భరత వంశంలో జన్మించిన కుశికుడు ఇంద్రుడితో సమానమైన తేజస్సు కలిగినవాడు. అతడి కొడుకు గాధి. కన్యాకుబ్జం రాజధానిగా పరిపాలన సాగించిన గాధి మహా రాజుకు చాలా కాలం సంతానం కలగలేదు. ఆ దిగులుతో సంతానం కోసం తపస్సు చేయాలని అడవులకు వెళ్ళి, సోమయాగం చేశాడు. ఆ యాగఫలంగా సత్యవతి అనే కూతురు కలిగింది.
ఆ రోజులలో భృగువంశ సంజాతుడైన చ్యవనుడికి ఋచీకుడనే కొడుకు ఉండేవాడు. ఋచీకుడు విఖ్యాతుడైన తపస్వి. గాధి కుమార్తెయైన సత్యవతిని వివాహమాడాలనే కోరికతో ఒక రోజు వెళ్ళి గాధిని అడిగాడు. ఋచీకుడిని ధన హీనుడిగా తలచిన గాధి, కన్యాశుల్కం ఇస్తేనే గాని తన కూతురిని వివాహమాడడానికి ఇవ్వనన్నాడు. శుల్కంగా ఏమి కావాలో కోరుకొమ్మన్నాడు ఋచీకుడు. ఒక చెవిశ్యామ వర్ణంతోను, మిగతా శరీరమంతా శ్వేతవర్ణంతో చంద్రుడిలా మెరిసే వెయ్యి వేగవంతమైన గుర్రాలను
శుల్కంగా కోరాడు గాధి. అలా కోరడంలో, అది మానవ సాధ్యమయ్యే పని కాదు గనుక, ఋచీకుడు నిస్సహాయంగా వెనుదిరిగి వెళ్ళి పోతాడని గాధి తలచాడు. కాని ఋచీకుడి తపశ్శక్తికి అది అసాధ్యం కాదని గాధి ఊహించలేదు.
చదవండి: హీరోయిన్ల బాటలో 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయం
అష్ట దిక్పాలకులలో ఒకడైన వరుణ దేవుడిని మనస్సులో తలుచుకున్నాడు ఋచీకుడు. ఋచీకుడికి ఏది కావాలంటే అది, ఎక్కడ కావాలంటే అక్కడ లభ్యమయ్యే వరమిచ్చాడు వరుణుడు. కన్యాకుబ్జం దగ్గర గంగానది ఒడ్డున కూర్చుని తనకు కావలసింది కోరుకున్నాడు ఋచీకుడు. అలా కోరిన వెంటనే గంగానది నీళ్ళ నుండి గాధి కోరుకున్న రూపంలో కాంతులీనుతూ వేయి గుర్రాలు ఉత్పన్నమయ్యాయి. ఆ వేయి గుర్రాలను శుల్కంగా గాధికి ఇచ్చి, సత్యవతిని పరిణయమాడాడు ఋచీకుడు. పూర్వం మహాతపస్సంపన్నులైన ఋషులకు సాధ్యం కానిదేదీ ఉండేది కాదని ఈ ఐతిహ్యం చెబుతుంది. ఈ కథ కారణంగానే నేటికీ కన్యాకుబ్జం నగరం దగ్గరి గంగానది అశ్వతీర్థంగా పిలవబడుతూ ఉందని వ్యాసుడి మహా భారతం, అనుశాసనిక పర్వం, నాలుగవ అధ్యాయంలో చెప్పబడింది.
– భట్టు వెంకటరావు
Comments
Please login to add a commentAdd a comment