Dr.Munjuluri Narasimha Rao
-
బలరాముడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 37 బలరాముడు దేవకీ గర్భం నుంచి ఏడవ వాడిగా పుట్టవలసినవాడు. కంసుడికి ఏడూ ఎనిమిదీ గర్భాల గురించిన సందిగ్ధతను పుట్టించి, ఇంకా భయాన్ని పెంచడానికి ఈ బలరాముణ్ని దేవకీ గర్భం నుంచి సంకర్షించి, గొల్లపల్లెలో ఉన్న వసుదేవుడి భార్యే అయిన రోహిణి గర్భంలో ఉంచారు. ఆ కాలంలోనే ఈ గర్భమార్పిడి పద్ధతి జరిగింది. అందుకనే బలరాముణ్ని సంకర్షణుడని అంటారు. సంకర్షించడమంటే అసలైన అర్థం, బ్రహ్మ చైతన్యం నుంచి దూరంగా లాగడమని. ఇలా భగవంతుణ్నించి దూరంగా లాగుతూ ప్రపంచ విలాసాల ప్రలోభా లను చూపించేది ప్రకృతి. అంచేత ఇలా సంకర్షణ చేసే ప్రకృతే బలరాముడు. కానీ ప్రకృతి అంటే, భగవంతుడి ప్రకృష్టమైన, గొప్పదైన కృతి, పని, కావ్యం. కావ్యం కాంతలాగ బుర్రకెక్కేలాగ చెబుతుందని చెబుతారు. భగవంతుడనే పురుషుడు గీసిన గిరిలోనే ఉంటూ పనిచేస్తుంది ఈ ప్రకృతి అనే కావ్యకాంత. ప్రకృతి మనను దూరంగా లాగుతున్నా, దూరంగా పోవడం వల్ల కలుగుతూన్న కష్టనష్టాలను అనుభవించేలాగ చేసి, తిరిగి భగవంతుడి వైపు మళ్లేలాగ చేస్తుంది కూడాను. ఆ విధంగా కూటస్థుడైన శ్రీకృష్ణుణ్ని దాటి ఎప్పుడూ ప్రవర్తించదు అతిబలిష్ఠమూ ప్రకృతి రూపమూ అయిన బలరామత్వం. బలరాముడు ప్రకృతిగా దుర్యోధన పక్షపాతిగా, భగవంతుడి దగ్గరే ఉన్నా అతనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూన్నట్టు అవుపిస్తాడు. మోసం చేసి సంపాయించిన పాండవుల రాజ్యాన్ని కౌరవులు తిరిగి ఇయ్యాలి లేదా యుద్ధంలో చావాలి అని శ్రీకృష్ణుడు అంటూంటే, జూదమాడడమూ రాజ్యాన్ని పోగొట్టుకోడమూ ధర్మరాజు స్వయంకృతాప రాధాలే తప్ప, వాటిలో దుర్యోధన శకునుల తప్పేమీ లేదన్నట్టు గానే మాట్టాడాడు బలరాముడు. శ్రీకృష్ణుడి సాయాన్ని అడగడానికి దుర్యోధనుడూ, అర్జునుడూ ద్వారకకు వచ్చారు. కృష్ణుడు వీళ్లను పరీక్షించాలను కొన్నట్టుగా నిద్రపోతున్నాడు. ముందు వచ్చిన దుర్యోధనుడు గర్వం కొద్దీ తల వైపూ తరవాత వచ్చిన అర్జునుడు భక్తి కొద్దీ పాదాల దగ్గర కూర్చున్నారు. కృష్ణుడు లేవగానే ఎదురుగా కూర్చున్న అర్జునుణ్నే చూశాడు సహజంగానే. ‘కానీ బావా! నేనే ముందర వచ్చాను నీ సాయాన్ని అర్థించ డానికి’ అని దుర్యోధనుడు అన్నాడు. ‘నా సాయాన్ని రెండు భాగాలుగా చేస్తాను: ఒక భాగం, ఏ శస్త్రమూ ఆయుధమూ పట్ట కుండా ఏదో మాట సహాయం మాత్రం చేసే నేను; రెండో భాగం కోట్లాది మంది ఉన్న నా నారాయణీసేన. మీ ఇద్దరిలో చిన్నవాడూ నేను ముందు చూసినవాడూ అర్జునుడు కనక, అతన్నే ముందర కోరుకో మంటాను’ అని కృష్ణుడన్నాడు. దీనికి దుర్యోధనుడు, అర్జునుడు ఆ పెద్దసేనను ఎగరేసుకొనిపోతాడేమోననే బెంగతో గతుక్కుమన్నాడు. అయితే, అర్జునుడు శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని ఎరిగినవాడు కనక, శస్త్రం పట్టకపోయినా ఎలా నడచు కోవాలో ఉపాయాలు చెప్పే అతన్నే ఎన్ను కున్నాడు. నారాయణీసేనను సంతోషంగా గ్రహించి దుర్యోధనుడు ఆ మీద తనకు గదాయుద్ధం నేర్పిన బలరాముడి దగ్గరికి వెళ్లి సహాయమడిగాడు. ‘నేను కృష్ణుడితో మనకు ఇరుపక్షాలవాళ్లూ సమానమని చాలాసార్లే చెప్పాను కానీ అతనికి నా మాట నచ్చలేదు. నేనేమో కృష్ణుణ్ని విడిచి ఒక్క క్షణమైనా వేరుగా ఉండలేను. అంచేత ఇటు నీకు గానీ అటు అర్జునుడికి గానీ సాయం చేయ కూడదని మనసులో నిశ్చయించుకొన్నాను. సర్వరాజులూ పూజించే భరతవంశంలో పుట్టావు. వెళ్లు, క్షత్రియ ధర్మానుసారమూ యుద్ధం చెయ్యి’ అని బలదేవుడనగానే అతన్ని కౌగిలించుకొని, కృష్ణుణ్ని మోసం చేయ గలిగానని మురిసిపోతూ దుర్యోధనుడు హస్తినా పురానికి చక్కాపోయాడు. ఇక్కడ యుధిష్ఠిరుడు మామగారైన ద్రుపదుణ్నీ, విరటుణ్నీ, బలరాముణ్నీ, సాత్యకినీ, ధృష్టద్యుమ్నుణ్నీ, శిఖండినీ, సహదేవుణ్నీ ఏడుగురు సేనాపతులుగా అభిషేకం చేశాడు. తిరిగి ఈ ఏడుగురి లోనూ ధృష్టద్యుమ్నుణ్ని సర్వసైన్యాధి పతిగా ఘోషించాడు. వీరికి అధిపతిగా అర్జునుణ్ని నియమించాడు. అర్జునుడి క్కూడా నేతగానూ అతని రథాశ్వాల నియంతగానూ జనార్దనుణ్ని కోరు కున్నాడు యుధిష్ఠిరుడు. ఆ సమయంలోనే మహాయుద్ధానికి సన్నద్ధమయ్యారని తెలిసి బలరాముడు, అక్రూరుడూ గదుడూ సాంబుడూ మొదలైనవాళ్లతో సహా ధర్మ రాజును చూడ్డానికి వచ్చాడు. బల రాముడికి నాగలీ రోకలీ ఆయుధాలుగా వర్ణిం చడంలో కూడా అతను ప్రకృతికి ప్రతీక అని చెప్పడమే ఇమిడి ఉంది. నాగలితో నేలను దున్నగా పండిన ధాన్యాలతోనూ ఆ ధాన్యాలను రోకలితో దంచి ‘పొట్టు’ అనే అడ్డును తొలగించి ఆ అన్నాలతో సర్వభూతాలనూ ప్రకృతి సాకుతోంది. రోహిణి కొడుకు రాగానే ధర్మరాజూ కృష్ణుడూ భీముడూ అర్జునుడూ నకుల సహదేవులూ ఇతర రాజులూ అందరూ వినయంగా లేచి నిలబడి అతన్ని సత్కరించారు. కృష్ణుడి వైపు చూస్తూ బలరా ముడు ‘ఇక ఈ మహా భయంకరమైన యుద్ధం జరగవలసిందేనేమో! యుద్ధానికి ముందే, ఏ దెబ్బలూ సుస్తీలూ లేనప్పుడే చుట్టాల్నీ సుహృత్తుల్నీ చూసిపోదామని వచ్చాను. ఎవరెవరు ఈ కురుక్షేత్రానికి చేరుకున్నారో వాళ్లందరికీ కాలం పక్వ మైందన్న మాట నిస్సంశయం. నువ్వు ఒకవైపు ఉండొద్దని నేను కృష్ణుడికి చెప్పాను. పాండవులు మనకెలాగ బాంధవులో దుర్యోధన మహారాజు కూడా బంధువే. అతనిక్కూడా సాయం చెయ్యి. అతను చాలామార్లే ఇక్కడికి వస్తూ పోతున్నాడు. కానీ నీ కోసమనీ కృష్ణుడు నా మాట పట్టించుకోకుండా దుర్యోధనుణ్ని ఉపేక్షిం చాడు. కృష్ణుడువినా నేను ఈ జగత్తును కన్నెత్తై చూడలేను. అంచేత అతను ఏం చేయదలుచుకున్నాడో దాన్నే నేనూ అనుస రిస్తాను. గదాయుద్ధంలో విశారదులైన భీమదుర్యోధనులిద్దరూ నాకు శిష్యులే. అంచేత వాళ్ల పట్ల నాకు సమానమైన స్నేహముంది. కురువంశీయులు నాశనమవుతూంటే నేను చూస్తూ ఊరకనే ఉండలేను. అందుకే నేను సరస్వతీనది ఒడ్డున ఉన్న తీరాన్ని సేవించుకొందామని వెళ్తున్నాను’ అని సెలవు తీసుకొన్నాడు. ఈ మాటలతోనూ మనకు బలరాముడు తాను పురుషుడి (ఆత్మ) అధీనంలో ఉండే ప్రకృతినని చెప్పకనే చెప్పినట్టయింది. యుద్ధంలో పద్దెనిమిదో రోజుకు నలభై రెండు రోజులపాటు తీర్థయాత్రలు ముగించుకొని బలరాముడు వచ్చాడు. భీమ దుర్యోధనుల యుద్ధం జరుగు తూండగా అర్జునుడు కృష్ణుణ్ని ‘ఈ ఇద్దరిలో నీ ఉద్దేశంలో ఎవరు గొప్ప? ఎవరిలో ఏయే గుణాలున్నాయి? నువ్వు ఎలాగ బేరీజు వేస్తావు?’ అని అడిగాడు. దానికి జవాబుగా వాసుదేవుడు ఇలాగ చెప్పాడు: ‘ఇద్దరికీ సమానమైన శిక్షణే అందింది. భీమసేనుడు బలంలో మిన్న; దుర్యోధనుడేమో గదాయుద్ధంలో బాగా పరిశ్రమ చేశాడు. భీముడు ధర్మపూర్వ కంగా గదా యుద్ధం చేస్తే గెలవడు; అన్యా యంగా చేస్తేనే సుయోధనుణ్ని చంప గలుగుతాడు. దేవతలు అసురుల్ని మాయ తోనే, అంటే ఉపాయంతో కూడిన నేర్పు తోనే జయించారు. అంచేత భీముడు కూడా మాయమయమైన పరాక్రమాన్ని అవలంబించాలి. జూదమాడుతూన్న ప్పుడు సుయోధనుడి తొడలను గదతో విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాడు గదా! ఆ ప్రతిజ్ఞను ఇప్పుడు పూర్తి చెయ్యాలి. మాయావి అయిన దుర్యోధనుణ్ని మాయ తోనే నాశనం చేయాలి. అలా కాకుండా బలాన్నే ఆశ్రయించుకొని న్యాయంగా నాభి కింద కొట్టకూడదనే నియమాన్ని పాటిస్తే యుధిష్ఠిరుడు గడ్డు పరిస్థితిలో పడిపోతాడు. ధర్మరాజు దుర్యో ధనుడితో ఈ ద్వంద్వ యుద్ధంలో నువ్వు గెలిస్తే నీదే రాజ్యమంతా అని బుద్ధి లేని మాటల న్నాడు. భీష్మ ద్రోణ కర్ణ శల్య జయద్రథ భగదత్తుల్లాంటి వీరుల్ని చంపిన మీదట ధర్మరాజు ఈ పిచ్చిమాట అని ఇంత కాలమూ కష్టపడి చేసినదాన్నంతనీ ఒక్క సారిగా సంశయంలో పడేశాడు. ఇది ధర్మ రాజు తాలూకు పెద్ద అబుద్ధే. ఈ ఒక్కటీ గెలిస్తే అంతనీ గెలుచుకొన్నట్టే అంటూ ఇంతదాకా గెలుచుకొన్నదాన్నంతనీ పణంగా పెట్టేశాడు. దుర్యో ధనుడు గదా యుద్ధంలో ఆరితేరినవాడు. అదీగాక మిమ్మల్ని గెలవాలన్న అతినిశ్చయంతో ఉన్నాడు. భీముడు గదాయుద్ధ నియమానికి విరుద్ధంగా తన ప్రతిజ్ఞను తీర్చుకోడానికి ప్రయత్నం చెయ్యకపోతే, దుర్యోధనుడు రాజై కూర్చుంటాడు’ అని సుదీర్ఘంగా ఉపన్య సించాడు. అప్పటికే వాళ్లిద్దరూ యుద్ధంలో పరస్పర గదాఘాతాలతో ఎర్రగా తయా రయ్యారు. భీముడి గదావేగం దుర్యో ధనుడి తొడలను విరగ్గొట్టింది. కింద కూలిపోయాడు. భీముడు మునపటి సన్నివేశాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కసి కొద్దీ దుర్యోధనుడి కిరీటాన్ని కాలితో తన్ని అతని తలను తొక్కాడు. ఇది చూసేసరికి బలరాముడి కోపం మిన్నంటింది. ‘ఛీ ఛీ భీమసేనుడా! గదాయుద్ధంలో బొడ్డు కింద కొట్టగూడదనే శాస్త్రీయ నియమాన్ని ఉల్లంఘించావు’ అని అతన్ని నిందించి, కృష్ణుడితో ‘ఈ రోజున నాతో సమానుడైన దుర్యోధనుణ్నే గాదు నన్ను కూడా అవ మానించాడు భీమసేనుడు’ అంటూ అతి కోపంతో భీముడి మీదకు ఉరికాడు. తక్షణమే శ్రీకృష్ణుడు అన్నను ఆపాడు. ‘మనకు శుద్ధపౌరుషులైన పాండవులు సహజ మిత్రులు. స్వయానా మన మేనత్త కొడుకులు. అదీగాక శత్రువుల చేత బాగా మోసానికి గురి అయ్యారు. క్షత్రియుడైన వాడికి ప్రతిజ్ఞా పరిపాలనం అతిధర్మం. సుయోధనుడి తొడల్ని గదతో భేదిస్తానని సభామధ్యంలో భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. తొడలు బొడ్డుకిందే ఉంటాయి. బొడ్డు కింద కొట్టకూడదంటే, ప్రతిజ్ఞను తీర్చుకోడానికి మరో మార్గమేది? అదీగాక మైత్రేయ మహర్షి, అడవిలో పాండవుల కష్టాల్ని కళ్లారా చూసి, దుర్యోధనుడికి పాండవులతో వైరం మానుకోమని చెప్పి నప్పుడు, ఈ దుర్యోధనుడు తొడమీద కొట్టుకొంటూ అతనికి కోపాన్ని తెప్పిం చాడు. ఆయన అప్పుడు భీముడి గద నీ యీ తొడను బద్దలుగొడుతుందని శపించాడు కూడాను. అదీగాకుండా ఇప్పుడు కలియుగం ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. వీటన్నిటి దృష్ట్యా వైరాన్నీ ప్రతిజ్ఞనీ తీర్చుకోవడం క్షత్రియుడైన భీముడికి తగినదే. నువ్వు కోపాన్ని దిగమింగాలి’ అని కృష్ణుడు బలరాముణ్ని తగ్గేలాగ చేశాడు. బలరాముడు కృష్ణుడికి ఎదురాడలేక ద్వారకకు వెళ్లిపోయాడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
గాంధారి
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 6 గాంధార రాజు సుబలుడి కూతురు గాంధారి. ధృతరాష్ట్రుడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లిచేయమని భీష్ముడు వర్తమానం పంపినప్పుడు ‘అతను కళ్లులేనివాడు గదా’ అనే శంక పీడించింది సుబలుణ్ని. కానీ పౌరవకులం ఖ్యాతీ సదాచార సంపన్నతా పరాక్రమమూ మొదలైన అనుకూల విషయాలు చాలా అవుపించడం వల్ల, ప్రతికూలమైన గుడ్డితనాన్ని వెనక్కి నెట్టి, పిల్లనిద్దామని నిశ్చయించుకొన్నారు సుబల దంపతులు. ధృతరాష్ట్రుడికి తనను ఇవ్వబోతున్నారని తెలిసిన గాంధారి ‘నేను ఎదురుగా అతన్ని చూస్తే గుడ్డితనం పెద్దదోషంగా అవుపిస్తుంది. అదీగాక, ఇతరులతో పోల్చడాలూ పోల్చుకోడాలూ వచ్చి మనసు చెదురుతుంది’ అని ఆలోచించి, గట్టి నిశ్చయంతో తన రెండు కళ్లనూ చాలా మడతలు పెట్టిన బట్ట పట్టీతో బంధించుకొంది. నిజానికి, ఉన్న కళ్లను కూడా మూసేసుకొని, కావాలని గుడ్డిగా ఉండటం అంత ప్రశస్తమేమీ కాదు. అయితే, ఆవిడ తర్కమూ తప్పేమీ కాదు. ప్రతిక్షణమూ తల్లిదండ్రుల్ని తప్పుపట్టుకొంటూ, జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం కన్నా తానూ గుడ్డిగా ఉండటమే మంచిదని అనుకొంది ఆవిడ. పిల్లను అడిగి సంబంధం ఖరారు చేయాలిగదా అనిపిస్తుంది గానీ రాజకీయ వివాదాల్లో ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. శాంతనుడికి సత్యవతి వల్ల పుట్టిన పిల్లలు త్వరగా చనిపోవడం వల్ల, రాజవంశానికి పెద్ద సమస్యే వచ్చిపడింది. అందుకోసమనే వంద మంది సంతానం కనగలిగే వరాన్ని శివుణ్నించి పొందిన గాంధారిని భీష్ముడూ సత్యవతీ ఎన్నుకొన్నారు. ఒకరోజున వ్యాసుడు చాలా ఆకలితో గాంధారి ఇంటికి వచ్చాడు. ఆవిడ ఆయనకు భోజనం పెట్టి, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది. దానికి సంతోషించి ఆయన వరం కోరుకోమన్నాడు. ‘నా భర్తకు దీటైన నూరుమంది కొడుకులు పుట్టాల’ని ఆవిడ కోరుకొంది. శివుడిచ్చిన వరాన్ని వ్యాసుడి వరం బలపరిచినట్టయింది. ధృతరాష్ట్రుడి వల్ల కలిగిన గర్భాన్ని ఆవిడ నిండా రెండేళ్లు మోసింది. అక్కడ వనంలో ఉన్న తోటికోడలు కుంతికి యుధిష్ఠిరుడు అప్పుడే పుట్టేశాడు. గాంధారికి అసూయ పుట్టింది. భర్తకు తెలియకుండా ఆవిడ తన కడుపును తొందర కొద్దీ పొడుచుకొంది. చాలా గింజలున్న పెద్దపండు లాంటి ఒక గట్టి మాంస పిండం బయటపడింది. ఆవిడ అవాక్కయింది. వందమంది కొడుకుల వరం అబద్ధమేనా అనిపించింది. వందలూ వేలుగా పిల్లలు పుట్టడాలు జంతువుల్లో కద్దు. పేడలో కులకులలాడుతూ పురుగులు ఎక్కణ్నించి వస్తున్నాయో తెలియకుండా పుట్టుకొస్తాయి. పాములూ మొసళ్లూ మొదలైన జంతువులూ ఎక్కువ గుడ్లను పెట్టి పొదుగుతూ ఉంటాయి. సాధారణ పద్ధతిలో మనుషుల్లో ఒక్కొక్కడూ పుట్టుకొని వస్తూ వందమంది పుట్టాలంటే కనీసం వందేళ్లైనా పడుతుంది. ఇంతకుముందు సగరుడనే రాజుకు ఒక భార్య వల్ల అరవై వేల మంది కొడుకులు పుట్టారని చెబుతారు. వందకు ఆరువందలింతల మంది పుట్టడం ఇంకా కష్టమైనదే. అప్పుడూ ఇప్పుడూ కూడా ఆవునేతి కుండల్లో ఆ గర్భాలను పెంచినట్టు చెప్పారు. అందుచేత, ఎక్కువమందిని కనే ప్రక్రియ ఆయా కాలాల్లో వాళ్లకు తెలుసునని అర్థమవుతుంది. ఇప్పటివాళ్లకే ఇంక్యుబేటర్లలో పిల్లల్ని పెంచే విద్య వచ్చుననీ అప్పటివాళ్లకు ఏమీరాదని అనుకోవడం శుద్ధ అవివేకమవుతుంది. నాగరికత ఎన్నిసార్లో చాలా ఉచ్ఛస్థాయిలకు చేరి, పెద్ద పెద్ద దుర్ఘటనల వల్లనో భూకంపాలూ సునామీలూ భారీ ఉల్కాపాతాలూ మొదలైన అతిఘోరమైన విపత్తుల వల్లనో కనుమరుగైపోతూ వచ్చింది. ఇది తెలియని మనం, ఇప్పటికాలంలో తెలిసినది మునపటి కాలంలో తెలియదని పొరబాటుగా అనుకొంటూ ఉంటాం. సుశ్రుతుడు వెంట్రుకను నిలువుగా చీల్చగలిగిన నేర్పుగల సర్జన్‌గా మనం వింటూ ఉంటాం. క్షయ రోగానికి మేక మాంసం తినడమూ మేకల మందలో పడుకోవడమూ విరుగుడన్న సంగతి పూర్వీకులు ఎరుగుదురు. కానీ ఇప్పటికాలంలో ఆ రోగానికి మందులను కనుక్కోడానికి చాలాకాలమే పట్టింది. కణాదుడనే ఒక శాస్త్రజ్ఞుడు తన ‘వైశేషిక సిద్ధాంతం’లో పరమాణువుల గురించి చెప్పాడన్న సంగతి చాలామందికి తెలియనే తెలియదు. ఈ శాస్త్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆ భాష మనకు ‘మెకాలే ఎఫెక్టు’ ద్వారా దూరమైపోయింది. అదీగాక సంస్కృతంలో శాస్త్రాలన్నీ సూత్ర రూపాల్లో ఉంటాయి. సూత్రాలనేవి చిన్న చిన్న వాక్యాలే కానీ చాలా అర్థంతో కూడుకొని ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి విశ్లేషణా వివరణా కావలసివస్తాయి. పెద్ద పెద్ద అంగలేసిందని చెప్పుకొనే ఇప్పటి సైన్సుకు ఇప్పటికీ అర్థంకాని ప్రాకృతికమైన దృగ్విషయాలెన్నో ఉన్నాయి. మన గ్రహం మీదనే జీవం ఉందనీ, అదే చాలా పురోగతిని పొందినదనీ అనుకొంటూ ఉంటాం. ఇతర గ్రహాల మీద జీవం ఉండే అవకాశాన్ని మనం వట్టినే కొట్టిపారేయలేం. ఫ్లైయింగ్ సాసర్లు వస్తున్నాయంటారు; అవేమిటో తెలియదు. వాటిలో వచ్చే ఆగంతకులెవరో ఎంతటి శాస్త్రజ్ఞానం గలవాళ్లో మనకు అంతుపట్టదు. ఈ నేపథ్యంలో మరోచోట జీవం లేదనుకోవడం ఒక విధంగా అహంకారమే. ఎక్కువ ఉష్ణోగ్రతలున్నచోట జీవాలుండవని సాధారణంగా అనుకొంటాం. కానీ కొన్ని రాక్షస తొండలు అగ్నిపర్వతాల నుంచి వెలువడిన లావాల ప్రాంతాల్లో గుడ్లను పెడుతూ ఉంటాయి. ఒక కణం తాలూకు శక్తి ఫలానా సమయంలో ‘ఇంత’ అని మనం స్పష్టంగా చెప్పనేలేం.. వీటన్నింటినీ పోల్చి చూసుకోకపోతే వందమంది పుట్టడమనేది మనకు అసాధారణంగా తోస్తుంది; అబద్ధమనిపిస్తుంది; కట్టుకథ అనిపిస్తుంది. ఇక ఆ గర్భపిండాలను పెంచడమన్నదీ అలాగే అబద్ధమనిపిస్తుంది. వ్యాసుడి పక్కకు చేరి ‘ఆడపిల్ల ఒకత్తె ఉంటే బాగుంటుంది’ అని గాంధారి అంటే దాన్ని కూడా ఆ మాంసపిండం నుంచే తీశాడు. అదే సైంధవుడికి పెళ్లామైన దుస్సల. మన ప్రస్తుత జ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని, ఏదైనా సత్యమూ అసత్యమూ అని చెప్పడం ఎంత అసమంజసమో పైన చెప్పిన వాక్యాలను కుదురుగా చదివితే క్షుణ్ణంగా అర్థమవుతుంది. అంత కష్టపడి కన్న ఆ వందమందీ మొగుడి నిర్వాకంకొద్దీ చనిపోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పవలసిన పనిలేదు. తనతోబాటే వచ్చి స్థిరపడిపోయిన తన అన్న శకుని మోసపు జూదంతో పాండవుల్ని దాసులుగా చేసినప్పుడు, ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాల పేరిట ఆ దాస్యాన్ని పోగొట్టి సర్ది చెప్పి పంపించేశాడు. అయితే, రెండోసారి జూదమాడటానికి పాండవుల్ని దారి మధ్యలోంచే పిలిపించాలని దుర్యోధనుడు మంకుపట్టు పట్టినప్పుడు, గాంధారి ధృతరాష్ట్రుడితో ‘నీ మాట విననివాణ్ని విడిచిపెట్టడమే మంచిది. ధర్మపూర్వకంగా గెలవని డబ్బు తరవాత తరాలవాళ్లను నాశనం చేస్తుంది’ అని అంది. కొడుకంటే ఆవిడకు ధృతరాష్ట్రుడికున్నంత మోహం లేదు. యుద్ధమంతా అయిపోయిన తరవాత, దగ్గరికి వచ్చిన పాండవుల్ని శపిద్దామన్నంత బాధా కోపమూ ఆవిణ్ని చుట్టుముట్టాయి. అప్పుడు వ్యాసుడు ఆవిడకు ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చాడు: ‘‘యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజుల్లోనూ ప్రతిరోజూ నీ పెద్దకొడుకు నీ దగ్గరికి వచ్చి, ‘జయించేలాగ దీవించమ’ని అడుగుతూ ఉండేవాడు గదా. నువ్వేమో ఎప్పుడూ ‘యతో ధర్మస్తతో జయః’ అని చెపుతూ వచ్చావే తప్ప ఒక్కసారి గూడా ‘నువ్వు గెలుస్తావు’ అని అనలేదు. నువ్వు ముందరి నుంచీ చాలా ఓర్పు ఉన్నదానివి. అధర్మాన్ని వదిలిపెట్టు. నువ్వన్నట్టే ధర్మమున్న వైపే జయించింది’ అని. అప్పుడు ఆవిడ పాండవుల్ని శపించకుండా ఉన్నా శ్రీకృష్ణుణ్ని మాత్రం శపించింది: ‘జ్ఞాతులైన కౌరవ పాండవులు పరస్పరమూ కొట్టుకొంటూ చచ్చిపోతూ ఉంటే వాళ్లను ఆపకుండా ఉపేక్షించావు గనక, నీ జ్ఞాతుల్ని నువ్వే చంపుతావు. ఈ రోజు నుంచి ముప్ఫై ఆరేళ్ల తరవాత నీవాళ్లందరూ ఒకళ్లతో ఒకళ్లు దెబ్బలాడుకొంటూ చనిపోతారు. నువ్వు కూడా ఒక అనాథుడి మాదిరిగా ఎవరికీ తెలియకుండా కుచ్చితమైన ఉపాయంతో చచ్చిపోతావు’ అని. సంస్కృతంలో శతమూ సహస్రమూ అనే మాటలు వందా వేయీ అనేగాక అనేకమనే అర్థాన్ని కూడా ఇస్తాయి. మనిషిలో అటు దైవీశక్తులూ ఇటు ఆసురీశక్తులూ రెండూ ఉన్నాయి. ఆ మంచీ చెడూ శక్తులు ఎప్పుడూ దెబ్బలాడుకొంటూనే ఉంటాయి. పురాణాల్లో తరచుగా వర్ణిస్తూ ఉండే దేవాసుర యుద్ధమంటే ఇదే. ఆ రెండు శక్తుల్లోనూ మంచివి ఎప్పుడూ తక్కువే. అందుచేతనే ధర్మపరులూ జ్ఞానవంతులూ అయిన పాండవులు ఐదుగురు మాత్రమే. అధర్మం కొమ్ముకాసేవాళ్లూ పాపప్పనులూ అజ్ఞానమూ గొప్ప అనుకొనేవాళ్లూ చాలామందే ఉంటారు. అందుకనే కౌరవులూ వాళ్లవైపు ఉండి యుద్ధం చేసినవాళ్లూ అనేకులు. ‘గాంధారి’ అనే మాటలోని ‘గాం’ అనే మాట కదలికను సూచిస్తుంది. కదలికకు మరోపేరే సృష్టి. అంతా ఒకే వస్తువున్నప్పుడు కదలిక ఎక్కడ ఉంటుంది? అది వేరు పేరైనప్పుడే కదలికలూ స్పందనలూ పుడతాయి. ఆ కదలికను ధరించేది ‘గాంధారి’ - అంటే, సృష్టిని ధరించి పోషించేది ‘గాంధారి’. సృష్టిని ధరించి పోషించేది కోరికల బలం, వాసనల శక్తి, మునపటి కర్మఫల గంధాల శక్తి. ధృతరాష్ట్రుడు ఇంద్రియ సంబంధమైన గుడ్డి మనస్సు; అతని ‘భార్య’ గాంధారి కోరికల శక్తి. మనస్సు ఇంద్రియాల ద్వారానే చూస్తుంది గనక అది పుట్టుగుడ్డిదే; మనను అందర్నీ కోరికల శక్తి, అంటే, మునుపటి వాసనల శక్తి దళసరి పట్టీతో కళ్లకు గంతలు కట్టుకొన్నట్టుగా ప్రవర్తింపజేస్తూ ఉంటుంది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
గంగాశాంతనులు
ఐదోవేదం: మహాభారత పాత్రలు మహాభారతమనే కథ, కౌరవ పాండవులకు మూడు తరాల కింద నుంచి మొదలవుతుంది. నిజానికి, కౌరవులనే మాట అందరికీ సమానమైనదే. అందరూ కురురాజ వంశం వాళ్లే. మరి కౌరవశబ్దం పాండవులకు ఎందుకని వాడరు? ఎందుకంటే ‘కురు’ అనే మాటను ‘పనిచెయ్యడం’ అనే అర్థంలో వాడతారు. పనులు జరిగే చోటేమో శరీరం. శరీరానికి అంకితమైనవాళ్లు కౌరవులు. పండా అంటే బుద్ధీ జ్ఞానమూ గనక, పాండవులు, వంశరీత్యా కురువంశంవాళ్లే అయినప్పటికీ, బుద్ధికీ జ్ఞానానికీ ప్రతీకలు. ధర్మానికి అంకితమైనవాళ్లు గనక, పాండవుల్ని కౌరవ శబ్దాన్నుంచి వేరు చేశారు. సరే, ఇప్పుడు ఆ ముందుతరాల వైపు తిరిగి దృష్టి సారిద్దాం. ప్రతీపుడనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు వయసు మీరినా పిల్లలు కలగకపోవడంతో భార్యతో కలసి పిల్లలకోసం తపస్సు చేశాడు. ఆ దంపతుల తపఃఫలంగా ఒక పిల్లవాడు కలిగాడు. వయసు బాగా పైబడిన తరువాత కామం బాగా శాంతించిన తరువాత పుట్టాడు గనక, ఆ పిల్లాడికి ‘శాంతనుడ’ని పేరుపెట్టారు. అంతకుముందు ఒకసారి ప్రతీపుడొక్కడే గంగ ఒడ్డున కూర్చొని ఉండగా, గంగానదే, ఒక అందమైన అమ్మాయి రూపాన్ని దాల్చి, అతని కుడి తొడమీద కూర్చుని ‘నన్ను పెళ్లి చేసుకో’మని కోరింది. శాస్త్రం ప్రకారం కుడి తొడ మీద కూర్చునేవాళ్లు కొడుకులూ కూతుళ్లూ కోడళ్లూ అవుతారు; ఎడమ తొడమీద కూర్చునేవాళ్లే భార్యలుగా కావడానికి తగినవాళ్లు. ప్రతీపుడు ఈ మాటనే చెప్పి, మా పిల్లాడికి నువ్వు పెళ్లానివి అవుదుగానిలే అని ఆవిడను ఒప్పించాడు. ప్రతీపుడికి పుట్టిన శాంతనుడు అంతకుముందు జన్మలో మహాభిషుడనే రాజు. అతను ఒకసారి బ్రహ్మసభకు వెళ్లినప్పుడు, అక్కడకు వచ్చిన గంగాదేవిని చూసి మోహంలో పడ్డాడు. బ్రహ్మ ఎదురుగుండానే అతను కామమోహితుడిగా కనిపించడం వల్ల, ‘నువ్వు మనుషుల్లో పుట్టి తిరిగి బ్రహ్మలోకానికి రాగలుగుతావు’ అని శపించాడు బ్రహ్మ. ‘గంగ అంటే మహామోహంలో పడ్డావు గనక, నువ్వు మనుషుల లోకంలో పుట్టినప్పుడు, ఆవిడే నీకు ప్రతికూలంగానూ, అప్రియంగానూ ప్రవర్తిస్తుంది’ అని శాపాంతమూ చెప్పాడు. బ్రహ్మ లోకం నుంచి తిరిగి వెళ్తూన్నప్పుడు గంగాదేవికి దిగాలు ముఖాలతో కాళ్లీడ్చుకుంటూ వెళ్తూన్న అష్టవసువులు అగుపడ్డారు. ఆ ఎనిమిది మంది వసువుల్లో ద్యుమంతుడనేవాడు (ఇతన్ని ప్రభాసుడని కూడా చెబుతూ ఉంటారు) భార్య మెప్పు కోసం వశిష్ఠ మహర్షి హోమధేనువును ఇతర వసువుల సాయంతో దొంగిలించుకొని వచ్చాడు. ఇంతట్లో వశిష్ఠుడు ఫలాలూ సమిధలూ తీసుకొని రానేవచ్చాడు. తన నందినీ ధేనువూ, దాని దూడా అక్కడ కనిపించలేదు. దివ్యదృష్టితో వసువుల నిర్వాకాన్ని కనిపెట్టి, వాళ్లందర్నీ మనుషులుగా పుట్టమని శపించాడాయన. మనుషుల్లో పుట్టడమంటే పనులు చేయడమూ వాటివల్ల వచ్చిపడే బంధనాల్లో చిక్కుకోవడమూ అనే వరస నిరంతరమూ జరుగుతూ ఉంటుంది. ఆ చిక్కుల నుంచి బయటపడాలంటే చాలా కష్టాలే పడాలి. శాపం గురించి విని, వాళ్లందరూ వచ్చి వశిష్ఠుణ్ని ప్రసన్నం చేసుకొందామని ఆయన్ను బతిమాలుకొన్నారు. ‘మీరందరూ ప్రతి సంవత్సరమూ ఒక్కొక్కళ్ల చొప్పున శాపమోక్షాన్ని పొందుతారు గానీ, ఈ ద్యుమంతుడు అసలైన నేరస్థుడు గనుక, ఇతను మాత్రం, తన కర్మ కారణంగా, చాలాకాలం పాటు మానుష లోకంలో ఉండవలసి వస్తుంది. ఇతనికి పిల్లలు కలగరు; తండ్రికి ప్రియాన్ని చేయడం కోసం స్త్రీ భోగాల్ని పూర్తిగా విడిచిపెడతాడు కూడాను. అయితే, ఇతను సర్వశాస్త్రాల్లోనూ విశారదుడవుతాడులే’ అని వశిష్ఠుడు వాళ్లకు చెప్పి పంపించాడు.దిగాలుపడి వస్తూన్న వసువులు గంగతో తమ శాప వృత్తాంతం చెప్పుకొని ‘ప్రతీపుడి కొడుకును మేము తండ్రిగా ఎన్నుకొంటాం. మమ్మల్ని నువ్వే మనుషుల లోకం నుంచి త్వరగా వెనక్కి తీసుకొని రావాలి’ అంటూ గంగను బతిమాలుకొన్నారు. ‘అయితే శాంతనుడితో నా సంగమం వమ్ము కాకుండా ఒక కొడుకైనా ఉండేలాగ ఏదో ఒక మార్గం చూడండి’ అని గంగ అడిగింది. ‘ఇదుగో ఈ ద్యుమంతుడు అతని దగ్గర ఉంటాడు. కానీ అపుత్రుడిగానే ఉంటాడు’ అని వసువులు గంగతో ఒప్పందం చేసుకొని ‘అమ్మయ్య’అని ఊపిరి పీల్చుకున్నారు. బ్రహ్మసభలో శాపాన్ని పొందిన మహాభిషుడే శాంతనుడిగా ప్రతీపుడికి పుట్టాడు. ప్రతీపుడు శాంతనుడికి పట్టంగట్టి అడవికి తపస్సు చేయడానికి వెళ్లాడు. పిల్లలకు ఏళ్లొచ్చి తమ పొల్లు తాము పోసుకొంటూ ఉన్నప్పుడు, పెద్దలు ఆస్తులన్నీ పంచిపెట్టి, మన అందరికీ మూలమైన మహాచైతన్యాన్ని వెదుక్కోవడానికి ఈ మాయాలోకం నుంచి దూరంగా వెళ్లి ప్రయత్నించాలి. అందుచేతనే బ్రహ్మచర్యమూ గృహస్థుగా ఉండటమూ ఆమీదట ఈ వానప్రస్థమూ, అంటే, ప్రతీపుడి మాదిరిగా వనానికి వెళ్లి తపస్సు చేయడమూ చివరికి సన్యాసమూ ఏర్పడ్డాయి. శాంతనుడు రాజయ్యాడు. వినోదం కోసం వేటకు వెళ్లడం రాజులకు ఒక అలవాటు. క్రూరమృగాల్ని చంపడమూ తిండికి పనికివచ్చే జంతువుల్ని మితంగా చంపడమూ ఈ వేటలో జరుగుతూ ఉంటుంది. దుప్పుల్నీ దున్నల్నీ చంపుతూ శాంతనుడు అక్కడున్న గంగానది ఒడ్డుకు సేదదీరడానికి వచ్చాడు. ఆ ఒడ్డుమీదకే గంగాదేవి ఊరకనే, ఏ ఉద్దేశమూ లేకుండానే, ఒక స్త్రీ రూపంలో వచ్చింది. ఇద్దరి కళ్లూ కలిశాయి; ప్రేమ పొటమరించింది. అయితే, గంగాదేవి పెళ్లికి ఒక షరతు పెట్టింది: ‘నేనేం చేసినా, అది శుభమైనది గానీ అశుభమైనదిగానీ నువ్వు అడ్డు చెప్పకూడదు. నాకు వ్యతిరేకంగా కానీ, అప్రియంగా గానీ నువ్వేమీ మాటలాడకూడదు. అడ్డు పడినా, అప్రియంగా మాట్లాడినా నేను నిన్ను విడిచివెళ్లిపోతాను. దీనికి తిరుగుండదు’ అని. ఆమె ఎవరో తెలియకపోయినా, ఆవిడగారి రూపవిమోహంలో పడ్డ శాంతనుడు ఏం జరగబోతోందో పిసరంతైనా ఆలోచించకుండా అన్నిటికీ ఒప్పేసుకొన్నాడు. అంతేమరి, మోహంలో పడ్డవాడికెవడికైనా ఇంగిత జ్ఞానం చక్కాపోతుంది. ప్రతి ఏడాదీ కన్న ప్రతి కొడుకునీ ‘ఇదుగో, నీకు చెప్పినట్టుగా నిన్ను శాపం నుంచి విముక్తుణ్ని చేస్తూ నిన్ను ప్రసన్నుణ్నిగా చేస్తున్నాను’ అంటూ గంగ నీళ్లల్లో ముంచుతూ ఉండేది. ఇలాగ ఏడుగురు కొడుకుల్ని పొట్టనబెట్టుకొన్నా, ఆవిడ ఎక్కడ విడిచివెళ్లిపోతుందోనన్న భయంతో శాంతనుడు పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ ఎనిమిదోవాణ్ని కూడా అలాగే కసాయిదానిలాగ తీసుకొనిపోతూ ఉంటే, శాంతనుడు ఉండబట్టలేక ‘వీణ్ని చంపకు. ముక్కుపచ్చలారని పిల్లల్ని ఇంత నిర్దయగా చంపే అసలు నువ్వెవత్తివి? ఎవరి పిల్లవి? నీ పిల్లల్ని నువ్వే నిర్దాక్షిణ్యంగా, కంట తడి కూడా పెట్టకుండా చంపుతున్నావేమిటి? పసిపిల్లల్ని చంపినందుకు నువ్వు చెప్పలేనన్ని ఏళ్లు నరకంలో ఉండవలసి వస్తుంది’ అని అంటూ ఆవిణ్ని అడ్డగించాడు. ‘నీకూ నాకు చెల్లిపోయింది గనకనే ఇలాగ అడ్డుపడ్డావు. ఈ పిల్లవాణ్ని చంపనులే. నేను మహర్షులందరూ శ్రద్ధగా సేవించే గంగానదిని. ఒక దేవకార్యాన్ని సిద్ధింపజేయడానికి నేను నీతో పాటు ఇన్నాళ్లున్నాను. ఈ గంగాదత్తుణ్ని నువ్వు ఉంచుకో’ అని చెబుతూ ఆవిడ నదీరూపంతో ఒకటైపోయింది. గంగ ఇచ్చిన ఆ గంగాదత్తుడే భీష్ముడు. ‘ఇతగాడికి పిల్లలుండరు; ఇతను పెళ్లిచేసుకోడు’అని చెప్పడానికి కారణంగానే వసువులు చేసిన దొంగతనం కథను చెప్పడం జరిగింది. శాంతనుడు పుట్టడానికి మూలకారణంగా బ్రహ్మసభలో జరిగిన కథను చెప్పారు. గంగాదేవి ఆవిడకుగా ఆవిడే, ఎవరి ప్రమేయమూ లేకుండానే బ్రహ్మసభకు వచ్చింది; ప్రతీపుడి కుడి తొడమీద కూర్చొంది; వేటాడి ఒడ్డున సేదదీరుతూన్న శాంతనుడి దగ్గరికీ వచ్చింది. ప్రతిదానికీ, మనకు తెలిసినా తెలియకపోయినా, మనం చేసిన ఏదో ఒక పనే కారణమవుతూ ఉంటుందని చెప్పడానికే ఈ రకంగా కథలో కథల్ని అల్లుతూ ఉంటాడు వ్యాసుడు. నిజానికి ఈ కథల వెనక ‘దేవకార్యం’ (సృష్టి) ఒకటి సిద్ధించడానికి పథకం అల్లడం జరిగింది. మహాభిషమంటే అన్నీ దేనిలో చివరికి విశ్రాంతిని పొందుతాయో ఆ పరమస్థానం. ‘బ్రహ్మ’ అనే పదానికి పెంపొందడమని అర్థం. అన్నిటికీ అంతమైన దివ్యవస్తువులో, సృష్టిని చేసి పెంపొందించాలన్న కోరిక పుట్టుకొని వచ్చింది. అక్కడికి ఒక కారణమంటూ ఏమీ లేకుండానే ఊరకనేగంగానది ఒక రూపాన్ని దాల్చి వచ్చింది. ‘గం’ అన్నా, ‘గా’ అన్నా వెళ్తూ ఉండటమని అర్థం. అంటే, ఎప్పుడూ ఆపుదల లేకుండా జరిగే సృష్టి ప్రవాహాన్ని నడిపే స్వచ్ఛమైన ప్రకృతి. అన్నిటికీ చివరి మజిలీ అయిన దివ్యుడికి సృష్టిగా, అంటే, చాలామందిగా పెంపొందాలనే కోరిక పుట్టడంతోనే, దానంతట అదే, అతనిలోంచే, అతని సొంత భావమనే ఆపరాని ప్రవాహం ఒకటి ఆకర్షించే ఒక గొప్ప రూపాన్ని ధరించి ‘ప్రకృతి’గా ఎదురు అవుపించింది. ‘ప్ర’ అంటే గొప్పది; ‘కృతి’ అంటే, తయారైన ఒక ఆకారం. అన్నిటికీ చివరి స్థానమైన దివ్యత్వం, లేక, చైతన్యం ఒకటిగా ఉండక ‘అనేకం’గా అవుదామని అనుకోవడమే ‘ప్రతీపత్వం’, వ్యతిరేకత్వం, తనకు తాను విరుద్ధంగా ప్రవర్తించడం. ఏకత్వానికి వ్యతిరేక భావమే అనేకత్వం. మహాచైతన్యానికి ఏ కొరతా ఉండదు. దానికి అనేకంగా కావాలని కోరిక పుట్టడమే అన్ని వికారాలూ శాంతించిన ‘శాంతన’ చైతన్యానికి ఎదురుగా గంగానది అనే ప్రకృతి రూపుగట్టడమూ, ఆ చైతన్యానికి జత కడదామని అనిపించడమూను. ఆ మహాచైతన్యం కొన్ని దివ్యశక్తుల ద్వారా ఈ అనేకత్వమనే సృష్టి నాటకాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తుల్లోవే వసువులు, సృష్టిని నివసింపజేసేవాళ్లు. ఈ ఎనిమిదింటిలో ఏడు ఎదురుగుండా అవుపించకుండానే పనిచేస్తూ ఉంటాయి. అవి కనిపించకుండానే పనిచేస్తూ ఉంటాయని చెప్పడానికే, గంగ తన ఏడుగురు కొడుకుల్నీ తన ప్రవాహంలో ముంచిందని చెప్పారు. పుట్టినదేదైనా నిలిచి ఉండాలంటే, దాంట్లో ‘నేనున్నాన’నే భావం ఉండాలి. ఆ భావమే ప్రకృతి మనకు ఇచ్చిన, మనలో మిగిల్చిన, అంటే, ‘గంగాదత్తమైన’ అహంభావం, ‘నేనున్నాన’నే భావం. ఈ ‘నేను’ అనే భావానికి మగా ఆడా అనే తేడా లేదు; అదే రెండూను. ఈ రెండూ సమంగా ఉంటే, పెళ్లి అవసరమే ఉండదు; అంచేత దానికింక పిల్లలు కలగరు. అహంకారం దానంతట అదే చావాలి; ఎవ్వరూ చంపలేరు. దాన్నే ‘స్వచ్ఛంద మరణమ’ని అంటారు. అదే భీష్ముడు తన తండ్రి నుంచి స్వచ్ఛంద మరణం పొందడమనే వరం వెనుక ఉన్న మర్మం. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు