దూరం చేసే అహంకారం | Mahabharat War was due to Pride | Sakshi
Sakshi News home page

దూరం చేసే అహంకారం

Published Mon, Jul 25 2022 12:15 AM | Last Updated on Mon, Jul 25 2022 12:36 AM

Mahabharat War was due to Pride - Sakshi

అహంకారం... అయిన వాళ్ళనే కాదు, కానివాళ్లనూ దూరం చేస్తుంది. అందరితో వ్యతిరేకతను పెంచి,  సమాజానికి దూరంగా బతికేలా చేస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తులను ఏ సమాజమూ గుర్తించదు.   ఏ మనిషీ గౌరవించడు. సరికదా, అవసరమయినపుడు ఆదుకునేవారు లేక అలాంటి వ్యక్తులు నానా ఇబ్బందులూ పడతారు.

నిత్య జీవితంలో చాలామంది తమ గురించి, తమ  ఆలోచనల గురించి గొప్పగా ఊహించుకుంటూ, తాము అందరికంటే ఉన్నతులమని, తమకంటే గొప్ప వారు మరొకరు లేరని భ్రమిస్తూంటారు. చేస్తున్న ప్రతిపనిలోనూ తమ గొప్పతనాన్ని చాటుకుంటూ, తాము ఇతరులకు భిన్నమని, ఇతరులకంటే తాము చాలా ఎక్కువమని భావిస్తూ వాస్తవానికి దూరంగా జీవిస్తారు.

వారిలో ఏ విశేషమూ లేకపోయినా, ఎంతో విఖ్యాతులమని విర్రవీగుతారు. తమలోని వాపును కూడా మహాబలమని భ్రమిస్తారు. అణకువతో ఓ మెట్టు దిగుదామన్న విషయాన్ని అటుంచి దానిని అవమానంగా భావిస్తారు. ఇలా అంతర్యామికీ, అంతరాత్మకూ మధ్య ఉన్న ఆ అదృశ్య, అతి ప్రమాదకర అంతఃశత్రువే అహంకారం. దానినే మనం గర్వమని కూడా పిలుస్తుంటాం.

వినమ్రతకు అహంకారం బద్ధ వ్యతిరేకం. గర్విష్టికి భగవంతుడు ఆమడదూరంలో ఉంటాడు. ముందు ‘నేను’ అనే మాయ నుంచి బయట పడితే, ఆ తరువాత తన దరికి చేర్చుకుంటానంటాడు. నిజానికి  ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం ఆత్మను పొందడం కాదు. అహంకారాన్ని పోగొట్టుకోవడమే.

మనం తినే తిండిలో కారం ఎక్కువైతే శరీరంలోని రక్తం మలినమవుతుంది. అదే అహంకారం పాలు ఎక్కువైతే మానవత్వమే మంటకలసి పోతుంది. ఎవరిలో అహంకారం ప్రవేశిస్తుందో అలాంటి వారు అధోగతి పాలవుతారు. చెదపురుగు పట్టిన వస్తువు ఏ విధంగా పనికి రాకుండా పోతుందో, అదేవిధంగా అహంకారం అనే చెదపురుగు పడితే మానవవత్వం మృగ్యమైపోతుంది. మనిషికి బుర్ర నిండా వెర్రి ఆలోచనలు కలిగిస్తుంది. మానవత్వం నుంచి రాక్షసత్వంలోకి మనిషిని నెట్టేస్తుంది.

   గర్వం లేదా అహంకారం ఎవరిలో ప్రవేశిస్తుందో వారి గతి అధోగతే. మనిషిలో గర్వం, అహంకారం కొంచెం ఉన్నా అవి మనిషిని నిలువునా ముంచేస్తాయి. గర్వంతో కూడిన విజయం ఎల్లప్పుడూ శాశ్వతం కాదు. అలాంటి విజయం వలన తాత్కాలిక ఆనందం పొందినప్పటికీ, సమస్యలు వచ్చినప్పుడు మనకు తోడుగా ఎవరూ ఉండరని గుర్తుంచుకోవాలి. నాది, నేను అనే భావనలు మనిషిలో గర్వాన్ని, అహంకారాన్ని పెంచుతాయి. ఈ రెండు భావనలను మనసు నుంచి తుడిచేస్తే జీవితంలో ఎలాంటి విజయాన్నైనా  సొంతం చేసుకోవచ్చు.

దుర్యోధనుడి విపరీతమయిన అహంకారం వల్లే  మహా భారత సంగ్రామం జరిగింది.  గర్వితుడయిన దుర్యోధనుడి అహంకారం వల్ల పాండవులకు ధర్మంగా  రావల్సిన రాజ్యం కూడా రాకుండా పోయింది. అంతేకాదు ద్రౌపది వస్త్రాపహరణానికి,  కౌరవ సేనల అకృత్యాలకు, జూదంలో ధర్మరాజును మాయతో గెలిచిన తీరుకు... ఇలా అన్నింటికీ దుర్యోధరుని అహంకారమే కారణమయ్యింది. ఆ అహంకారం వల్లే సాక్షాత్తు శ్రీ కృష్ట భగవానుడు యుద్ధం వద్దని వారించడానికి వచ్చినా దుర్యోధనుడు వినలేదు.. కయ్యానికి కాలు దువ్వి , తాను నాశనమవడమే కాకుండా ఏకంగా కురు వంశం నాశనమవ్వడానికి కారణమయ్యాడు. ఇలా దుర్యోధనుడే కాదు మన పురాణాలలో అనేక మంది పురాణ పురుషులు అహంకారంతో తమ నాశనాన్ని తామే కోరి తెచ్చుకున్నారు.

గర్వమనేది మనిషిని పూర్తిగా నిర్వీర్యుడ్ని చేసి, పతనానికి పునాది వేస్తుంది. కనుక ఎవరైనా ఒకరిపై గెలిచామనే గర్వంతో ఆనందిస్తున్నారంటే వారిలో మానసిక వైకల్యం ఉన్నట్టుగానే భావించాలి. గర్వం నాశనానికి తొలి మెట్టు. మనిషిలో గర్వం అనే అగ్నిని రాజేస్తే, ఆ తర్వాత అది దుఃఖానికి కారణమవుతుంది.

  మనషి బతికి ఉన్నప్పుడే నేను, నాది అనే  భావనలు కలుగుతాయి. మరణించాక శ్మశానంలో రాజైనా,సేవకుడైనా,ధనికుడైనా, పేదవాడైనా ఒక్కటే. అందువల్ల ఈ భూమి మీద బతికున్నంత కాలం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవించడానికి కృషి చేయాలి. గర్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లో దరి చేరనివ్వకుండా సచ్ఛీలతతో తమకున్నదానిలో ఇతరులకు సహాయం చేసేవాడే నిజమైన విజేత అవుతాడన్న వాస్తవాన్ని గుర్తెరగాలి.

విధేయత, అణకువ లాంటి లక్షణాలు మనుషులను విజయతీరాలకు తీసుకువెళతాయి. అందువలన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరినప్పటికీ గర్వం, తలకెక్కించు కోకుంటే అసలైన విజయం సొంతం అవుతుంది. గర్వం లేనివారు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో తప్పక విజయం సాధిస్తారు.
గర్వం లేనప్పుడు దురభిప్రాయం ఉండదు. ఎందుకంటే గర్వం, దురభిప్రాయం రెండూ వేరు వేరు కాదు. మనిషికి ఒకదాని పట్ల గర్వభావన ఉంటే వేరొక దాని పట్ల దురభిప్రాయం, అంటే చిన్న చూపు ఉన్నట్లే. కనుక గర్వం ఒక విధమైన దురభిప్రాయంలో నాటుకుపోయి ఉంటుంది.

అహంకారం అనేది ఎక్కడో ఉండదు. అజ్ఞాతంగా మనలోనే ఉంటుంది. ఇది అనేక అనర్థాలకు మూలకారణమవుతుంది. ఉన్న పళంగా ఆకాశానికి ఎత్తేసి, ఆ ఆకాశం నుంచి ఒక్క ఉదుటన పాతాళంలోకి తోసేస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తులెవరైనా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు.


– దాసరి దుర్గా ప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement