గణపవరం సిఆర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను. మా వూళ్లో మా నాన్నగారి మిత్రులంతా డాక్టర్లు కావడంతో, ఆయన నన్ను డాక్టర్ చదివించాలనుకుని, నా చేత ఎంసెట్ రాయించారు. ఫ్రీ సీట్ వచ్చింది. ఆంధ్రా మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేశాను. ఆ తరవాత ఎంఎస్ (ఆర్థో) పూర్తి చేశాను. మార్గం చూపిన బర్డ్.... చదువు పూర్తయిన కొత్తల్లో తిరుపతిలోని బర్డ్ (బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్, రిహాబిలిటేషన్ ఫర్ డిసేబుల్డ్) ఆసుపత్రి, ఆర్టిఫీషియల్ లింబ్ ఫిట్టింగ్ సెంటర్లో మూడు సంవత్సరాలు సేవ చేశాను. సేవ అని ఎందుకంటున్నానంటే అక్కడ మాకు జీతం ఎక్కువగా ఉండదు. పూర్తిగా స్వామి వారి సేవగా భావించాలి. ఆ ఆసుపత్రిలో అందరికీ ఉచితంగానే చికిత్స చేస్తారు. తితిదే వారి ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రి అది. అక్కడికి కృత్రిమ కాళ్ల కోసం వేల మంది వచ్చేవారు. ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల నుంచి కూడా వచ్చేవారు. నిరంతరం వచ్చిపోయే రోగులతో అక్కడి పనివారు విసుగెత్తిపోయి ‘మూడు నెలల తరవాత రండి, ఆరు నెలల తరవాత రండి’ అంటూ వచ్చినవాళ్లని పంపేస్తూ ఉండేవారు. వారి తప్పు కూడా లేదు. అక్కడకు వచ్చేవారి సంఖ్య అలా ఉండేది. ఆ సమయంలోనే ఒకసారి ‘బర్డ్’ తరఫున ఇతర డాక్టర్లతో కలిసి కలకత్తాలో కృత్రిమ కాళ్లు అమర్చే హెల్త్ క్యాంప్‌కు హాజరయ్యి చాలామందికి కాళ్లు అమర్చాము. ఆ క్యాంప్‌కు మదర్ థెరిస్సా హాజరయ్యి ఆశీర్వదించడం ‘ఇలాగే సేవ చేస్తూ ఉండండి’ అని పలకడం మర్చిపోలేదు. అప్పుడే అనుకున్నాను ‘నేను కూడా ఇటువంటి కేంద్రం నెలకొల్పాలి’ అని. దేశంలో ఎవరికి కృత్రిమ కాలు కావాలన్నా జైపూర్, తిరుపతి వంటి ప్రదేశాలకు వెళ్లవలసి వస్తోంది. నేను నా స్వస్థలంలో నెలకొల్పితే కనీసం ఈ చుట్టుపక్కల వాళ్లకైనా ఉపయోగపడతాను కదా అనుకున్నాను. ఆ ఆలోచన నుంచి వచ్చినదే ఈ ‘వాక్’ సంస్థ. మరచిపోలేను... కాళ్లు పోగొట్టుకున్నవారు ఎదుర్కొనే సమస్యలు కూడా ‘వాక్’ సంస్థ ఆవిర్భావానికి ఒక కారణం. ఒకసారి ఒక పేషెంటుకు ఆపరేషన్ చేసి కాలు తీయాల్సి వచ్చింది. సర్జరీ పూర్తి చేసి డిశ్చార్జ్ చేశాం. ఆ తరవాత కొన్ని సంవత్సరాలకి రోడ్డు మీద అడుక్కుంటూ కనిపించాడు. అతడు గతంలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కాలు పోగొట్టుకోవడంతో అతడి ఉద్యోగమూ పోయింది. ఇప్పుడు కుటుంబమూ వెలి వేసింది. అతడిని నా దగ్గరకు తీసుకువచ్చి ఉచితంగా కాలు ఇచ్చి, అతడి కాళ్ల మీద అతడు నిలబడేలా అతడికి దారి చూపించి పంపాను. ఇప్పుడు అతడు షాపు పెట్టుకుని ఎంతో గౌరవప్రదంగా, హాయిగా జీవిస్తున్నాడు. మరోసారి గుంటూరు ఎఎంజి పాఠశాలలో ఒక అమ్మాయిని చూసి నా మనసు కరిగిపోయింది. ఆ అమ్మాయి కాళ్లు, చేతులు లేకుండా పుట్టిన కారణంగా తల్లి ఆమెను అక్కడ విడిచివెళ్లిపోయింది. ఆ పాఠశాల వారే ఆ అమ్మాయిని పెంచుతున్నారు. ఆ అమ్మాయికి ఇప్పుడు 16 సంవత్సరాలు. పేరు స్టెల్లా. లక్షరూపాయల ఖర్చుతో ఆమెకు రెండు కాళ్లు, ఒక చేయి ఏర్పాటుచేశాం. చేతికి స్పామ్ లాంటిది వేయడం వల్ల ఆమె చేయి కేవలం అంగుళం మేర పెరిగింది. ఆ అమ్మాయి కళ్లల్లో కనిపించిన సంతోషాన్ని మర్చిపోలేను. అప్పటికే మా సంస్థ ద్వారా సుమారు వందమందికి కృత్రిమ కాళ్లు నేనే స్వయంగా కొని, ఉచితంగా పంపిణీ చేశాను. ఆయన చలవే... నేను సేవా కార్యక్రమాలు చేయడం చూసిన ఒక పెద్ద మనిషి, కృత్రిమకాళ్లు తయారుచేయడానికి కావలసిన యంత్రసామగ్రిని మాకు ఉచితంగా అందచేశారు. 2006లో గుంటూరు బ్రాడీపేటలో ప్రారంభమైన మా ‘వాక్’ సంస్థ, ఇప్పుడు గుంటూరులోని కాకాని రోడ్డులో మా సొంత స్థలంలో ఉంది. ఇప్పటివరకు సుమారు నాలుగు వేల మందికి కృత్రిమ కాళ్లు ఉచితంగా అందచేశాం. మా దగ్గర సర్జరీ చేయించుకున్న వాళ్లకే కాకుండా, బయట సర్జరీ చేయించుకున్న వాళ్లకు కూడా ఈ కాళ్లు పంపిణీ చేస్తున్నాం. మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ హెచ్డి పైపులను తీసుకువచ్చి, వాటితో ఈ కాళ్లు తయారుచేస్తాం. పాదాలు మాత్రం జైపూర్ నుంచే కొనుగోలు చేస్తాం. అది వారి పేటెంట్. పేదల కోసం... మా సేవలన్నీ పేదలకు మాత్రమే. పేదలకు కేవలం కాళ్లు ఇచ్చి వదిలేయడం కాకుండా, కాలికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మా దగ్గరకు రమ్మని చెప్పి పంపుతాం. అంతేకాదు, వారికి ఏదో ఒక దారి కూడా చూపుతున్నాం. సాఫ్ట్ టాయ్స్ తయారీ, అగరువత్తుల తయారీ, టైలరింగ్ వంటివి నేర్పుతున్నాం. కృత్రిమ చేతులు మాత్రం పనిచేయవు. కేవలం చేతితో గ్లాసు పట్టుకునేలా మాత్రం చేయగలం. అంతవరకే. చేతి దగ్గర ఒక బటన్‌లాంటిది నొక్కితే గ్లాసు పట్టుకుని నీళ్లు తాగగలుగుతారు. చేయూతనివ్వండి... ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడవాలంటే ఎంతోమంది దాతలు ముందుకు రావాలి. ఒక్కరితో అయ్యే పని కాదు. మేం చేస్తున్నది మంచి పనే అయినా, మాకు అనుకున్నంత సహకారం అందట్లేదు. అడపాదడపా కొందరు దాతలు సహాయం చేస్తున్నారు. మా సేవ నిరంతర ప్రక్రియ. ఇందుకోసం ఎందరు ముందుకు వచ్చినా ఇంకా మిగులుతూనే ఉంటుంది. మాకు రెండు మూడు సంవత్సరాలుగా చందాల కొరత ఏర్పడింది. ఇటువంటి సంస్థలను ఆదరించి, ఆర్థికంగా చేయూతనిస్తే మరిన్ని సేవాకార్యక్రమాలు చేయగలుగుతాం. - సంభాషణ: డా.పురాణపండ వైజయంతి సాక్షి, విజయవాడ ఎవరైనా ఇంట్లో శుభకార్యం చేసుకుంటున్నప్పుడు ఆ ఆనందానికి గుర్తుగా, లేదంటే గతించినవారి జ్ఞాపకార్థం చందాలు ఇవ్వమని కోరుతోంది వాక్ సంస్థ. మీ ప్రతి చందా ఒకరిని నడిపిస్తుంది. ఒక్కో కృత్రిమ అవయవానికి నాలుగు వేల నుంచి ఏడు వేల వరకు, ట్రైసైకిల్ ఇవ్వాలంటే రూ. 5500 ఖర్చ వుతుంది. అవి అవసరమైనవారికి దాతలు నేరుగా ఇవ్వొచ్చు. - డాక్టర్ రమణ యశస్వి వాక్ ఫౌండేషన్, గుంటూరు. ఫోన్: 99484 94667 -
నడిపించే ‘అభయ’ హస్తం!
పదేళ్ల చౌడేశ్వరి ఊరెళ్లాలనే ఉత్సాహంలో ప్లాట్‌ఫారమ్ అంచుకొచ్చింది... రైలు వేగానికి పట్టుతప్పి పడిపోయింది. మరో అమ్మాయి వాటర్ ట్యాంకు నిండిందేమోనని చూస్తూ జారి కరెంట్ వైర్ మీద పడిపోయింది. ఇస్త్రీ చేసుకుని బతికే యువకుడు పక్కనే ఉన్న కరెంట్ వైర్ షాక్‌తో అవిటివాడయ్యాడు... వీళ్లంతా ఇప్పుడు నడుస్తున్నారు... విధి వక్రించిన వీళ్లను వేలు పట్టి నడిపించిన మేనమామ చేవూరి రామకృష్ణ! చేవూరి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్లో ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. తన రిటైర్మెంట్ ఉద్యోగానికే కానీ ప్రవృత్తికి కాదంటారాయన. పద్మారావునగర్‌లోని వీరి ఇంట్లో అడుగుపెడితే ‘అభయ వాలంటరీ ఆర్గనైజేషన్’ ఆధ్వర్యంలో వీరు చేస్తున్న సేవకు నిదర్శనంగా వికలాంగులకు అమర్చే కాలిపర్లు, కృత్రిమ కాళ్లు కనిపిస్తాయి. ‘‘ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ యూనిట్ నిమ్స్ హాస్పిటల్లో ఉంది. నా ఉద్యోగం అక్కడే. ఓ నాలుగయిదేళ్ల క్రితం శివసాయి అనే ఏడాదిన్నర పాప గురించి సాక్షి పేపర్లో చదివాను. ఆ పాపకు లివర్ వ్యాధి. ఆ తల్లిదండ్రులు ఖర్చును భరించే స్థితిలో లేరు. వారికి ప్రభుత్వ వైద్యం అందడం లేదని తెలిసి బాధనిపించింది. ‘భగవంతుని దయవల్ల నాకు మంచి జీతం వస్తోంది. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రభుత్వ సహాయం అందని వాళ్లను చూసి బాధపడి ఊరుకోవడం కంటే ఆ పని నేనే ఎందుకు చేయకూడదు’ అనుకున్నాను. అదే విషయం ఇంట్లో చెప్తే మా ఆవిడ కూడా సరేనన్నది. మా పెద్దబ్బాయి అప్పటికప్పుడు పదివేలిచ్చాడు. ఆ పాపకు ఆమె తల్లి లివర్‌లోని కొంతభాగాన్ని తీసి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. అలా మొదలైన మా సేవలో ప్రయోజనం పొందిన వాళ్లు ఇప్పటికి మూడువందల మందికి పైగా ఉన్నారు’’ అని చెప్పారు రామకృష్ణ. స్వచ్ఛంద విరాళాలతో... ‘‘శివసాయి ఆపరేషన్ తర్వాత నా ఆలోచనలకు, మానసిక సంఘర్షణకు ఒక రూపం వచ్చినట్లయింది. పుట్టువికలాంగులు, పోలియో వంటి వ్యాధులతో వికలాంగులైన వాళ్లు, ప్రమాదవశాత్తూ కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారు ఎంతోమంది మా దగ్గరకు వచ్చేవాళ్లు. వారిలో వైద్యానికయ్యే ఖర్చును భరించే స్థితిలో లేని వారందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాం. మా కాలనీలో వాకర్స్ అసోసియేషన్ వారు ఈ సర్వీస్‌లో భాగస్వాములయ్యారు. మా కోడలు, చిన్నబ్బాయి ఫేస్బుక్ ద్వారా వారి ఫ్రెండ్స్‌ను చైతన్యం చేస్తుంటారు. ఇప్పటికి మా సేవలకు ఆరులక్షలకు పైగా ఖర్చయింది. అందులో ఎక్కువ మొత్తం దాతల విరాళాలే. పేషెంట్లకి కృత్రిమ అవయవాలను దాతల చేతనే ఇప్పిస్తున్నాం. నేను చేస్తున్న సేవాకార్యం గురించి తెలిసి ఎన్. రామకృష్ణ (రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి)ఉత్సాహం చూపించారు. వృద్ధాశ్రమాలకు వెళ్లి వైద్యం చేస్తుంటారు. అభయ ఆర్గనైజేషన్ రూపుదాల్చడానికి కారకులు కూడా ఈయనే ’’అన్నారు చేవూరి. ‘అభయ’ హస్తమే! ‘‘పుట్టుకతో వికలాంగులకంటే ప్రమాదాల్లో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వాళ్లు త్వరగా బేలగా మారుతుంటారు. వాళ్లకు వైద్యం కంటే ముందు ధైర్యం చెప్పాలి’’ అన్నారు ఎన్. రామకృష్ణ. మాటే మాకు ప్రచారం! ‘‘డాక్టర్లను కలిసి ‘మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లలో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి మేము సహాయం చేస్తాం. మాకు ఒక్క ఫోన్ చేస్తే చాలు’ అని చెప్పాం. మా సేవలు అలా నోటి మాటతోనే విస్తరించాయి. మూడేళ్ల పిల్లాడికి హియరింగ్ ఎయిడ్ అమర్చిన తర్వాత మాట్లాడాడు. ఆ తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇన్నేళ్లలో అలాంటి ఆనందాలెన్నో చూశాం’’ అన్నారు చేవూరి. - వాకా మంజులారెడ్డి ప్రభుత్వసేవలో కొన్నిసార్లు నిబంధనలే ప్రతిబంధకాలవుతుంటాయి. ప్రభుత్వ వైద్యం అందాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఆ కార్డు ఉంటే చలువ దుస్తులు వేసుకున్న వారికి కూడా ఉచితవైద్యం చేయాలి. చిరిగిన దుస్తులతో కాళ్లు విరిగి వచ్చిన వారికి తెల్లకార్డు లేకపోతే ప్రభుత్వవైద్యం అందదు. ఇలాంటి సంఘటన ఎదురైన ప్రతిసారీ ఇదేం న్యాయం అని రామకృష్ణ మనసు రోదించేది. ఆ ఆవేదన నుంచి రూపొందినదే ‘అభయ వాలంటరీ ఆర్గనైజేషన్’. కలాం కల... తేలిక కాలు! అబ్దుల్ కలామ్ మదిలో మెదిలిన ఆలోచనే ఈ ఫ్లోర్ రియాక్షన్ ఆర్థోసిస్. జైపూర్ కాలు మూడున్నర కేజీల బరువు ఉంటుంది. కలాం ప్రయోగంతో 350 గ్రాముల కాలిపర్ తయారైంది. ఆ ప్రాజెక్టులో నేను కూడా పని చేశాను. ఆ అనుభవం వల్ల పేషెంటుకి సరిపోయే టైలర్‌మేడ్ కాలిపర్ని చేయించగలుగుతున్నాను. - చేవూరి రామకృష్ణ, అభయ ఆర్గనైజేషన్ సెక్రటరీ