ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరానికి తెరలేచింది. అయితే మిగతా నాలుగు రాష్ట్రాల విషయం పక్కనబెట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం విషయంలో దేశంలో ప్రత్యేక చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి, ప్రతిష్ఠకు ఒక అగ్ని పరీక్ష లాంటివనీ, ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే, 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఓడించడం సులభవుతుందనీ బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులూ, ఆ పార్టీలకు అనుకూలంగా విశ్లేషణ చేసే మోదీ వ్యతిరేకులూ తల పోస్తు న్నారు. అఖిలేష్ యాదవ్ అనూహ్యంగా తెరమీదకు తెచ్చిన ‘శ్రీకృష్ణ జపం’ (శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి కలలోకి వచ్చి ‘నీవు రామరాజ్య స్థాపన చేస్తావు, ఈ ఎన్నికల్లో విజయం నీదే’ అంటున్నాడని అఖిలేష్ యాదవ్ చెప్పుకోవడం) ఈ ఎన్నికల్లో బాగా పని చేస్తుం దనీ, హిందువుల ఓట్లు చీలిపోతాయనీ, యాదవ కులపు ఓట్లు, ముస్లింల ఓట్లు గుండుగుత్తగా సమాజ్‌వాది పార్టీకి పోలవుతాయనీ మోదీ వ్యతిరేకులు ముందుస్తు అంచనాలు వేస్తున్నారు. (చదవండి: అయోధ్య రాముడా? మధుర కృష్ణుడా?)
లౌకిక భావాలకు ప్రాతినిధ్యం వహించే సమాజ్‌వాది పార్టీ అనాలోచితంగా, అసందర్భంగా మథుర శ్రీకృష్ణుణ్ణి నెత్తికి ఎందుకు ఎత్తుకున్నట్లు? ముస్లిం పరిపాలనలో మథురలో శ్రీకృష్ణ ఆలయానికి అపచారం జరిగిందనీ, ఇది హిందూ సమాజానికి అవమానమనీ, ఈ అవమానాన్ని తుడిచి పెడతామనీ హిందూ సంస్థల ప్రతినిధులు, వారి మద్దతుతో రాజకీయాలు నడిపే భారతీయ జనతా పార్టీ చాలా కాలం నుండి చెప్పుకుంటూ వస్తుందనే విషయం హిందువులకు బాగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్న ఈ కృష్ణ నినాదం ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? (చదవండి: అధికారానికి ‘నిచ్చెన’ప్రదేశ్!)
ఈ దేశ చరిత్రలో హిందూ సంస్కృతికి, హిందువులకు జరిగిన కష్టనష్టాలపై అఖిలేష్ యాదవ్‌గానీ, ఆయన తండ్రి ములాయంగానీ ఎప్పుడూ మాట్లాడలేదు. కాగా వారిద్దరూ హిందూ వ్యతిరేకులనీ, జిహాదీ ఉగ్రవాదుల మద్దతుదారులను, సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించారనే వ్యూహాత్మక ప్రచారాన్ని హిందుత్వ శక్తులు... హిందుత్వ అభిమాన ఓటర్ల మెదళ్ళలోకి బాగా ఎక్కించారనే విషయం సత్యదూరమైనదేమీ కాదు. గత నెలలో హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్ ప్రతినిధుల సమావేశంలో హిందుత్వ ప్రతినిధుల మాటలు... జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపకుండా పోతాయా? (చదవండి: అందరి వికాసం ఉత్త నినాదం కారాదు!)
ఇక ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ... మోదీ, యోగీ తర్వాత హిందువులను రక్షించేవారెవరని అడిగిన మాటల వల్ల... ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. హిందుత్వ శక్తులు ఏకమవ్వడానికి దోహదం చేస్తాయి. మోదీ, యోగీ వ్యతిరేకుల దుష్ప్రచారాలు హిందు త్వాన్ని బలహీన పరుస్తాయా లేక బలపరుస్తాయా, లేదా సమాజ్‌వాది పార్టీ ఎన్నికల విజయాలను దెబ్బ తీస్తాయా అనే విషయాలను విశ్లేషకులు ఎవరూ చెప్పలేకపోతున్నారు.
- ఉల్లి బాల రంగయ్య
రాజకీయ సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment