Mahabharatham
-
ఫోటోతో పాటు గుడ్ న్యూస్ చెప్పిన 'మహాభారతం' సీరియల్ అర్జునుడు
భారత ఇతిహాసాల్లో ఒకటిగా చెప్పుకునే మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని 'మహాభారతం' అనే సీరియల్ తెరకెక్కింది. హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో ఇది అందుబాటులో ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోలలో మహాభారతం కూడా ఒకటి. 269 ఏపిసోడ్స్ ఉన్న ఈ సీరియల్‌కు IMDb రేటింగ్ 9.0 ఉంది. మహాభారతం సీరియల్లో అర్జునుడిగా నటించిన హిందీ సీరియల్ నటుడు షహీర్ షేక్‌ను ఎవరూ మరచిపోలేరు. ఆయన మరోసారి తండ్రి అయ్యాడు. 2020లో రుచికా కపూర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ జంటకు ఒక పాప ఉంది. ఇప్పుడు మరో ఆడ శిశువుకు రుచికా జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. భారతీయ వెండితెర ప్రముఖ నటులలో ఒకరైన షహీర్ షేక్ తన చిరకాల స్నేహితురాలు రుచికా కపూర్‌ను మార్చి 2020లో వివాహం చేసుకున్నాడు. వారి మొదటి కుమార్తె అనయను 2021లో స్వాగతించారు. తమ పర్సనల్ లైఫ్‌ను ఎక్కువగా కెమెరా కళ్లకు దూరంగా ఉంచిన ఈ జంట ఈసారి తన జీవితంలోకి వచ్చిన కొత్త అతిథి గురించి షహీర్ భార్య రుచిక ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది. సోదరిని కలిగి ఉండటానికి మించిన గొప్పదనం నిజంగా ఏమీ లేదని రుచికా కపూర్ డిసెంబర్ 31 న తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. అక్కడ తన ఇద్దరు పిల్లల ఫోటోలను పోస్ట్ చేసింది. పెద్ద పాప పేరు అనయ అయితే రెండో కుమార్తె పేరు కుద్రత్ అని ఆమె తెలిపింది. తన చెల్లెల్ని అనయ ఎంతో ముద్దుగా కౌగిలించుకోవడం ఆ ఫోటోలో చూడవచ్చు. షహీర్ షేక్ త్వరలో బాలీవుడ్ చిత్రం అయిన డు పట్టి (Do Patti ) సినిమాలో నటి కృతి సనన్ సరసన నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజోల్ కూడా ఓ పాత్ర పోషించింది. కన్నికా ధిల్లాన్ కథను అందించిన ఈ చిత్రానికి శశాంక్ చతుర్వేది దర్శకత్వం వహించారు. షహీర్ షేక్ కుచ్ రంగ్ ప్యార్ కే ఐసా బీ, మహాభారత్, నవ్య, బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ, క్యా మస్త్ హై లైఫ్ మొదలైన హిందీ సీరియల్స్‌లో కూడా ఆయన నటించారు. అతని భార్య రుచిక ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా, మార్కెటింగ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఇది కాకుండా, ఆమె బాలాజీ మోషన్ పిక్చర్ డిప్యూటీ హెడ్‌గా కూడా పనిచేసింది. ఆమె ఉడ్తా పంజాబ్, ఏక్ విలన్ రిటర్న్, దొబారా వంటి చిత్రాలకు సహ దర్శకత్వం వహించింది. View this post on Instagram A post shared by Ruchikaa Kapoor Sheikh (@ruchikaakapoor) -
మహాభారతంలో సూర్య
-
తల్లి మాటలు విన్న భీముడు ఏం చేశాడు?
ప్రశ్న: తల్లి మాటలు విన్న భీముడు ఏం చేశాడు? జవాబు : కుంతిని వారి ఇంటికి పంపాడు ప్రశ్న: ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంది? జవాబు : వారి ఇల్లు అల్లకల్లోలంగా ఉంది. బంధువులు, జనులు అందరూ దుఃఖిస్తున్నారు. యజమాని కన్నీరు కారుస్తున్నాడు ప్రశ్న:యజమాని విలపిస్తూ బంధువులతో ఏమన్నాడు? జవాబు : నా భార్యను రాక్షసుడికి అర్పించాలి. ఆమె రక్షణ బాధ్యత నా మీద ఉంది. నా కూతురుని పంపలేను. ఆమెకు పెండ్లి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నా కుమారుడు చిన్నవాడు. వాడు వృద్ధిలోకి రావాలి. అందువల్ల నేనే రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అన్నాడు ప్రశ్న:యజమాని మాటలకు అతని భార్య ఏమంది? జవాబు : ఆపద వచ్చినప్పుడు విచారించకూడదు. ఎదిరించాలి. మీకు పుత్రులను ఇచ్చాను. నా ఋణం తీరింది. నేను ఉన్నప్పటికీ పిల్లల్ని పోషించలేను. మిమ్మల్ని వదిలి జీవించలేను. మీరు జీవించి ఉండాలి. నేను రాక్షసుడికి ఆహారంగా వెళ్తాను.. అంది ప్రశ్న: కూతురు ఏమంది? జవాబు : తల్లిదండ్రులారా! ఎంతకాలం ఉన్నా, నేను పరుల ఇంటికి వెళ్లవలసినదానిని. మీరు జీవించి ఉంటే, బిడ్డలను పొందవచ్చు. నేనే రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అంది ప్రశ్న: కుమారుడు ఏమన్నాడు? జవాబు : నేను రాక్షసుడిని చంపుతాను అంటూ కర్ర పట్టుకుని ఉరికాడు. అంత దుఃఖంలోనూ బాలుని మాటలు విని అందరూ నవ్వారు ప్రశ్న: అంతా విన్న కుంతి ఏం చేసింది? జవాబు : వారిని ఓదార్చి అసలు కథ అడిగింది. -
ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో
నిర్మాత ఎక్తా కపూర్ మహభారతాన్ని చంపేసిందంటూ నటుడు ముఖేష్ ఖన్నా ఆమెపై విరుచుకుపడ్డారు. 2008లో వచ్చిన ‘కహానీ హమారా మహాభారతం’ సీరియల్‌ను ఎక్తా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక లాక్డౌన్ నేపథ్యంలో ఈ సీరియల్ పునః ప్రసారం అవుతుంది. కాగా ముఖేష్ ఖన్నా హీరోగా నటించిన ‘శక్తిమాన్’ను కూడా పునః ప్రసారం చేయనున్నట్లు చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘శక్తిమాన్’ న్యూ వర్షన్‌ను మళ్లీ ప్రసారం చేయనున్నాం. అయితే ఇది ఎక్తా ‘మహాభారతం’ తరహాలో ఉండదు. ఈ సీరియల్లో ద్రౌపతి పాత్రకు భుజంపై టాటూ ఉంటుంది. అయితే ఎక్తా మహాభారతాన్ని ఆధునికంగా తీస్తున్నట్లు సీరియల్ మొదట్లోనే చెప్పారు. సంస్కృతి అనేది ఎప్పుటికీ ఆధునికమైనది కాదు.. కాలేదు కూడా. ఒకవేళ ఆధునికం చేయాలని ప్రయత్నించిన రోజే.. సంస్కృతి అంతమైపోతుంది’ అని మండిపడ్డారు. ఒకవేళ ఈ సీరియల్ పేరు ‘క్యుంకీ గ్రీక్ భీ కబీ హిందూస్థానీ’ అయుంటే తాను ఎక్తా ‘మహాభారతాన్ని’ సమర్థించేవాడినని అన్నారు. ఒక ఇతిహాసాన్ని మార్చే హక్కు వారికి ఎవరూ ఇచ్చారని విమర్శించారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడి కంటే ఎక్తా తెలివిగా ఉండాలని ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. రామయణం, మహాభారతాలు పురాణాలు మాత్రమే కాదని, అవి మన భారతదేశ చరిత్రలుగా ఎత్తిచూపాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. (మహాభారతం తిరిగి వచ్చేసింది) -
కరోనా వల్ల ఓ మంచి జరిగింది: నటుడు
అలనాటి పౌరాణిక సీరియల్స్ రామాయణం, మహాభారతాలు వీక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాయనడంలో అతిశయోక్తి లేదు. సుమారు మూడు దశాబ్దాల తరువాత తిరిగి ఇవి తిరిగి ప్రసారం కానున్నాయి. కరోనా భయంతో ఇంటిపట్టునే ఉన్న జనాలకు ఈ సీరియల్స్ తప్పకుండా ఊరట కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో మహాభారతంలో దుర్యోధనుడిగా కనిపించిన నటుడు పునీత్ ఇస్సార్ ప్రేక్షకులకు కొన్ని సూచనలు అందించాడు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకుగానూ ప్రతి ఒక్కరూ సామాజిక ఎడం పాటించాలని కోరాడు. తమ గృహంలో బయటి వారు లోపలికి రావడం కానీ, లోపలి వారు బయటకు వెళ్లడం కానీ పూర్తిగా నిషేధమని తెలిపాడు. మాలాగే అందరూ ఇంటి గడప దాటవద్దని సూచించాడు. అంతేకాకుండా.. తాము ఇంటి పనులను కూడా విభజించుకున్నట్లు తెలిపాడు. కరోనా పుణ్యమాని కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్నామని ఓ పాజిటివ్ అంశాన్ని సైతం చెప్పుకొచ్చాడు. పునీత్ మహాభారతం సీరియల్లో నటించడమే కాక దానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ డీడీ భారత్‌లో మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం ఏడింటికి గంట నిడివితో రెండు ఎపిసోడ్లు ప్రసారమవుతున్నాయి. దీనితోపాటు డీడీ నేషనల్లో రామాయణం ఉదయం తొమ్మిది గంటలకు ఒక ఎపిసోడ్, రాత్రి తొమ్మిదింటికి మరో ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ రెండూ కూడా మార్చి 28నుంచి ప్రారంభమయ్యాయి. (రామాయణ్ చూస్తున్నా.. మరి మీరు?) -
కిరాతార్జునీయం
పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయమది. తమ వద్దకు వచ్చిన వ్యాసమునీంద్రుని పాండవులు అర్ఘ్య పాద్యాదులతో పూజించిన తరువాత ఆయనతో ‘కౌరవులు మమ్మల్ని మాయ జూదంలో ఓడించారు. మమ్మల్ని అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికీ పంపించారు. శత్రుంజయులుగా పేరొందిన మాకే ఇప్పుడు శత్రుభయం పట్టుకుంది. మాకు తగిన తరుణోపాయం చెప్పండి’’ అని అడిగారు. అపుడు వ్యాసభగవానుడు ‘‘మీకు ఎంతమంది శత్రువులున్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కలగాలి. కాబట్టి అర్జునుని శంకరుని గురించి తపస్సు చేయమనండి. శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు పాశుపతాస్త్రం అడగండి. శంకరుడు దానిని మీకు ఇచ్చి విజయీభవ అని ఆశీర్వదిస్తే ఇక మీ విజయానికి తిరుగులేదు’’ అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వ్యాసుడి సూచన మేరకు అర్జునుడు శివారాధన చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఒక అడవిపందిని సృష్టించి దానిని అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు పంపాడు. అది అక్కడికి వెళ్లి రొద చేస్తోంది. ఆ ధ్వనికి కళ్ళు తెరిచి చూశాడు అర్జునుడు. వెంటనే తన విల్లందుకున్నాడు. ఈలోగా శివుడు అర్జునుడి వెనుక నుంచి అడవిపంది మీదకి వేసిన బాణం దాని పృష్ట భాగంలోంచి శరీరంలోకి వెళ్లి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేలమీద పడింది. సరిగ్గా అదే సమయంలో ఎక్కుపెట్టిన అర్జునుడి బాణం అడవి పంది నోట్లోంచి శరీరంలోకి వెళ్లి అక్కడనుంచి పృష్ఠభాగంలోంచి బయటకు వెళ్లి నేలమీద పడింది. శివుడు తన ప్రమథగణాలలో ఒకడిని పిలిచి తన బాణాన్ని తీసుకు రమ్మనమని చెప్పాడు. అతను వెళ్లి అర్జునునితో ‘ఈ బాణం మా నాయకుడిది. ఆయన గొప్ప వీరుడు. ఆయన బాణం తీశాడంటే ఎవరూ నిలబడలేరు. జాగ్రత్త’’ అన్నాడు కవ్వింపుగా.. ‘‘మీ నాయకుడు అంత మొనగాడయితే నాతో యుద్ధానికి రమ్మని చెప్పు’’ అన్నాడు అర్జునుడు. ఆ మాటకోసమే ఎదురు చూస్తున్నాడు కిరాతుడి రూపంలో ఉన్న శివుడు. కొండమీది నుంచి ఒక్క దూకు దూకి అర్జునుడి ముందు నిలబడి, ‘‘ఈ పందిని నువ్వు నీ బాణంతో కొట్టావా? ఏదీ ఇప్పుడు చూపు నీ విద్య’’ అన్నాడు. అర్జునుడు క్షణం ఆలస్యం చేయకుండా శివుని మీద బాణాలు ప్రయోగించడం ప్రారంభించాడు. శివుడు కూడా అర్జునుని మీదకు బాణాలు వేస్తున్నాడు. అర్జునుడు తన బలం అంతటినీ ఉపయోగించి శివుడిని పడగొట్టేందుకు యత్నిస్తున్నాడు. కానీ శివునికి ఏమీ అవడం లేదు. తర్వాత ఇద్దరూ మల్లయుద్ధం చేశారు. శంకరుడు అర్జునుని శరీరాన్ని తోసి అవతల పారేశాడు. అపుడు అర్జునుడు తిరిగి లేచి తన ధనుస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక గట్టి ప్రహారం చేశాడు. అపుడు శంకరుడు ఇక యుద్ధాన్ని చాలించి చంద్రవంకతో, పట్టుపుట్టంతో, పార్వతీ సమేతంగా అర్జునుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. మళ్ళీ కొడదామని గాండీవాన్ని ఎత్తిన అర్జునుడు తన ఎదుట సాక్షాత్కరించిన అర్ధనారీశ్వరుడి పాదాల మీద పడి శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి కన్నుల వెంట నీరు కార్చుతూ ‘‘ఈశ్వరా, జగత్తుకే తండ్రివయిన నీపై అజ్ఞానినై బాణాలు వేశాను. నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయింది’’ అని పరమేశ్వరుని పాదాల మీద పడిపోయాడు. అపుడు శంకరుడు ‘‘నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను. మీకు ఎదురులేదు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీరే గెలిచి తీరుతారు. విజయీభవ!’’అని ఆశీర్వదించాడు. ఇందులో మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే... ఆపదలో ఉన్న సమయంలో తగిన ఉపాయం చూపిన వాడే మనకు హితుడనీ, భగవంతుడు తన భక్తులకు అనేక పరీక్షలు పెట్టి, వాటిలో ¯ð గ్గినప్పుడే వరాలను అనుగ్రహిస్తాడనీ, అంతవరకూ మనం కుంగిపోకుండా కాలం పెట్టిన పరీక్షలలో నిగ్గు తేలాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
ద్రౌపదిగా వినిపిస్తా!
మహాభారతంలో ద్రౌపది పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ పాత్రలో వినిపించడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్ కథానాయిక శిల్పాశెట్టి. వావ్.. మరి ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? పాండవులుగా నటించేదెవరు? కౌరవుల మెయిన్ టీమ్ కౌన్? ఇలాంటి ప్రశ్నలు మీ మైండ్లోకి వస్తే వెంటనే ఫుల్స్టాప్ పెట్టండి. ఎందుకంటే.. ఇది సినిమానో, టీవీ సీరియలో, వెబ్ సిరీసో కాదు. రేడియోలో ‘మహాభారతం’ వినబోతున్నాం. ఇందులో ద్రౌపది పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు శిల్పా శెట్టి. ‘‘నాలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. చిన్నప్పుడు బీఆర్ చోప్రా మహాభారతం మాత్రమే టీవీలో చూసే చాన్స్ ఉండేది. అందులో ద్రౌపది పాత్ర చాలా బాగుంటుంది. ఈ పాత్రకు వాయిస్ అందిచ బోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శిల్పా. వెండితెరపై హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారామె. అలాగే బుల్లితెరపై కూడా సత్తా చాటారు శిల్పా. ఇప్పుడు రేడియో ప్లాట్ఫామ్లోకి ద్రౌపది పాత్రతో ఫస్ట్ టైమ్ ఎంట్రీ ఇస్తున్నారు. పదేళ్ల క్రితం వచ్చిన ‘ఆప్నే’ సినిమా తర్వాత శిల్పాశెట్టి మరో ఫుల్ లెంగ్త్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. -
‘అభినవ’ పురాణాలు
బీజేపీతో ఏకీభవించని వారితో నేను ఏకీభవించను. కారణం– మన భారతీయ సంప్రదాయానికీ ఆధునిక జీవనానికీ నిచ్చెనలు వేస్తున్న ఒకే ఒక పార్టీ బీజేపీగా నేను భావిస్తాను. ‘మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్!’ అని గిరీశం తొందరపడి తీర్పునిచ్చాడు కానీ అతను కాని బీజేపీలో ఉంటే తన మనస్సు మార్చుకునేవా డని నా గట్టి నమ్మకం. ఇందుకు గట్టి ఉదాహరణ నాకు ఇటీవలే ఉత్త రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ మాటల్లో దొరి కింది. ఆయన లాకాయి లూకాయి మంత్రి కాడు. ఉప ముఖ్యమంత్రి. ఆయన అన్నారు కదా మన జర్న లిజం పురాణ కాలం నుంచే ప్రారంభమైందని నొక్కి వక్కాణించారు. అంతేకాదు, ఇందుకు బలమైన ఉదా హరణలు ఇచ్చారు. మొదటి ఉదాహరణ: మన భగవద్గీత. ధృతరా ష్ట్రుడితో ఎలా చెప్పాడయ్యా సంజయుడు? చూసింది చూసినట్టు ఒక్క అక్షరం పొల్లు పోకుండా 700 శ్లోకా లను వినిపించాడు. మహా భారత యుద్ధం పంచ రంగులతో ఆయన దివ్య దృష్టికీ కనిపించడానికీ ఈనాటి మన ఐపాడ్లకీ చాలా దగ్గర సంబంధం ఉన్నదని సంజయుని కథనిబట్టి మనం అర్థం చేసు కోవాలి. అలాగే పురాణాల్లో అనాదిగా వస్తున్న పాత్ర– నారదుడు. ఆయన ఎక్కడ పడితే అక్కడికి– ఆయా కారణాలకి చటుక్కున వెళ్లే టెక్నిక్కీ నేటి ‘గూగుల్’కీ పోలికలు లేవా? అని ఆయన బహిరంగ సభలో ప్రశ్నించారు. ‘మీ దిక్కుమాలిన గూగుల్ ఇవాళ ప్రారంభమైంది. కానీ భారతదేశంలో గూగు ల్– పురాణకాలంలో–మహాభారతం రోజుల నాటికే ప్రారంభమైందని’ ఆయన బల్ల గుద్దారు. మనం రెండుసార్లు ‘క్లిక్’ నొక్కితే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి ఆయా సమా చారాల్ని తెలుసుకోవచ్చు. అది ఇవాళ్టి మాట. కానీ నారదుడు ‘నారాయణ, నారాయణ’ అని రెండుసార్లు అనడం ద్వారా– ఇటు ‘పారిజాతాపహరణా’న్ని, అటు ‘కృష్ణార్జున యుద్ధాన్ని’ నిర్వహిం చిన గొప్పతనాన్ని మరచిపోతున్నాం– అని వాక్రుచ్చారు. అలాగే రామాయణంలో మహాసాధ్వి సీత ‘టెస్ట్ ట్యూబ్’ నుంచి పుట్టిందని సోదాహరణంగా వివరిం చారు. ఆ లెక్కన ద్రోణుడు యజ్ఞాలు చేసే దోనెలో అతని వీర్యం పడగా పుట్టాడని పురాణం. యజ్ఞాల వేళల్లో వీర్యానికి ఏం అగత్యమున్నదో మనకు తెలీదు, ఏమైనా మన పురాణాల నిండా అడ్డమైన వాళ్లూ అడ్డమైన పద్ధతుల్లో పుట్టారు. ఈ విధానాలకీ, ఆధునిక జీవన విధానానికీ ఒక సాపత్యాన్ని వెదికిన సెకండరీ, హయ్యర్, సైన్స్ సాంకేతిక శాఖల మంత్రి గారి ‘ఆలోచనా సరళి’ని కొట్టి పారేయడానికి వీలు లేదు. ఇవన్నీ చాలా గొప్ప పరిశీలనలుగా నేను భావి స్తున్నాను. ఈ లెక్కన స్టీవ్ జాబ్స్ ఏ శూద్రక మహర్షో, బిల్ గేట్స్ కిందటి జన్మలో ఏ శుక మహర్షో అయి ఉంటారని నాకు గట్టి నమ్మకం. లేకపోతే– ఇంతగా ప్రపంచాన్నంతటినీ ఆకర్షించగల ప్రయోగా లను చెయ్యలేరు. నాకు మొదటినుంచీ శ్రీనాథుడిమీద ఈ నమ్మకం ఉండేది. నిజానికి ‘ఆధునిక కవులలో అద్భుతమైన పాత్రికేయుడు శ్రీనాథుడు’ అనే విషయం మీద పరిశోధన జరగాలని నా గట్టి నమ్మకం. ఆయన ‘కాశీఖండము’, ‘భీమ ఖండము’ వంటి మహా రచనలు చేస్తూనే– ఆంధ్ర దేశ మంతా తిరిగి– ఆయా ప్రాంత ఆహార విశేషాల గురించి చెప్పుకుపోయాడు. ఏమైనా కొన్ని తరాలు, శతాబ్దాలు, మళ్లీ మాట్లాడితే యుగాల కిందటి వాస్తవాలను మనకి పంచిన ఘనత బీజేపీది కాక ఇంకెవరికి ఉంటుంది? అని నాకు గర్వపడాలనిపిస్తుంది. మరి మన మహా భారతంలో విమానాలు న్నాయి. వాటిని మన ‘ఎయిర్ ఇండియా’ విమానా లతో పోల్చవచ్చునేమో. కాలదోషం పట్టి వాటిని ప్రస్తుతం ఎవరూ కొనుగోలు చెయ్యడం లేదు. అలాగే హఠాత్తుగా ఆడవారుగా మారిపోయిన మగ వారూ, మగవారిగా మారిపోయిన ఆడవారూ, నపుంసకులూ ఉన్నారు. మన కాలంలో వారు ఎవరో పోల్చవలసిన అవసరం బీజేపీ నాయకులకి ఉంది. ఏమైనా డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని కాల దన్నేలాగ– మన సంస్కృతికీ, పౌరాణిక సంస్కృతికీ నిచ్చెనలు వేయగలిగిన ఆలోచనా పటిమ, స్వదేశీ అభిమానం ఉన్న పార్టీగా నేను బీజేపీని గుర్తిస్తు న్నాను. రాబోయే ఎన్నికలలో తప్పనిసరిగా నా ఓటు బీజేపీకి వెయ్యబోతున్నానని ఇప్పుడే హామీని ఇస్తు న్నాను. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
300 కోట్లతో మరో ‘మహాభారతం’
సినిమా కథలను ఎక్కువగా పురాణాల నుంచి ఇన్స్పైర్ అయ్యే తయారుచేసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో పౌరాణిక, జానపద కథలను సినిమాలుగా తెరకెక్కించాలన్న ఆసక్తి దర్శక నిర్మాతల్లో పెరుగుతోంది. బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలు ఘనవిజయాలు సాధించటంతో చాలా మంది సినీ ప్రముఖులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. దర్శకధీరుడు రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కించటం తన జీవితాశయమని ఇప్పటికే ప్రకటించేశారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా కృష్ణుడి కోణంలో మహాభారతాన్ని రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో భీముడి కోణంలో మరో మహాభారతం సిద్ధమవుతోంది. తాజాగా మరో దక్షిణాది నటుడు మహాభారత గాథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. విలక్షణ నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో ఆర్ఎస్ విమల్ దర్శకత్వంలో కర్ణుడి కోణంలో మహాభారతాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా ఈ సినిమాను మలయాళ నటుడు పృథ్వీరాజ్ హీరోగా 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని భావించారు. కానీ ప్రాజెక్ట్ విక్రమ్ చేతికి రావటంతో బడ్జెట్ రేంజ్ కూడా మారిపోయింది. యునైటెడ్ ఫిలిం కింగ్ డమ్ అనే అమెరికా నిర్మాణ సంస్థ ఈ సినిమాను 300 కోట్లతో నిర్మించేందుకు ముందుకొచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ రెడీ కావటంతో ఇటీవల దర్శకుడు విమల్ స్క్రిప్ట్‌కు శబరిమల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2019 చివరికల్లా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దాదాపు 32 భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. -
అచ్యుతుడు
సదాచారం నుండే ధర్మం పుడుతుంది. ధర్మాన్ని తెలుసుకోవాలంటే సదాచారం మూలంగానే తెలుసు కోవాలి. ఈ సదాచారానికి నియామకుడు అచ్యుతుడు. ‘ఆచార ప్రభవో ధర్మః – ధర్మస్య ప్రభురచ్యుతః’ అని శ్లోకం. ఎవడైతే ఏ దశలోనూ తన స్వభావం నుంచి పక్కకు తొలగిపోడో (జారిపోడో) అతడే అచ్యుతుడు. శ్రీహరి తాను ఏ పరిస్థితిలోనూ ఇచ్చిన మాట నుంచి పక్కకు తొలగను, ప్రతిజ్ఞా పరిపాలన నిమిత్తం దేనినైనా, ఎవరినైనా వదులుకుంటానుకానీ ప్రతిజ్ఞను మరవనని పలు సందర్భాలలో తెలిపాడు. తన ప్రతిజ్ఞను నెరవేర్చుకునేందుకు స్థిరంగా ఉండే పరమాత్మ తన భక్తుని ప్రతిజ్ఞను నిలబెట్టే విష యంలో మరింత దృఢచిత్తంతో వ్యవహరిస్తాడు అన డంలో ఎట్టి సందేహం లేదు. భక్తుని ప్రతిజ్ఞను నెరవేర్చే క్రమంలో తమ ప్రతిజ్ఞను వదులుకోవడానికి సిద్ధపడే పరమాత్మ భక్తవత్సలుడుగా ప్రసి ద్ధిని పొందాడు. భారత యుద్ధ సమయంలో ఆయుధాన్ని పట్టను అని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేసినా, ఆయుధం పట్టిస్తాననే భీష్మాచార్యులవారి ప్రతిజ్ఞను నెరవేర్చడానికి రథ చక్రాన్ని చేత బూనాడు. శ్రీరాముడు సత్యవాక్పరిపాల కుడని అతని భక్తులు చేసిన ప్రతి జ్ఞను శ్రీరాముడు వెంటనే సాకా రమొందిస్తాడని తెలుపడానికే వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలోని యుద్ధ కాండలో... ‘‘ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశ రథిర్యది /పౌరుషేచాప్రతిద్వందః శరైనం జహి రావ ణిమ్.. అనే లక్ష్మణుని ప్రతిజ్ఞను పొందుపరిచాడు. దశరథ పుత్రుడైన నా అన్న శ్రీరాముడు ధర్మా త్ముడైతే, సత్యసంధుడైతే, పౌరుషంలో సాటిలేనివా డైతే, నేను ప్రయోగించే ఈ బాణం రావణపుత్రుడైన ఇంద్రజిత్తును వధించుగాక అని లక్ష్మణుడు బాణప్ర యోగం చేశాడు. ఇంద్రజిత్తు హతుడయ్యాడు. యుద్ధభూమిలో తనకు అత్యంత ప్రియుడైన పాండవ మధ్యముడైన అర్జునునితో ‘కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణశ్యతి’ ఓ కుంతీ పుత్రుడా! నా భక్తుడు వినాశమును పొందడు అనే ప్రతిజ్ఞను చేయి అని శ్రీకృష్ణుడు పేర్కొన్న విషయాన్ని వ్యాసమహర్షి మహా భారతంలోని భగవద్గీతలో ఆవిష్కరించాడు. మహాభారతంలోని శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర ఉత్తర పీఠికలోని ‘న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్’ వాసుదేవుని పరమభక్తులైన వారికి అశుభములు ఏర్పడవు అనే విషయం ద్వారా శ్రీ మహా విష్ణువు యొక్క భక్త రక్షణ తత్పరతను వ్యాసమహర్షి పేర్కొన్నాడు. తన ప్రతిజ్ఞ నుండి భక్త రక్షణ స్వభావం నుండి పక్కకు తొలగని భక్తజన ప్రతిజ్ఞను నెరవేర్చు టలో ఆలస్యం చేయని అచ్యుతుణ్ణి ఆరాదిద్దాం. అంతు లేని ఆనందాన్ని అందుకుందాం. – సముద్రాల శఠగోపాచార్యులు -
మహాబలి
బాహుబలి చూస్తిరా? అంతకంటే పెరియ (పెద్ద) సినిమా చూస్తరా? బాహుబలి కంటే మహాబలి లాంటి సినిమాలు ఇండియాలో హాల్చల్ చేయబోతున్నాయి. బోట్లలో నింపినా సరిపోవు. అన్ని దుడ్లు... మునుగుతాయా? తేలతాయా? చూస్తమా? వెయ్యి కోట్ల భీముడు భీముడు బలవంతుడా లేక బాహుబలినా! అయినా ఆ పోలికేంటి? భీముడు రియల్ క్యారెక్టర్. బాహుబలి రీల్ క్యారెక్టర్ కదా అనుకుంటున్నారా? కరెక్టే. అయితే ఈ ఇద్దరి బలానికి పోలిక పెట్టింది రీల్ వైజ్‌గానే. బడ్జెట్ వైజ్‌గా ఎవరు పెద్ద అంటే. నిన్న మొన్నటి వరకూ ‘బాహుబలి’ పెద్ద. ఇప్పుడు భీముడే బిగ్. ‘బాహుబలి’ రెండు పార్ట్స్ బడ్జెట్ దాదాపు 300 కోట్లు. మరి భీముడికి అయ్యే బడ్జెట్ ఎంతో తెలుసా? 1000 కోట్లండి బాబు. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో జ్ఞానపీuŠ‡ అవార్డుగ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రాసిన బుక్ ఆధారంగా ‘మహాభారతం’పై ఈ సినిమా తీయడానికి బీఆర్ శెట్టి అనే బిలియనీయర్ రెడీ అయ్యారు. భీముడి క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఈ సినిమాకయ్యే బడ్జెట్ 1000 కోట్లు. టైటిల్ రోల్‌ని మోహన్‌లాల్ చేయబోతున్నారు. కర్ణుడి పాత్రలో నాగార్జున కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయం తెలియడానికి ఇంకా టైమ్ పడుతుంది. మోహన్‌లాల్ మాత్రం భీముడిగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. ‘‘రెండు పార్ట్స్‌గా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మొదటి పార్ట్‌ను విడుదల చేసిన, నెక్ట్స్ 90 డేస్ తర్వాత సెకండ్ పార్ట్‌ను రిలీజ్ చేస్తాం’’ అని వాసుదేవన్ నాయర్ అన్నారు. యూనిట్ అనుకున్నట్లుగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళితే.. దేశంలో 1000కోట్లతో నిర్మించిన తొలి సినిమా ఇదే అవుతుంది. వెయ్యి కోట్లా? తీసినవాళ్లు, కొన్నవాళ్లు ‘సేఫ్’ అవుతారా? అంటే.. టూ పార్ట్స్, మల్టీస్టారర్, మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్.. మునిగే చాన్సే లేదని ఊహించవచ్చు. 500 కోట్ల రామాయణం రామబాణానికి తిరుగులేదంటారు. అందుకే భీముడు గదతో బాక్సాఫీసు దగ్గరకు వస్తుంటే.. విల్లును ఎక్కుపెట్టి నేనూ వస్తున్నా అంటున్నాడు రాముడు. రామాయణం అంటే సీతను అడవులపాలు చేసిన రాముడు అని ఈతరం వారు అనుకుంటారు. కొందరకి అది కూడా తెలియకపోవచ్చు. ఇలాంటి టైమ్‌లో రామాయణం వస్తే? అబ్బో.. బడ్జెట్ బోలెడంత అవుతుంది. అయినా ఓకే అంటూ అల్లు అరవింద్ రామాయణం ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి త్రీ పార్ట్స్‌గా ఆయన ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. రాముడు ఎవరంటే రామ్‌చరణ్ అట. అంతేకాదు.. మెగా కాంపౌండ్‌కి చెందిన హీరోలు కీలక పాత్రల్లో కనిపిస్తారని టాక్. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఇలాంటి వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఇంతకీ రాముడు ఎప్పుడు కెమెరా ముందుకు వస్తాడు? దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి నో క్లారిటీ. ‘‘రామాయణం వంటి సినిమాను నిర్మించాలంటే ఎంతో బాధ్యతగా ఉండాలి. బిగ్ స్రీన్‌పై చూపించడం అంత ఈజీ కాదు. అందుకే పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాం’’ అని అల్లు అరవింద్ అప్పట్లో అన్నారు. సో... 500 కోట్లు వర్కవుట్ అవుతుందా అంటే... త్రీ పార్ట్స్ బాస్. పైగా పర్ఫెక్ట్ ప్లానింగ్ కూడా. రాముడికి తిరుగుండకపోవచ్చు. 300 కోట్ల కర్ణుడు కర్ణుడి దానగుణం ఎంత గొప్పది? ప్రాణాలనైనా తృణప్రాయంగా ఇచ్చేంత గొప్పది. మరి కురుక్షేత్ర రణరంగంలో దుష్టులైన కౌరవుల వైపు ఎందుకు ఉండాల్సి వచ్చింది? పాండవులకు కర్ణుడు ఎందుకు వ్యతిరేకం అయ్యారంటే చరిత్ర తెలుసుకోవాలి. మలయాళ దర్శకుడు ఆర్. ఎస్. విమల్ ఆ పని మీదే ఉన్నారు. విక్రమ్ టైటిల్ రోల్లో ఆయన ‘మహావీర్ కర్ణ’ అనే సినిమా తీయబోతున్నారు. 300 కోట్ల రూపాయలతో యునైటెడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ‘‘రెండేళ్లుగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా. కొన్ని సీన్లు రీ–రైట్ కూడా చేశా. తమిళ్, హిందీ భాషల్లో తీసి, మిగతా భాషల్లో డబ్ చేయాలనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ లెవల్లో యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్‌ని తీసుకోబోతున్నాం’’ అన్నారు విమల్. డైరెక్టరే చెప్పేశారుగా.. ఇంటర్నేషనల్ లెవల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అని.. ఇంకేం? బొమ్మ మునిగే చాన్సే లేదు. 400 కోట్ల రోబో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్ రికార్డుల గురించి చెప్పుకోవాలంటే ప్రజెంట్ బాహుబలి, దంగల్ వసూళ్ల నుంచి స్టార్ట్ చేయాలి. ‘‘హలో... ఫ్యూచర్లో మా గురించి కూడా చెప్పుకుంటారు’’ అంటున్నారు ‘2.0’ టీమ్. ‘రోబో’కి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్ డేట్స్‌లో కాస్త అయోమయంగా ఉన్నా కలెక్షన్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో దూసుకెళ్లేలా మార్కెట్‌ను రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే వంద కోట్లకు పైగా శాటిలైట్ రైట్స్‌ను దక్కించుకున్నారు. రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీజాక్సన్ ముఖ్యతారలుగా సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇండియన్ సినిమాల్లో ఇప్పటికి ఇది హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. ఆల్రెడీ శాటిలైట్, ఇతర హక్కుల రూపంలో 150 కోట్లు వచ్చేశాయట. రోబో మునిగే చాన్సే లేదు. టోటల్ కలెక్షన్స్ మిగతా సినిమాలకు షాక్ ఇస్తాయేమో! వెయిట్ అండ్ సీ. 250 కోట్ల సంఘమిత్ర బాక్సాఫీసుపై యుద్ధం చేయడానికి భీముడు, రాముడు, కర్ణుడు రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు తలపడటానికి ఓ రాణి రెడీ అవుతోంది. పేరు... సంఘమిత్ర. 250కోట్ల ఖర్చుతో దండయాత్రకు రెడీ అవుతున్నారు సంఘమిత్ర. లేడీని నమ్మి 250 కోట్లు ఖర్చుపెడుతున్నారా? అంటే.. హలో... ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘డర్టీ పిక్చర్’, ‘క్వీన్’.. ఇలా చాలా సిన్మాలున్నాయి. ఒకట్రెండు మినహా అన్నీ ఆల్మోస్ట్ లాభాలు తెచ్చినవే. ఆ ఒకటీ రెండూ సినిమాలూ ‘భేష్’ అనిపించుకున్నాయి. ఇక.. ‘సంఘమిత్ర’ గురించి చెప్పాలంటే.. ముందు శ్రుతీహాసన్ ఒప్పుకుని ఆ తర్వాత తప్పుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులకు సీన్లోకి దిశా పాట్నీ వచ్చారు. సుందర్. సి దర్శకత్వంలో తేనాండాళ్ ఫిలమ్స నిర్మిస్తున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య కీలక పాత్రలు చేయనున్నారు. ఎప్పుడో అనౌన్స్ చేసినా ఇంకా ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో సంఘమిత్ర దండయాత్రకు స్టార్టింగ్ ప్రాబ్లమా? అనే డౌట్స్ వచ్చాయి. సినిమా లేట్ అవుతున్నది స్టార్టింగ్ ప్రాబ్లమ్ వల్ల కాదని, ప్రిపరేషన్ ప్లాన్ వల్ల అని అంటున్నారు చిత్రబృందం. ‘‘ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్‌కి చాలా టైమ్ పట్టింది. చిన్న చిన్న మార్పులు చేస్తున్నాం. గ్రాఫిక్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ లేదా మేలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని సుందర్ సి. స్పష్టం చేశారు. ఇది ట్రైలింగ్వుల్ మూవీ. పెట్టిన పెట్టుబడిని ‘సంఘమిత్ర’ సునాయాసంగా లాగేస్తుంది సారూ. సోనమ్ భారతం బీటౌన్‌లో మహాభారతం సినిమాపై మోస్ట్ ఇంట్రస్టెడ్ యాక్టర్ ఎవరంటే.. ఆమిర్ ఖాన్ అని చెప్పేయొచ్చు. మరి.. యాక్ట్రస్ విషయానికొస్తే సోనమ్ కపూర్. భారతంలో నటించడానికి ఆమిర్ ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు సోనమ్ కపూర్ అయితే ఏకంగా ఈ నేపథ్యంలో వచ్చిన పుస్తకాల రైట్స్ కూడా కొనేశారు. మహాభారతంపై ‘ఆర్యావతార క్రానికల్స్’ అనే టైటిల్‌తో మూడు పార్ట్స్‌గా బుక్ రచించారు ఉదయశంకర్. అందులో ఫస్ట్ పార్ట్ ‘గోవింద’ రైట్స్‌ను సోనమ్ కపూర్ కొన్నారు. దీంతో మహాభారతంపై సినిమా తీయడానికి సోనమ్ రెడీ అయ్యారన్న వార్తలు వచ్చాయి. ‘‘మహాభారతం గొప్ప కథ. ఇందులో ఏ క్యారెక్టర్ చేస్తానో ప్రస్తుతం నాకు తెలీదు’’ అని సోనమ్ పేర్కొన్నారు. సో.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళితే బడ్జెట్ రెండు వందల కోట్ల పైనే ఉంటుందని ఊహించవచ్చు. 200 కోట్లకు దగ్గరగా.. ఆల్రెడీ విడుదలకు సిద్ధమైన చిత్రాల్లో ‘పద్మావత్’ బడ్జెట్ దాదాపు 180 కోట్లు అని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్ ముఖ్య పాత్రలో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే పలు వివాదాలు, పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. రెండో ఇండియన్ @ 180 కోట్లు శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన ‘భారతీయుడు’ అప్పట్లో ఓ సంచలనం. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ ని ప్లాన్ చేస్తున్నారు. కమల్ నటిస్తారు. శంకర్ తెరకెక్కిస్తారు. ‘దిల్’ రాజు తీస్తారనే వార్త వచ్చింది. అయితే ‘దిల్’ రాజు తప్పుకున్నారు. ఫస్ట్ పార్ట్ నిర్మించిన ఎ.యం. రత్నం నిర్మించడానికి రెడీగా ఉన్నారట. ఇక, శంకర్ ప్లాన్ చేయడం, కమల్ డేట్స్ లాక్ చేయడమే ఆలస్యం. ఈ చిత్రానికి 180 కోట్లు బడ్జెట్ అవుతుందట. ‘భారతీయుడు’పై ఉన్న క్రేజ్ సీక్వెల్‌కి వర్కవుట్ అవు తుంది. సో.. రెండో భారతీయుడు వసూళ్లు ఇరగదీస్తాడని అంచనా వేయొచ్చు. -
భారీ సినిమాకు మోదీ మద్దతు..!
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో మహాభారత కథ సినిమా తెరకెక్కించేందుకు మలయాళ పరిశ్రమ సిద్ధమవుతోంది. ఎమ్టీ వాసుదేవన్ రాసిన రంథమూలం నవల ఆధారంగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకా సెట్స్ మీదకు కూడా వెల్లని ఈ సినిమాపై అప్పుడూ వివాదాలు మొదలయ్యాయి. కేరళకు చెందిన హిందూ ఐక్య వేది అనే సంస్థ ఈ సినిమాకు మహాభారతం అనే టైటిల్‌ను పెట్టడాన్ని వ్యతిరేకిస్తోంది. ఆ టైటిల్ కేవలం వ్యాసుడికే సొంతమని.. ఆ పేరుతో ఎవరు సినిమా చేసిన అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది. ఈ సమయంలో అనూహ్యం చిత్రయూనిట్‌కు దేశ ప్రధాని మోదీ మద్దతు లభించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ ఆఫీసు నుంచి చిత్రయూనిట్‌ను అభినందిస్తూ ఓ లేక వచ్చిందని, దేశానికే గర్వకారణమైన సినిమాను తెరకెక్కిస్తుంన్నందుకు ఆయన యూనిట్ సభ్యులను అభినందించినట్టుగా చెపుతున్నారు. అంతేకాదు మహాభారతం యూనిట్‌కు మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. -
600 కోట్లతో 'మహాభారతం'
విజువల్ ఎఫెక్ట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఫిలిం మేకర్స్ దృష్టి పౌరాణిక, చారిత్రక కథాంశాల మీద పడింది. బాహుబలి లాంటి ఫాంటసీ ఘనవిజయం సాధించటంతో అదే తరహా చిత్రాలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాజమౌళి.., బాహుబలి తరువాత మహాభారత గాథను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రకటించాడు. అయితే ఇదే కథను వెండితెరకెక్కించేందుకు మరో నటుడు కూడా రెడీ అవుతున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మహాభారత గాథను 600 కోట్లతో బడ్జెట్‌తో సినిమాగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ మహాభారతంలోని ముఖ్య ఘట్టాలతో రాసిన రంధమూలం అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. భీముడు ప్రధాన పాత్రగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మోహన్ లాల్ భీముడుగా నటించనున్నాడట. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే భీష్ముడిగా అమితాబ్, ద్రౌపదిగా ఐశ్వర్యరాయ్, అర్జునుడిగా విక్రమ్‌లను నటింపచేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరో ప్రధాన పాత్రకు టాలీవుడ్ కింగ్ నాగార్జునను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. మరి ఇంత భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న మహాభారతం ఎప్పటికి పట్టాలెక్కుతుందో చూడాలి. -
విజ్ఞాన సర్వస్వం.. మహాభారతం
నన్నయ భట్టారక జయంతి సభలో వక్తలు రాజమహేంద్రవరం కల్చరల్ : మహాభారతం విజ్ఞాన సరస్వస్వమని ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు అన్నారు. సాహితీ శరత్ కౌముది ఉత్సవాల్లో భాగంగా మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి స్థాపించిన శరన్మండలి ఆధ్వర్యాన.. ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన నన్నయ భట్టారక జయంతి సభలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆయన నన్నయ కవిత్వంపై ప్రసంగించారు. ‘‘కాంతాసమ్మితంగా భారత రచన సాగింది, భార్య.. భర్తకు నచ్చజెప్పినట్టుగా అటు వ్యాసుడు, ఇటు కవిత్రయం మనకు భారతాన్ని అందించారు. భారతం నీతిశాస్త్రం, మహాకావ్యం, ఇతిహాసం, బహుపురాణ సముచ్ఛయం, ధర్మశాస్త్రం. ఎవరు ఏ దృష్టితో చూస్తే వారికి ఆ దృష్టిలోనే గోచరిస్తుంది. మహాభారతంలో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది. ఇందులేనిది మరెక్కడా ఉండదు’’ అని అన్నారు. దీని ఆంధ్రీకరణలో మానవజాతికి నన్నయ అద్భుతమైన నీతులు అందించాడని చెప్పారు. ‘‘మనం చేసే పనులను ఎవరూ చూడట్లేదని అనుకోవద్దు. మనం చేసే ప్రతి పనినీ సూర్యచంద్రులు, పంచభూతాలు, యముడు, ఉభయ సంధ్యలు, మనస్సు, ధర్మదేవతలు గమనిస్తూనే ఉంటారని శకుంతల పాత్ర ద్వారా నన్నయ తెలియచేసాడు’’ అన్నారు. జన్మనిచ్చినవాడు, అన్నం పెట్టినవాడు, భయాన్ని తొలగించేవాడు స్త్రీకి గురువులైతే, వీరితోపాటు విద్య నేర్పినవాడు, ఉపనయనం చేసినవాడు పురుషుడికి గురువులని వివరించారు. ‘జగద్ధితంబుగ¯ŒS’ భారతాంధ్రీకరణ చేసినట్టు నన్నయ చెప్పుకున్నాడని, దీని అర్థం జగత్తు హితం కోసమే ఈ రచన చేసినట్టని అన్నారు. ‘శారద రాత్రులు..’ నన్నయ చివరి పద్యంగా భావించాలని రాఘవేంద్రరావు చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్ నరసింహారావు మాట్లాడుతూ, భారతాంధ్రీకరణను రాజరాజుకు నన్నయ అంకితమిచ్చినట్టు ఆంధ్రభారతంలో ఎక్కడా లేదన్నారు. చిలకమర్తి ఫౌండేష¯ŒS వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాథ్ మాట్లాడుతూ, రుషులు ద్రష్టలు, స్రష్టలు అని చెప్పారు. భవిష్యత్తును చూడగలిగినవాడు ద్రష్ట అయితే, కలకాలం నిలిచిపోయే పాత్రలను సృష్టించినవాడు స్రష్ట అని వివరించారు. తొలుత కళాశాల ప్రాంగణంలోని ప్రకాశం, నన్నయ భట్టారకుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి తనయులు మధునామూర్తి, సుబ్రహ్మణ్యం, మేనల్లుడు కామరాజు, సోదరుని కుమారుడు సత్యనారాయణమూర్తి, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కళాశాల కరస్పాండెంట్ అసదుల్లా అహమ్మద్, డాక్టర్ బీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.