
ఉత్తరప్రదేశ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మధురలోని ఆశ్రమం వద్ద ప్రసాదం కోసం క్యూలో వేచి ఉన్నఇద్దరు మహిళా భక్తులపై 'కిచిడీ' వడ్డించే వ్యక్తి జారిపడి వేడి ఆహారం వారిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్యూలో నిలబడిన మరో ఎనిమిది మంది మహిళలకు కూడా పాత్రలోని వేడి వేడి కిచిడీ పడటంతో స్వల్ప గాయపడ్డారు. గాయపడిన భక్తులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని ఆగ్రాలోని ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. కాగా ఇద్దరు భక్తులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు.
మధురలోని బృందావన్ ప్రాంతంలోని గౌరీ గోపాల్ ఆశ్రమంలో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం భక్తులందరూ పరిక్రమ మార్గ్ సంత్ కాలనీలో ఉన్న గౌరీ గోపాల్ ఆశ్రమానికి చేరుకోగా.. బయట ప్రసాదం పంపిణీ చేస్తుండటాన్ని గమనించారు.
బియ్యం, పప్పుతో చేసిన కిచిడీని తీసుకునేందుకు భక్తులు క్యూలో నిల్చున్నారు. ఈక్రమంలో కిచిడీని పాత్రను తీసుకొస్తున్న వ్యక్తి జారిపడిపోయాడు. అతని చేతిలోని వేడి ఆహారం పక్కన నిలబడి ఉన్న మహిళలపై పడినట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వందనా అగర్వాల్ చెప్పారు. ఈ సంఘటన భక్తులను భయాందోళనకు గురిచేసిందని, గాయపడిన 10 మంది మహిళలను ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు.