దుర్యోధనుడి గర్వభంగం
పురానీతి
మాయాజూదంలో ఓటమి పాలైన పాండవులు వనవాసంలో నిరుపేదల్లా గడపసాగారు. హస్తినాపురంలో దుర్యోధనాది కౌరవులు అష్టైశ్వర్యాలతో తులతూగసాగారు. అడవులలో ఉన్న పాండవులను మరింత అవమానించాలని తలచాడు దుర్యోధనుడు. శకుని, కర్ణ, దుశ్శాసనులు అతడి ఆలోచనకు వంత పాడారు. వనవాసంలో ఉన్న పాండవుల వద్ద ఐశ్వర్య బలప్రదర్శన చేసి వారిని చిన్నబుచ్చాలని దుష్టచతుష్టయం నిశ్చయించుకున్నారు. వనవాసంలో పాండవులు ఆవాసం ఏర్పరచుకున్న ద్వైతవనంలో కౌరవుల గోవులు ఉండేవి.
అందువల్ల పథకం ప్రకారం క్రూరమృగాల వల్ల గోవుల ప్రాణాలకు హాని కలుగుతోందని ధృతరాష్ట్రుడి ఎదుట కొందరు గోపాలకుల చేత సభలో చెప్పించారు. ఆ నెపంతో గోరక్షణ కోసం ద్వైతవనానికి వెళ్లేందుకు దృతరాష్ట్రుడి అనుమతి పొందారు.
దుష్టచతుష్టయం సమస్త పరివారంతో, రాజ వైభవ లాంఛనాలతో అట్టహాసంగా ఘోషయాత్రకు బయలుదేరారు. ద్వైతవనానికి చేరువలో కమలాలతో నిండిన ఒక సుందర సరోవరం ఒడ్డున గుడారాలు నిర్మించుకుని విడిది చేశారు. అక్కడకు చేరువలోనే పాండవుల పర్ణశాల ఉంది. అద్భుతమైన సరోవర సౌందర్యానికి ముగ్ధులైన కౌరవులు అందులోకి దిగి యథేచ్ఛగా జలక్రీడలు ప్రారంభించారు. ఇంతలో కొందరు గంధర్వులు అక్కడకు పరుగు పరుగున చేరుకున్నారు. ‘ఇది మా ప్రభువు చిత్రసేనుడు నిర్మించుకున్న సరోవరం. ఇందులో అన్యులకు ప్రవేశం నిషిద్ధం. తక్షణమే ఇక్కడి నుంచి తొలగిపొండి’ అని హెచ్చరించారు.
గంధర్వుల మాటలకు దుర్యోధనాది కౌరవులు వికటాట్టహాసాలు చేస్తూ ‘సాక్షాత్తు దేవేంద్రుడే వచ్చినా మేము ఇక్కడి నుంచి తొలగిపోయే ప్రసక్తే లేదు’ అని పలికి వారిని గెంటివేశారు. చేసేది లేక వారు తమ లోకానికి చేరుకుని జరిగినదంతా తమ ప్రభువైన చిత్రసేనుడికి విన్నవించారు. ఆగ్రహంతో రగిలిపోయిన చిత్రసేనుడు సేనలను తోడ్కొని వెళ్లి కౌరవులను ముట్టడించాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న కౌరవ సేనలు గంధర్వులతో యుద్ధానికి తలపడ్డాయి. గంధర్వుల ధాటికి తాళలేని కౌరవ సేనలు ద్వైతవనంలోని పాండవుల పర్ణశాల వైపుగా పరుగులు ప్రారంభించాయి. గంధర్వుల దాడిలో కర్ణుడు క్షణాల్లోనే విరథుడై, నిరాయుధుడిగా మిగిలాడు. దుర్యోధనుడికి, అతడి సోదరులకు కూడా అదే గతి పట్టింది. చిత్రసేనుడు వారందరినీ బంధించి తీసుకుపోసాగాడు.
ఈలోగా పారిపోయిన కౌరవ సైనికులు ధర్మరాజు వద్దకు చేరుకుని దుర్యోధనాదులు గంధర్వుల చేతికి బందీలుగా చిక్కారని, వారిని విడిపించాలని మొరపెట్టుకున్నారు. అక్కడే ఉన్న భీముడు వారి మాటలు విని... ‘అన్నయ్యా! కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు. మనకు భారం తగ్గింది’ అన్నాడు. అప్పుడు ధర్మరాజు... ‘భీమసేనా! నువ్విలా అనరాదు. శరణార్థులైన వారు ఎలాంటి వారైనా వారిని కాపాడటమే ఉత్తమ వీరుల లక్షణం. పైగా, కౌరవులు మనకు స్వయానా దాయాదులు. వారికి సాయపడటం మన ధర్మం’ అని పలికాడు. అందువల్ల గంధర్వులను వారించి, కౌరవులను విడిపించమని భీమార్జునులను పురమాయించాడు.
కౌరవులను విడిచిపెట్టమని అర్జునుడు నచ్చచెప్పగా గంధర్వులు వినిపించుకోకుండా, పాండు సోదరులపై ఆయుధాలు సంధించారు. ఇక అర్జునుడు గాండీవానికి పనిచెప్పాడు. తన శర పరంపరతో గంధర్వులను నిరాయుధులుగా చేశాడు. తన సేనలు చిక్కుల్లో పడ్డాయని తెలుసుకున్న చిత్రసేనుడు అక్కడకు వచ్చాడు. అతడు అర్జునుడికి అదివరకే మిత్రుడు. అర్జునుడిని చూడటమే తడవుగా యుద్ధాన్ని విరమించుకోమని తన సేనలను ఆదేశించాడు. అర్జునుడి మాటపై కౌరవులను విడిచిపెట్టాడు. సోదరులతో కలసి ద్వైతవనానికి తిరిగి వచ్చిన కౌరవులను ధర్మరాజు సాదరంగా ఆహ్వానించాడు. జరిగిన దానికి బాధపడవద్దని, అనవసరంగా ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడవద్దని దుర్యోధనుడికి హితవు చెప్పి సాగనంపాడు.