అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కాసేపట్లో జరగబోతుంది. రామ మందిర ప్రారంభ వేడుకల్లో కార్పొరేట్ సంస్థలు సందడిగా పాల్గొంటున్నాయి. దాదాపు 7000 మంది అతిథులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని కోట్లమంది ఈ క్రతువును పరోక్షంగా టీవీలు, సామాజిక మాధ్యమాలు, ఇతర మీడియాల్లో వీక్షించే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే టెలికాం సంస్థలు అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత రోజూ మూడు నుంచి ఐదు లక్షల మంది సందర్శకులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ అయోధ్యలో తమ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి. రామమందిర ప్రతిష్ఠాపన నేపథ్యంలో అయోధ్యలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలు, సామర్థ్యాన్ని పెంచినట్లు తెలిపాయి. దీంతో వినియోగదారులు స్పష్టమైన వాయిస్ కాల్స్, హై-స్పీడ్ డేటా, వీడియో స్ట్రీమింగ్ వంటి సదుపాయాల్ని పొందొచ్చని చెప్పాయి.
ఇదీ చదవండి: అయోధ్యలో హూటల్ రూం ధర ఎంతంటే..?
అయోధ్య రైల్వే స్టేషన్, రామమందిర ప్రాంగణం, విమానాశ్రయం, ప్రధాన ప్రాంతాలు, నగరంలోని హోటళ్లతో సహా అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో తమ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచినట్లు వెల్లడించాయి. లఖ్‌నవూకు అనుసంధానించే హైవేలతో సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో పటిష్ట సిగ్నలింగ్ కోసం స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. అదనపు నెట్‌వర్క్ సైట్లు, అంతరాయం లేని నెట్‌వర్క్ అందించటం కోసం ఆప్టిక్ ఫైబర్ కేబుల్‌ను ఏర్పాటు చేసినట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment