అది 1973 సంవత్సరం.. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12.05 ని. కావస్తోంది. కాసేపట్లో ఉషశ్రీ ధర్మసందేహాలు కార్యక్రమం.. శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు, ఆ తరువాయి శ్రీమద్భారతం ప్రవచనం.. అంటూ ప్రకటన వినపడగానే తెలుగు లోగిళ్లు నై మిశతపోవనాలుగా మారిపోయాయి. ‘ఉషశ్రీ ఉపన్యాసాలు స్నిగ్ధ గవాక్షాలు’ అని పలువురు పెద్దలు ప్రశంసించారు. అలా ప్రారంభమైన ఆ కార్యక్రమం – 1990 సెప్టెంబరు 7 వ తేదీ ‘ఉషశ్రీ’ కన్నుమూసే వరకు కొనసాగింది.
ఆకాశవాణి ద్వారా ఉషశ్రీ.. వాల్మీకి రామాయణం, కవిత్రయ భారతం, పోతన భాగవతాలను తెలుగు శ్రోతలకు వినిపించారు. శ్రోతల సందేహాలకు చమత్కారంగా సమాధానాలిచ్చేవారు.
ఉషశ్రీ నేపథ్యం..
పశ్చిమగోదావరి జిల్లా కాకరపర్రు గ్రామంలో 1928, మార్చి 16న పురాణపండ రామమూర్తి, కాశీ అన్నపూర్ణ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ‘ఉషశ్రీ’ కలం పేరుతో తెలుగువారికి సుపరిచితులయ్యారు. జ్వలితజ్వాల, అమృత కలశం, మల్లెపందిరి, సంతప్తులు, ప్రేయసి – ప్రియంవద, తరాలు-అంతరాలు వంటి నవలలు, కథలు, వెంకటేశ్వర కల్యాణం వంటి యక్షగానాలు, పెళ్లాడేబొమ్మా(నవలా లేఖావళి), వ్యాసాలు, విమర్శలు, నాటికలు రాసిన ఉషశ్రీ... రామాయణభారత ఉపన్యాసాలు ప్రారంభించాక ఇక కథలు, పద్యాలు, నవలలు విడిచిపెట్టేశారు.
ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా..
తుది శ్వాస విడిచేవరకు రామాయణభారతాలే ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా జీవించారాయన. శృంగేరి శారదా పీఠం ఆస్థానకవిగా సత్కారం అందుకున్నారు. ఉషశ్రీ రచించిన రామాయణ భారత భాగవతాలను తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని లక్షల కాపీలు ముద్రించింది. ఇప్పుడు తెలుగువారు గర్వించే సన్నివేశం చోటు చేసుకుంది. అదే అయోధ్యలో ఉషశ్రీ గళం.
అయోధ్య అంతటా..
ఉషశ్రీ గళంలో జాలువారిన రామాయణం ఇప్పుడు అయోధ్యలో వినిపిస్తోంది. అయోధ్యను సందర్శించి, విన్నవారు ఈ సంగతిని చెప్పారు. అంతే కాకుండా దేశంలోని అనేక ఎఫ్.ఎం. స్టేషన్లు కూడా దీనిని ప్రసారం చేస్తున్నాయి. కేంద్రంలో అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ఒకరి చొరవతో ఇది సాధ్యమైందని తెలిసింది. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు తమ ఎఫ్.ఎం. స్టేషన్లలో వీటిని తాజాగా ప్రసారం చేశాయి. వీటిని విన్నవారు, ఇదే స్వరాన్ని అయోధ్య ఆలయంలో కూడా విన్నామని చెబుతున్నారు.
ఆటుపోట్ల నడుమ ఆ గళం..
సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం ఉషశ్రీ గళ ప్రస్థానం ఆకాశవాణి విజయవాడలో వినబడడం ప్రారంభమైంది. ధర్మసందేహాలు శీర్షికన మహాభారతంతో మొదలై, శ్రీ భాగవతం వరకూ కొనసాగింది. ఆ సమయంలో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉషశ్రీ గారు భౌతికంగా అదృశ్యమై 33 సంవత్సరాలు అయినా ఆ గళం ఇంకా సజీవంగా ఉండడానికి ప్రధాన కారణం ఆయన అభిమానులు.
ఆ తరువాత కరోనా సమయంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉషశ్రీ కుటుంబ సభ్యులను సంప్రదించి.. రామాయణ, భారత, భాగవతాలను ప్రసారం చేసింది. ఇప్పుడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఉషశ్రీ రామాయణం దేశవ్యాప్తంగా అన్ని ఎఫ్.ఎం.లలోనూ ప్రసారమవుతోంది. అయోధ్య రామాలయ పరిసరాల్లోనూ మార్మోగుతోంది. ఉత్తర భారతంలో ఉషశ్రీ రామాయణాన్ని వినిపించడం అది కూడా రాముని విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ప్రసారం చెయ్యడం తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం.
Comments
Please login to add a commentAdd a comment