600 కోట్లతో 'మహాభారతం'
విజువల్ ఎఫెక్ట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఫిలిం మేకర్స్ దృష్టి పౌరాణిక, చారిత్రక కథాంశాల మీద పడింది. బాహుబలి లాంటి ఫాంటసీ ఘనవిజయం సాధించటంతో అదే తరహా చిత్రాలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాజమౌళి.., బాహుబలి తరువాత మహాభారత గాథను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రకటించాడు. అయితే ఇదే కథను వెండితెరకెక్కించేందుకు మరో నటుడు కూడా రెడీ అవుతున్నాడు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మహాభారత గాథను 600 కోట్లతో బడ్జెట్తో సినిమాగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ మహాభారతంలోని ముఖ్య ఘట్టాలతో రాసిన రంధమూలం అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. భీముడు ప్రధాన పాత్రగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మోహన్ లాల్ భీముడుగా నటించనున్నాడట.
మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే భీష్ముడిగా అమితాబ్, ద్రౌపదిగా ఐశ్వర్యరాయ్, అర్జునుడిగా విక్రమ్లను నటింపచేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరో ప్రధాన పాత్రకు టాలీవుడ్ కింగ్ నాగార్జునను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. మరి ఇంత భారీ తారాగణంతో, భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న మహాభారతం ఎప్పటికి పట్టాలెక్కుతుందో చూడాలి.