ప్రముఖ దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీళ్లు.. తాగేందుకు ఎగబడుతున్న భక్తులు | Devotees At Banke Bihari Temple Drink Ac Water Believing It To Be Charan Amrit, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

ప్రముఖ దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీళ్లు.. తాగేందుకు ఎగబడుతున్న భక్తులు

Published Mon, Nov 4 2024 8:34 AM | Last Updated on Mon, Nov 4 2024 10:13 AM

Devotees at Banke Bihari Temple drink AC water, believing it to be Charan Amrit

ప్రజల్లో దైవ భక్తి రోజురోజుకి శృతి మించుతోంది. ప్రముఖ దేవాలయంలో ఏర్పాటు చేసిన ఏసీల నుంచి కారే నీటిని తాగుతున్నారు. ఒంటిపై చల్లుకుని పునీతులం అయ్యామని తెగ సంబరపడిపోతున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వ్రిందావన్ నగరంలో ప్రముఖ ప్రసిద్ధ ‘బాంకే బిహారీ’ అనే శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. అయితే ఆ దేవాలయంలో దైవ దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. వస్తూ.. వస్తూ తమ వెంట టీ తాగే కప్పులను తెచ్చుకుంటున్నారు. శ్రీకృష్ణుడి దర్శనం అనంతరం గుడికి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీటిని దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు.

ఆ నీటిని టీ కప్పుల్లో నింపుకున్న భక్తులు తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంతమంది భక్తులు నీటిని సేకరించడానికి కప్పులను ఉపయోగిస్తుండగా.. మరికొందరు చేతిలో తీర్ధం తీసుకున్నట్లుగా ఏసీ నుంచి కారే నీటిని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు.  

వెలుగులోకి వచ్చిన పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆలయ నిర్మాణ  సమయంలో ఏసీలను ఏర్పాటు చేశారు. ఆ ఏసీల నుంచి కారే నీటిని బయట విడుదలయ్యేలా ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాలను అమర్చారు. ఇప్పుడు ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాల ద్వారా విడుదలవుతున్న నీటినే భక్తులు తాగుతున్నారు.  
 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో.. వీడియోలు తీసిన వారు.. ఏనుగు శిల్పం నుంచి ఏసీ విడుదల చేసే నీరు కారుతుందని చెబుతున్న మాటలు వినబడుతున్నాయి. అయినప్పటికీ అనేక మంది ఆలయానికి వెళ్లేవారు నీటిని తాగడం లేదంటే తమపై చల్లుకోవడం చేస్తున్నారు.  

మరికొందరు ఏనుగు శిల్పం నోటి నుండి కారుతున్న 'చరణ్ అమృతం’ (దేవుడు తమని ఆశీర్వదిస్తున్నారనే సూచికగా) భావిస్తున్నారు. శ్రీకృష్ణుడి పాదాల నుండి వస్తున్న పవిత్ర జలం అంటూ భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలపై డాక్టర్లు సైతం స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోల్లో.. దేవాలయంలో అమర్చిన ఏసీల నుంచి వచ్చే నీరని తాగొద్దని కోరుతున్నారు. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగడం వల్ల ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement