గంగాశాంతనులు | Mahabharata characters: Fifth Veda | Sakshi
Sakshi News home page

గంగాశాంతనులు

Published Sun, May 24 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

గంగాశాంతనులు

గంగాశాంతనులు

ఐదోవేదం: మహాభారత పాత్రలు
మహాభారతమనే కథ, కౌరవ పాండవులకు మూడు తరాల కింద నుంచి మొదలవుతుంది. నిజానికి, కౌరవులనే మాట అందరికీ సమానమైనదే. అందరూ కురురాజ వంశం వాళ్లే. మరి కౌరవశబ్దం పాండవులకు ఎందుకని వాడరు? ఎందుకంటే ‘కురు’ అనే మాటను ‘పనిచెయ్యడం’ అనే అర్థంలో వాడతారు. పనులు జరిగే చోటేమో శరీరం. శరీరానికి అంకితమైనవాళ్లు కౌరవులు.

పండా అంటే బుద్ధీ జ్ఞానమూ గనక, పాండవులు, వంశరీత్యా కురువంశంవాళ్లే అయినప్పటికీ, బుద్ధికీ జ్ఞానానికీ ప్రతీకలు. ధర్మానికి అంకితమైనవాళ్లు గనక, పాండవుల్ని కౌరవ శబ్దాన్నుంచి వేరు చేశారు. సరే, ఇప్పుడు ఆ ముందుతరాల వైపు తిరిగి దృష్టి సారిద్దాం.
 
ప్రతీపుడనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు వయసు మీరినా పిల్లలు కలగకపోవడంతో భార్యతో కలసి పిల్లలకోసం తపస్సు చేశాడు. ఆ దంపతుల తపఃఫలంగా ఒక పిల్లవాడు కలిగాడు. వయసు బాగా పైబడిన తరువాత కామం బాగా శాంతించిన తరువాత పుట్టాడు గనక, ఆ పిల్లాడికి ‘శాంతనుడ’ని పేరుపెట్టారు. అంతకుముందు ఒకసారి ప్రతీపుడొక్కడే గంగ ఒడ్డున కూర్చొని ఉండగా, గంగానదే, ఒక అందమైన అమ్మాయి రూపాన్ని దాల్చి, అతని కుడి తొడమీద కూర్చుని ‘నన్ను పెళ్లి చేసుకో’మని కోరింది.

శాస్త్రం ప్రకారం కుడి తొడ మీద కూర్చునేవాళ్లు కొడుకులూ కూతుళ్లూ కోడళ్లూ అవుతారు; ఎడమ తొడమీద కూర్చునేవాళ్లే భార్యలుగా కావడానికి తగినవాళ్లు. ప్రతీపుడు ఈ మాటనే చెప్పి, మా పిల్లాడికి నువ్వు పెళ్లానివి అవుదుగానిలే అని ఆవిడను ఒప్పించాడు. ప్రతీపుడికి పుట్టిన శాంతనుడు అంతకుముందు జన్మలో మహాభిషుడనే రాజు. అతను ఒకసారి బ్రహ్మసభకు వెళ్లినప్పుడు, అక్కడకు వచ్చిన గంగాదేవిని చూసి మోహంలో పడ్డాడు.

బ్రహ్మ ఎదురుగుండానే అతను కామమోహితుడిగా కనిపించడం వల్ల, ‘నువ్వు మనుషుల్లో పుట్టి తిరిగి బ్రహ్మలోకానికి రాగలుగుతావు’ అని శపించాడు బ్రహ్మ. ‘గంగ అంటే మహామోహంలో పడ్డావు గనక, నువ్వు మనుషుల లోకంలో పుట్టినప్పుడు, ఆవిడే నీకు ప్రతికూలంగానూ, అప్రియంగానూ ప్రవర్తిస్తుంది’ అని శాపాంతమూ చెప్పాడు.
 
బ్రహ్మ లోకం నుంచి తిరిగి వెళ్తూన్నప్పుడు గంగాదేవికి దిగాలు ముఖాలతో కాళ్లీడ్చుకుంటూ వెళ్తూన్న అష్టవసువులు అగుపడ్డారు. ఆ ఎనిమిది మంది వసువుల్లో ద్యుమంతుడనేవాడు (ఇతన్ని ప్రభాసుడని కూడా చెబుతూ ఉంటారు) భార్య మెప్పు కోసం వశిష్ఠ మహర్షి హోమధేనువును ఇతర వసువుల సాయంతో దొంగిలించుకొని వచ్చాడు. ఇంతట్లో వశిష్ఠుడు ఫలాలూ సమిధలూ తీసుకొని రానేవచ్చాడు.

తన నందినీ ధేనువూ, దాని దూడా అక్కడ కనిపించలేదు. దివ్యదృష్టితో వసువుల నిర్వాకాన్ని కనిపెట్టి, వాళ్లందర్నీ మనుషులుగా పుట్టమని శపించాడాయన. మనుషుల్లో పుట్టడమంటే పనులు చేయడమూ వాటివల్ల వచ్చిపడే బంధనాల్లో చిక్కుకోవడమూ అనే వరస నిరంతరమూ జరుగుతూ ఉంటుంది. ఆ చిక్కుల నుంచి బయటపడాలంటే చాలా కష్టాలే పడాలి. శాపం గురించి విని, వాళ్లందరూ వచ్చి వశిష్ఠుణ్ని ప్రసన్నం చేసుకొందామని ఆయన్ను బతిమాలుకొన్నారు.

‘మీరందరూ ప్రతి సంవత్సరమూ ఒక్కొక్కళ్ల చొప్పున శాపమోక్షాన్ని పొందుతారు గానీ, ఈ ద్యుమంతుడు అసలైన నేరస్థుడు గనుక, ఇతను మాత్రం, తన కర్మ కారణంగా, చాలాకాలం పాటు మానుష లోకంలో ఉండవలసి వస్తుంది. ఇతనికి పిల్లలు కలగరు; తండ్రికి ప్రియాన్ని చేయడం కోసం స్త్రీ భోగాల్ని పూర్తిగా విడిచిపెడతాడు కూడాను. అయితే, ఇతను సర్వశాస్త్రాల్లోనూ విశారదుడవుతాడులే’ అని వశిష్ఠుడు వాళ్లకు చెప్పి పంపించాడు.దిగాలుపడి వస్తూన్న వసువులు గంగతో తమ శాప వృత్తాంతం చెప్పుకొని ‘ప్రతీపుడి కొడుకును మేము తండ్రిగా ఎన్నుకొంటాం.

మమ్మల్ని నువ్వే మనుషుల లోకం నుంచి త్వరగా వెనక్కి తీసుకొని రావాలి’ అంటూ గంగను బతిమాలుకొన్నారు. ‘అయితే శాంతనుడితో నా సంగమం వమ్ము కాకుండా ఒక కొడుకైనా ఉండేలాగ ఏదో ఒక మార్గం చూడండి’ అని గంగ అడిగింది. ‘ఇదుగో ఈ ద్యుమంతుడు అతని దగ్గర ఉంటాడు. కానీ అపుత్రుడిగానే ఉంటాడు’ అని వసువులు గంగతో ఒప్పందం చేసుకొని ‘అమ్మయ్య’అని ఊపిరి పీల్చుకున్నారు.
 
బ్రహ్మసభలో శాపాన్ని పొందిన మహాభిషుడే శాంతనుడిగా ప్రతీపుడికి పుట్టాడు. ప్రతీపుడు శాంతనుడికి పట్టంగట్టి అడవికి తపస్సు చేయడానికి వెళ్లాడు. పిల్లలకు ఏళ్లొచ్చి తమ పొల్లు తాము పోసుకొంటూ ఉన్నప్పుడు, పెద్దలు ఆస్తులన్నీ పంచిపెట్టి, మన అందరికీ మూలమైన మహాచైతన్యాన్ని వెదుక్కోవడానికి ఈ మాయాలోకం నుంచి దూరంగా వెళ్లి ప్రయత్నించాలి. అందుచేతనే బ్రహ్మచర్యమూ గృహస్థుగా ఉండటమూ ఆమీదట ఈ వానప్రస్థమూ, అంటే, ప్రతీపుడి మాదిరిగా వనానికి వెళ్లి తపస్సు చేయడమూ చివరికి సన్యాసమూ ఏర్పడ్డాయి.
 
శాంతనుడు రాజయ్యాడు. వినోదం కోసం వేటకు వెళ్లడం రాజులకు ఒక అలవాటు. క్రూరమృగాల్ని చంపడమూ తిండికి పనికివచ్చే జంతువుల్ని మితంగా చంపడమూ ఈ వేటలో జరుగుతూ ఉంటుంది. దుప్పుల్నీ దున్నల్నీ చంపుతూ శాంతనుడు అక్కడున్న గంగానది ఒడ్డుకు సేదదీరడానికి వచ్చాడు. ఆ ఒడ్డుమీదకే గంగాదేవి ఊరకనే, ఏ ఉద్దేశమూ లేకుండానే, ఒక స్త్రీ రూపంలో వచ్చింది. ఇద్దరి కళ్లూ కలిశాయి; ప్రేమ పొటమరించింది.

అయితే, గంగాదేవి పెళ్లికి ఒక షరతు పెట్టింది: ‘నేనేం చేసినా, అది శుభమైనది గానీ అశుభమైనదిగానీ నువ్వు అడ్డు చెప్పకూడదు. నాకు వ్యతిరేకంగా కానీ, అప్రియంగా గానీ నువ్వేమీ మాటలాడకూడదు. అడ్డు పడినా, అప్రియంగా మాట్లాడినా నేను నిన్ను విడిచివెళ్లిపోతాను. దీనికి తిరుగుండదు’ అని. ఆమె ఎవరో తెలియకపోయినా, ఆవిడగారి రూపవిమోహంలో పడ్డ శాంతనుడు ఏం జరగబోతోందో పిసరంతైనా ఆలోచించకుండా అన్నిటికీ ఒప్పేసుకొన్నాడు.

అంతేమరి, మోహంలో పడ్డవాడికెవడికైనా ఇంగిత జ్ఞానం చక్కాపోతుంది.
 ప్రతి ఏడాదీ కన్న ప్రతి కొడుకునీ ‘ఇదుగో, నీకు చెప్పినట్టుగా నిన్ను శాపం నుంచి విముక్తుణ్ని చేస్తూ నిన్ను ప్రసన్నుణ్నిగా చేస్తున్నాను’ అంటూ గంగ నీళ్లల్లో ముంచుతూ ఉండేది. ఇలాగ ఏడుగురు కొడుకుల్ని పొట్టనబెట్టుకొన్నా, ఆవిడ ఎక్కడ విడిచివెళ్లిపోతుందోనన్న భయంతో శాంతనుడు పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ ఎనిమిదోవాణ్ని కూడా అలాగే కసాయిదానిలాగ తీసుకొనిపోతూ ఉంటే, శాంతనుడు ఉండబట్టలేక ‘వీణ్ని చంపకు.

ముక్కుపచ్చలారని పిల్లల్ని ఇంత నిర్దయగా చంపే అసలు నువ్వెవత్తివి? ఎవరి పిల్లవి? నీ పిల్లల్ని నువ్వే నిర్దాక్షిణ్యంగా, కంట తడి కూడా పెట్టకుండా చంపుతున్నావేమిటి? పసిపిల్లల్ని చంపినందుకు నువ్వు చెప్పలేనన్ని ఏళ్లు నరకంలో ఉండవలసి వస్తుంది’ అని అంటూ ఆవిణ్ని అడ్డగించాడు.
 
‘నీకూ నాకు చెల్లిపోయింది గనకనే ఇలాగ అడ్డుపడ్డావు. ఈ పిల్లవాణ్ని చంపనులే. నేను మహర్షులందరూ శ్రద్ధగా సేవించే గంగానదిని. ఒక దేవకార్యాన్ని సిద్ధింపజేయడానికి నేను నీతో పాటు ఇన్నాళ్లున్నాను. ఈ గంగాదత్తుణ్ని నువ్వు ఉంచుకో’ అని చెబుతూ ఆవిడ నదీరూపంతో ఒకటైపోయింది. గంగ ఇచ్చిన ఆ గంగాదత్తుడే భీష్ముడు.
 
‘ఇతగాడికి పిల్లలుండరు; ఇతను పెళ్లిచేసుకోడు’అని చెప్పడానికి కారణంగానే వసువులు చేసిన దొంగతనం కథను చెప్పడం జరిగింది. శాంతనుడు పుట్టడానికి మూలకారణంగా బ్రహ్మసభలో జరిగిన కథను చెప్పారు. గంగాదేవి ఆవిడకుగా ఆవిడే, ఎవరి ప్రమేయమూ లేకుండానే బ్రహ్మసభకు వచ్చింది; ప్రతీపుడి కుడి తొడమీద కూర్చొంది; వేటాడి ఒడ్డున సేదదీరుతూన్న శాంతనుడి దగ్గరికీ వచ్చింది. ప్రతిదానికీ, మనకు తెలిసినా తెలియకపోయినా, మనం చేసిన ఏదో ఒక పనే కారణమవుతూ ఉంటుందని చెప్పడానికే ఈ రకంగా కథలో కథల్ని అల్లుతూ ఉంటాడు వ్యాసుడు.    
 
నిజానికి ఈ కథల వెనక ‘దేవకార్యం’ (సృష్టి) ఒకటి సిద్ధించడానికి పథకం అల్లడం జరిగింది. మహాభిషమంటే అన్నీ దేనిలో చివరికి విశ్రాంతిని పొందుతాయో ఆ పరమస్థానం. ‘బ్రహ్మ’ అనే పదానికి పెంపొందడమని అర్థం. అన్నిటికీ అంతమైన దివ్యవస్తువులో, సృష్టిని చేసి పెంపొందించాలన్న కోరిక పుట్టుకొని వచ్చింది. అక్కడికి ఒక కారణమంటూ ఏమీ లేకుండానే ఊరకనేగంగానది ఒక రూపాన్ని దాల్చి వచ్చింది. ‘గం’ అన్నా, ‘గా’ అన్నా వెళ్తూ ఉండటమని అర్థం.

అంటే, ఎప్పుడూ ఆపుదల లేకుండా జరిగే సృష్టి ప్రవాహాన్ని నడిపే స్వచ్ఛమైన ప్రకృతి. అన్నిటికీ చివరి మజిలీ అయిన దివ్యుడికి సృష్టిగా, అంటే, చాలామందిగా పెంపొందాలనే కోరిక పుట్టడంతోనే, దానంతట అదే, అతనిలోంచే, అతని సొంత భావమనే ఆపరాని ప్రవాహం ఒకటి ఆకర్షించే ఒక గొప్ప రూపాన్ని ధరించి ‘ప్రకృతి’గా ఎదురు అవుపించింది. ‘ప్ర’ అంటే గొప్పది; ‘కృతి’ అంటే, తయారైన ఒక ఆకారం. అన్నిటికీ చివరి స్థానమైన దివ్యత్వం, లేక, చైతన్యం ఒకటిగా ఉండక ‘అనేకం’గా అవుదామని అనుకోవడమే ‘ప్రతీపత్వం’, వ్యతిరేకత్వం, తనకు తాను విరుద్ధంగా ప్రవర్తించడం.

ఏకత్వానికి వ్యతిరేక భావమే అనేకత్వం. మహాచైతన్యానికి ఏ కొరతా ఉండదు. దానికి అనేకంగా కావాలని కోరిక పుట్టడమే అన్ని వికారాలూ శాంతించిన ‘శాంతన’ చైతన్యానికి ఎదురుగా గంగానది అనే ప్రకృతి రూపుగట్టడమూ, ఆ చైతన్యానికి జత కడదామని అనిపించడమూను.
 ఆ మహాచైతన్యం కొన్ని దివ్యశక్తుల ద్వారా ఈ అనేకత్వమనే సృష్టి నాటకాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తుల్లోవే వసువులు, సృష్టిని నివసింపజేసేవాళ్లు. ఈ ఎనిమిదింటిలో ఏడు ఎదురుగుండా అవుపించకుండానే పనిచేస్తూ ఉంటాయి.

అవి కనిపించకుండానే పనిచేస్తూ ఉంటాయని చెప్పడానికే, గంగ తన ఏడుగురు కొడుకుల్నీ తన ప్రవాహంలో ముంచిందని చెప్పారు. పుట్టినదేదైనా నిలిచి ఉండాలంటే, దాంట్లో ‘నేనున్నాన’నే భావం ఉండాలి. ఆ భావమే ప్రకృతి మనకు ఇచ్చిన, మనలో మిగిల్చిన, అంటే, ‘గంగాదత్తమైన’ అహంభావం, ‘నేనున్నాన’నే భావం. ఈ ‘నేను’ అనే భావానికి మగా ఆడా అనే తేడా లేదు; అదే రెండూను.

ఈ రెండూ సమంగా ఉంటే, పెళ్లి అవసరమే ఉండదు; అంచేత దానికింక పిల్లలు కలగరు. అహంకారం దానంతట అదే చావాలి; ఎవ్వరూ చంపలేరు. దాన్నే ‘స్వచ్ఛంద మరణమ’ని అంటారు. అదే భీష్ముడు తన తండ్రి నుంచి స్వచ్ఛంద మరణం పొందడమనే వరం వెనుక ఉన్న మర్మం.
- డాక్టర్ ముంజులూరి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement