పదేళ్ల చౌడేశ్వరి ఊరెళ్లాలనే ఉత్సాహంలో ప్లాట్‌ఫారమ్ అంచుకొచ్చింది... రైలు వేగానికి పట్టుతప్పి పడిపోయింది. మరో అమ్మాయి వాటర్ ట్యాంకు నిండిందేమోనని చూస్తూ జారి కరెంట్ వైర్ మీద పడిపోయింది. ఇస్త్రీ చేసుకుని బతికే యువకుడు పక్కనే ఉన్న కరెంట్ వైర్ షాక్‌తో అవిటివాడయ్యాడు... వీళ్లంతా ఇప్పుడు నడుస్తున్నారు... విధి వక్రించిన వీళ్లను వేలు పట్టి నడిపించిన మేనమామ చేవూరి రామకృష్ణ!
చేవూరి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్‌లో ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. తన రిటైర్‌మెంట్ ఉద్యోగానికే కానీ ప్రవృత్తికి కాదంటారాయన. పద్మారావునగర్‌లోని వీరి ఇంట్లో అడుగుపెడితే ‘అభయ వాలంటరీ ఆర్గనైజేషన్’ ఆధ్వర్యంలో వీరు చేస్తున్న సేవకు నిదర్శనంగా వికలాంగులకు అమర్చే కాలిపర్‌లు, కృత్రిమ కాళ్లు కనిపిస్తాయి.
‘‘ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ యూనిట్ నిమ్స్ హాస్పిటల్‌లో ఉంది. నా ఉద్యోగం అక్కడే. ఓ నాలుగయిదేళ్ల క్రితం శివసాయి అనే ఏడాదిన్నర పాప గురించి సాక్షి పేపర్‌లో చదివాను. ఆ పాపకు లివర్ వ్యాధి. ఆ తల్లిదండ్రులు ఖర్చును భరించే స్థితిలో లేరు. వారికి ప్రభుత్వ వైద్యం అందడం లేదని తెలిసి బాధనిపించింది. ‘భగవంతుని దయవల్ల నాకు మంచి జీతం వస్తోంది. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రభుత్వ సహాయం అందని వాళ్లను చూసి బాధపడి ఊరుకోవడం కంటే ఆ పని నేనే ఎందుకు చేయకూడదు’ అనుకున్నాను. అదే విషయం ఇంట్లో చెప్తే మా ఆవిడ కూడా సరేనన్నది. మా పెద్దబ్బాయి అప్పటికప్పుడు పదివేలిచ్చాడు. ఆ పాపకు ఆమె తల్లి లివర్‌లోని కొంతభాగాన్ని తీసి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. అలా మొదలైన మా సేవలో ప్రయోజనం పొందిన వాళ్లు ఇప్పటికి మూడువందల మందికి పైగా ఉన్నారు’’ అని చెప్పారు రామకృష్ణ.
స్వచ్ఛంద విరాళాలతో...
‘‘శివసాయి ఆపరేషన్ తర్వాత నా ఆలోచనలకు, మానసిక సంఘర్షణకు ఒక రూపం వచ్చినట్లయింది. పుట్టువికలాంగులు, పోలియో వంటి వ్యాధులతో వికలాంగులైన వాళ్లు, ప్రమాదవశాత్తూ కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారు ఎంతోమంది మా దగ్గరకు వచ్చేవాళ్లు. వారిలో వైద్యానికయ్యే ఖర్చును భరించే స్థితిలో లేని వారందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాం. మా కాలనీలో వాకర్స్ అసోసియేషన్ వారు ఈ సర్వీస్‌లో భాగస్వాములయ్యారు. మా కోడలు, చిన్నబ్బాయి ఫేస్‌బుక్ ద్వారా వారి ఫ్రెండ్స్‌ను చైతన్యం చేస్తుంటారు. ఇప్పటికి మా సేవలకు ఆరులక్షలకు పైగా ఖర్చయింది. అందులో ఎక్కువ మొత్తం దాతల విరాళాలే. పేషెంట్లకి కృత్రిమ అవయవాలను దాతల చేతనే ఇప్పిస్తున్నాం. నేను చేస్తున్న సేవాకార్యం గురించి తెలిసి ఎన్. రామకృష్ణ (రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి)ఉత్సాహం చూపించారు. వృద్ధాశ్రమాలకు వెళ్లి వైద్యం చేస్తుంటారు. అభయ ఆర్గనైజేషన్ రూపుదాల్చడానికి కారకులు కూడా ఈయనే ’’అన్నారు చేవూరి.
‘అభయ’ హస్తమే!
‘‘పుట్టుకతో వికలాంగులకంటే ప్రమాదాల్లో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వాళ్లు త్వరగా బేలగా మారుతుంటారు. వాళ్లకు వైద్యం కంటే ముందు ధైర్యం చెప్పాలి’’ అన్నారు ఎన్. రామకృష్ణ.
మాటే మాకు ప్రచారం!
‘‘డాక్టర్లను కలిసి ‘మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లలో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి మేము సహాయం చేస్తాం. మాకు ఒక్క ఫోన్ చేస్తే చాలు’ అని చెప్పాం. మా సేవలు అలా నోటి మాటతోనే విస్తరించాయి. మూడేళ్ల పిల్లాడికి హియరింగ్ ఎయిడ్ అమర్చిన తర్వాత మాట్లాడాడు. ఆ తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇన్నేళ్లలో అలాంటి ఆనందాలెన్నో చూశాం’’ అన్నారు చేవూరి.
- వాకా మంజులారెడ్డి
ప్రభుత్వసేవలో కొన్నిసార్లు నిబంధనలే ప్రతిబంధకాలవుతుంటాయి. ప్రభుత్వ వైద్యం అందాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఆ కార్డు ఉంటే చలువ దుస్తులు వేసుకున్న వారికి కూడా ఉచితవైద్యం చేయాలి. చిరిగిన దుస్తులతో కాళ్లు విరిగి వచ్చిన వారికి తెల్లకార్డు లేకపోతే ప్రభుత్వవైద్యం అందదు. ఇలాంటి సంఘటన ఎదురైన ప్రతిసారీ ఇదేం న్యాయం అని రామకృష్ణ మనసు రోదించేది. ఆ ఆవేదన నుంచి రూపొందినదే ‘అభయ వాలంటరీ ఆర్గనైజేషన్’.
కలాం కల... తేలిక కాలు!
అబ్దుల్ కలామ్ మదిలో మెదిలిన ఆలోచనే ఈ ఫ్లోర్ రియాక్షన్ ఆర్థోసిస్. జైపూర్ కాలు మూడున్నర కేజీల బరువు ఉంటుంది. కలాం ప్రయోగంతో 350 గ్రాముల కాలిపర్ తయారైంది. ఆ ప్రాజెక్టులో నేను కూడా పని చేశాను. ఆ అనుభవం వల్ల పేషెంటుకి సరిపోయే టైలర్‌మేడ్ కాలిపర్‌ని చేయించగలుగుతున్నాను.
- చేవూరి రామకృష్ణ, అభయ ఆర్గనైజేషన్ సెక్రటరీ