మానవ బలహీనతను సొమ్ము చేసుకోవడానికి నమ్మకాన్ని వాటంగా మార్చుకోవడం చరిత్రలో తరచూ కనిపించేదే. ఎవరికీ ఏ ఇబ్బందీ కలగనంత వరకేమో కానీ... ప్రజల అమాయకత్వాన్ని స్వార్థానికి వాడుకుంటున్నప్పుడు, ఆ ప్రక్రియ ఆఖరికి ప్రాణాంతకంగానూ మారినప్పుడు చూస్తూ సహించలేం. సమకాలీన సమాజంలో అలాంటి అనుభవాల్ని భరించలేం. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లా ఫూల్‌రాయ్ వద్ద మంగళవారం జరిగిన ధార్మిక సభ, అక్కడ తొక్కిసలాటను చూసినప్పుడు అదే అనిపిస్తుంది.
121 మంది అమాయక భక్తులు మరణించిన హాథ్రస్ ఘటన ఘోర విషాదం. పాదధూళితో, పంపులో నీళ్ళతో సమస్త సమస్యలూ పరిష్కారమవుతాయని అమాయక ప్రజల్ని నమ్మిస్తున్న ఓ పెద్ద మనిషి తప్పిదానికి అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిశాయి. పాలకులు ఎప్పటి లానే సంతాపాలు తెలిపారు. నష్టపరిహారాలు ప్రకటించారు. సిట్ దర్యాప్తుకూ ఆదేశించారు. కానీ, తరచూ జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనల్ని నివారించాల్సిన బాధ్యత లేదా? ప్రమాదవేళ తూతూ మంత్రంగా స్పందించి, ఆనక నివారణ చర్యలపై నిమ్మకు నీరెత్తినట్టుంటే సరిపోతుందా?
తాజా హాథ్రస్ ఘటనకు కేంద్రబిందువైన స్వయం ప్రకటిత దైవదూత నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలే బాబా కథ సుదీర్ఘమైనదే. ఆయన అసలు పేరు సూరజ్ పాల్. ఆధ్యాత్మిక గురువుగా మారక ముందు యూపీ పోలీసుల స్థానిక ఇంటెలిజెన్స్ విభాగంలో సాధారణ హెడ్ కానిస్టేబుల్. ఉద్యోగంలో ఉండగానే తాను ఆధ్యాత్మికత వైపు మొగ్గాననీ, అందుకే 1990లలో చేస్తున్న ఉద్యోగం మానేసి దైవమార్గం పట్టాననీ ఆయన కథనం. ఉత్తరప్రదేశ్‌లో ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఆయన చలువ కళ్ళద్దాలు, శ్వేత వస్త్రధారణతో పేరు, పలుకుబడి గల బాబాగా అవతరించడం ఆశ్చర్యమే.
ఇవాళ యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా తదితర ప్రధాన హిందీ రాష్ట్రాల్లో ఆయనకు లక్షలాది భక్తులు పోగుబడడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. చనిపోయిన బిడ్డను బ్రతికిస్తానంటూ 23 ఏళ్ళ క్రితం శ్మశానంలో గందరగోళం చేయడం మొదలు లైంగిక అత్యాచార ఆరోపణల దాకా ఈ బాబాపై అనేక కేసులున్నాయి. నాలుగేళ్ళ క్రితం 2020 జనవరిలో షాజహాన్‌పుర్‌లో ఈయన సత్సంగంలోనే ప్రసాద వితరణ వేళ మంటలు చెలరేగి, తొక్కిసలాట జరిగింది. సమయానికి అగ్నిమాపక దళం రావడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, దోవ కూడా సరిగ్గా లేని తాజా హాథ్రస్ ఘటనాస్థలిలో కనీసం అంబులెన్స్ లాంటివైనా లేకపోవడం ఘోరం, నేరం.
హాథ్రస్ ఘటనపై కఠిన చర్యలు చేపడతామని యూపీ సీఎం గర్జించారు కానీ, ఈ దుర్ఘటనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అసలు భోలే బాబా పేరే పెట్టలేదు. ఇక, ఇంత భారీ దుర్ఘటన జరిగాక సదరు బాబా ఎవరికీ కనిపించకుండా పరారీలో ఉన్నారు. హాథ్రస్ ఘటన అత్యాశకూ, అపరిమిత నిర్లక్ష్యానికీ ప్రతీక. ఈ ఘటనలో తిలా పాపం తలా పిడికెడు.
సత్సంగమంటూ 80 వేల మందికే అనుమతి తీసుకొన్నా, రెండున్నర లక్షల మందికి పైగా జనాన్ని అనుమతించడం ఎవరి తప్పు? తగినన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలైనా లేకుండా అంత భారీ ఆధ్యాత్మిక సభ జరిపిన నిర్వాహకులను ఏమనాలి? ‘నా పాదధూళి ఇంటికి తీసుకెళ్ళి సమస్యల్లో ఉన్నవారికి రాస్తే అన్నీ చక్కబడతాయి’ అని అమాయకుల బలహీనతతో ఆడుకొని, ఇంత ఘోరానికి కారకుడైన మహానుభావుణ్ణి ఏం చేయాలి? ఇంత జరిగాక కూడా ఆయన తన వకీలు ద్వారా ఈ దుర్ఘటన వెనుక అసాంఘిక శక్తుల కుట్ర ఉందంటూ నెపం నెట్టేసే పని చేస్తుంటే పాలకులు ఏం చేస్తున్నట్టు?
హాథ్రస్ ఘటన లాంటివి మనకు కొత్త కాదు. గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. 2005లో మహారాష్ట్రలోని వాయిలో మంధరాదేవి గుడి వద్ద తొక్కిసలాటలో 340 మందికి పైగా చనిపోయారు. 2008లో రాజస్థాన్‌లో చాముండా దేవి ఆలయం వద్ద కనీసం 250 మంది, హిమాచల్ ప్రదేశ్‌లోని నైనాదేవి గుడి వద్ద 162 మంది తొక్కిసలాటల్లోనే దుర్మణం పాలయ్యారు.
చరిత్ర పుటల్లో వెనక్కి వెళితే, 70 ఏళ్ళ క్రితం 1954లో స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళాలో అలహా బాద్‌లో జరిగిన తొక్కిసలాటలో 800 మంది ప్రాణాలు కోల్పోవడం గుండెల్ని మెలిపెట్టే విషాదం. రద్దీని నియంత్రించే వ్యవస్థలు లేకపోవడం, భారీగా జనం తరలివచ్చే సందర్భాలకు తగ్గట్టు ముందస్తు ప్రణాళికా రచన చేయకపోవడం, సామాన్యుల నియంత్రణే కష్టంగా ఉండే సమయంలో వీఐపీల తాకిడి ఎక్కువై యంత్రాంగమంతా వారి సేవల్లో తరించడం లాంటి లోపాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అది మరింత విషాదం.
భారతదేశంలో నూటికి 79 తొక్కిసలాటలు ధార్మిక సమ్మేళనాలు, తీర్థయాత్రల్లో జరుగుతున్నవేనని 2013లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. పైపెచ్చు, మన దేశంలో అనేక ఆలయాలు కొండల పైన, నదీ తీరాల్లో, ప్రయాణానికి సంక్లిష్టమైన ఇతర ప్రాంతాల్లో నెలకొన్నందున తొక్కిసలాటల ముప్పు ఎక్కువ. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక సమ్మేళనాలు నిర్వహిస్తుంటే వేలు, లక్షల్లో జనం రాకతో ఆ ప్రాంతాలు క్రిక్కిరిసి పోతున్నాయి.
అలాంటి చోట్ల ప్రాథమిక వసతులే కాదు... కనీసం సరైన ప్రవేశ మార్గాలు, అత్యవసర పరిస్థితుల్లో నిష్క్రమణ మార్గాలు సైతం ఉండట్లేదు. ఇవన్నీ ప్రమాదాలకు కారణాలే. వీటిని నివారించాలంటే జనసమ్మర్దాన్ని నియంత్రించే యంత్రాంగం కీలక పాత్ర పోషించాలి. 2014లోనే జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థ జనసమ్మర్ద నియంత్రణపై మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ, అవి ఎక్కడా అమలైనట్టు లేవు. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజా ఘటనతోనైనా పాలకులు నిద్ర లేస్తారా? ఓట్ల రాజకీయాల్ని వదిలేసి, మూఢనమ్మకాలు ప్రోత్సహించేవారికి ముకుతాడు వేస్తారా?
Comments
Please login to add a commentAdd a comment