బలరాముడు | Balarama story | Sakshi
Sakshi News home page

బలరాముడు

Published Sun, Mar 13 2016 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

బలరాముడు

బలరాముడు

ఐదోవేదం : మహాభారత పాత్రలు - 37
బలరాముడు దేవకీ గర్భం నుంచి ఏడవ వాడిగా పుట్టవలసినవాడు. కంసుడికి ఏడూ ఎనిమిదీ గర్భాల గురించిన సందిగ్ధతను పుట్టించి, ఇంకా భయాన్ని పెంచడానికి ఈ బలరాముణ్ని దేవకీ గర్భం నుంచి సంకర్షించి, గొల్లపల్లెలో ఉన్న వసుదేవుడి భార్యే అయిన రోహిణి గర్భంలో ఉంచారు. ఆ కాలంలోనే ఈ గర్భమార్పిడి పద్ధతి జరిగింది. అందుకనే బలరాముణ్ని సంకర్షణుడని అంటారు. సంకర్షించడమంటే అసలైన అర్థం, బ్రహ్మ చైతన్యం నుంచి దూరంగా లాగడమని. ఇలా భగవంతుణ్నించి దూరంగా లాగుతూ ప్రపంచ విలాసాల ప్రలోభా లను చూపించేది ప్రకృతి.

అంచేత ఇలా సంకర్షణ చేసే ప్రకృతే బలరాముడు. కానీ ప్రకృతి అంటే, భగవంతుడి ప్రకృష్టమైన, గొప్పదైన కృతి, పని, కావ్యం. కావ్యం కాంతలాగ బుర్రకెక్కేలాగ చెబుతుందని చెబుతారు. భగవంతుడనే పురుషుడు గీసిన గిరిలోనే ఉంటూ పనిచేస్తుంది ఈ ప్రకృతి అనే కావ్యకాంత. ప్రకృతి మనను దూరంగా లాగుతున్నా, దూరంగా పోవడం వల్ల కలుగుతూన్న కష్టనష్టాలను అనుభవించేలాగ చేసి, తిరిగి భగవంతుడి వైపు మళ్లేలాగ చేస్తుంది కూడాను. ఆ విధంగా కూటస్థుడైన శ్రీకృష్ణుణ్ని దాటి ఎప్పుడూ ప్రవర్తించదు అతిబలిష్ఠమూ ప్రకృతి రూపమూ అయిన బలరామత్వం.
 
బలరాముడు ప్రకృతిగా దుర్యోధన పక్షపాతిగా, భగవంతుడి దగ్గరే ఉన్నా అతనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూన్నట్టు అవుపిస్తాడు. మోసం చేసి సంపాయించిన పాండవుల రాజ్యాన్ని కౌరవులు తిరిగి ఇయ్యాలి లేదా యుద్ధంలో చావాలి అని శ్రీకృష్ణుడు అంటూంటే, జూదమాడడమూ రాజ్యాన్ని పోగొట్టుకోడమూ ధర్మరాజు స్వయంకృతాప రాధాలే తప్ప, వాటిలో దుర్యోధన శకునుల తప్పేమీ లేదన్నట్టు గానే మాట్టాడాడు బలరాముడు.
 
శ్రీకృష్ణుడి సాయాన్ని అడగడానికి దుర్యోధనుడూ, అర్జునుడూ ద్వారకకు వచ్చారు. కృష్ణుడు వీళ్లను పరీక్షించాలను కొన్నట్టుగా నిద్రపోతున్నాడు. ముందు వచ్చిన దుర్యోధనుడు గర్వం కొద్దీ తల వైపూ తరవాత వచ్చిన అర్జునుడు భక్తి కొద్దీ పాదాల దగ్గర కూర్చున్నారు.  కృష్ణుడు లేవగానే ఎదురుగా కూర్చున్న అర్జునుణ్నే చూశాడు సహజంగానే. ‘కానీ బావా! నేనే ముందర వచ్చాను నీ సాయాన్ని అర్థించ డానికి’ అని దుర్యోధనుడు అన్నాడు.

‘నా సాయాన్ని రెండు భాగాలుగా చేస్తాను: ఒక భాగం, ఏ శస్త్రమూ ఆయుధమూ పట్ట కుండా ఏదో మాట సహాయం మాత్రం చేసే నేను; రెండో భాగం కోట్లాది మంది ఉన్న నా నారాయణీసేన. మీ ఇద్దరిలో చిన్నవాడూ నేను ముందు చూసినవాడూ అర్జునుడు కనక, అతన్నే ముందర కోరుకో మంటాను’ అని కృష్ణుడన్నాడు. దీనికి దుర్యోధనుడు, అర్జునుడు ఆ పెద్దసేనను ఎగరేసుకొనిపోతాడేమోననే బెంగతో గతుక్కుమన్నాడు. అయితే, అర్జునుడు శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని ఎరిగినవాడు కనక, శస్త్రం పట్టకపోయినా ఎలా నడచు కోవాలో ఉపాయాలు చెప్పే అతన్నే ఎన్ను కున్నాడు.

నారాయణీసేనను సంతోషంగా గ్రహించి దుర్యోధనుడు ఆ మీద తనకు గదాయుద్ధం నేర్పిన బలరాముడి దగ్గరికి వెళ్లి సహాయమడిగాడు. ‘నేను కృష్ణుడితో మనకు ఇరుపక్షాలవాళ్లూ సమానమని చాలాసార్లే చెప్పాను కానీ అతనికి నా మాట నచ్చలేదు. నేనేమో కృష్ణుణ్ని విడిచి ఒక్క క్షణమైనా వేరుగా ఉండలేను. అంచేత ఇటు నీకు గానీ అటు అర్జునుడికి గానీ సాయం చేయ కూడదని మనసులో నిశ్చయించుకొన్నాను. సర్వరాజులూ పూజించే భరతవంశంలో పుట్టావు.

వెళ్లు, క్షత్రియ ధర్మానుసారమూ యుద్ధం చెయ్యి’ అని బలదేవుడనగానే అతన్ని కౌగిలించుకొని, కృష్ణుణ్ని మోసం చేయ గలిగానని మురిసిపోతూ దుర్యోధనుడు హస్తినా పురానికి చక్కాపోయాడు. ఇక్కడ యుధిష్ఠిరుడు మామగారైన ద్రుపదుణ్నీ, విరటుణ్నీ, బలరాముణ్నీ, సాత్యకినీ, ధృష్టద్యుమ్నుణ్నీ, శిఖండినీ, సహదేవుణ్నీ ఏడుగురు సేనాపతులుగా అభిషేకం చేశాడు. తిరిగి ఈ ఏడుగురి లోనూ ధృష్టద్యుమ్నుణ్ని సర్వసైన్యాధి పతిగా ఘోషించాడు. వీరికి అధిపతిగా అర్జునుణ్ని నియమించాడు.

అర్జునుడి క్కూడా నేతగానూ అతని రథాశ్వాల నియంతగానూ జనార్దనుణ్ని కోరు కున్నాడు యుధిష్ఠిరుడు. ఆ సమయంలోనే మహాయుద్ధానికి సన్నద్ధమయ్యారని తెలిసి బలరాముడు, అక్రూరుడూ గదుడూ సాంబుడూ మొదలైనవాళ్లతో సహా ధర్మ రాజును చూడ్డానికి వచ్చాడు. బల రాముడికి నాగలీ రోకలీ ఆయుధాలుగా వర్ణిం చడంలో కూడా అతను ప్రకృతికి ప్రతీక అని చెప్పడమే ఇమిడి ఉంది. నాగలితో నేలను దున్నగా పండిన ధాన్యాలతోనూ ఆ ధాన్యాలను రోకలితో దంచి ‘పొట్టు’ అనే అడ్డును తొలగించి ఆ అన్నాలతో సర్వభూతాలనూ ప్రకృతి సాకుతోంది.
 రోహిణి కొడుకు రాగానే ధర్మరాజూ కృష్ణుడూ భీముడూ అర్జునుడూ నకుల సహదేవులూ ఇతర రాజులూ అందరూ వినయంగా లేచి నిలబడి అతన్ని సత్కరించారు.

కృష్ణుడి వైపు చూస్తూ బలరా ముడు ‘ఇక ఈ మహా భయంకరమైన యుద్ధం జరగవలసిందేనేమో! యుద్ధానికి ముందే, ఏ దెబ్బలూ సుస్తీలూ లేనప్పుడే చుట్టాల్నీ సుహృత్తుల్నీ చూసిపోదామని వచ్చాను. ఎవరెవరు ఈ కురుక్షేత్రానికి చేరుకున్నారో వాళ్లందరికీ కాలం పక్వ మైందన్న మాట నిస్సంశయం. నువ్వు ఒకవైపు ఉండొద్దని నేను కృష్ణుడికి చెప్పాను. పాండవులు మనకెలాగ బాంధవులో దుర్యోధన మహారాజు కూడా బంధువే. అతనిక్కూడా సాయం చెయ్యి.

అతను చాలామార్లే ఇక్కడికి వస్తూ పోతున్నాడు. కానీ నీ కోసమనీ కృష్ణుడు నా మాట పట్టించుకోకుండా దుర్యోధనుణ్ని ఉపేక్షిం చాడు. కృష్ణుడువినా నేను ఈ జగత్తును కన్నెత్తై చూడలేను. అంచేత అతను ఏం చేయదలుచుకున్నాడో దాన్నే నేనూ అనుస రిస్తాను. గదాయుద్ధంలో విశారదులైన భీమదుర్యోధనులిద్దరూ నాకు శిష్యులే. అంచేత వాళ్ల పట్ల నాకు సమానమైన స్నేహముంది. కురువంశీయులు నాశనమవుతూంటే నేను చూస్తూ ఊరకనే ఉండలేను.

అందుకే నేను సరస్వతీనది ఒడ్డున ఉన్న తీరాన్ని సేవించుకొందామని వెళ్తున్నాను’ అని సెలవు తీసుకొన్నాడు. ఈ మాటలతోనూ మనకు బలరాముడు తాను పురుషుడి (ఆత్మ) అధీనంలో ఉండే ప్రకృతినని చెప్పకనే చెప్పినట్టయింది.
 యుద్ధంలో పద్దెనిమిదో రోజుకు నలభై రెండు రోజులపాటు తీర్థయాత్రలు ముగించుకొని బలరాముడు వచ్చాడు. భీమ దుర్యోధనుల యుద్ధం జరుగు తూండగా అర్జునుడు కృష్ణుణ్ని ‘ఈ ఇద్దరిలో నీ ఉద్దేశంలో ఎవరు గొప్ప? ఎవరిలో ఏయే గుణాలున్నాయి? నువ్వు ఎలాగ బేరీజు వేస్తావు?’ అని అడిగాడు.

దానికి జవాబుగా వాసుదేవుడు ఇలాగ చెప్పాడు: ‘ఇద్దరికీ సమానమైన శిక్షణే అందింది. భీమసేనుడు బలంలో మిన్న; దుర్యోధనుడేమో గదాయుద్ధంలో బాగా పరిశ్రమ చేశాడు. భీముడు ధర్మపూర్వ కంగా గదా యుద్ధం చేస్తే గెలవడు; అన్యా యంగా చేస్తేనే సుయోధనుణ్ని చంప గలుగుతాడు. దేవతలు అసురుల్ని మాయ తోనే, అంటే ఉపాయంతో కూడిన నేర్పు తోనే జయించారు. అంచేత భీముడు కూడా మాయమయమైన పరాక్రమాన్ని అవలంబించాలి. జూదమాడుతూన్న ప్పుడు సుయోధనుడి తొడలను గదతో విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాడు గదా! ఆ ప్రతిజ్ఞను ఇప్పుడు పూర్తి చెయ్యాలి.

మాయావి అయిన దుర్యోధనుణ్ని మాయ తోనే నాశనం చేయాలి. అలా కాకుండా బలాన్నే ఆశ్రయించుకొని న్యాయంగా నాభి కింద కొట్టకూడదనే నియమాన్ని పాటిస్తే యుధిష్ఠిరుడు గడ్డు పరిస్థితిలో పడిపోతాడు. ధర్మరాజు దుర్యో ధనుడితో ఈ ద్వంద్వ యుద్ధంలో నువ్వు గెలిస్తే నీదే రాజ్యమంతా అని బుద్ధి లేని మాటల న్నాడు. భీష్మ ద్రోణ కర్ణ శల్య జయద్రథ భగదత్తుల్లాంటి వీరుల్ని చంపిన మీదట ధర్మరాజు ఈ పిచ్చిమాట అని ఇంత కాలమూ కష్టపడి చేసినదాన్నంతనీ ఒక్క సారిగా సంశయంలో పడేశాడు.

ఇది ధర్మ రాజు తాలూకు పెద్ద అబుద్ధే. ఈ ఒక్కటీ గెలిస్తే అంతనీ గెలుచుకొన్నట్టే అంటూ ఇంతదాకా గెలుచుకొన్నదాన్నంతనీ పణంగా పెట్టేశాడు. దుర్యో ధనుడు గదా యుద్ధంలో ఆరితేరినవాడు. అదీగాక మిమ్మల్ని గెలవాలన్న అతినిశ్చయంతో ఉన్నాడు. భీముడు గదాయుద్ధ నియమానికి విరుద్ధంగా తన ప్రతిజ్ఞను తీర్చుకోడానికి ప్రయత్నం చెయ్యకపోతే, దుర్యోధనుడు రాజై కూర్చుంటాడు’ అని సుదీర్ఘంగా ఉపన్య సించాడు.
 
అప్పటికే వాళ్లిద్దరూ యుద్ధంలో పరస్పర గదాఘాతాలతో ఎర్రగా తయా రయ్యారు. భీముడి గదావేగం దుర్యో ధనుడి తొడలను విరగ్గొట్టింది. కింద కూలిపోయాడు. భీముడు మునపటి సన్నివేశాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కసి కొద్దీ దుర్యోధనుడి కిరీటాన్ని కాలితో తన్ని అతని తలను తొక్కాడు. ఇది చూసేసరికి బలరాముడి కోపం మిన్నంటింది. ‘ఛీ ఛీ భీమసేనుడా! గదాయుద్ధంలో బొడ్డు కింద కొట్టగూడదనే శాస్త్రీయ నియమాన్ని ఉల్లంఘించావు’ అని అతన్ని నిందించి, కృష్ణుడితో ‘ఈ రోజున నాతో సమానుడైన దుర్యోధనుణ్నే గాదు నన్ను కూడా అవ మానించాడు భీమసేనుడు’ అంటూ అతి కోపంతో భీముడి మీదకు ఉరికాడు. తక్షణమే శ్రీకృష్ణుడు అన్నను ఆపాడు.

‘మనకు శుద్ధపౌరుషులైన పాండవులు సహజ మిత్రులు. స్వయానా మన మేనత్త కొడుకులు. అదీగాక శత్రువుల చేత బాగా మోసానికి గురి అయ్యారు. క్షత్రియుడైన వాడికి ప్రతిజ్ఞా పరిపాలనం అతిధర్మం. సుయోధనుడి తొడల్ని గదతో భేదిస్తానని సభామధ్యంలో భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. తొడలు బొడ్డుకిందే ఉంటాయి. బొడ్డు కింద కొట్టకూడదంటే, ప్రతిజ్ఞను తీర్చుకోడానికి మరో మార్గమేది? అదీగాక మైత్రేయ మహర్షి, అడవిలో పాండవుల కష్టాల్ని కళ్లారా చూసి, దుర్యోధనుడికి పాండవులతో వైరం మానుకోమని చెప్పి నప్పుడు, ఈ దుర్యోధనుడు తొడమీద కొట్టుకొంటూ అతనికి కోపాన్ని తెప్పిం చాడు.

ఆయన అప్పుడు భీముడి గద నీ యీ తొడను బద్దలుగొడుతుందని శపించాడు కూడాను. అదీగాకుండా ఇప్పుడు కలియుగం ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. వీటన్నిటి దృష్ట్యా వైరాన్నీ ప్రతిజ్ఞనీ తీర్చుకోవడం క్షత్రియుడైన భీముడికి తగినదే. నువ్వు కోపాన్ని దిగమింగాలి’ అని కృష్ణుడు బలరాముణ్ని తగ్గేలాగ చేశాడు. బలరాముడు కృష్ణుడికి ఎదురాడలేక ద్వారకకు వెళ్లిపోయాడు.
- డా॥ముంజులూరి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement