కోట్లాది మంది దశాబ్దాల స్వప్నం సాకారమై, అయోధ్యలో బాలరాముడు కొలువు దీరాడు. రామాయణాన్ని గృహస్థ ధర్మానికి అద్భుతమైన నిదర్శనంగా పేర్కొంటారు. శ్రీరాముడి జీవన మార్గాన్ని పరిశీలించి చూస్తే వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో ఎలా నడుచుకోవాలనే విషయమై విలువైన పాఠాలు కనిపిస్తాయి. శ్రీరాముడిని విశ్వసించే ప్రతి ఒక్కరూ, తమ ఆర్థిక విజయానికి కావాల్సిన సూత్రాలను రామాయణం నుంచి తీసుకోవచ్చు.
రాముడి వనవాసం.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళిక అవసరాన్ని గుర్తు చేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితానికి ఆలోచనాత్మక ఆర్థిక ప్రణాళిక ఎంతో అవసరమని నిపుణులు తరచూ సూచిస్తుంటారు. ఆర్థిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం, వాటికి తగిన బడ్జెట్ కేటాయించుకోవడం, వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితంలో అనిశ్చితులు ఎదురైనా, వాటిని సులభంగా అధిగమించొచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాముడు తన బాధ్యతలను ఏనాడూ విస్మరించలేదు.
అందుకే ఊహించని పరిస్థితులు ఎదురైతే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం ఎలా అన్నది రాముడి చేసి చూపించాడు. మనం కూడా ఆర్థిక ప్రణాళిక ఆధారంగా జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు సన్నద్ధత ఏర్పాటు చేసుకోవాలి. జీవితానికి తగినంత బీమా కవరేజీ, ఆరోగ్య బీమా తీసుకోవాలి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. జీవిత లక్ష్యాలు, అందుకు కావాల్సిన మొత్తం, చేయాల్సిన పెట్టుబడి, వివిధ సాధనాల మధ్య రిస్క్ ఆధారంగా కేటాయింపులు.. వీటన్నింటికీ ఆర్థిక ప్రణాళిక మార్గం చూపిస్తుంది.
ధర్మ మార్గం
ధర్మం పట్ల రాముడి అచంచలమైన నిబద్ధత ఆయన జీవన గమనానికి మూలస్తంభంగా కనిపిస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితంలో నైతిక ఆర్థిక విధానాల ఆచరణ అవసరాన్ని ఇది తెలియజేస్తుంది. ఇదే దీర్ఘకాలంలో విజయానికి బాటలు పరుస్తుంది. నిజాయితీ, చిత్తశుద్ధి, ఆర్థిక నిర్ణయాల్లో పారదర్శకత, క్రమశిక్షణ, భావోద్వేగాల నియంత్రణ, వేగంగా ధనవంతులు కావచ్చనే ప్రచారానికి ఆకర్షితులు కాకపోవడం వంటివి ఆర్థిక విజయాలకు భరోసానిస్తుంది. ఆర్థిక విషయాల్లో ధర్మానికి కట్టుబడి ఉండడం వల్ల అది స్థిరమైన, నైతిక సంపద సృష్టికి దారితీస్తుంది.
రిస్క్ నిర్వహణ
రావణుడితో రాముడు సాగించిన యుద్ధం.. ధైర్యం, రిస్క్ నిర్వహణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక విషయాల్లోనూ వీటి అవసరం ఎంతో ఉంది. సంపద సృష్టికి, ఆర్థిక లక్ష్యాల సాధనకు ధైర్యంగా, తమకు సరిపడే రిస్‌్కలను తీసుకోవాల్సిందే. రిస్‌్కలను మదించే విషయమై, అనిశి్చతులను అధిగమించేందుకు అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవడాన్ని మర్చిపోవద్దు. ధర్మం కోసం రాముడు యుద్ధం చేయక తప్పలేదు. అలాగే, సంపద సృష్టి కోరుకునే వారు కూడా రిస్‌్కతో కలసి నడవాల్సిందే. అది కూడా తాము భరించే స్థాయిలోనే రిస్‌్కను పరిమితం చేసుకోవాలి. పెట్టుబడికి సైతం ముప్పు ఉంటుందని ఈక్విటీలకు దూరంగా ఉండడం సరికాదు. రాబడులకు, పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ఒక్కదాని దృష్టితోనో పరుగులు తీయకూడదు.
సరళతరం
వనవాస సమయంలో రాముడి నిరాడంబర, సాధారణ జీవన శైలి.. పొదుపు ధర్మాన్ని తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితంలోనూ పొదుపుతో కూడిన జీవనశైలిని అనుసరించడం, అనవసర దుబారాని నియంత్రించడం ఆర్థిక శ్రేయస్సుకు దారి చూపుతుంది. నేడు ప్రతి ఒక్క అవసరానికీ సులభంగా రుణాలు లభిస్తున్నాయి. అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. అవసరాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి.
రుణాలతో కోరికలు తీర్చుకోవడం ఆర్థిక శ్రేయస్సుకు మేలు చేయదు. పొదుపు మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. తెలివిగా ఖర్చు చేస్తూ, పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. క్రెడిట్ కార్డ్ రుణాల నుంచి త్వరగా బయటకు రావాలి. అధిక ఖర్చుకు కళ్లెం వేయాలి. సరైన అవకాశాలు, అనుకూల సమయం కోసం వేచి చూస్తూ ఈక్విటీ మార్కెట్లో వచ్చే విలువైన అవకాశాలను కోల్పోవద్దు. సహనం, పట్టుదల కష్టపడి సంపాదించిన ధనానికి రక్షణగా నిలవాలి.
మార్గదర్శకం
రాముడి విధేయత, తన అనుచరులతో ఉన్న బలమైన బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెట్టుబడుల విషయంలోనూ సత్సంబంధాలు ఎంతో అవసరం. పరస్పర గౌరవం, నమ్మకం, మద్దతు అనేవి ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు సాయపడతాయి. అవసరం మేరకు ఆర్థిక నిపుణుల సాయాన్ని, మద్దతును, మార్గదర్శకాన్ని తీసుకోవాలి. ఇన్వెస్టర్ రిస్‌్కను మదింపు వేసి, అనుకూలమైన పెట్టుబడి సాధనాలు, ఆర్థిక లక్ష్యాల సాధనకు ఆచరించాల్సి మార్గాన్ని వారు సూచిస్తారు. ఆర్థిక ప్రపంచంలో ఉండే సంక్లిష్టతలను అధిగమించేందుకు సాయపడతారు.
వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో
రాముడి సైన్యంలో కనిపించే వైవిధ్యాన్ని, తమ పెట్టుబడులకూ అన్వయించుకోవాలి. వానరాలు, ఎలుగుబంట్లు, ఉడతలు, గద్దలు ఇవన్నీ రామదండులో కనిపిస్తాయి. ఇదే మాదిరిగా పెట్టుబడుల్లోనూ వైవిధ్యం ఉండాలి. కేవలం పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లకే (ఎఫ్‌డీలు) పరిమితం కాకూడదు. అన్ని ముఖ్య సాధనాల్లోకీ పెట్టుబడులు వర్గీకరించుకోవాలి. దీనివల్ల రిస్‌్కను తగ్గించుకోవచ్చు. రాబడులు స్థిరంగా ఉండేలా చూసుకోవచ్చు. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. ఈక్విటీలు, డెట్, గోల్డ్, ఏఐఎఫ్‌లకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు.
నేనే సుపీరియర్ అనుకోవద్దు..!
పెట్టుబడుల విషయంలో అంతా తనకే తెలుసన్న అహంకారం అస్సలు పనికిరాదు. రావణుడి పతనానికి ఇదే దారితీసింది. మెరుగైన పనితీరు చూపించని సాధనాల విషయంలో అహంకారం విడిచి పెట్టి ఆలోచించాలి. నిరీ్ణత కాలానికోసారి సమీక్షించుకుని పెట్టుబడుల్లో మార్పులు చేసుకోవాలి. అలా కాకుండా ఇన్వెస్ట్ చేసి పని అయిపోందని అనుకోవడం ఆర్థిక విజయాలకు దారితీయదు. సంపద సృష్టికి, పెట్టుబడుల మార్గంలో తప్పొప్పులను అంగీకరించాలి. దీనివల్ల నష్టాలను పరిమితం చేసుకునేందుకు వీలుంటుంది. మారుతున్న పరిస్థితులను ఆహా్వనించడం ఆర్థిక శ్రేయస్సుకు అవసరం.
శ్రీరాముడి జీవితంలో పొందుపరిచిన జ్ఞానం కేవలం ఆధ్యాత్మికతకు పరిమితం కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియచెపుతుంది. ఇన్వెస్టర్లకు విలువైన అంశాలను తెలియజేస్తుంది. రామాయణాన్ని చదవడం, అందులోని ముఖ్యమైన అంశాలను గ్రహించి, వాటిని తమ పెట్టుబడులకు అన్వయించుకోవడం వల్ల ఆర్థిక విజయాలకు మార్గాన్ని సులభం చేసుకోవచ్చు. చెడుపై మంచి విజయం సాధించడం రామాయణంలో కనిపిస్తుంది. అదే మాదిరిగా ఇన్వెస్టర్లు ఆర్థిక అవరోధాలను అధిగమించి, మంచి ఆర్థిక అలవాట్లతో, క్రమశిక్షణతో మెలగడం ద్వారా సంపద సృష్టికి చేరువకావచ్చు.
హద్దులకు కట్టుబడి ఉండడం
సంపద సృష్టి కోరుకునే వారు అందుకు అడ్డదారులు (షార్ట్‌కట్స్) వెతుక్కోకూడదు. లంకాధిపతి రావణుడు సీతమ్మ వారిని కోరుకోవడం వల్ల ఎంతటి ఉపద్రవం జరిగిందో రామాయణం చెబుతోంది. కోరికలపై నియంత్రణ అవసరమని, సన్మార్గమే శ్రేష్టమని ఇది సందేశం ఇస్తుంది. పెట్టుబడులపై రాబడుల విషయంలోనూ కోరికలను అదుపులో పెట్టుకుని వ్యవహరించాలి. తమకంటూ ఆర్థిక సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలి. ఉద్రేకంతో కూడిన నిర్ణయాలకు చోటు ఇవ్వకూడదు. టిప్స్‌ను అనుసరించడం కాకుండా కాల పరీక్షకు నిలిచిన బలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. దీనివల్ల విజయం తేలిక అవుతుంది.
ఓపిక, క్రమశిక్షణ
సముద్రంలో రామసేతు వారధి నిర్మాణం ఎంతో ఓపిక, పట్టుదలతో, ఎంతో మంది కృషితో, సుదీర్ఘ కాలానికి కానీ సాధ్యం కాలేదు. సందప సృష్టి కూడా అంతే. స్వల్ప కాలంలో కుబేరులు కావడం అనేది ఆచరణలో అంత సులభం కాదు. క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది. సిప్ అవసరాన్ని ఇక్కడ గుర్తించాలి. సిప్ రూపంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే, చిన్న మొత్తమే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారుతుంది. దీర్ఘకాలంలో సంపద సృష్టిని సిప్ సులభతరం చేస్తుంది. స్థిరత్వం, సహనం అనేవి దీర్ఘకాల ప్రయాణానికి ఎంతో అవసరం.
లక్ష్మణుడి కోసం ఆంజనేయుడు సంజీవని కోసం వెళ్లడం, దాన్ని గుర్తించలేక తన చేత్తో మొత్తం సుమేరు పర్వతాన్ని పెకిలించి చేత్తో తీసుకురావడం తెలిసిందే. ప్రతీ ఇన్వెస్టర్ సంజీవని వంటి కంపెనీలను గుర్తించలేకపోవచ్చు. అలాంటప్పుడు వారి ముందున్న మార్గం మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్. ఇన్వెస్టర్లు ఒక్కో కంపెనీ వారీ రిస్‌్కను తగ్గించుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సూచీల్లో ఇన్వెస్ట్ చేసే ప్యాసివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. అందులోని కొన్ని స్టాక్స్ బలహీన పనితీరు చూపించినా కానీ, మిగిలిన వాటి అండతో దీర్ఘకాలంలో మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment