నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చిన అవార్డు ఇది: చిరంజీవి | Amitabh Bachchan honours Chiranjeevi with ANR Award | Sakshi
Sakshi News home page

నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చిన అవార్డు ఇది: చిరంజీవి

Published Tue, Oct 29 2024 2:47 AM | Last Updated on Tue, Oct 29 2024 11:14 AM

Amitabh Bachchan honours Chiranjeevi with ANR Award

ఏఎన్‌ఆర్‌ అవార్డు అందుకున్న సందర్భంగా హీరో చిరంజీవి

‘‘సినీ పరిశ్రమను నా ఇల్లు అనుకుంటే... ఈ పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాలప్పుడు (2007) వచ్చింది. అందరూ కలిసి నాకు లెజండరీ అవార్డు ప్రదానం చేస్తుంటే హ్యాపీ ఫీలై, ఎంత ధన్యుణ్ణి అనుకున్నా. కానీ... కొన్ని ప్రతికూల పరిస్థితులు... కొంతమంది హర్షించని ఆ సమయంలో ఆ అవార్డు తీసుకోవడం సముచితంగా అనిపించలేదు. అందుకే ఈ టైమ్‌ క్యాప్సూ్యల్లో అవార్డు ఉంచి, నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అన్నాను.

ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్‌ ఏఎన్నార్‌ అవార్డు్డను పుచ్చుకున్న రోజున... అదీ అమితాబ్‌గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున... నా మిత్రుడు... నా సోదరుడు నాగ్‌ మనస్ఫూర్తిగా ఈ అవార్డుకు మీకు అర్హత ఉంది... తీసుకోండి అని అన్న రోజున ఇప్పుడు ఇంట గెలిచాను... రచ్చా గెలిచాను’’ అని హీరో చిరంజీవి ఎంతో భావోద్వేగంగా ప్రసంగించారు. లెజండరీ నటుడు ‘ఏఎన్నార్‌’ అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి ఈ విధంగా పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, పలువురు చిత్రరంగ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదగా ‘ఏఎన్నార్‌ అవార్డు’ అందుకున్నారు చిరంజీవి.  

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పద్మభూషణ్‌లు, పద్మ విభూషణ్‌లు, పర్సనాలిటీ ఆఫ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు... ఇలా ఎన్ని అవార్డులు వచ్చినా సరే... ఏఎన్‌ఆర్‌ అవార్డు నాకు ప్రత్యేకం. ఎందుకంటే నా వాళ్లు నన్ను గుర్తించి, ప్రశంసించి, ఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు అది నిజమైన అచీవ్‌మెంట్‌ అని ఫీలయ్యాను. అందుకే నాగ్‌తో ఇది ప్రత్యేకమైన అవార్డు అని చెప్పాను. 

అమితాబ్‌గారి మాటలు ఎనర్జీ ఇచ్చాయి
నాకు పద్మభూషణ్‌ అవార్డు వచ్చినప్పుడు ఫిల్మ్‌ ఇండస్ట్రీ నన్ను సత్కరించింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి, అమితాబ్‌ బచ్చన్‌గారు  ‘చిరంజీవి ద కింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ అన్నారు. నా హిందీ ‘ప్రతిబంథ్‌’ సినిమా చూసి, అమితాబ్‌గారు ‘పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌. డన్‌ ఏ గుడ్‌ జాబ్‌. ప్రయోజనాత్మక సినిమా’ అన్నారు. ఆ మాటలు ఎనర్జీ ఇచ్చాయి.

నాన్న పొగడాలనుకున్నాను
మా నాన్నగారికి నటనంటే చాలా ఇష్టం. కానీ నన్ను పొగిడేవారు కాదు... ఏంటమ్మా... నాన్నగారు ఏం అనరు.. మాట్లాడరు. బయట ఎంత గెలిచినా ఇంట గెలవమంటుంటారు కదా అనేవాడిని. ‘చాలా పొగుడుతారు... కానీ తల్లిదండ్రులు పిల్లలను పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’ అని మా అమ్మ అన్నారు. ఆ రోజు అనిపించింది... నేను ఎప్పుడో ఇంట గెలిచాను అన్నమాట. అలాగే రచ్చ కూడా గెలిచాను.  

మా అమ్మ ఏఎన్నార్‌ సీనియర్‌ మోస్ట్‌ ఫ్యాన్‌ 
ఏఎన్నార్‌గారి ఫ్యాన్స్‌లో సీనియర్‌ మోస్ట్‌ ఫ్యాన్‌ మా అమ్మ. ఆమె నిండు గర్భిణీతో ఉన్నప్పుడు ఏఎన్నార్‌గారి ‘రోజులు మారాయి’ సినిమా చూడాలనుకుంది. అమ్మ తన పుట్టింట్లో మొగల్తూరులో ఉండేది. నర్సాపూర్‌ దాటి పాలకొల్లు వెళ్లి, సినిమా చూడాలి. నాన్న జట్కా బండి ఏర్పాటు చేశారు. గతుకుల రోడ్డు. మొగల్తూరు వైపు వెళుతున్న బస్సు ఈ బండికి ఎదురుగా వచ్చింది. దానికి దారి ఇచ్చే క్రమంలో జట్కా బండి పొలాల్లో దొర్లింది. బండిలో ఉన్న అందరూ కిందపడ్డారు. నాన్న కంగారుపడి, అమ్మతో ‘పద.. ఇంటికి వెళ్లిపోదాం’ అన్నా ‘సినిమా చూడాల్సిందే’ అని పట్టుబట్టి వెళ్లింది. ఆ తర్వాత రెండు నెలలకు నన్ను బయట పడేసింది. ఏఎన్‌ఆర్‌గారి మీద నాకు ఉన్న అభిమానం అమ్మ ద్వారా... ఆ బ్లడ్‌ ద్వారా వచ్చిందేమో.  

Chiranjeevi:ఈ అవార్డు నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది

చిరంజీవికి ఎముకలు లేవన్నారు ఏఎన్‌ఆర్‌గారు 
నాకు నాగేశ్వరరావుగారి సినిమాల్లో డ్యాన్సులంటే ఇష్టం. ఆయన పాటలకు నాకు తెలిసిన పద్ధతిలో డ్యాన్సులు వేసుకునేవాడిని. నాకు డ్యాన్సుల్లో ఇన్‌స్పిరేషన్‌ ఎవరంటే అక్కినేనిగారు. అయితే ఆయన నా గురించి ఓ ఇంటర్వ్యూలో ‘నాకు ఎముకలు ఉన్నాయి... కానీ చిరంజీవికి లేవు. ఈ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి డ్యాన్సులు పరిచయం చేసింది నేనే. కానీ ఆ డ్యాన్సులకి స్పీడు పెంచింది, గ్రేసు పెంచింది చిరంజీవి’ అన్నారు. ‘ఇది గొప్ప గొప్ప అవార్డులతో సమానం’ అనిపించింది.

అలాగే ఇండస్ట్రీ మద్రాసు నుంచి ఇక్కడికి రావడానికి కృషి చేసిన మహానుభావుడు ఏఎన్‌ఆర్‌గారు. ‘కాలేజీ బుల్లోడు’ హండ్రెడ్‌ డేస్‌ ఫంక్షన్‌కి నన్ను పిలిస్తే వెళ్లాను. అందరూ ఒకటే కేరింతలు... కేకలు. ఆయన పక్కకి తిరిగి, ‘ఎవరి కోసం అవన్నీ అనుకున్నావ్‌...’ అంటే ‘మీ కోసం’ అన్నాను. ‘మాది అయిపోయింది. నీ కోసమే’ అంటూ, నన్ను ఎంకరేజ్‌ చేశారు. అలా ప్రశంసించే గొప్ప మనసు చాలామందికి ఉండదు. ఆ తర్వాత ఆయనతో ‘మెకానిక్‌ అల్లుడు’ చేసే గొప్ప చాన్స్‌  వచ్చింది. ఆయన్ను చూస్తే నాకో ‘ఫాదర్లీ ఫీలింగ్‌’.

నాగ్‌ నాకు డాక్టర్‌లాంటి వాడు 
ఆరోగ్య సూత్రాలు పాటించడం, ఎక్సర్‌సైజుల విషయంలో, యంగ్‌గా ఉండటానికి చూపించే శ్రద్ధలో నాగ్‌ నాకెంతో ఇన్‌స్పిరేషన్‌. నాకు ఆరోగ్య సూత్రాలు తెలిపే డాక్టర్‌. ఇక దేవానంద్, లతా మంగేష్కర్, అమితాబ్, బాలచందర్‌గార్లు... ఇలా గొప్ప గొప్పవారికి ఇచ్చిన ఏఎన్నార్‌ అవార్డు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఇచ్చిన అవార్డులా భావిస్తున్నాను’’ అన్నారు.

ఏఎన్‌ఆర్‌ని ఎవరూ మ్యాచ్‌ చేయలేరు: అమితాబ్‌ బచ్చన్‌ 
‘‘ఇండియన్‌ సినిమాకు ఏఎన్నార్‌గారు చేసిన కాంట్రిబ్యూషన్‌ను ఎవరూ మ్యాచ్‌ చేయలేరు. ఈ సందర్భంగా నా తండ్రి రాసిన ఓ హిందీ పద్యంలోని ఓ లైన్‌ను ఇక్కడ ప్రస్తావించాలనుకున్నాను. ‘‘నా కుమారులైనంత మాత్రాన... నా కుమారులు నాకు వారసులు కాలేరు. ఎవరైతే నా వారసులవుతారో వారే కుమారులు’’ అని ఉంది. గొప్ప వ్యక్తి ఏఎన్నార్‌గారికి నిజమైన వారసులుగా, కుమారులుగా నాగార్జున ఆయన కుటుంబం నిరూపించుకుంది. నా ఫ్రెండ్‌ చిరంజీవికి ఈ అవార్డును అందించేందుకు నన్ను ఎంపిక చేసిన నాగ్‌కు థ్యాంక్స్‌.

ఆ ఇద్దరూ ఏబీసీ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా: నాగార్జున 
‘‘ఏఎన్‌ఆర్‌... ఈ మూడు అక్షరాలే నాకు ప్రపంచం. ఏ లెజెండ్‌ లివ్స్‌ ఆన్‌. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తులని గౌరవించడం ఏయన్నార్‌ అవార్డు ముఖ్యోద్దేశం. ఈ రోజు అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు. ఇండియన్‌ సినిమాకు ఏబీ 
(అమితాబ్‌) సి (చిరంజీవి).. అమితాబచ్చన్‌గారు, మెగాస్టార్‌ చిరంజీవిగారు. చిరంజీవిగారికి అవార్డు ప్రదానం చేయడానికి అమితాబచ్చన్‌గారు రావడం ఆనందంగా ఉంది. ఏఎన్‌ఆర్‌ శతజయంతి సందర్భంగా ఇది మాకు ఎంతో ప్రత్యేకం. అమితాబ్‌గారి సామాజిక బాధ్యతకు మేం సెల్యూట్‌చేస్తున్నాం. 1985లో నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు.. నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవిగారి షూటింగ్‌ జరుగుతుంటే ఆయన డాన్స్‌ చూడమని చెప్పారు. 

ఆ డాన్స్, గ్రేస్, కరిష్మా చూసి ఆయనలా డాన్స్‌ చేయగలనా అనిపించింది. చేయలేం...  కెరీర్‌లో మరో దోవ వెతుక్కుంద్దామనుకుని బయటకు వచ్చాను. మనం సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని నాన్నగారు అనేవారు. చిరంజీవిగారు, అమితాబచ్చన్‌ గారు అదే చేసి చూపించారు. ఒకటే చెప్పగలను... ఈ ఇద్దరూ ‘ఏబీసీ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ «థ్యాంక్స్‌. ‘ఏఎన్‌ఆర్‌ లీవ్స్‌ ఆన్‌’. ఈ వేడుకలో కీరవాణి ఆధ్వర్యంలో ఏఎన్‌ఆర్‌ హిట్‌ పాటలను పలువురు గాయనీ గాయకులు ఆలపించారు. ఇక ఆస్కార్‌ విజేత కీరవాణిని ఈ వేదికపై నాగార్జున ప్రత్యేకంగా సన్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement