Lord sri krishna
-
ప్రముఖ దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీళ్లు.. తాగేందుకు ఎగబడుతున్న భక్తులు
ప్రజల్లో దైవ భక్తి రోజురోజుకి శృతి మించుతోంది. ప్రముఖ దేవాలయంలో ఏర్పాటు చేసిన ఏసీల నుంచి కారే నీటిని తాగుతున్నారు. ఒంటిపై చల్లుకుని పునీతులం అయ్యామని తెగ సంబరపడిపోతున్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వ్రిందావన్ నగరంలో ప్రముఖ ప్రసిద్ధ ‘బాంకే బిహారీ’ అనే శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. అయితే ఆ దేవాలయంలో దైవ దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. వస్తూ.. వస్తూ తమ వెంట టీ తాగే కప్పులను తెచ్చుకుంటున్నారు. శ్రీకృష్ణుడి దర్శనం అనంతరం గుడికి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీటిని దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు.Serious education is needed 100%People are drinking AC water, thinking it is 'Charanamrit' from the feet of God !! pic.twitter.com/bYJTwbvnNK— ZORO (@BroominsKaBaap) November 3, 2024ఆ నీటిని టీ కప్పుల్లో నింపుకున్న భక్తులు తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంతమంది భక్తులు నీటిని సేకరించడానికి కప్పులను ఉపయోగిస్తుండగా.. మరికొందరు చేతిలో తీర్ధం తీసుకున్నట్లుగా ఏసీ నుంచి కారే నీటిని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వెలుగులోకి వచ్చిన పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆలయ నిర్మాణ సమయంలో ఏసీలను ఏర్పాటు చేశారు. ఆ ఏసీల నుంచి కారే నీటిని బయట విడుదలయ్యేలా ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాలను అమర్చారు. ఇప్పుడు ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాల ద్వారా విడుదలవుతున్న నీటినే భక్తులు తాగుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో.. వీడియోలు తీసిన వారు.. ఏనుగు శిల్పం నుంచి ఏసీ విడుదల చేసే నీరు కారుతుందని చెబుతున్న మాటలు వినబడుతున్నాయి. అయినప్పటికీ అనేక మంది ఆలయానికి వెళ్లేవారు నీటిని తాగడం లేదంటే తమపై చల్లుకోవడం చేస్తున్నారు. మరికొందరు ఏనుగు శిల్పం నోటి నుండి కారుతున్న 'చరణ్ అమృతం’ (దేవుడు తమని ఆశీర్వదిస్తున్నారనే సూచికగా) భావిస్తున్నారు. శ్రీకృష్ణుడి పాదాల నుండి వస్తున్న పవిత్ర జలం అంటూ భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.PLEASE DO NOT DRINK AIR CONDITIONING WATER!Cooling and air conditioning systems are breeding grounds for many types of infections including fungus, some really hellish. Exposure to air conditioning condensed water can lead to a terrifying disease known as Legionnaires'… https://t.co/FhOly0P7Dj— TheLiverDoc (@theliverdr) November 3, 2024వైరల్ అవుతున్న వీడియోలపై డాక్టర్లు సైతం స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోల్లో.. దేవాలయంలో అమర్చిన ఏసీల నుంచి వచ్చే నీరని తాగొద్దని కోరుతున్నారు. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగడం వల్ల ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. -
శ్రీకృష్ణుడి చేతిలో హతమైన రాక్షసుల గురించి తెలుసా?
ద్వాపరయుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణం మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. దేవకీ వసుదేవులకు అష్టమ(8వ) సంతానంగా జన్మించిన వాడే శ్రీకృష్ణుడు. అలాగే మహావిష్టువు ఎనిమిదో అవతారంగా కృష్ణావతారమని, ఇది చాలా విశిష్టమైందని భక్తుల విశ్వాసం.కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపు కుంటారు. అయితే కృష్ణావతారంలో దుష్టశిక్షణ, శిష్ట రక్షణార్థంఅనేకమందిరాక్షసులను తుదముట్టించాడు. ఆ వివరాలు ఒకసారి చూద్దామా. పూతన: మాయారూపంలో చిన్ని కృష్ణుడికి చనుపాలిచ్చి చంపాలని చూసిన రాక్షసి. ఇది గమనించిన కృష్ణుడి రెండు గుక్కలలో ఆమె శరీరంలోని సత్తువంతా పీల్చేసి, చివరకు ప్రాణాలను కూడా హరించాడు.శకటాసురుడు,తృణావర్త (సుడిగాలి): కంసుడు అనుచరులైన వీరుకృష్ణుడిని వధించాలని, అపహరించాలని భావించి ఆయనచేతిలోనే ప్రాణాలు కోల్పోయి, విముక్తి పొందిన రాక్షసులువత్సాసుర వధ: రేపల్లెనెంచి బృందావనానికి చేరిన కృష్ణుడు స్నేహితులతో ఆడుకుంటుండగా కోడె గిత్త రూపంలో వచ్చాడు వత్సాసురుడు. దీన్ని పసిగట్టిన కృష్ణయ్య దాన్ని ఎత్తి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపాడుబకాసురవధ: కంసుడు కృష్ణుడిని చంపడానికి పూతన సోదరుడు బకాసురుడు. పక్షిరూపంలో ఉన్న అతడిని కృష్ణుడు వధించాడు.శ్రీకృష్ణుడు గోపబాలురు యమునాతీరమున ఆడుకుటుండుగా కంసప్రేరితుడైన బకాసురుని జ్యేష్ఠపుత్రుడు అఘాసురుడు పెద్ద కొండచిలువ రూపంలో వచ్చి శ్రీకృష్ణుడిచేతిలో హతమయ్యాడు. అలాగే అరిష్టాసుర, ఇంకా గోవుల సమాజానికి ఒక పీడకలగా మారిన కాళియ మర్ధనంచేసి అక్కడి ప్రజలకు విముక్తి కల్పించాడు. కువలయపీడ- శ్రీ కృష్ణుడు మధురలో మదగజం రూపంలో ఉన్న ఏనుగు రాక్షసుడిని శ్రీ కృష్ణుడు చంపాడు.కంసుడు పంపించిన మరో రాక్షసుడు అశ్వం రూపంలో ఉన్న కేశికను కూడా వధించాడు కృష్ణుడు. పౌండ్రక వాసుదేవుడి వధ : అసూయతో యుద్ధం ప్రకటించి, శ్రీకృష్ణుడు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. కానీ వైరభక్తితో కృష్ణుని లో కలిసిపోయాడు.శిశుపాలుడి వధ: శిశుపాలుడు తల్లి సాత్యతికిచ్చిన మాట ప్రకారం అతని నూరు తప్పులను కాచిన శ్రీకృష్ణుడు,అతని దూషణలు శృతి మించడంతో సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శిశుపాలుడుని హత మార్చాడు. కంస చాణూర మర్ధన: తండ్రిశాపంతో అసురులుగా పుట్టిన చాణూరుడు, ముష్టికుడు, కళలుడు, తోశాలకుడు, కూటుడు , కంసుని కొలువులో చేరి, చివరికి నల్లనయ్య చేతిలో శాప విముక్తి పొందారు. ఇంకా వెయ్యి బాహువులు కలిగిన బాణాసురుడు కూడా నల్లనయ్య చేతిలో హతమయ్యాడు. అనుచరుల మరణంతో, యుద్ధానికి కాలుదువ్విన మామ కంసుడిని అతి సునాయాసంగా కడతేర్చాడు కన్నయ్య. భౌమాసుర (నరకాసుర)- నరకాసురుడు శ్రీకృష్ణుని 16వేల భార్యలను బంధించాడు, చివరికి కృష్ణుడి చేతిలో చనిపోయాడు. -
20 రోజులపాటు 40 టన్నుల ఇసుకతో శైతక శిల్పం
-
శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసు వివాదంలో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని మధురు స్థానిక కోర్టు Mathura Court కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలంలో సర్వే చేపట్టాలని కోర్టు అమిన్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 20వ(2023) తేదీలోగా సర్వే పూర్తి చేసి.. ఆ నివేదికను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. జనవరి 2వ తేదీ తర్వాత నుంచి ఈ సర్వేను చేపట్టాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సూచించింది. షాహీ ఈద్గాలో ఉన్న 13.37 ఎకరాలు తమకు అప్పగించాలని హిందూ సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలకు ఇరు పక్షాలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తూ.. నోటీసులు జారీ చేసింది. అది కృష్ణ జన్మస్థలమని, మొగలు చక్రవర్తి ఔరంగజేబ్ అక్కడున్న ఆలయాన్ని కూల్చేయించి.. ఈద్గా కట్టించాడని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా, ఉపాధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్‌లు వాదిస్తున్నారు. అంతేకాదు 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంఘ్‌కు, షాహీ మసీద్ ఈద్గాకు మధ్య జరిగిన ఒప్పందాన్ని సైతం వీళ్లు న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఇదిలా ఉంటే.. జ్క్షానవాపి మసీద్ కేసులోనూ వారణాసి కోర్టు ఇదే తరహాలో వీడియోగ్రాఫిక్ సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే. -
దేవుడి వల్లే ఆప్ పుట్టింది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని శ్రీకృష్ణుడితో పోల్చుకున్న ఆయన.. పార్టీ పుట్టుక దేవుడి జోక్యం వల్లే జరిగిందంటూ కామెంట్లు చేశారు. ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఆప్ తొలి జాతీయ సమావేశం ‘రాష్ట్రీయ జన ప్రతినిధి సమ్మేళన్’లో ఆ పార్టీ కన్వీనర్ హోదాలో ఆయన ప్రసంగించారు. ఆప్ పుట్టింది నవంబర్ 6, 2012లో. 63 ఏళ్ల కిందట.. ఈ తేదీనే మన దేశం రాజ్యాంగాన్ని దత్తత తీసుకుంది. ఆప్ పుట్టుక ఏదో యాదృచ్ఛికం కాదు. దేవుడి జోక్యంవల్లే జరిగింది. దేవుడు దేశాభివృద్ధి కోసం ఆప్ అనే విత్తనాన్ని నాటాడు. అది మొలకెత్తి ప్రతీ రాష్ట్రంలోనూ పెరుగుతూ.. మనకు అనితర బాధ్యతలను అప్పజెప్పుతోంది అంటూ వ్యాఖ్యానించారాయన. ఢిల్లీ, పంజాబ్‌లో వృక్షాలుగా ఎదిగి.. అక్కడి ప్రజలకు సంక్షేమ ఫలాలు, నీడను అందిస్తోంది. గుజరాత్‌లోనూ ఈ ఆప్ విత్తనం.. చెట్టుగా ఎదగడం ఖాయం అని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ధీమా వ్యక్తం చేశారయన. పుట్టిన పదేళ్లలో ఇంతలా ఎదిగిన పార్టీ బహుశా దేశంలో ఆప్ మాత్రమే కావొచ్చని చెప్పారాయన. ఆప్‌ను శ్రీ కృష్ణుడితో పోల్చిన కేజ్రీవాల్.. పసివయసులో కృష్ణుడి ఎలాగైతే రాక్షస సంహారం చేశాడో.. అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగంలాంటి రాక్షసులను ఆప్ వధిస్తుంది అంటూ కార్యకర్తలు, కీలక నేతల మధ్య హుషారుగా ప్రసంగించారు కేజ్రీవాల్. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండడం మాత్రమే కాదు.. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానిక విభాగాల్లో, పంచాయితీల్లో 1,446 మంది ఆప్ ప్రతినిధులు పదవుల్లో కొనసాగుతున్నారని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తథ్యమన్న భయం బీజేపీకి పట్టుకుందని, అందుకే అవినీతిపై యుద్ధం పేరిట ఆమ్ ఆద్మీ పార్టీని(ఆప్) నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. తప్పుడు అవినీతి కేసుల్లో తమ పార్టీ నాయకులను, మంత్రులను ఇరికించడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. గుజరాత్లో ఆప్ బలం నానాటికీ పెరుగుతుండాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. గుజరాత్లో ఆప్ కార్యక్రమాలకు కవరేజీ ఇవ్వొద్దంటూ ప్రధానమంత్రి మీడియా సలహాదారు హీరేన్ జోషీ మీడియా సంస్థలను బెదిరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ ఇప్పటిదాకా 285 మంది ఎమ్మెల్యేలను కొనేసిందని ఆరోపించారు. ‘ఆపరేషన్ కమలం’ కింద రూ.7,000–రూ.8,000 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆదివారం తిప్పికొట్టారు. కేజ్రీవాల్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక ఆప్‌ను శ్రీకృష్ణుడితో కేజ్రీవాల్ పోల్చుకోవడంపై బీజేపీ నేతలు సెటైర్లు, విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగాలు లేకపోతే మంచి భవిష్యత్తు లేదు -
మంచి మాట: ఆత్మ నిగ్రహం అసలైన బలం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అతని అభివృద్ధి నిలిచిపోయి అథః పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు విమర్శ చేసుకొంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో సత్సాంగత్యం తో మనసును అదుపులో పెట్టుకోవాలి. అలా మనస్సును అధీనంలో ఉంచుకోవడమే మనో నిగ్రహం. మనోస్థైర్యం దానికి ఆలంబన. 3చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, దాయాదులైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడిపోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. ధనుర్బాణాలు పక్కన పడేసి, నైరాశ్యంలో కూరుకుపోయాడు. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు మనోనిగ్రహాన్ని తిరిగి పొందడం వల్లనే తిరిగి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్య సంధులుగా, న్యాయపరులుగా, నీతివేత్తలుగా తీర్చిదిద్దుతుంది. అందుకే భగవద్గీతను కంఠోపాఠంగా కాకుండా జీవన వెలుగు దివిటీగా చేసుకోమంటారు పెద్దలు. ప్రవరాఖ్యుడికున్నంత మనోనిగ్రహం అందరికీ ఉండాలన్నది శాస్త్ర వచనం. ప్రవరాఖ్యుడు ఒకసారి హిమాలయాలు చూడడానికి వెళ్ళాడు. సిద్ధుడిచ్చిన లేపనం అక్కడ కరిగి పోయింది. కష్టకాలం వచ్చింది. అక్కడ అమిత సౌందర్యవతి అయిన గంధర్వ కాంత కనిపించింది. ఆమెను దారి చెప్పమని ప్రవరాఖ్యుడు అడిగాడు. కానీ ఆమె అతనిని తనను వివాహమాడమని తియ్యని మాటలెన్నో చెప్పింది. ప్రవరాఖ్యుడు ఆమె మాటలకు చలించలేదు. అందాలు ఆరబోసి అతనిని రెచ్చగొట్టినప్పటికీ అతడు నిగ్రహాన్ని విడిచిపెట్టకుండా తన భార్యను, బంధువులను గుర్తు పెట్టుకున్నాడు. ప్రవరాఖ్యుడి వలెనే అందరూ మనో నిగ్రహంతో ముందుకు వెళ్ళాలంటోంది సనాతన ధర్మం. అయితే దీనిని భక్తిమార్గంలో నడవడం వల్లనే సులువుగా సాధించవచ్చు. మనో నిగ్రహం అలవడితే దివ్యశక్తి ఆవహిస్తుంది. సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని అవగతం చేస్తుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడిగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయ లోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీతతో సహా ఇంచుమించు ఇతర మతగ్రంథాలన్నీ ప్రబోధించాయి. మనస్సును జయిస్తే చాలు. ముల్లోకాలను జయిస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేవి అదుపులో ఉంటాయి. దుర్గుణాలు సద్గుణాలుగా మారి శాంతి సౌఖ్యాలనిస్తాయి. అయితే ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ప్రతిభ ఉండీ పిరికితనం వల్ల మనిషి చాలా పోగొట్టుకుంటాడు. ఆత్మస్థైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. ఆత్మ స్థైర్యం ఓ బలవర్ధక పానీయం వంటిది. అది పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్యసాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతా భావన సాధించేందుకు తగిన బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధన లో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. – దాసరి దుర్గాప్రసాద్ -
అఖిలేష్ యాదవ్ శ్రీకృష్ణ జపం ఫలిస్తుందా?
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరానికి తెరలేచింది. అయితే మిగతా నాలుగు రాష్ట్రాల విషయం పక్కనబెట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం విషయంలో దేశంలో ప్రత్యేక చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి, ప్రతిష్ఠకు ఒక అగ్ని పరీక్ష లాంటివనీ, ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే, 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఓడించడం సులభవుతుందనీ బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులూ, ఆ పార్టీలకు అనుకూలంగా విశ్లేషణ చేసే మోదీ వ్యతిరేకులూ తల పోస్తు న్నారు. అఖిలేష్ యాదవ్ అనూహ్యంగా తెరమీదకు తెచ్చిన ‘శ్రీకృష్ణ జపం’ (శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి కలలోకి వచ్చి ‘నీవు రామరాజ్య స్థాపన చేస్తావు, ఈ ఎన్నికల్లో విజయం నీదే’ అంటున్నాడని అఖిలేష్ యాదవ్ చెప్పుకోవడం) ఈ ఎన్నికల్లో బాగా పని చేస్తుం దనీ, హిందువుల ఓట్లు చీలిపోతాయనీ, యాదవ కులపు ఓట్లు, ముస్లింల ఓట్లు గుండుగుత్తగా సమాజ్‌వాది పార్టీకి పోలవుతాయనీ మోదీ వ్యతిరేకులు ముందుస్తు అంచనాలు వేస్తున్నారు. (చదవండి: అయోధ్య రాముడా? మధుర కృష్ణుడా?) లౌకిక భావాలకు ప్రాతినిధ్యం వహించే సమాజ్‌వాది పార్టీ అనాలోచితంగా, అసందర్భంగా మథుర శ్రీకృష్ణుణ్ణి నెత్తికి ఎందుకు ఎత్తుకున్నట్లు? ముస్లిం పరిపాలనలో మథురలో శ్రీకృష్ణ ఆలయానికి అపచారం జరిగిందనీ, ఇది హిందూ సమాజానికి అవమానమనీ, ఈ అవమానాన్ని తుడిచి పెడతామనీ హిందూ సంస్థల ప్రతినిధులు, వారి మద్దతుతో రాజకీయాలు నడిపే భారతీయ జనతా పార్టీ చాలా కాలం నుండి చెప్పుకుంటూ వస్తుందనే విషయం హిందువులకు బాగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్న ఈ కృష్ణ నినాదం ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? (చదవండి: అధికారానికి ‘నిచ్చెన’ప్రదేశ్!) ఈ దేశ చరిత్రలో హిందూ సంస్కృతికి, హిందువులకు జరిగిన కష్టనష్టాలపై అఖిలేష్ యాదవ్‌గానీ, ఆయన తండ్రి ములాయంగానీ ఎప్పుడూ మాట్లాడలేదు. కాగా వారిద్దరూ హిందూ వ్యతిరేకులనీ, జిహాదీ ఉగ్రవాదుల మద్దతుదారులను, సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించారనే వ్యూహాత్మక ప్రచారాన్ని హిందుత్వ శక్తులు... హిందుత్వ అభిమాన ఓటర్ల మెదళ్ళలోకి బాగా ఎక్కించారనే విషయం సత్యదూరమైనదేమీ కాదు. గత నెలలో హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్ ప్రతినిధుల సమావేశంలో హిందుత్వ ప్రతినిధుల మాటలు... జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపకుండా పోతాయా? (చదవండి: అందరి వికాసం ఉత్త నినాదం కారాదు!) ఇక ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ... మోదీ, యోగీ తర్వాత హిందువులను రక్షించేవారెవరని అడిగిన మాటల వల్ల... ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. హిందుత్వ శక్తులు ఏకమవ్వడానికి దోహదం చేస్తాయి. మోదీ, యోగీ వ్యతిరేకుల దుష్ప్రచారాలు హిందు త్వాన్ని బలహీన పరుస్తాయా లేక బలపరుస్తాయా, లేదా సమాజ్‌వాది పార్టీ ఎన్నికల విజయాలను దెబ్బ తీస్తాయా అనే విషయాలను విశ్లేషకులు ఎవరూ చెప్పలేకపోతున్నారు. - ఉల్లి బాల రంగయ్య రాజకీయ సామాజిక విశ్లేషకులు -
ఐపీఎస్ కొలువుకు రాజీనామా.. శ్రీకృష్ణుడి సేవకు అంకితం
చండీగఢ్: పోలీసు ఉద్యోగానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఐపీఎస్ కొలువు అంటే మాటలు కాదు. ఇక ఐపీఎస్ ఉద్యోగం సాధించడం కూడా అంత సులువు కాదు. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ మంది ఏళ్ల తరబడి అహోరాత్రాలు శ్రమించి.. కష్టపడి చదువుతారు. అయినా కొందరికి ఉద్యోగం రాదు. అంతలా కష్టపడి సాధించిన ఉద్యోగాన్ని మధ్యలోనే వదులుకుంటారా.. అది కూడా దేవుని సేవ కోసం. చాలా కష్టం కదా. కానీ హరియాణాకు చెందిన ఓ మహిళా ఐపీఎస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. మిగతా జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె నిర్ణయం విన్నవారంతా షాకవుతున్నారు. ఆ వివరాలు.. ప్రస్తుతం హరియాణా అంబాలా రేంజ్లో ఇన్స్పెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా. ఈ క్రమంలో ఆమె తాను స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు భాతరి అరోరా రాష్ట్ర ప్రధాన సలహాదారుకు లేఖ రాశారు. దానిలో "50 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత, ఆల్ ఇండియా సర్వీసెస్ (డీసీఆర్బీ) నిబంధనలు, 1958 లోని రూల్ 16 (2) ప్రకారం, ఆగస్టు 1, 2021 నుంచి సర్వీసు నుంచి పదవీ విరమణ కోరుతూ.. నేను ఈ దరఖాస్తును స్వచ్ఛందంగా సమర్పించాను" అని తెలిపారు. “ఇప్పుడు నేను జీవితం అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురు నానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్దాస్, తులసీదాస్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో జీవించాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాంతం అంకితం చేయాలని నేను ఆరాటపడుతున్నాను’’ అని తెలిపారు భారతి అరోరా. ఇక దీనిపై ఫోన్ ద్వారా భారతి అరోరా పీటీఐతో మాట్లాడుతూ, ‘‘నా ఉద్యోగం అంటే నాకు ఎంతో గౌరవం, ఆసక్తి. ఇప్పటికే 23 ఏళ్లుగా విధులు నిర్వహించాను. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పయణించాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని భావిస్తున్నాను’’ అని తెలిపారు. ఐపీఎస్ అధికారిగా పని చేసిన భారతి అరోరా 2007 సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలు పేలుడు కేసును దర్యాప్తు చేశారు. అప్పుడు ఆమె పోలీసు సూపరింటెండెంట్‌గా (రైల్వే) విధులు నిర్వహించారు. పోలీసు పరిపాలనలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను ఏప్రిల్ 2021 లో కర్నాల్ నుంచి అంబాలా రేంజ్‌కు బదిలీ చేశారు. భారతి తన లేఖలో “నా సేవ పట్ల నేను ఎంతో గర్విస్తున్నాను. నాకు సేవ చేయడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి అవకాశం కల్పించినందుకు ఈ సేవకు నేను చాలా కృతజ్ఞతలు. నాకు సరైన మార్గాన్ని చూపించినందుకు హరియాణా రాష్ట్రానికి నా కృతజ్ఞతలు. నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఆగస్టు 1 నుంచి స్వచ్ఛందంగా సేవ నుంచి విరమించుకునేందుకు నన్ను అనుమతించమని నేను కోరుతున్నాను” అన్నారు. -
రుక్మిణీ పరిణయం
విదర్భదేశానికి భీష్మకుడు రాజు. ఆయనకు రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు, అద్వితీయ సౌందర్యవతి, సుగుణాల రాశి అయిన ఒక్కగానొక్క కుమార్తె రుక్మిణి. ఆమె యుక్తవయస్సుకు రాగానే శ్రీకృష్ణుడు రుక్మిణి దేవి రూపలావణ్యాల గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకొంటాడు. అదేవిధంగా రుక్మిణీ దేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీ కృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకొంటుంది. రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్ళి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరిని శిశుపాలుడి కిచ్చి పెళ్ళి చేయాలని తీర్మానించడమే కాదు, ముహూర్తం కూడా పెట్టిస్తాడు. ఈ విషయం తెలుసుకొన్న రుక్మిణీదేవి చాలా చింతిస్తుంది. కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిద్యోతనుడు అనే విప్రవరుడిని రప్పించి తన మనసులోని విషయం చెప్పి ద్వారకపురానికి వెళ్ళి శ్రీకృష్ణునకు తన అభీష్టాన్ని తెలిపి ముహూర్తం కంటే ముందే ఇక్కడకు వచ్చి తనని చేపట్టమని ప్రాధేయపడుతుంది. అగ్నిద్యోతనుడు వెనువెంటనే ద్వారకకు వెళ్ళి రుక్మిణీదేవి మనోగతాన్ని శ్రీకృష్ణునకు విన్నవించడంతో పాటు రుక్మిణీ దేవిని ఏవిధంగా చేపట్టాలో కూడా సలహా చెబుతాడు. శ్రీ కృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు. వారిరువురూ విదర్భదేశం వైపు బయలుదేరుతారు. అగ్నిద్యోతనుడు రుక్మిణి వద్దకు వెళ్ళి శ్రీ కృష్ణుడితో జరిగిన సంభాషణనంతటినీ వివరించి ఏమీ భయపడవద్దని ఊరడించి శ్రీ కృష్ణుడు ఆమెని సర్వమంగళాదేవి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు. అనుకున్న ప్రకారం రుక్మిణీదేవి నగర పొలిమేరలలో ఉన్న సర్వమంగళాదేవి ఆలయానికి వస్తుంది. అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది. రాజధాని వీథులలో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు. అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటాహుటిన ద్వారక వైపు బయలుదేరతాడు. అలా రుక్మిణీదేవిని తీసుకొని వెళ్ళుతున్న శ్రీ కృష్ణుడిని చూసి అందరూ తెల్లబోయారు. తేరుకొని శ్రీ కృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరారు. అప్పుడు బలరాముడు మొదలైన యదువీరులు ఆ రాజులను చెల్లాచెదరు చేశారు. వారంతా పిక్కబలం చూపి పారిపోతూ, శిశుపాలుని చూసి ‘బతికి ఉంటే కదా భార్య! ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరో రాచకన్యని పెళ్ళి చేసుకో‘మని చెబుతారు. కాని రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్ళి శ్రీ కృష్ణుడి రథానికి ఎదురుగా నిలిచి రకరకాలుగా దుర్భాషలాడుతూ కృష్ణునిపై బాణాలు విడుస్తుంటే శ్రీ కృష్ణుడు వాడి ధనుస్సు ఖండించాడు. మరికొన్ని నిశిత శరాలతో రథాన్ని విరగ్గొట్టాడు. శిశుపాలుడు పరిగ, గద ఆదిగా గల అనేక ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటిని ఛేదిస్తాడు. పదే పదే చికాకు పరుస్తున్న రుక్మి శిరస్సు ఖండించబోగా రుక్మిణీదేవి ప్రార్థనతో శాంతించి రుక్మికి తల గొరిగించే సన్మానం చేస్తాడు. అది చూసి రుక్మిణీ దేవి విచారిస్తుండగా, బలరాముడు రుక్మిణీ దేవిని ఓదారుస్తాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని ద్వారకకు తీసుకొని వెళ్లి అక్కడ ఆమెను అంగరంగ వైభవంగా పరిణయమాడతాడు. ఇందులో మనం తెలుసుకోదగ్గ నీతి ఏమిటంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఇష్టం లేని పెళ్లి చేయరాదు. అంతేకాదు, తల్లిదండ్రుల కోసం మనసు చంపుకుని పెళ్లి చేసుకుని, జీవితాంతం బాధపడకుండా తల్లిదండ్రులను ఒప్పించి కోరుకున్నవాడిని పెళ్లి చేసుకోవడం కొంత మేలు. – డి.వి.ఆర్. భాస్కర్ -
అచ్యుతుడు
సదాచారం నుండే ధర్మం పుడుతుంది. ధర్మాన్ని తెలుసుకోవాలంటే సదాచారం మూలంగానే తెలుసు కోవాలి. ఈ సదాచారానికి నియామకుడు అచ్యుతుడు. ‘ఆచార ప్రభవో ధర్మః – ధర్మస్య ప్రభురచ్యుతః’ అని శ్లోకం. ఎవడైతే ఏ దశలోనూ తన స్వభావం నుంచి పక్కకు తొలగిపోడో (జారిపోడో) అతడే అచ్యుతుడు. శ్రీహరి తాను ఏ పరిస్థితిలోనూ ఇచ్చిన మాట నుంచి పక్కకు తొలగను, ప్రతిజ్ఞా పరిపాలన నిమిత్తం దేనినైనా, ఎవరినైనా వదులుకుంటానుకానీ ప్రతిజ్ఞను మరవనని పలు సందర్భాలలో తెలిపాడు. తన ప్రతిజ్ఞను నెరవేర్చుకునేందుకు స్థిరంగా ఉండే పరమాత్మ తన భక్తుని ప్రతిజ్ఞను నిలబెట్టే విష యంలో మరింత దృఢచిత్తంతో వ్యవహరిస్తాడు అన డంలో ఎట్టి సందేహం లేదు. భక్తుని ప్రతిజ్ఞను నెరవేర్చే క్రమంలో తమ ప్రతిజ్ఞను వదులుకోవడానికి సిద్ధపడే పరమాత్మ భక్తవత్సలుడుగా ప్రసి ద్ధిని పొందాడు. భారత యుద్ధ సమయంలో ఆయుధాన్ని పట్టను అని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేసినా, ఆయుధం పట్టిస్తాననే భీష్మాచార్యులవారి ప్రతిజ్ఞను నెరవేర్చడానికి రథ చక్రాన్ని చేత బూనాడు. శ్రీరాముడు సత్యవాక్పరిపాల కుడని అతని భక్తులు చేసిన ప్రతి జ్ఞను శ్రీరాముడు వెంటనే సాకా రమొందిస్తాడని తెలుపడానికే వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలోని యుద్ధ కాండలో... ‘‘ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశ రథిర్యది /పౌరుషేచాప్రతిద్వందః శరైనం జహి రావ ణిమ్.. అనే లక్ష్మణుని ప్రతిజ్ఞను పొందుపరిచాడు. దశరథ పుత్రుడైన నా అన్న శ్రీరాముడు ధర్మా త్ముడైతే, సత్యసంధుడైతే, పౌరుషంలో సాటిలేనివా డైతే, నేను ప్రయోగించే ఈ బాణం రావణపుత్రుడైన ఇంద్రజిత్తును వధించుగాక అని లక్ష్మణుడు బాణప్ర యోగం చేశాడు. ఇంద్రజిత్తు హతుడయ్యాడు. యుద్ధభూమిలో తనకు అత్యంత ప్రియుడైన పాండవ మధ్యముడైన అర్జునునితో ‘కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణశ్యతి’ ఓ కుంతీ పుత్రుడా! నా భక్తుడు వినాశమును పొందడు అనే ప్రతిజ్ఞను చేయి అని శ్రీకృష్ణుడు పేర్కొన్న విషయాన్ని వ్యాసమహర్షి మహా భారతంలోని భగవద్గీతలో ఆవిష్కరించాడు. మహాభారతంలోని శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర ఉత్తర పీఠికలోని ‘న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్’ వాసుదేవుని పరమభక్తులైన వారికి అశుభములు ఏర్పడవు అనే విషయం ద్వారా శ్రీ మహా విష్ణువు యొక్క భక్త రక్షణ తత్పరతను వ్యాసమహర్షి పేర్కొన్నాడు. తన ప్రతిజ్ఞ నుండి భక్త రక్షణ స్వభావం నుండి పక్కకు తొలగని భక్తజన ప్రతిజ్ఞను నెరవేర్చు టలో ఆలస్యం చేయని అచ్యుతుణ్ణి ఆరాదిద్దాం. అంతు లేని ఆనందాన్ని అందుకుందాం. – సముద్రాల శఠగోపాచార్యులు -
వివరం: భగవానుడు గీసిన గీత
ఇహ పర లోకాలలో సుఖాన్ని సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఒక కాలానికీ, ప్రాంతానికీ చెందిన ఒక మనిషి యొక్క అభ్యుదయాన్నీ శ్రేయస్సునూ కోరుకుంటూ తగిన మార్గాలను బోధించేవాడు గురువవుతాడు. సర్వ దేశాలకు, సర్వ కాలాలకు, సర్వ జాతులకు వర్తించే విధంగా జగత్తులోని ప్రతి మానవుణ్నీ ఉద్దేశించి అభ్యుదయ నిశ్శ్రేయస మార్గాలను రెండింటినీ మహోదాత్తమైన పద్ధతిలో, విశ్వజనీనమైన ‘భగవద్గీతా’ రూపంలో ఉపదేశించడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. చైత్ర శుద్ధ నవమి - ధర్మాన్ని ఆచరించిన శ్రీరాముని పుట్టినరోజు. శ్రావణ బహుళ అష్టమి - ధర్మాన్ని ఉపదేశించిన శ్రీకృష్ణుని పుట్టినరోజు. మార్గశిర శుద్ధ ఏకాదశి - శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ని నిమిత్తంగా చేసుకొని సకల మానవాళికి ‘గీత’ బోధించిన రోజు. ప్రపంచంలోని అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతమై విరాజిల్లిందని ఉపనిషత్ గ్రంథాలకు పీఠికలు రాసిన అనేక మంది జ్ఞానులు చెబుతున్నారు. ‘ఆధ్యాత్మము’ అంటే ప్రాణుల స్వభావము లేదా వాస్తవ రూపం! దీని గురించి వివరంగా తెలుసుకునే విద్యే ఆధ్యాత్మ విద్య! ఇంకా సరళంగా చెప్పాలంటే - ఎక్కణ్నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి వెళ్లాలి, అందుకు ఏం చేయాలి?... అనేవి సంక్షిప్తంగా చెప్పే శాస్త్రమే ‘గీతా’ శాస్త్రం! చాలా మతగ్రంథాల్లాగా ప్రత్యేకంగా రాయబడిన గ్రంథం కాదిది. మహాభారతమనే ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకూ 700 శ్లోకాలతో 18 అధ్యాయాలుగా విభక్తమై ఉంది భగవద్గీత! స్కూల్లో టీచరు సంవత్సరమంతా పాఠం చెప్పి, పరీక్షల ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పినట్టు - మొత్తం లక్ష శ్లోకాల భారతంలో - జీవితంలో పాసైపోవడానికి 700 శ్లోకాలు చాలన్నట్టుగా బయటకు తెచ్చిందే - భగవద్గీత! అర్జునుడి విషాదం వల్ల కృష్ణుడు గీత బోధించవలసి వస్తుంది. యుద్ధంలో తనవాళ్లందరూ మరణిస్తారన్నది అర్జునుడి చింతకు మొదటి కారణం. తానే వారందరినీ చంపడం అధర్మం అనే భావన రెండో కారణం. ఈ విషాద కారణాలు రెండింటినీ తొలగించి, అర్జునుని స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరించడానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నమే భగవద్గీత! నిరుడు రాసిన పుస్తకానికి అదే సంవత్సరంలో కాలం చెల్లడం చూస్తున్నాం! మరి ఒకటా రెండా 5,152 సంవత్సరాల క్రితం ఉపదేశించబడి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట... బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లోనో, పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్స్లోనో, మోటివేషన్ స్పీచుల్లోనో, మోరల్ వ్యాల్యూస్ చర్చల్లోనో... ఏదో ఒక సందర్భంలో ‘గీత’ గురించి మాట్లాడుకోవడం... అమెరికన్ సెనేట్‌లో ‘భగవద్గీత’ మీద ప్రమాణం చేసి, కాంగ్రెస్ సభ్యురాలిగా తులసీ గబ్బర్డ్ పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేశమంతా గర్వపడుతూ చప్పట్లు చరచడం... గీత శక్తిని ప్రపంచానికి చాటడమే అవుతుంది. పైగా... ‘భగవద్గీతా కించి దధీతా...’ భగవద్గీతను ఏ కొంచెం అధ్యయనం చేసినా వాడి గురించి యముడు చర్చించడని శంకరాచార్య... ‘జ్ఞానం గురించి లోతైన అవగాహన నాకు భగవద్గీత వల్లే ఏర్పడింది’ అని మాక్స్‌ముల్లర్... ‘శాశ్వతమైన ప్రమాణాలు గల ఉపదేశానికి సంక్షిప్త రూపమే భగవద్గీత. ఇది భారతీయులకే కాదు మానవ లోకానికంతటికీ సుస్థిరమైన ఉత్తమ ప్రయోజనాన్నిస్తుంది’ అని ఆల్డస్ హక్స్లీ... ‘ప్రతిఫలాపేక్ష విడిచి కర్మలను ఆచరించడమనే అద్భుతమైన సూచననిచ్చి, మానవ బలహీనతల్ని రూపుమాపి ఉత్తమ సమాజాన్ని నిర్మించగలిగే బలాన్నివ్వడం భగవద్గీత గొప్పదనం’ అని స్వామి వివేకానంద... ఇలా మహానుభావుల అనుభవాల్లో భగవద్గీత గురించి వింటుంటే, గీత లౌకిక ప్రయోజనాలనీ, పారమార్థిక ప్రయోజనాలనీ రెండూ ఇస్తుందనే నమ్మకం కలగడం లేదూ! కాబట్టే - గీత మీద ప్రమాణం చేస్తే అంతా నిజమే చెప్పాలన్నంత పవిత్రతను ఆ గ్రంథానికి ఆపాదించటం జరిగింది. యుద్ధ రంగంలో నిలబడే రెండు పక్షాలూ ఒకరికొకరు శత్రువులు. అది యుద్ధ ధర్మం! అక్కడ నిలబడి ‘వీళ్లందరూ నావాళ్లు’ అని మమకారాన్నీ, ‘నేను చంపవలసి వస్తోంద’ని అహంకారాన్నీ ప్రదర్శించాడు అర్జునుడు - తాత్కాలికమైన మోహావేశంలో! అది గమనించి, ‘డ్యూటీ కరెక్ట్‌గా చేయాలంటే అహంకార మమకారాల్ని వదిలిపెట్టాలం’టూ డ్యూటీలో ఉన్న బ్యూటీ గురించి కృష్ణుడు చెప్పిందే గీత! పైగా జరుగుతున్న యుద్ధం - వ్యక్తుల మధ్య కాదనీ, ధర్మానికీ అధర్మానికీ మధ్య అనీ, చనిపోయేది శరీరమే కానీ ఆత్మ కాదనీ శాశ్వతమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఉపదేశించాడు కృష్ణుడు! మనుజుల కర్తవ్యాన్ని గుర్తుచేసి, జ్ఞాన బోధతో పరమాత్మను చేరే మార్గాన్ని చూపించడమే కృష్ణావతార వైశిష్ట్యం! ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఫలితం పరమాత్మ వంతుగా భావించి, భవ బంధాలను వదలి చేయడమే మనిషి కర్తవ్యం... ఇదే గీతా సారాంశం! అసలు భగవద్గీత ఏం చెబుతుంది? ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అసలు కృష్ణుడు అర్జునునికి ఉపదేశం మొదలెడుతూనే - ‘అశోచ్యా నన్వ శోచస్త్వం... దుఃఖింప తగనివారిని గూర్చి దుఃఖిస్తున్నావు’ అన్నాడు. నిజానికి మనం చేస్తున్నదీ ఇదే! ఏది అవసరమో అది వదిలేసి, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి బాధపడుతుంటాం! దేని గురించి ఎంత ఆలోచించాలో, ఎవరి గురించి ఎంత ఆలోచించాలో తెలుసుకోవడమే వివేకం! ఫేస్‌బుక్కుల ముందు విలువైన సమయమంతా పాడు చేసుకుంటున్న యువతరానికి భగవద్గీత పుస్తకం ప్రయోజనమేమిటో చెప్పాల్సి ఉంది. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం... త్యక్త్వోత్తిష్ట..!’ నీచమైన మనో దౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సంసిద్ధుడవై లే!’ అంటూ జాగృత పరచి, జీవన గమ్యానికి చేర్చే స్ఫూర్తినిస్తుంది గీత! భగవంతుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతను బట్టి ఇస్తాడు. జ్ఞానులూ అంతే. ఆసక్తిని బట్టీ, అర్హతను బట్టీ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ‘శిష్యస్తేహం... శాధిమాం త్వాం ప్రపన్నం... దైన్యంతో ఆలోచనాశక్తిని కోల్పోయాను. శిష్యుడిగా అర్థిస్తున్నాను. సరైన మార్గం చూపించు!’ అని అర్జునుడు శరణు వేడాకే కృష్ణుడు గీత బోధ మొదలుపెట్టాడు. ఆసక్తి లేనివాడికి ఏ విషయమూ పట్టుబడదు. అందుకే ‘ఆసక్తి లేనివాడికి భగవద్గీత ఉపదేశించవద్ద’న్నాడు కృష్ణుడు. (ఇదంతే నా తపస్కాయ - (18-67).. భగవద్గీతే కాదు, ఏ సబ్జెక్టయినా అంతే! వేదికపైన ఉపన్న్యాసకుడు చెప్పిందే చెబితే, బోర్ కొట్టేస్తున్నాడంటారు. కాలేజీలో లెక్చరర్ చెప్పింది మళ్లీ మళ్లీ చెప్పాలి. దీన్ని రివిజన్ అంటారు. ‘గీత’లో కృష్ణుడు చేసిందీ ఇదే! అర్జునుడు ఆచరించాల్సిన కర్తవ్యాన్నీ, కాపాడుకోవాల్సిన క్షత్రియ ధర్మాన్నీ పలుమార్లు పలు విధాలుగా చెప్పాడు. కాబట్టే ‘న యోత్స్యే... (యుద్ధం చేయను) అని అన్నవాడు కాస్తా, గీతోపదేశంతో అజ్ఞాన జనితమైన సందేహాలు మొత్తం తొలగిపోయి ‘కరిష్యే వచనం తవ... నువ్వు చెప్పినట్టే చేస్తాను’ అన్నాడు అర్జునుడు. మనలోని ఆత్మగ్రంథం తెరుచుకోనంతవరకూ బాహ్య గ్రంథాలన్నీ నిరుపయోగాలు. మన ఆటంకాలన్నీ తొలగించి, మన ఆత్మను మనం దర్శించే అవకాశం కల్పిస్తుంది గీత! ఇంట్లో అమ్మా నాన్నా ఉన్నారంటే పిల్లల ప్రవర్తన అదుపులో ఉంటుంది. సమాజంలో పోలీసు వ్యవస్థ ఉందంటే, జనం ప్రవర్తన అదుపులో ఉంటుంది. ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి, మరుజన్మ ఆధారపడి ఉంటుందని తెలుసుకుంటే, ఈ జన్మంతా అదుపులో ఉంటుంది. అదే చెబుతూ పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది గీత - ‘శరీరం యదవాప్నోతి.. (15-8)! మనం చేసే పనులు ఎవడూ చూడ్డం లేదనుకుంటే, పెద్ద పొరబాటే! ‘సర్వతోక్షి శిరోముఖం... సర్వత శృతిమల్లోకే..’ నువ్వు చేసేది చూస్తున్నాడు. మాట్లాడేది వింటున్నాడు పరమాత్మ! వాడన్నీ గమనిస్తుంటాడన్న విషయం బాల్యంలోనే అర్థమైపోతే, జీవితాన్ని పారదర్శకంగా, ఆదర్శవంతంగా గడిపేయొచ్చు! విశేషమేమిటంటే - భౌతికంగా గీతను బోధించినవాడు కృష్ణుడే అని మనం అనుకుంటున్నప్పటికీ, ‘గీత’ లో ఎక్కడా ‘కృష్ణ ఉవాచ’ అని కనిపించదు. ‘భగవాన్ ఉవాచ!’ అనే కనిపిస్తుంది. ఈ భగవానుడికి ఎవరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ రకంగా జగత్తులో మానవుడని చెప్పబడే ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి చేసిన మహోదాత్తోపదేశం కాబట్టే గీత దేశ, కాల, జాత్యాదులకు అతీతంగా విరాజిల్లుతోంది. కర్మణ్యేవాధి కారస్తే... అంటూ ఫలితంపైన దృష్టి పెట్టకుండా, త్రికరణ శుద్ధిగా కర్మని ఆచరించమని చెప్పే గ్రంథాన్ని ఒక మతానికి ఎలా పరిమితం చేయగలం! భోగ లాలసత్వానికీ, దురాశలకీ, నీతి బాహ్యమైన భావావేశాలకీ లోను కాకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు త్రికరణ శుద్ధిగా ఆచరించాలని చెప్పే గీత నాకు తల్లి లాంటిది. స్వాతంత్య్ర సముపార్జనా దీక్షలో నాకు అమేయమైన శక్తినిచ్చింది భగవద్గీత. - మహాత్మాగాంధీ ఏదో విధంగా భోగమయ జీవితాన్ని గడపాలనే మానవ సమాజ ప్రవృత్తిని భగవద్గీత వ్యతిరేకిస్తుంది. ఉత్తమ లక్ష్య సాధన కోసం ఏ క్షణంలోనైనా, ఎలాంటి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలని బోధిస్తుంది. తెలివితేటల్నీ, కాలాన్నీ డబ్బుగా మార్చుకోవటంలోను, వీకెండ్స్ పేరుతో దాన్ని ఖర్చుపెట్టి ఆనందాన్ని కొనుక్కోవడంలోను బిజీగా ఉంటూ... అదే జీవితమనుకుంటున్న ఈ పరుగుల ప్రపంచానికి, భారతీయత కనిపించకుండా గ్లోబలైజేషన్ ముసుగు కప్పేసిన అధిక శాతం యువతరానికీ, భగవద్గీత ఉత్తమమైన, శాశ్వతమైన మార్గాన్ని సూచిస్తుందనడంలో సందేహం లేదు! హిందూ ధర్మ సాహిత్యం అనంతమైనది. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, సిద్ధాంతాలు! ‘వీటిలో దేన్ని అనుసరించాల’ని సామాన్యుడడిగే ప్రశ్నకి ఒకే సమాధానం చెప్పొచ్చు. వీటన్నిటి సారమూ - ‘సర్వ శాస్త్రమయీ గీతా..’ అని పేరుగాంచినదీ... సాక్షాత్తూ భగవానుడైన శ్రీకృష్ణుడే చెప్పినదీ ‘భగవద్గీత’ ఒక్కటి చాలు! ‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే... జ్ఞానంతో సమానమైనదీ పవిత్రమైనదీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి జ్ఞానివి కమ్ము అంటూ అర్జునుణ్ని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని జ్ఞానులు కావాలని కాంక్షించింది గీత! అందుకే భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చిన విదేశీయులకు మన ధన, కనక, వస్తు, వాహనాలపైన కన్ను పడితే, జర్మనీ దేశస్తులు మాత్రం ‘మా దృష్టి భారతదేశంలోని ఆధ్యాత్మ జ్ఞాన సంపదపైన పడింది’ అన్నారు. వేదాల గురించి, భగవద్గీత గురించి అనేక సందర్భాలలో ప్రస్తావించిన ఎడ్విన్ ఆర్నాల్డ్, మాక్స్ ముల్లర్, ఓపెన్ హామర్లు జర్మనీ దేశం వారే! మహాత్మాగాంధీకి భగవద్గీతపైన మక్కువ ఏర్పడటానికి కారణం - ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన ‘ద సాంగ్ ఆఫ్ సెలెస్టల్’ అనే గీతానువాద గ్రంథమే! ఏం చదువుకున్న తర్వాత ఇంకా చదవడానికి మిగిలే ఉంటుందో - అది విజ్ఞానం! ఏం తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకునేందుకు మిగిలి ఉండదో - అది ఆధ్యాత్మ జ్ఞానం! ఆధ్యాత్మ జ్ఞానం లేకుండా మిగతా లౌకిక జ్ఞానాలన్నీ స్వార్థాన్నే ప్రేరేపిస్తాయి. మనదేశం ఈ స్వార్థంలోనే కొట్టుకుపోవడానికి కారణం - ప్రస్తుతం మన విద్యావ్యవస్థలో ఆధ్యాత్మ జ్ఞాన బోధన లేకపోవడమే! ఈ జ్ఞానం అవసరాన్ని గుర్తించడం వల్లే, న్యూజెర్సీ (యూఎస్ఏ)లోని ‘సెటన్ హాల్ యూనివర్సిటీ’ లో చేరే ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా భగవద్గీత చదవాలనే నిబంధన పెడుతూ, ఈ కోర్సుకు ‘ద జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫామేషన్’ అని పేరుపెట్టారు. మరి ‘గీత’ పుట్టిన భారతదేశంలో మాత్రం ‘సెక్యులర్’ పేరుతో దీన్ని దగ్గరికే రానివ్వకపోవడం దురదృష్టకరం. పక్కింట్లో ‘గీత’ వినిపిస్తుంటే ఎవరో టపా కట్టేసుంటారనే స్థితి నుంచి, ‘తెల్లారింది... పక్కింటివాళ్లు లేచి పనులు చేసుకుంటున్నారు’ అనే స్థితికి సంకేతంగా ఒక ఉద్యమ స్థాయిలో గీతా ప్రచారం జరగవలసి ఉంది! ‘వీళ్లందరూ నావాళ్లు’ అని మమకారాన్నీ, ‘నేను చంపవలసి వస్తోంద’ని అహంకారాన్నీ ప్రదర్శించాడు అర్జునుడు - తాత్కాలికమైన మోహావేశంలో! అది గమనించి, ‘డ్యూటీ కరెక్ట్‌గా చేయాలంటే అహంకార మమకారాల్ని వదిలిపెట్టాలం’టూ డ్యూటీలో ఉన్న బ్యూటీ గురించి శ్రీకృష్ణుడు చెప్పిందే గీత! అందుకే గీత నేర్చుకుందాం. రాత మార్చుకుందాం. ఇంటింటా గీతాజ్యోతిని వెలిగిద్దాం. భగవద్గీత... ఉత్తమ జీవన విధాన మార్గం! మానవులకు ఆశాదీపం! సాధకులకు కల్పవృక్షం! సర్వేజనాస్సుఖినోభవన్తు! - గంగాధర శాస్త్రి గాయకుడు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భగవద్గీత లాంటి కర్తవ్య బోధనా గ్రంథం లేకపోతే ప్రపంచ వాఙ్మయం పరిపూర్ణమైనట్టు కాదు. - ఎడ్విన్ ఆర్నాల్డ్, ‘ది సాంగ్ ఆఫ్ సెలెస్టన్ గ్రంథకర్త’