ఇండియాస్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చలనచిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్‌ని నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకటించింది.
1941లో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నాగేశ్వరరావు.. తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమలలో 71 సంవత్సరాల పాటు కొనసాగారు. తన కెరీర్‌లో 250 చిత్రాలకు పైగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోను స్థాపించి పలు సినిమాలను నిర్మించారు. ఈ క్రమంలో భారతదేశపు అత్యున్నతమైన పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు. 1924 సెప్టెంబరు 20న జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు 2014 జనవరి 22న మరణించారు.
'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఈవెంట్ సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు కొనసాగుతుంది. దేశంలో 25 ప్రధాన నగరాల్లో నాగేశ్వరరావు నటించిన 10 సూపర్ హిట్ క్లాసిక్ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రోలతో పాటు వడోదర, జలంధర్, తుమకూరు వంటి చిన్న నగరాల్లో కూడా ఈ సనిమాలు రిలీజ్ అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని ప్రధాన సిటీలలో విడుదల అవుతాయి.
సెప్టెంబర్ 20 నుంచి విడుదల కానున్న సినిమాలు
దేవదాసు (1953), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), భార్య భర్తలు (1961), గుండమ్మ కథ (1962)
డాక్టర్ చక్రవర్తి (1964), సుడిగుండాలు (1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం (1981), మనం (2014)
నిధులు
ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం, NFDC - నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా , మల్టీప్లెక్స్ చైన్ PVR-Inox సంయుక్తంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాయి. నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ కింద భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నిధులు సమకూరుతాయి.
తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది: నాగార్జున
'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఈవెంట్ గురించి నాగార్జున ఇలా రియాక్ట్ అయ్యారు. 'కొన్ని దశాబ్దాలుగా ప్రజల హృదయాలలో నిలిచిపోయే పాత్రలలో నాగేశ్వరరావు గారు నటించారు. ఆయన సాధువుగా కనిపించినా, మద్యపానానికి బానిసగా ఆపై రొమాంటిక్ హీరోగా అనేక రకాల పాత్రలను పోషించడంలో అద్భుతమైన ప్రతిభ చూపారు. అందుకే ఆయన్ను 'నటసామ్రాట్' అని పిలుస్తారు. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించిన మార్గదర్శకుడు. అతని వారసత్వం గురించి మేము చాలా గర్విస్తున్నాము. ఈ పండుగ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కేవలం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు ఒక ఐకాన్‌ను గుర్తుంచుకుంటారు.' అని నాగ్ అన్నారు.
ఆ అదృష్టం నాకు కలిగింది: అమితాబ్ బచ్చన్
'అక్కినేని నాగేశ్వరరావు గారిని చాలా సందర్భాల్లో కలుసుకునే అదృష్టం నాకు కలిగింది. ఇతరుల పట్ల ఆయన చూపించే ప్రేమ, వినయం ఎప్పుడూ ఆశ్చర్యాన్ని తెప్పిస్తాయి. భారతీయ సినిమా వారసత్వాన్ని తిరిగి పెద్ద తెరపైకి తీసుకురావాలనే ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ ఈ పండుగను జరుపుతుంది. బహుముఖ ప్రజ్ఞ, లెజెండరీ నటుడి గురించి అందరూ తెలుసుకునే అద్భుతమైన అవకాశం మనకు దక్కుతుంది.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment