Before Marriage Review: 'బిఫోర్ మ్యారేజ్' మూవీ రివ్యూ | Before Marriage 2024 Telugu Latest Movie Review - Sakshi
Sakshi News home page

Before Marriage Review: 'బిఫోర్ మ్యారేజ్' మూవీ రివ్యూ

Published Fri, Jan 26 2024 5:16 PM | Last Updated on Fri, Jan 26 2024 6:36 PM

Before Marriage Telugu Latest Movie Review - Sakshi

చిత్రం: బిఫోర్ మ్యారేజ్
విడుద‌ల‌: జ‌న‌వ‌రి 26
న‌టీన‌టులు: హీరో భారత్, హీరోయిన్ నవీన రెడ్డి, అపూర్వ‌...
గాయ‌నీగాయ‌కులు: మంగ్లీ, సంథిల్య పిస‌పాటి, అప‌ర్ణ నంద‌న్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ర‌వికుమార్ గొల్ల‌ప‌ల్లి,
మ్యూజిక్: పీఆర్
డీవోపీ: రాజశేఖర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: శ్రీధర్ రెడ్డి ఆటాకుల
నిర్మాత: ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి
ఎడిటింగ్: అలోష్యాస్ క్స‌వెర్
ప‌బ్లిసిటీ డిజైన‌ర్: జేకే ఫ్రేమ్స్
పీఆర్ఓ: ఆశోక్ ద‌య్యాల‌

యువ‌త‌ను ఆక‌ర్షించే క‌థ‌, దానికి తోడు ఓ మెసెజ్ ఇస్తే సినిమాను బ్ర‌హ్మండంగా హిట్ చేస్తారు ప్రేక్ష‌కులు. స‌రిగ్గా అలాంటి స‌బ్జెక్టుతో వ‌చ్చిన మూవీ 'బీఫోర్ మ్యారేజ్'. మూడు ద‌శాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా ప‌రిచ‌య‌మ‌వుతూ హనుమ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన‌ మూవీ 'బిఫోర్ మ్యారేజ్'. శుక్ర‌వారం థియేట‌ర్‌ల‌లో విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

క‌థేంటి
ధ‌ర‌ణి (నవీన రెడ్డి) తన కాలేజీ ఫ్రెండ్స్ శాంతి, ప్రశాంతితో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ చదువుకుంటుంది. కొత్త అలవాట్లు, ఎంజాయ్ మెంట్ కోరుకునే క్రమంలో అనుకోని పరిస్థితుల్లో ధరణి పెగ్నెన్సీ అవుతుంది. పెళ్ళి కాకుండానే తల్లి అవుతుందటంతో ఆమె జీవితం తలక్రిందులు అవుతుంది. దీంతో సామాజిక ఒత్తిడికి లోన‌వుతుంది. జీవితం త‌ల‌క్రిందులైన‌ట్టు మారిపోతుంది. ఈ ప‌రిస్థితుల్లో ఆమె తండ్రి ఆమెను అంగీకరిస్తారా? అలాంటి పరిస్థితిని ఎలా ఈ యువ‌తి అధిగమిస్తుంద‌నేదే ఈ సినిమా క‌థ‌.

న‌టీన‌టులు
ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన న‌వీన‌ రెడ్డి క్యూట్‌గా కనిపించింది. ఈ త‌రం అమ్మాయిల ఆలోచ‌న దోర‌ణి ఎలా ఉంటుందో స‌రిగ్గా అలాగే చేసి చూపించింది. మెయిన్ లీడ్ పాత్ర‌ను స‌మ‌ర్థ‌వంతంగా పోషించింద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే హీరో భార‌త్ ఆకాష్ పాత్రలో త‌న యాక్టింగ్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేశాడు. చక్క‌గా, చ‌లాకీగా క‌నిపించాడు. ఇక అపూర్వ త‌న పాత్ర త‌గ్గ‌ట్టుగా న‌టించి మెప్పించింది. ఇత‌ర పాత్రలు త‌మ ప‌రిది మేర‌కు న‌టించి మెప్పించారు.

సాంకేతిక విభాగం
ఈ సినిమాకు ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ పీఆర్ చేసిన పాట‌లు బాగున్నాయి. సింగ‌ర్ మంగ్లీ పాడిన పాట ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవ‌చ్చు. 'ఇదేమి జిందగీ. రొటీన్‌గా ఉన్నది.." పాట బాగుంది. ఇక నాచుర‌ల్‌గా విజువ‌ల్స్ క‌నిపించేలా షూట్ చేసిన డీవోపీ రాజశేఖర్ రెడ్డి ప‌నితీరు బాగుంది. అలోష్యాస్ క్స‌వెర్ ఎడిటింగ్ స‌రిగ్గా కుదిరింద‌ని చెప్పొచ్చు. క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మాత ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి కేర్ తీసుకున్న‌ట్టు క‌నిపిస్తుంది. స్క్రీన్ అందంగా, రిచ్‌గా క‌నిపిస్తుంది.

విశ్లేష‌ణ‌
చిన్న విష‌య‌మే క‌దా అని యువ‌త పెడ‌దోవ ప‌డితే ఏం జ‌రుగుతుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల‌ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు చిత్ర‌యూనిట్ ముందే ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లే ఈ సినిమాలో స‌న్నివేశాలుగా క‌నిపిస్తాయి. ద‌ర్శ‌కుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల తాను రాసుకున్న క‌థ‌కు త‌గిన‌ట్టే తెర‌మీద చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పొచ్చు. పెళ్లికి ముందు త‌ప్పు అనిపించ‌ని ఓ పొర‌పాటు.. లైఫ్‌ను పూర్తిగా మార్చేస్తుంద‌ని చూపించిన విధానంలో ఇచ్చిన మెసెజ్ యువ‌త‌కు సూటిగా తాకుతుంది. తాత్కాలిక ఆనందాల కోసం పెడదోవ పడుతున్న యువతకు ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఇస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించారు. యువ‌త థియేట‌ర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా అని త‌ప్ప‌కుండా చెప్పొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement