సదాచారం నుండే ధర్మం పుడుతుంది. ధర్మాన్ని తెలుసుకోవాలంటే సదాచారం మూలంగానే తెలుసు కోవాలి. ఈ సదాచారానికి నియామకుడు అచ్యుతుడు. ‘ఆచార ప్రభవో ధర్మః – ధర్మస్య ప్రభురచ్యుతః’ అని శ్లోకం. ఎవడైతే ఏ దశలోనూ తన స్వభావం నుంచి పక్కకు తొలగిపోడో (జారిపోడో) అతడే అచ్యుతుడు. శ్రీహరి తాను ఏ పరిస్థితిలోనూ ఇచ్చిన మాట నుంచి పక్కకు తొలగను, ప్రతిజ్ఞా పరిపాలన నిమిత్తం దేనినైనా, ఎవరినైనా వదులుకుంటానుకానీ ప్రతిజ్ఞను మరవనని పలు సందర్భాలలో తెలిపాడు.
తన ప్రతిజ్ఞను నెరవేర్చుకునేందుకు స్థిరంగా ఉండే పరమాత్మ తన భక్తుని ప్రతిజ్ఞను నిలబెట్టే విష యంలో మరింత దృఢచిత్తంతో వ్యవహరిస్తాడు అన డంలో ఎట్టి సందేహం లేదు. భక్తుని ప్రతిజ్ఞను నెరవేర్చే క్రమంలో తమ ప్రతిజ్ఞను వదులుకోవడానికి సిద్ధపడే పరమాత్మ భక్తవత్సలుడుగా ప్రసి ద్ధిని పొందాడు. భారత యుద్ధ సమయంలో ఆయుధాన్ని పట్టను అని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేసినా, ఆయుధం పట్టిస్తాననే భీష్మాచార్యులవారి ప్రతిజ్ఞను నెరవేర్చడానికి రథ చక్రాన్ని చేత బూనాడు.
శ్రీరాముడు సత్యవాక్పరిపాల కుడని అతని భక్తులు చేసిన ప్రతి జ్ఞను శ్రీరాముడు వెంటనే సాకా రమొందిస్తాడని తెలుపడానికే వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలోని యుద్ధ కాండలో... ‘‘ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశ రథిర్యది /పౌరుషేచాప్రతిద్వందః శరైనం జహి రావ ణిమ్.. అనే లక్ష్మణుని ప్రతిజ్ఞను పొందుపరిచాడు. దశరథ పుత్రుడైన నా అన్న శ్రీరాముడు ధర్మా త్ముడైతే, సత్యసంధుడైతే, పౌరుషంలో సాటిలేనివా డైతే, నేను ప్రయోగించే ఈ బాణం రావణపుత్రుడైన ఇంద్రజిత్తును వధించుగాక అని లక్ష్మణుడు బాణప్ర యోగం చేశాడు. ఇంద్రజిత్తు హతుడయ్యాడు.
యుద్ధభూమిలో తనకు అత్యంత ప్రియుడైన పాండవ మధ్యముడైన అర్జునునితో ‘కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణశ్యతి’ ఓ కుంతీ పుత్రుడా! నా భక్తుడు వినాశమును పొందడు అనే ప్రతిజ్ఞను చేయి అని శ్రీకృష్ణుడు పేర్కొన్న విషయాన్ని వ్యాసమహర్షి మహా భారతంలోని భగవద్గీతలో ఆవిష్కరించాడు. మహాభారతంలోని శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర ఉత్తర పీఠికలోని ‘న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్’ వాసుదేవుని పరమభక్తులైన వారికి అశుభములు ఏర్పడవు అనే విషయం ద్వారా శ్రీ మహా విష్ణువు యొక్క భక్త రక్షణ తత్పరతను వ్యాసమహర్షి పేర్కొన్నాడు. తన ప్రతిజ్ఞ నుండి భక్త రక్షణ స్వభావం నుండి పక్కకు తొలగని భక్తజన ప్రతిజ్ఞను నెరవేర్చు టలో ఆలస్యం చేయని అచ్యుతుణ్ణి ఆరాదిద్దాం. అంతు లేని ఆనందాన్ని అందుకుందాం.
– సముద్రాల శఠగోపాచార్యులు
Comments
Please login to add a commentAdd a comment