విదర్భదేశానికి భీష్మకుడు రాజు. ఆయనకు రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు, అద్వితీయ సౌందర్యవతి, సుగుణాల రాశి అయిన ఒక్కగానొక్క కుమార్తె రుక్మిణి. ఆమె యుక్తవయస్సుకు రాగానే శ్రీకృష్ణుడు రుక్మిణి దేవి రూపలావణ్యాల గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకొంటాడు. అదేవిధంగా రుక్మిణీ దేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీ కృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకొంటుంది. రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్ళి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరిని శిశుపాలుడి కిచ్చి పెళ్ళి చేయాలని తీర్మానించడమే కాదు, ముహూర్తం కూడా పెట్టిస్తాడు.
ఈ విషయం తెలుసుకొన్న రుక్మిణీదేవి చాలా చింతిస్తుంది. కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిద్యోతనుడు అనే విప్రవరుడిని రప్పించి తన మనసులోని విషయం చెప్పి ద్వారకపురానికి వెళ్ళి శ్రీకృష్ణునకు తన అభీష్టాన్ని తెలిపి ముహూర్తం కంటే ముందే ఇక్కడకు వచ్చి తనని చేపట్టమని ప్రాధేయపడుతుంది.
అగ్నిద్యోతనుడు వెనువెంటనే ద్వారకకు వెళ్ళి రుక్మిణీదేవి మనోగతాన్ని శ్రీకృష్ణునకు విన్నవించడంతో పాటు రుక్మిణీ దేవిని ఏవిధంగా చేపట్టాలో కూడా సలహా చెబుతాడు. శ్రీ కృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు. వారిరువురూ విదర్భదేశం వైపు బయలుదేరుతారు. అగ్నిద్యోతనుడు రుక్మిణి వద్దకు వెళ్ళి శ్రీ కృష్ణుడితో జరిగిన సంభాషణనంతటినీ వివరించి ఏమీ భయపడవద్దని ఊరడించి శ్రీ కృష్ణుడు ఆమెని సర్వమంగళాదేవి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు.
అనుకున్న ప్రకారం రుక్మిణీదేవి నగర పొలిమేరలలో ఉన్న సర్వమంగళాదేవి ఆలయానికి వస్తుంది. అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది. రాజధాని వీథులలో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు. అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటాహుటిన ద్వారక వైపు బయలుదేరతాడు. అలా రుక్మిణీదేవిని తీసుకొని వెళ్ళుతున్న శ్రీ కృష్ణుడిని చూసి అందరూ తెల్లబోయారు. తేరుకొని శ్రీ కృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరారు. అప్పుడు బలరాముడు మొదలైన యదువీరులు ఆ రాజులను చెల్లాచెదరు చేశారు. వారంతా పిక్కబలం చూపి పారిపోతూ, శిశుపాలుని చూసి ‘బతికి ఉంటే కదా భార్య! ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరో రాచకన్యని పెళ్ళి చేసుకో‘మని చెబుతారు. కాని రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్ళి శ్రీ కృష్ణుడి రథానికి ఎదురుగా నిలిచి రకరకాలుగా దుర్భాషలాడుతూ కృష్ణునిపై బాణాలు విడుస్తుంటే శ్రీ కృష్ణుడు వాడి ధనుస్సు ఖండించాడు.
మరికొన్ని నిశిత శరాలతో రథాన్ని విరగ్గొట్టాడు. శిశుపాలుడు పరిగ, గద ఆదిగా గల అనేక ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటిని ఛేదిస్తాడు. పదే పదే చికాకు పరుస్తున్న రుక్మి శిరస్సు ఖండించబోగా రుక్మిణీదేవి ప్రార్థనతో శాంతించి రుక్మికి తల గొరిగించే సన్మానం చేస్తాడు. అది చూసి రుక్మిణీ దేవి విచారిస్తుండగా, బలరాముడు రుక్మిణీ దేవిని ఓదారుస్తాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని ద్వారకకు తీసుకొని వెళ్లి అక్కడ ఆమెను అంగరంగ వైభవంగా పరిణయమాడతాడు.
ఇందులో మనం తెలుసుకోదగ్గ నీతి ఏమిటంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఇష్టం లేని పెళ్లి చేయరాదు. అంతేకాదు, తల్లిదండ్రుల కోసం మనసు చంపుకుని పెళ్లి చేసుకుని, జీవితాంతం బాధపడకుండా తల్లిదండ్రులను ఒప్పించి కోరుకున్నవాడిని పెళ్లి చేసుకోవడం కొంత మేలు.
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment